మా మూడో అమ్మాయి తన్మయి. బంగారం లాంటి పిల్ల. నలభై దాటకుండానే దానికి నూరేళ్లూ నిండాయి. వినాయకచవితి (14వతేది) రాత్రి 12-55న కాచిగూడ లోని దైహిక ఆస్పత్రిలో మా ముద్దుల కూతురు బ్రెయిన్ ట్యూమరు, ఇతరేతర దుష్ప్రభావాల మూలాన అనాయాసంగా ఇహలోకం వదిలివెళ్లింది.
మా ముగ్గురు అమ్మాయిలలో తన్మయి చిన్నది. కాని అదే ఎక్కువ ధైర్యస్థురాలు. 1987లో పుట్టింది. బిటెక్ తరవాత బి-స్కూలులో ఎంబిఎ ఫైనాన్స్ చేసింది. 2011 లో ముంబయి Capgemini లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం తెచ్చుకుంది. అందులోని యాంత్రికత నచ్చక కొద్దినెలలకే దాన్ని స్వచ్ఛందంగా వదిలేసి, తనను తాను స్వతంత్రంగా ప్రూవ్ చేసుకోవటం కోసం పట్టుబట్టి హైదరాబాద్ తిరిగొచ్చింది. అప్పటి వరకూ నేను, నా భార్య దుర్గ కిందామీదా అవస్థపడుతూ నడుపుకుంటున్న "దుర్గా పబ్లికేషన్స్" ను సొంతంగా, సమర్థంగా డెవలప్ చేసింది. నా రచనలేకాక వేరే పుస్తకాలనూ విరివిగా ప్రచురించింది. బుక్ ఫెయిర్ లలో తానే కూర్చుని స్టాల్ నడిపేది. నేను చేపట్టిన ప్రతి సమాజసేవా కార్యం లోనూ నాకు కుడిభుజంలా పని చక్కబెట్టేది.
ఇవన్నీ చేస్తూనే ఈ సంవత్సరం కొత్తగా SAP కోర్సు బహుకష్టపడి చేసింది. నా పేరు, పలుకుబడి నీడ కూడా పడకుండా, నాకు తెలియకుండా జాగ్రత్త పడి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాలుకు ₹14 లక్షల జీతం మీద ఉద్యోగం స్వశక్తితో సాధించింది. ఇద్దరు పిల్లల సంగతి చూసుకుంటూ, హైటెక్ సిటీకి సొంతంగా కారు డ్రయివ్ చేసుకుంటూ వెళ్లి ఈ జూలై మొదటివారం వరకూ చక్కగా పనిచేసింది. దాని కెరీర్ గొప్పగా పైకి వెళుతున్నదని అందరం ఆనందపడుతుండగా ఎవరూ కలనైనా ఊహించని రీతిలో విధి మాపై పగబట్టినట్టు ఏకంగా దాన్నే పైకి తీసుకుపోయింది.
మా గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారి అనుమతి, ఆమోదం లేకుండా మేము ఏ ముఖ్య నిర్ణయమూ చేయము. వచ్చిన సంబంధాన్ని వారి ముందు పెట్టి, అనిష్టంగా, వ్యాకుల పడుతూ ఆయన సరే అన్న మీదట ప్రసిద్ధ జ్యోతిషులు పసుమర్తి కామేశ్వర శర్మ గారు ముందుండి నడిపించగా... బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, పలువురు యతీశ్వరులు స్వయానా విచ్చేసి ఆశీర్వదించగా 2014 లో తన్మయిని విజయవాడ గుంటుపల్లి వాస్తవ్యులైన తూములూరి గోవర్ధన రావు, గిరిజల సుపుత్రుడు, IBM ఉద్యోగి దిలీప్ కుమార్ కి ఇచ్చి 2014 డిసెంబరులో ( ఒక నివేశన స్థలం అమ్ముకుని) వైభవంగా పెళ్లి చేశాము. ఆ తరవాత అది ఏనాడూ సుఖపడింది లేదు. పిండుకోవటం, పీడించటమే తప్ప భార్యాబిడ్డలను సుఖపెట్టటం దాని మగడు ఎరగడు.
మైలు దూరంలోనే ఉన్నప్పటికీ నాకు కూడా తెలియకుండా,పడిన శారీరక, మానసిక గృహహింస కారణంగా 2020 ఆగస్టులో తన్మయికి బ్రెయిన్ ట్యూమర్ దాపురించింది. లక్షలు ఖర్చుపెట్టి వెంటనే సర్జరీ, రేడియేషన్ చేయించాను. అదేరోజుల్లో దాన్ని, ఇద్దరు పిల్లలను వదిలేసి మగడు చేతులు దులుపుకున్నాడు. గురుకృపతో తెప్పరిల్లిన తన్మయి గృహ హింస, కట్నం వేధింపు, ఫోర్జరీ వగైరా క్రిమినల్ కేసులు పెట్టింది. పిల్లల పోషణ కోసం మెయింటెనెన్సు కోరుతూ ఫామిలీకోర్టుకెళ్లింది. నాలుగేళ్లకు పైగా కోర్టులచుట్టూ తెగ తిరిగినా ఏకేసూ అంగుళం ముందుకు కదలలేదు. నేరస్థులను కడుపులో పెట్టుకుని కాపాడి, న్యాయార్తులను శతవిధాల సతాయించటాన్నే మనం నెత్తికెక్కించుకున్న దిక్కుమాలిన (అ)వ్యవస్థలో న్యాయపాలన లేక రూల్ ఆఫ్ లా అందురు.
తపస్సులా కోర్సుచేసి, కోరుకున్న ఉద్యోగాన్ని సాధించిన ఆనందంతో కళకళలాడవలసిన స్థితిలో తన్మయి ప్రవర్తన అనూహ్యంగా మారింది. పిల్లలు సహా ఎవరినీ, దేనినీ పట్టించుకోవటం మానేసింది. దానికి ఏదో అయింది. జులై లో MRI తీయిస్తే బ్రెయిన్ ట్యూమర్ మెదడుకు రెండు వైపులా మళ్లీ ఉద్ధృతంగా వచ్చిందన్నారు. అర్జంటుగా ఆపరేషన్ చేయాలి : కాని- వ్రణాన్ని సగం మాత్రమే తొలగించగలం. ఆపైన రేడియేషన్, కెమో థెరపీ చికిత్సలు షరా మామూలే. పక్షవాతం, చూపు, మాట, మెమరీ పోవటం వంటి సైడ్ ఎఫెక్టులు తప్పవు. కాని మరికొంతకాలం బతకాలంటే ఇంతకుమించి గత్యంతరం లేదు అని హైదరాబాద్, చెన్నై లలో పేరుమోసిన ఆస్పత్రుల ఘనవైద్యులు అన్నారు. సర్జరీ వద్దే వద్దు, రేడియేషనే గతి అని మరికొందరు స్పెషలిస్టులు చెప్పారు. వీటిలో ఏదారి ఎంచుకున్నా బతికేది మహా అయితే సగటున ఒకటి రెండేళ్లేనన్న సంగతి మాత్రం దాటేశారు. పులి, సింహం, చిరుతపులి వంటి సర్జరీ, రేడియేషన్, కెమోథెరపీలతో మా అమ్మాయిని వికృతాకారంలో జీవచ్ఛవాన్ని చేయటానికీ ప్రాణం ఒప్పక ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆశ్రయించాము.
విశ్వవిఖ్యాత ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, ఇమ్యునాలజీలో సూపర్ స్పెషలిస్టు, మాకు అత్యంత ఆప్తులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు, ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపును తొలగించి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచటం ద్వారా సకల వ్యాధులను నయంచేయగల ఇంజెక్షన్, టీకాలను సొంతంగా కనుగొన్న ప్రపంచ ప్రసిద్ధ ఇమ్యునాలజిస్టు, మైక్రో బయాలజిస్టు డాక్టర్ పెద్దపల్లి అప్పారావు గారు, మహా సిద్ధ వైద్య చికిత్సాలయ వైద్యులు డాక్టర్ నిర్లేప, ప్రసాద్ గార్లు, కోయంబత్తూరు లోని ప్రముఖ కాన్సర్ స్పెషలిస్టు డాక్టర్ రాధేశ్యామ్ గారు, న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మీనాధ్ శివరాజు గారు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ధనంజయ్, డాక్టర్ ఎస్. ఎస్. శాస్త్రి, ఆయర్వేద నిపుణులు డాక్టర్ ప్రదీప్ గారు, హోమియో వైద్యులు డాక్టర్ నాగ హరిత గారు తన్మయి మీద అభిమానంతో శాయశక్తులా ప్రయత్నించారు. అమ్మాయిని చూసిన ప్రతి డాక్టరూ ఆమె తలనెప్పి, శరీర బాధ ఏదీ లేకుండా జీవకళతో చక్కగా ఉన్నందుకు ఆశ్చర్య పడ్డారు.
కంచి కామకోటి సర్వజ్ఞ పిఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి స్వామి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి, విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, పెద్దముత్తేవి శ్రీకృష్ణాశ్రమ గురువు శ్రీ గౌరా గారు, తన్మయిని విశేష వాత్సల్యంతో ఆశీర్వదించారు. కంచి కామాక్షి, స్కందగిరి, చిల్కూరు బాలాజీ, ఎల్లారమ్మ దేవాలయాల నుంచి ప్రసాదాలు వచ్చాయి. చివరి రోజు వరకూ మా అమ్మాయి హనుమాన్ చాలీసా, లలితా సహస్రం, నవగ్రహ స్తోత్రాదులు పారాయణం, మంత్ర జపం ప్రతి నిత్యం చేసింది. రోజూ గురువుగారి ఫోటో కళ్లకద్దుకునే మంచం దిగేది. గంటముందు వరకూ మామూలుగానే కనిపించింది. నిర్విచారంగా, నిర్వికారంగా, ప్రశాంతంగా వెళ్లి పోయింది.
దానికి పక్షం రోజుల ముందు కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వరానంధ భారతి స్వామి స్వయంగా ఫోన్ చేసి అమ్మాయి మీద క్షుద్ర పీడ ఉన్నదని చెప్పి, చేయవలసింది తెలిపారు. మాకు చిరకాలంగా ఆప్తులు, పాదుకాంత పూర్ణ దీక్షాపరులు శ్రీ జి. వి. కె. రావు గారు అత్తింటి వారు కొన్నేళ్లకిందటే ఆమెను నిర్వీర్యంచేసి, ప్రాణం తీసేందుకు తీవ్ర ప్రయోగం చేసినట్టు ధ్రువీకరించారు. పదకొండు రాత్రులు ఆయన వారాహి మంత్ర జపం, తార, ఉచ్చిష్ట గణపతుల పూజ చేసి తీర్థం ఇచ్చారు. ఆయన చెప్పిన దానినే చెన్నై తాంత్రిక నిపుణులు రోచిష్మాన్ గారు కూడా ధ్రువపరిచారు. నల్లగొండలోని రుద్రాంశ శక్తిపీఠం హనుమత్ ఉపాసకులు తన్మయి ఫోటో చూడగానే ఆమె మారణానికి తీవ్ర ప్రయోగం జరిగిందని చెప్పారు. పాండిచ్చేరి దగ్గరి కారైక్కల్ లోని ఉచ్చిష్ట గణపతి, శివారాధకులు కేవలం ఆమె ఫోటోను చూసీ ఏఏ సంవత్సరాలలో, ఎక్కడెక్కడ ఏఏ విధాలుగా ఆమె మీద పగతో భర్త, అత్త ఏ వస్తువులను ఉపయోగించి ఎటువంటి ప్రయోగం చేయించారో కళ్లతో చూసినట్టు వివరించారు. దాని విరుగుడుకు ఆయన ప్రయత్నం చేసేలోపే అమ్మాయి వెళ్లిపోయింది.
ఈ ఫిబ్రవరిలో తన్మయి పట్టుబట్టి, తానే అన్నీ ఆర్గనైజ్ చేసి పదేళ్ల కుమారుడికి ఉపనయనం చేయించింది. అత్త మామలు మేము రమ్మన్నా రాలేదు. బిడ్డలిద్దరితో కలిసి స్వయంగా వెళ్లి అడిగినా భర్త పట్టించుకోలేదు. ఈ 15 న మరణవార్త తెలిపినా, ఎంతమంది ఫోన్ చేసినా వారెవరూ వచ్చి చూసిన పాపాన పోలేదు. అంత్యక్రియల మరుసటి రోజు రాత్రి అతడు "హాయ్ శాస్త్రి గారూ, విషాద వార్త విని దిగ్భ్రాంతి చెందాను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని మెసేజ్ పంపాడు.
బన్సీలాల్ పేట శ్శశాన వాటికలో నిత్య కర్మలు చిక్కడపల్లి లోని మా స్వగృహంలో 23 నుంచి 25 వరకు 10,11,12 రోజుల కర్మలు తన్మయి కుమారుడు చి. రుత్విక్ చేస్తున్నాడు. మొత్తం కుటుంబ సభ్యులం, బంధువర్గం ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. కేవలం సన్నిహిత బంధుమిత్రులకు పరిమితమైన ప్రైవేటు కార్యక్రమంగా దీనిని దుఃఖ భారంతో నిర్వహిస్తున్నాము. అందరితో అన్నీ ఏకరువుపెట్టి, పరామర్శలు, సాంత్వనపూర్వక హితబోధలు అందుకునే ఓపిక, సత్తువ నాకు గాని, వాళ్లమ్మకు గాని లేవు. కొద్ది రోజులపాటు మా మానాన మమ్మల్ని వదిలేయటమే మాకు చేయగలిగిన మేలు. నేను బాగానే ఉన్నాను. విధి లీల, ప్రారబ్ధం, వైరాగ్యం, వేదాంతాల గురించి అనర్గళంగా పరోపదేశం చేయగలిగిన స్థితిలోనే ఉన్నాను.
నా హితైషి పవన్ కల్యాణ్ గారి సంతాప ప్రకటన ద్వారా విషయం తెలిసి, తల్లడిల్లి, సానుతాపంతో ఫోన్లు, మెసేజ్ లు చేసిన, ఇంటికి వచ్చి పరామర్శించిన నా మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, పూజ్యులు అందరికీ వందనాలు. మూడునెలలుగా సమయమంతా మా అమ్మాయి కోసమే వెచ్చించాను. నా ధర్మ నిరతి, ఉద్యమ దీక్ష పూర్వం లాగే ఉన్నాయి. త్వరలో కలుద్దాం. ఆలోచించ వలసింది, చేయవలసింది చాలా ఉన్నాయి. 🙏





