పాత ముచ్చట్లు - 9
ఎం.వి.ఆర్.శాస్త్రి
........అది ఉరుములేని పిడుగు.
రాయ బెరేలి లో ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. దాని మీద పత్రికలు ,మేధావులు, రాజకీయవర్గాలూ తీవ్ర స్థాయిలో తర్జనభర్జనలు చేస్తూ , ప్రధానమంత్రి రాజీనామా చెయ్యాలని దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన సాగుతుండగా 1975జూన్ 25 అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి ప్రకటించినట్టు రేడియోలో నివ్వెరపరిచే వార్త ! ఆ రాత్రికి రాత్రే దేశమంతటా వేల సంఖ్యలో అరెస్టులు. ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియకుండా పత్రికల కళ్ళకు సెన్సార్ షిప్ గంతలు.
అది అప్పటి తరానికి కనీవినీ ఎరుగని గత్తర . తెల్లవాళ్ళ హయాం లో పత్రికల మీద కరకు ఆంక్షలు ఉండేవని వెనకటివారు చెబితే వినటమే. తన కుర్చీని కాపాడుకోవటానికి ఇందిరమ్మ దేశానికి తెచిపెట్టిన సెన్సార్ పీడ పాతతరం వాళ్ళు కూడా కలలోనైనా ఊహించనిది.
స్వేచ్ఛ గా పనిచేసుకోవటానికి అలవాటుపడ్డ ఎడిటర్ల నెత్తిమీద రెవిన్యూ అధికారులు కత్తెర్లు పట్టుకుని తిష్ఠ వేశారు. ఏ పత్రికలో ఏ పేజీ లో ఏమి వేస్తున్నారనేది ప్రచురణ కేంద్రం లో పెద్ద అధికారి అయిన కలెక్టర్ కో , సబ్ కలెక్టర్ కో , ఆర్ డీ వొ కో , డీ.పీ.ఆర్.వొ కో ముందుగా చూపించాలి. అచ్చుకు వెళ్ళబొయ్యేముందు ఏ అర్ధరాత్రో పేజి ప్రూఫ్ లు సర్కారు వారికి సమర్పించుకోవాలి. అక్కడ జర్నలిజం అంటే ఏమిటో తెలియని... కామన్సెన్సు తక్కువ; అనుమానాలు ఎక్కువ అయిన ఆఫీసర్లు భూతద్దాలతో వాటిని పట్టిపట్టి గాలిస్తారు. ప్రభుత్వానికి, పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఏ మాత్రం వాసన తగిలినా ఒక వార్తలో పేరాలకు పేరాలు , ఒక పేజీలో వార్తలకు వార్తలను ఎర్ర సిరాతో కొట్టేస్తారు. సంపాదకీయాల , ఎడిట్ పేజీ వ్యాసాలనిండా ఇష్టం వచ్చినట్టు కత్తికోతలు పెడతారు. వాటిలో అభ్యంతరకరమైన విషయాలు, పదాలు ఏమీ లేవని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోరు. ఇప్పటికిప్పుడు ఈ కొట్టివేతలను ఎలా సర్దుకోవాలి , పత్రికను ఎప్పుడు అచ్చు వెయ్యాలి , పాఠకులకు ఎప్పటికి చేరవెయ్యాలి అని అడుగుతే " అదంతా మాకు తెలవదు. మీ ఏడుపు మీరు ఏడవండి. " అనేవారు. కొట్టివేసిన వాటి బదులు వేరే మాటర్ పెట్టినా మళ్ళీ దాన్నీ పట్టుకొచ్చి ఈ అయ్యలకు దాఖలు చేసుకోవలసిందే.
దానికి సమయం చాలక , లేక ఒళ్ళు మండి - పేజీలలో సెన్సార్లు పెట్టిన కంతలను పూడ్చకుండా అలాఉంచే పత్రికల వారు పేజీలను ప్రచురించేవారు. కొంతమంది సంపాదకులు నిరసన సూచకంగా సంపాదకీయం స్పేసును ఖాళీగా ఉంచేవారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ వార్త లేక ఏ రాత తమ కొంప ముంచుతుందో, ఎక్కడ అరెస్టు అవుతామోనన్న భయంతో పత్రికల వాళ్ళకు దినదినగండం గా ఉండేది. కూచుంటే లేవలేని అధికారి కూడా పెద్ద పెద్ద జర్నలిస్టులకు ఏది ఎలా రాయాలన్న దాని మీద దిక్కుమాలిన పాఠాలు చెప్పేవాడు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారు తన దృష్టికి వచ్చిన విషయాలపై ఉదారంగా స్పందించి జర్నలిష్టులకు వీలైనంత ఊరట నిచ్చేవారు. కానీ నూటికి 99.9 వ్యవహారాలు ముఖ్యమంత్రిదాకా వెళ్ళవు. చాదస్తపు అధికారుల బారిన పడ్డ జర్నలిస్టులకు దేవుడే దిక్కు. పోను పోను ఆంక్షలు కాస్త సడలినా మొదట్లో అవి మహా కర్కశంగా ఉండేవి.
అదిగో , ఆ తొలి దశలో నేను మా వూళ్ళో చెత్త సమస్య మీద ఆంధ్రజ్యోతి కి ఒక వార్త పంపాను. " మురికివాడగా మారిన జగ్గయ్యపేట పంచాయతి " అన్న హెడ్డింగుతో అది మొఫసిల్ పేజీలో ప్రముఖంగా వచ్చింది. దాన్ని చూసి కొత్తగా వచ్చిన పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ అగ్గిరాముడయ్యాడు. రాసిందంతా అబద్ధం , అన్యాయం అంటూ పత్రిక ఎడిటర్ కి పెద్ద ఫిర్యాదు చేశాడు.
అప్పుడు ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారు. ఆయన సంపాదకత్వ బాధ్యత దాదాపుగా విరమించి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. విజయవాడ లో రెసిడెంట్ ఎడిటర్ నండూరి రామ మోహనరావుగారు. వాస్తవానికి ఎడిటర్ ఆయనే. ఆయన మంచివాడు. నాకు బాగా తెలిసిన వాడు . ఎప్పుడైనా బెజవాడ వెళ్ళినప్పుడు సాయంత్రాలు ఆయన డెస్క్ లో ఒక్కడే కూచుని ఉండే సమయంలో కలిస్తే బోలెడు కబుర్లు చెప్పేవారు. నాతొ పాటు బయటికి వచ్చి నా బస్సుస్టాప్ దగ్గర నిలబడి ఆంధ్రపత్రికలో తాను చేసిన మార్క్ ట్వేన్ నవలల అనువాదాలగురించో ఇంకొకటో మాట్లాడి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవారు.
నాకు అంత బాగా తెలిసిన ఆ గొప్పమనిషి కూడా ఎమర్జెన్సీ కాలంలో పంచాయతీ అధికారి నుంచి ఫిర్యాదు చూసి కంగారు పడ్డారు. " ఇదుగో ఫలానా అధికారి మాకు ఇలా రాశాడు. ఇకపై అటువంటి ఫిర్యాదులకు ఏ విధమైన ఆస్కారం ఇవ్వ రాదని ఇందుమూలముగా ఆదేశించడమైనది - అంటూ నాకు శ్రీముఖం పంపారు. పైగా అత్యవసరపరిస్థితి నీ , దానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలనూ దృష్టిలో పెట్టుకొని వార్తల విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలంటూ ఆంధ్రజ్యోతి విలేఖరులందరికీ జారీచేసిన సర్క్యులర్ కూడా దానికి జతపరిచారు. ( అసలు ఆ సర్క్యులర్ కి కారణం నేనేనట! నా మీద స్థానిక అధికారి ఫిర్యాదును సీరియస్ గా తీసుకునే రామమోహనరావుగారు అందరికీ హెచ్చరిక పంపారని అప్పట్లో విజయవాడ టౌన్ రిపోర్టర్ గా ఉన్న నా మిత్రుడు ఐ. వెంకట్రావుగారు తరవాత నాకు చెప్పారు. )
నా వార్త అంత కదలిక తెస్తే సంతోషమే . కాని నండూరి వారి మందలింపు నాకు ఎంత మాత్రం నచ్చలేదు. జగ్గయ్యపేటలో పారిశుద్ధ్యం సమస్యకీ అత్యవసర పరిస్థితికీ సంబంధం ఏమిటి ? మా ఊరి చెత్త గురించి రాస్తే దేశ భద్రతకో , జాతీయ ప్రయోజనాలకో ఏ విధంగా ఇబ్బంది ? పోనీ నేను రాసింది అబద్ధమా ? కాదు ! ఇదిగో ఆధారాలు, ఫోటో సాక్ష్యాలు . నిజమేమిటో నిర్ధారించుకోకుండా అలా ఎలా మందలిస్తారు ? ఫిర్యాదుకు ఆస్కారమే ఇవ్వకూదదంటే ఏ విలేఖరి అయినా ఎలా పనిచేయగలడు - అంటూ ఆయనకి పెద్ద ఉత్తరం రాశాను . తరవాత కలిసినప్పుడు రామమోహనరావుగారు తన ఎమర్జెన్సీ ఈతిబాధల గురించి చాలా చెప్పారు. అవి వింటే పాపం అనిపించింది.
నా మీద కంప్లయింట్ చేసిన స్పెషల్ ఆఫీసరు కూడా పోను పోను నాకు దగ్గరి మిత్రుడు అయ్యాడు. కానీ అప్పటి నా అనుభవం నా మీద పెద్ద ప్రభావం చూపింది. తరవాత నేను ఈనాడుకు వెళ్లి సెంట్రల్ న్యూస్ బ్యూరో కు ఇంచార్జి అయినప్పుడూ , దరిమిలా ఆంధ్రప్రభ డిప్యూటీ ఎడిటర్ గా రిపోర్టర్ల నెట్ వర్క్ మొత్తాన్నీ చూసినప్పుడూ వెనకటి నా అనుభవం ఎప్పుడూ గుర్తుకొచ్చేది. అప్పుడు నా లాగా , నా కింద పనిచేసే ఏ రిపోర్టరూ నిజం రాసినందుకు మాటపడకూడదు ; సమస్య ఏదైనా రానీ , సిన్సియర్ గా పనిచేసే రిపోర్టర్ కి అండగా నేను ఉండి తీరతాను అనుకున్నా. కంప్లయింట్లకు , లీగల్ కేసులకూ భయపడకండి. మీమీద ఎన్ని ఫిర్యాదులు వస్తే మీరు అంత బాగా పనిచేసినట్టు అని మా వాళ్లకు ( సక్రమంగా డ్యూటీ చేసే వాళ్ళకు మాత్రమే ) నేను చెప్పేవాడిని. ఆ మాట నిలబెట్టుకోవటానికి చాలా గొడవలే ఎదుర్కోవాల్సి వచ్చింది.
జగ్గయ్యపేట లో గ్రామీణ విలేఖరిగా ఉన్నప్పుడు నా జీవితాశయం ఎప్పటికైనా ఐ. వెంకట్రావు గారిలా విజయవాడ టౌన్ రిపోర్టరు కావాలని ! లేదా మా ఊరు దగ్గరి ఖమ్మంలో ఆంధ్రజ్యోతికి జిల్లా రిపోర్టర్ గా పనిచేయాలని. అది వీలుపడకపోతే జగ్గయ్యపేట లోనే వార్తలు, వ్యాసాలు రాసుకుంటూ , ఎల్ ఐ సి ఏజెంటుగా పని కొనసాగిస్తూ, కమ్యూనిస్టు పార్టీ పని, అభ్యుదయ రచయితల సంఘం ( అరసం ) వగైరా విప్లవ కార్యక్రమాలను సాగిస్తూ జీవయాత్ర సాగించాలని ! ( అప్పటి కమ్యూనిస్టు పర్వం గురించి , తరవాత నాలో వచ్చిన మౌలిక పరివర్తన గురించి ఇంకోసారి రాస్తాను. )
వ్యాపకాలు , రాచకార్యాలు చాలానే ఉన్నాయి. డబ్బులే ఇబ్బంది. ఆంధ్రపత్రిక ఏజెన్సీ మీద వచ్చేది తక్కువ. ఇన్సూరెన్సు ఏజెన్సీ ఫరవాలేదు. పెళ్లి కాలేదు కాబట్టి ఖర్చులు తక్కువ . వాటికీ కటకటగానే ఉండేది. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంతో దయతో నెలసరి మొత్తాన్ని పది నుంచి పాతికకు పెంచారు.అప్పట్లో వారపత్రికలలో వస్తూండే వింత ఇంటర్వ్యూ లను పారడీ చేస్తూ " భా.మ. తో ఇంటర్వ్యూ " అనే రచనను నేను పంపితే రామమోహనరావుగారు దాన్ని ఆదివారం అనుబంధంలో వేసి నన్ను ఎంతో మెచ్చుకున్నారు.
దాన్ని చూసినవారు అది తను రాసింది అనుకున్నారని తరవాత ఒకసారి కలిసినప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు అన్నారు. ఆ ఉత్సాహంతో అలాంటి వ్యంగ్య రచనలు చాలా చేసాను. నండూరివారు వాటిని ఎడిట్ పేజీ లోనో, ఆదివారం అనుబంధం లోనో కనీసం వారానికొకటి వేస్తూండే వారు. ఒక్కో దానికి పాతిక రూపాయలు పారితోషికం ఇచ్చేవారు.
ఈ ప్రకారంగా నెలకు పాతిక రూపాయల జీతం , వారానికి ఒకటి చొప్పున నాలుగు వ్యాసాలకు పాతికేసి చొప్పున నెలకు వంద ... మొత్తం 125 రూపాయలు ఇస్తున్నారు కదా ? డబ్బులకు కాస్త ఇబ్బందిగా ఉంది . వీలయితే నా నెలసరి మొత్తాన్ని 25 నుంచి 50 చెయ్యగలరా ? అప్పుడు మొత్తం మీద150 రూపాయల సంపాదనతో నేను హాయిగా బతకగలవాడను .. ఏమంటారు ? అని ఓ సారి రామమోహనరావు గారిని అడిగాను. ఆయన ఆలోచించి చెపుతా అన్నారు.
తరవాత బాగా అలోచించి ఆలోచించి చివరికి - నా పారితోషికాన్ని 25 నుంచి 50 కి పెంచెట్టు చేయటం తన శక్తికి మించిన పని అని చెప్పారు. నా మీద అభిమానం తో ఒక సలహా ఇచ్చారు. ఏమనంటే - కొత్తగా ఈనాడు పత్రిక వచ్చింది కదా ? వాళ్ళు త్వరలో విజయవాడ లో ఎడిషన్ పెట్టబోతున్నారు . దానికి విలేఖరులు కావాల్సి వస్తుంది . వాళ్ళయితే నెలకు 50 రూపాయలు ఇవ్వగలరు. ప్రయత్నించి చూడండి - అని !
ఆనాడు రామమోహనరావుగారు ఇచ్చిన ఆ ఒక ఐడియా నా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది.
No comments:
Post a Comment