పాత ముచ్చట్లు - 6
ఎం.విఆర్.శాస్త్రి
.......................
నిజాం సర్కారులో చందూలాల్ అని ఒక వజీరు ఉండేవాడట. ఎవరు వచ్చి ఏ కోరిక కోరినా సరే అని మాట ఇచ్చే వాగ్దాన కర్ణుడాయన. మాటవరసకు ఎవరైనా తనను ఆశ్రయించి , ఏ మెదక్ లోనో కలక్టర్ పోస్టు ఖాళీ అయింది ; దాన్ని కనుక ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుని బతుకుతా - అని వేడుకున్నాడనుకోండి. ఆయన ఇట్టే ప్రసన్నుడై ' సరే పో ' అని అతగాడిని కలక్టర్ గా నియమిస్తున్నట్టు అక్కడికక్కడే కాగితం రాసి ఇచ్చేవాడట . అవతలి వాడు పరమానందంతో దాన్ని పట్టుకుని కొత్తబట్టలు వేసుకుని కొత్త కొలువులో చేరటానికి పోతుంటే సగం దూరం వెళ్ళకుండానే ఇంకొకడు మాసిపోయిన కొత్త బట్టలతో ఎదురు వచ్చేవాడట. అతగాడు ఇతడి కంటే ముందు మెదక్ జిల్లా కొత్త కలక్టర్ గా నియమించబడినట్టు చందూలాల్ చేత చీటీ రాయించుకు వెళ్ళిన వాడట.
మరి ఉద్యోగంలో వెంటనే చేరకుండా వెనక్కి తిరిగివస్తున్నాడేమిటి ? ఎందుకంటే అతడు వెళ్ళే సరికే అంతకంటే చాల రోజుల ముందే కొత్త కలక్టర్ గా చీటీ పట్టుకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఆ కుర్చీ నాదంటేనాదంటూ కొట్టుకు చస్తున్నారట . అలా ఉండేది చందూలాల్ దర్బార్ అని చెప్పి పాత కాలపు వాళ్ళు నవ్వుకునే వాళ్ళు.
టంగుటూరి అంజయ్య ఆ చందూలాల్ కంటే తెలివైన వాడు ; జనం లోంచి వచ్చిన వాడు ; గల్లీ నుంచి డిల్లీ దాకా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండేవాడు ;వెనకటి స్నేహాలను మరవని వాడు ; సాధ్యమైనంతవరకూ ఎవరినీ నొప్పించని వాడు - కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక సొంత పనుల కోసం ఆయనను ఆశ్రయించే వాళ్ళు సహజంగానే చాలా ఎక్కువయ్యారు. రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవటం కోసం మంత్రి వర్గాన్నే ఏకంగా జుంబో జెట్ స్థాయికి చేర్చి మొత్తం దేశాన్ని ఆశ్చర్య పరిచిన వాడు తనవారనుకున్న చిన్నా చితకా వాళ్లకు చేతనైన సాయం చేయకుండా ఉంటాడా ? చేశాడు. కానీ ఎంత చేసినా కార్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది కదా ? సమస్యే. కానీ దానికీ నొప్పింపక తానొవ్వని విధంగా అంజయ్య గారు చక్కటి ఉపాయం కనిపెట్టాడు.
అదేమిటి అన్నది చాల ఏళ్ళ తరవాత నా మిత్రుడు పి.ఎస్. సుందరం గారు చెపితే నాకు తెలిసింది. సుందరం గారు చాలా ఏళ్ళు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆంగ్ల దిన పత్రికకు బ్యూరో చీఫ్ గా , తరవాత రెసిడెంట్ ఎడిటర్ గా పని చేసినవాడు. నేను ఆంధ్ర ప్రభకు వెళ్ళాక నాకు సహచరుడు. ఆయన కు అంజయ్యగారు పూర్వం నుంచీ బాగా తెలుసు. ఆ స్నేహాన్ని పురస్కరించుకుని , ఆయన మఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి సుందరం గారు తన బంధువు ఒకరికి ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజి ద్వారా ఉద్యోగం వేయించమన్నాడట. అప్పట్లో ప్రభుత్వ రంగ ఉద్యోగాలన్నీ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజిల ద్వారానే ... ఏళ్ళ తరబడి పడిగాపులు కాశాక మాత్రమే... అదీ అదృష్టాన్ని బట్టి జరిగేవి.
' ఓస్ దానికేం భాగ్యం అప్లికేషను ఇవ్వు. ఇప్పుడే చెబుతా ' అన్నాడట ముఖ్యమంత్రి. ఆ అర్జీ దారుకు కావలసిన సహాయం వెంటనే చెయ్యమని సంబంధిత ఎంప్లాయ్ మెంట్ ఆఫీసరు కు స్వహస్తంతో రాసి , ' 'దీన్ని తీసికెళ్ళి ఆఫీసరు కు ఇవ్వు .నీపని అయిపోతుంది ' అని చెప్పాడట. ఇంకేం? బోలెడు థాంక్స్ చెప్పి తన వాడికి ఉద్యోగం వచ్చేసినట్టే అని సుందరం గారు సంబరపడుతూ ఆఫీసుకు వెళ్లి సంబంధిత అధికారికి అర్జీని ఇచ్చాడట . దాని మీద ముఖ్యమంత్రి ఎండార్స్ మెంటును చూడగానే అతగాడు కుర్చీ నుంచి లేచి ' ఎస్ సర్ ' అంటూ హడావిడి పడతాడనుకున్నాడట. అతడేమో చాలా కూల్ గా దాన్ని చూసి పక్కన పెట్టి ' సరే తప్పక చేస్తాం . కొంతకాలం తరవాత రండి ' అన్నాడట. మళ్ళీ ఎన్ని సార్లు వెళ్ళినా అదిగో ఇదిగో అనటమే తప్ప పని మాత్రం ఎంతకీ కాలేదట . చూసి చూసి విసుగు పుట్టి ఒకరోజు ఈయన నేరుగా అడిగేశాడట. ' ముఖ్యమంత్రి అదేశాన్నే లెక్క చేయటం లేదు . మీకు ఏమిటి ధైర్యం ? పని చేయకపోతే మానె ! అసలు సంగతి చెప్పండి ' అని అడిగితే ఆ ఆఫీసరు -
' అయ్యా ! మాకు కొన్ని కొండగుర్తులు ఉంటాయండి. ముఖ్యమంత్రిగారు అర్జీ మీద ఇలా రాసి పంపారూ- అంటే ' వీలయితేనె సహాయం చేయి. ' అని అర్థమండి. అలా కాక ఏ పి.ఏ తోనో ఫోన్ చేయించారనుకోండి. కొంచెం అర్జెంటు అని గుర్తు అండి. అలాకాక ఏ సెక్రటరీ నుంచో ఫోన్ వచ్చిందనుకోండి. ఎలాగైనా సరే అప్పటికప్పుడు పని జరిగి తీరాలని సి.ఎం గారు కోరుతున్నట్టు మాకు అర్థమవుతుందండి. వీటిలో మీది మొదటి కేటగిరీ కాబట్టి వీలును బట్టి చేయటం కోసం ఫైల్ లో జాగ్రత్తగా పెట్టామండి. అదే ఉద్యోగం కోసం మీ కంటే ముందు మీలాంటి వారు చాలామంది ఇలాగే తెచ్చి యిచ్చిన సిఫారసులను వరస క్రమంలో వీలును బట్టి పరిశీలించాక ఏదో ఒక నాటికి మీ వంతూ రావచ్చండి ' అని విడమర్చి చెప్పాడట!
ఇక అంజయ్య పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది బేగంపేట విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ ఆయనకు చేసిన అవమానం . ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిన ఘటన అది. 1982 ఫిబ్రవరి 2 న జరిగింది.
అప్పట్లో రాజీవ్ గాంధీ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి గా ఉండే వాడు. దేశాన్నేలే ఇందిరా గాంధీ కి కొడుకు కావటం మినహా రాజకీయ రంగంలో అప్పట్లో ఏ అర్హతా లేని వాడు. వయసు, అనుభవం , వ్యక్తిత్వం ,రాజకీయ చరిత్రల బట్టి చూస్తే అంజయ్య ముందు ఎందుకూ కొరగాని వాడు. అయినా తిరుపతి పర్యటనకు వెళ్ళబోతూ హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి , తనకోసం జరిగిన స్వాగతాల ఆర్భాటాలను, వేలాది జనాల సమీకరణను, నినాదాల అట్టహాసాలను చూసి చిర్రెత్తి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మండిపడ్డాడు. తనకు ఘన స్వాగతం కోసం ఏర్పాటైన వేదిక మీదికి గాని , వాహనంలోకి గాని ఎక్కనని మొరాయించి , గంటల తరబడి వేచి ఉన్న జనాలను నిరాశపరిచి పెద్ద సీన్ సృష్టించాడు. చివరికి తనతో పాటు తిరుపతి వెళ్ళవలసిన ముఖ్యమంత్రిని వద్దు పొమ్మని ప్రభుత్వ ప్రత్యేక విమానంలో తానొక్కడే వెళ్లి ముఖ్యమంత్రిని దారుణంగా అవమానించాడు.
ఆ పరాభవానికి అంజయ్య నోచుకున్నా మరీ అంత సీరియస్ గా కుమిలిపోలేదు. అక్కడున్న కాంగ్రెస్ నాయకులూ , మంత్రులు కూడా జరిగిన దాని తీవ్రతను వెంటనే గ్రహించలేదు. అప్పట్లో 24 గంటల న్యూస్ చానెళ్ళు లేవు. రాజీవ్ గాంధీ రాష్ట్ర పర్యటన, తిరుపతిలో జాతినుద్దేశించి ఆయన చేసిన మహాప్రసంగం విశేషాలు పతాక శీర్షికలోనూ , బేగంపేట లో జరిగింది దిగువన సైడ్ లైట్ లాగా ఇచ్చి పత్రికలో మామూలు పద్ధతిలో రిపోర్ట్ చేసి ఉంటే బహుశా ప్రజలు కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదేమో.
ప్రజల అదృష్టవశాత్తూ , కాంగ్రెస్ దురదృష్ట వశాత్తూ ఆ సమయాన ఈనాడు ఒక గొప్ప పని చేసింది. అప్పట్లో నేను న్యూస్ రిపోర్టింగ్ బాధ్యత చూస్తున్నా . రిపోర్టర్లు వచ్చ్చి ఆ నాటి వార్తా విశేషాలను చెప్పారు. ఫోటోగ్రాఫర్ కేశవులు చాలా ఫోటోలు తెచ్చాడు. మొదట్లో మేము కూడా విమానాశ్రయం ఘటనను మొదటి పేజి లో ప్రముఖంగానే అయినా మామూలు పద్ధతిలో వేద్దాం అనుకున్నాం. రాత్రి 7 గంటలకు చైర్మన్ రామోజీ రావు గారి చాంబర్ లో రోజువారీ మీటింగ్ లోనూ అలాగే చెప్పాము. అప్పుడు రామోజీ రావు గారి బుర్ర అమోఘంగా పని చేసింది . మేము ఎంపిక చేసి పెట్టుకున్నవే కాక మొత్తం అన్ని ఫొటోలనూ ఆయన తెప్పించి చూశారు. వాటిలో కొన్నిటిని ఒక వరసలో అమర్చి ' ఎమ్వీ ఆర్ నీకు ఏమనిపిస్తున్నది ? ' అన్నారు. 'అర్థమైంది' అన్నాను. 'ఇంకేం? రాయి. ఇవాళ ఇదొక్కటే హైలైట్ చేద్దాం' అన్నారు చైర్మన్.
అప్పుడు రాశాను ఆ బొమ్మలను దగ్గర పెట్టుకుని పైన మీరు చూస్తున్న బొమ్మల కథని . " ఇంది'రా కుమారుడు విజయం చేసిన కథాక్రమంబెట్టిదనిన ' అన్న శీర్షికతో మరునాడు మొదటి పేజి ముప్పాతిక భాగమంతా అదే నిండిపోయింది. ఆ ప్రయోగం మా అందరినీ ఎంత కదిలించిందంటే ఇంటికి వెళ్ళిన రామోజిరావుగారు రాత్రి పొద్దు పోయాక మళ్ళీ ఆఫీసు కు వచ్చి డెస్క్ లో నిలబడి మొదటి పేజి ప్రూఫ్ లో బొమ్మల కథను చదువుకుని మరీ వెళ్లారు.
పత్రికలో మాకే అంత ఇది గా ఉంటే మర్నాడు పేపర్లో చదివిన లక్షలాది పాఠకుల సంగతి వేరే చెప్పాలా ? దాన్ని చూసిన వారల్లా వెర్రెత్తిపోయారు. తమ ముఖ్యమంత్రికి జరిగిన అవమానానికి ఆవేశంతో ఊగిపోయారు.రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా అదే చర్చ. ఈనాడు కార్యాలయానికి ఆ రోజంతా వేల సంఖ్యలో మెచ్చుకోలు ఫోన్లు. ఆ తరవాత మూడు నెలలకు ఎన్టీ రామారావు వచ్చి రగిలించిన తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదానికి అది ప్రధాన ప్రేరణ . ఒక వార్త చరిత్రగతిని ఎలా మార్చగలదనటానికి ఇదో ఉదాహరణ.
నా మొత్తం జర్నలిస్టు కెరీర్ లో నేను రాసిన best pieces అనదగ్గవాటిలో ఇదొకటి.
అద్భుతమండి... రామోజీ రావు గారి ఆలోచన, మీ ఆచరణ చాలా చక్కగా కుదిరాయి... మరి ప్రస్తుత పరిస్తితులలో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తలకెత్తుకునే వారేరి?
ReplyDeleteGood
ReplyDelete