Monday, 5 March 2018

పాత ముచ్చట్లు -1

 పాత ముచ్చట్లు - 1

ఎం.వి.ఆర్.శాస్త్రి

   ఇంట్లో దేనికోసమో వెతుకుతూంటే పాత ఫోటో లు చాలా బయటపడ్డాయి. వాటిలో ప్రసిద్ధులైన వాళ్ళు ఉన్నవీ ఎక్కువగానే ఉన్నాయి. వట్టిగా కెమెరా కు పోజు ఇవ్వటం కాకుండా , లైవ్లీ గా ఉన్నవీ ,ఇప్పుడు చూస్తె తమాషాగా కనిపించేవీ వాటిలో ఉన్నాయి. ఎంపిక చేసిన అలాంటి అనుభవాలు కొన్నిటిని మన మిత్రులతో పంచుకుందాం అనిపించింది.

   ఈ కింది ఫోటో చూడండి. అది పాతికేళ్ల కిందటిది. అప్పట్లో ఆంధ్రప్రభ దినపత్రిక డిప్యూటీ ఎడిటరు గా ఉండేవాడిని. గోదావరి పుష్కరాల సందర్భం లో ఒక ప్రత్యెక సంచిక ను బుక్ లెట్ గా వెలువరించాము . దానికి బాగా పేరు వచ్చింది. ఎక్స్ ప్రెస్ గ్రూపు యజమాని మనోజ్ కుమార్ సొంతాలియా కు అది తెగ నచ్చింది.   ఆదివారం అనుబంధాన్ని టాబ్లాయిడ్ నుంచి బుక్ లెట్ సైజు కు వెంటనే మార్చాలని నిర్ణయించారు. న్యూస్ రిపోర్టింగ్ నెట్ వర్క్ తో పాటు సండే మాగజిన్ పనినీ నన్నే చూడమన్నారు. అలా నా చేతికి వచ్చాక ఆదివారం అనుబంధం సైజు తో పాటు కంటెంటు నూ మొత్తంగా మార్చాము. { నా "ఉన్నమాట" కాలం అప్పుడు మొదలైందే. }

   అప్పట్లో ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గారు. యాజమాన్యం తో పాటు ఆయన కూడా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.

    పత్రిక ప్రాచుర్యం పెంచే పనిలో భాగంగా కథల పోటీ పెట్టాలనుకున్నాము .  అప్పట్లో కాల్పనిక సాహిత్యంలో  సచిత్ర వారపత్రికలది రాజ్యం. వాటిలో పోటాపోటీ గా వస్తూండే కథలకు, నవలలకూ పెద్ద క్రేజు . అంతవరకూ దినపత్రికలేవీ కథల పోటీ లు పెట్టేవి కావు. (నాకు గుర్తున్నంతలో ).  మనం పోటీ పెడితే రచయితలు ఉత్సాహం చూపుతారా , పరువు నిలుస్తుందా అని మొదట్లో సందేహం కలిగింది. " ఏమీ ఫరవాలేదు. తప్పక క్లిక్ అవుతుంది . '' అని ధైర్యం చెప్పారు ఆప్త  మిత్రులు వాకాటి పాండు రంగ రావు గారు. ఆయన ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికకు ఎడిటర్ గా ఉండే వారు. ఇద్దరమూ కలిసే ఈనాడు నుంచి ఆంధ్రప్రభకు 1990 చివరిలో వెళ్ళాం .

   పాండు రంగ రావు గారు తెలుగులో అగ్రశ్రేణి కథా రచయితగా సుప్రసిద్ధులు. వారపత్రిక సంపాదకత్వాన్ని సమర్థంగా నిర్వహిస్తూ సాహిత్య రంగంలో మంచిపేరు తెచ్చుకున్నవారు. ఆయన  ఇచ్చిన భరోసా తో కొంచెం బెరుకుగానే (1993 లో) కథలపోటీ అనౌన్స్ చేశాను . బహుమతి మొత్తాలు కూడా అప్పటి రివాజు తో పోల్చితే బాగానే పెట్టాము.

   అంచనాలకు మించి  రచయితలనుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వేయి కంటే ఎక్కువే ఎంట్రీలు వచ్చినట్టు గుర్తు.  సన్డే మాగజిన్ ఇంచార్జ్ విజయబాబు ( యాజమాన్యం చేతులు మారాక ఆయన అదే పత్రికకు ఎడిటర్ అయ్యారు ) ,ఇతర సహచరులు ,ఎంత కష్టపడి ఎన్ని వడపోతలు చేసినా పాతిక పైనే కథలు పోటీకి నిలిచాయి. సమయం ఆట్టె లేదు. తుది నిర్ణయం త్వరగా చేయాలి. దాన్నీ మామూలు పద్ధతికి భిన్నం గా చేద్దాం అనుకున్నాం. ఖర్చుకు యాజమాన్యం సరే అంది.
 
   న్యాయ నిర్ణేతలు గా ఎవరుంటే బాగుంటుంది ? వాకాటి గారు మధురాంతకం రాజారాం , శ్రీపతిగార్ల పేర్లు సూచించారు. ఇద్దరూ టాప్ క్లాస్ కథకులు. వారు ఒప్పుకుంటే అంతకంటే ఏమి కావాలి? వాకాటి గారే వారితో మాట్లాడి ఒప్పించారు. రాజారాం గారు తిరుపతి నుంచి ప్రత్యేకంగా మా పని కోసమే  వచ్చారు. దోమలగూడ లోని ఆంధ్రప్రభ కార్యాలయం కన్నా హోటల్ రూమ్ అయితే బాగుంటుందని అనుకున్నాం. సెక్రటేరియట్ కు ఎదుట వీధిలోని సరోవర్ హోటల్ లో  రూమ్ తీసుకున్నాం అప్పట్లో అదే హైదరాబాద్ లో పెద్ద స్టార్ హోటలు.  రాజారాం గారు ,శ్రీపతిగారు, వాకాటిగారు న్యాయనిర్ణేతలు. నేను, విజయబాబు వారికి సహాయకులం. ఉదయం మొదలుపెట్టి సీరియస్ గా పనిచేస్తే సాయంత్రానికి పని తెమిలింది. ఆ సందర్భం లో తీసిందే ఈ ఫోటో.



   చిత్రంలో ఎడమనుంచి కుడికి : నేను, వాకాటి , మధురాంతకం రాజారాం , శ్రీపతి ,విజయబాబు.

   బహుమతులు ఎవరికి వచ్చాయన్నది గుర్తులేదు. ఆ ప్రకటన వెలువడ్డ పత్రిక నా దగ్గర లేదు.

No comments:

Post a Comment