Friday, 28 June 2024

సామవేదం : నిశ్శబ్ద ధార్మిక విప్లవం

 

 ఎం.వి.ఆర్.శాస్త్రి

https://youtu.be/0hyPgJ3JtGA?si=p8u4UN4CacIs5IKC

     “హిందువులకు దేవుడే దిక్కు" అని నేను చేసిన కొత్త వీడియోను ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న "ఋషిపీఠం" వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు చూసి మెచ్చుకుంటూ  ఆడియో సందేశం పంపారు. ధన్యోస్మి. మేమిద్దరం ఒకే గురువు నుంచి స్ఫూర్తి ని, శక్తినీ పొంది , గురు ఉపదేశాన్ని దివ్యాదేశంగా తలచి ఎవరి క్షేత్రంలో వారు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్లం. ధర్మ వీరుడు, ధర్మ ప్రచారకుడు, ధర్మ మూర్తి అయిన షణ్ముఖశర్మ  గారి మెచ్చుకోలును  సద్గురు శివానందమూర్తి గురుదేవులు పలికించిన దీవెనగా భావిస్తాను




      షణ్ముఖ శర్మగారు నాకు కనీసం 30 ఏళ్లుగా తెలుసు. స్వాతి వారపత్రికలో జర్నలిస్టుగా , సినిమా కవిగా జీవయాత్ర సాగించిన కాలం మొదలుకుని ... ఋషిపీఠం  పెట్టి బాలారిష్టాల నుంచి దానిని ఒడ్డున పడవేయటానికి సతమతమైన వామన దశ నుంచి ... ప్రవచన రంగంలో ఇంతింతై బ్రహ్మాండమంతగా ఎదిగి దేశ దేశాలలో లక్షల అభిమానుల  అక్షౌహిణులను సమకూర్చుకుని నిశ్శబ్ద ధర్మయుద్ధంలో  నిమగ్నమైన నేటి అవక్ర త్రివిక్రమత్వం వరకూ- సామవేదంవారి  ప్రస్థానాన్ని నేను దూరం నుంచే సన్నిహితంగా గమనిస్తున్నాను. ధర్మపీఠం ముందు నిలబడి సత్య నిష్ఠ తో దేనినైనా ప్రశ్నించి, ఎవరినైనా నిలదీసి , అక్షరాయుధంతో  అధర్మాన్ని చీల్చి చెండాడటంలో ఎవరికీ తీసిపోను- అని  కొంచెం ఎక్కువే గర్వించే నేను కూడా క్రోధం లేకుండా శుద్ధ సత్వాన్ని వీడకుండా మెత్తటి మాటలలోనే వజ్ర సదృశ కాఠిన్యాన్ని, ధర్మాగ్రహ ప్రచండత్వాన్ని  భాసింపజేయగల సామవేదం వారి సంపాదకీయ ప్రజ్ఞకు ఆశ్చర్యపోతుంటాను.  ఉదాహరణకు  కాశీ కారిడార్ నిమిత్తం వారణాసి క్షేత్రం లోని ప్రాచీన దేవతామూర్తులను పెకలించినప్పుడు “క్షేత్రాపచారం జరగరాదు” శీర్షికతో 2021 జూలై లో శర్మగారు రాసిన ఈ పలుకుల ములుకులను చిత్తగించండి:




     “ప్రాచీన క్షేత్రాలను, ఆలయాలను అభివృద్ధిపరచడం హర్షణీయమే.కానీ ఆ క్రమంలో వాటి ప్రాచీనతనీ , చరిత్రనీ , పౌరాణిక ఐతిహాసిక ప్రాధాన్యాన్నీ పావనత్వాన్నీ దెబ్బతీయకుండా వాటిని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాలి. కాశీ కేవలం కట్టడాల క్షేత్రం కాదు. దానికి లెక్కలకందని కాలాల ఘనేతిహాస నేపథ్యం  ఉంది. ఏ లింగం, ఏ ప్రతిమ ఏ స్థానంలో ఉందో పురాణాలు వర్ణించాయి. వాటిని తొలగిస్తే ఆ స్థానాల పురాణ నేపథ్యం తెలిసి చేసే శాస్త్ర విధానాలు , యాత్రలు ఏమవుతాయి? మనకు చిన్నప్రతిమలుగా , గూడుల్లాంటి గుడులుగా కనపడుతున్నవి విశ్వ చైతన్య శక్తిబిందువులు . COSMIC ENERGY POINTS గా వైజ్ఞానిక పరిశోధనలతో తేల్చారు. ఆ చోటు నుండి వాటిని కదల్చినా ఒక శక్తి కేంద్రాన్ని భంగ పరచినట్టే కదా? ఇళ్ళూ, దుకాణాలు  కూల్చినట్టు గుడులనూ, ప్రతిమలను తొలగించటం దైవాపచారం, క్షేత్రాపచారం అవుతాయి కదా!

     “కాశీ పునర్నిర్మాణంలో ద్వాదశాదిత్య మందిరాలు , పంచ వినాయకులు, కొన్ని స్వయంభూ లింగాలు, మూర్తులు తొలగిపోయాయనీ, ముక్తిమండపం కూడా పోతోందనీ, ఒక ప్రాచీన అక్షయ మహావృక్షం ఖండించబడిందనీ ఎందరో వేదన పడుతున్నారు. విశ్వనాథాలయాన్ని మరింత శోభాయమానం చేస్తూ చక్కని కారిడార్ కట్టడం మంచిదే కానీ , ఆ మందిర శోభ కోసం ఎన్నో ప్రాచీన మందిరాలను, దేవతామూర్తులను, ప్రాచీన వృక్షాలను ధ్వంసం చేయటం సమంజసమా? ఈ క్షేత్ర దైవాపరాధం దేశానికి క్షోభకరం  కాదా? దేశాన్నీ, ధర్మాన్నీ దెబ్బతీయాలని చూస్తున్న విపక్షాల మూక దీనిని అవకాశంగా తీసుకుని హిందువులను చీల్చవచ్ఛు కూడా. “

      ఆ ఋషివాక్కే నిజమయింది. కాశీక్షేత్ర దైవాపరాధమే ఇప్పుడు ఈ  దేశానికి క్షోభకరం అయింది. దేశాన్నీ ధర్మాన్నీ దెబ్బతీయాలనుకునే విపక్షాల మూక ఇలాంటి దైవాపరాధాలను , అనేకానేక ధర్మాపచారాలను అవకాశంగా తీసుకుని హిందువులను చీల్చనే చీల్చింది. 400 కు తగ్గేదే లేదని తొడకొట్టిన భాజపేయ గండర గండలు ధర్మదేవత చాచికొట్టిన దెబ్బకు ఎన్నికల గోదాలో కుదేలై సింపిల్ మెజారిటీకే తెరువులేక అలయెన్సు ఊతకర్రల సాయంతో సర్కారును నెట్టుకు రావాల్సిన దుస్థితికి చేరారు.

      ఆ సంగతి అలా ఉంచండి. తెలుగులో -ఆ మాట కొస్తే దేశంలోనే ఎన్నో వందల, వేల  పత్రికలు ఉన్నాయి కదా? ప్రాచీన కాశీ క్షేత్రంలో సౌకర్యాల అభివృద్ధి పేర పరమ పవిత్రమైన దేవతా మూర్తుల , దైవ ప్రతీకల మహా విధ్వంసం జరిగితే ఋషిపీఠం వలె గొంతెత్తి అపచారాన్ని నిష్కర్షగా ఖండించిన పత్రిక వేరొకటి ఉన్నదా అంటే నాకైతే సందేహమే.  

     సద్గురు శివానంద మూర్తి గారి దివ్య స్ఫూర్తితో వేల మందిని కదిలించి ధర్మరక్షణకు కార్యోన్ముఖం చేయించి దేశంలోనే ఒక గొప్ప ధార్మిక ఉద్యమానికి చోదకశక్తి కాగలిగిన యోగ్యత, దక్షత షణ్ముఖశర్మగారికి ఉన్నాయి.ఆ మాట నేను ఆయనతోనే పలుమార్లు అన్నాను. కాని పట్టించుకున్నట్టు కనిపించలేదు. వయసు, వనరులు, శక్తి, సామర్ధ్యం , అవకాశం అన్నీ ఉండి కూడా ఆయన విసుగు , విరామం లేకుండా నిరంతర ప్రవచనాలకే సమయమంతా వెచ్చిస్తూ అసలైన, హిందూసమాజానికి జీవన్మరణ సమస్య వంటి  ధర్మ పోరాటం మీద శ్రద్ధ పెట్టటం లేదు. ప్రవచనాలు ఎన్ని చెప్పినా మన మొద్దు జనాలు మారతారా, కదులుతారా అని నాకు లోలోన ఒకింత అసంతృప్తి ఉండేది. అదికూడా ఒక నెలకింద పోయింది. అదీ ఆశ్చర్యకరంగా .



1999 జూలై లో సంస్థాపన నుంచి ఈ జూన్ వరకు పాతికేళ్లలో రాసిన 209 “ఋషిపీఠం సంపాదకీయాలు” ను అదే పేరిట ప్రచురించామనీ , నా అభిప్రాయం కోసం దాన్ని నాకు పంపుతామనీ శర్మగారు ఆ మధ్య  నాకు ఫోన్లో చెప్పారు. ఆ సందర్భంలోనే ఋషిపీఠం రజతోత్సవ వేడుకలు మూడు రోజులుగా భాగ్యనగరం లో జరుగుతున్నాయని , ఆహ్వాన పత్రిక ప్రత్యేకంగా మా ఇంటికి పంపించామని  గుర్తు చేసి ఆ సాయంత్రం  ముగింపు సభకు స్వయంగా ఆహ్వానించారు. వెళ్లకపోవటం మర్యాద కాదు కనుక 6-30లోగా తప్పక వస్తానని చెప్పాను.

బషీర్ బాగ్ లోని భారతీయ విద్యాభవన్ పెద్ద ఆడిటోరియం లో సభ.  6 గంటలకు మొదలు అని చెప్పినా అతిథులు, ఆహూతులు వచ్చి సీట్లలో సెటిలై కార్యక్రమం మొదలెట్టేసరికి మామూలు ఆనవాయితీ ప్రకారం ఆరున్నర పైమాటే. అయినా  శర్మగారిని ముందుగా కలిసి కాసేపు మాట్లాడుదాం అనుకుని 6-10 కల్లా సభాస్థలికి చేరాను. వెయ్యి మంది పట్టే ఆ ఆడిటోరియం అంతా నిశ్శబ్దంగా ఉన్నది. గేటు దగ్గర నిలబడి గౌరవ అతిథుల కోసం ఎదురు చూసేవారు లేరు. ఎక్కడా ఏ రకమైన అలికిడీ లేదు. అనుమానం వచ్చి ఇంకోసారి ఆహ్వాన పత్రిక చూశాను. సరైన  టైముకు సరైన స్థలానికే  వచ్చాను. మరి ఒక్క కార్యకర్తా కనపడడేమిటి ? ఒక  వేళ ప్రోగ్రాం కాన్సిల్ అయిందేమో కనుక్కో అని నా అసిస్టెంటుకు చెప్పాను. అతడు లోపలికి వెళ్లి కనుక్కుంటే   మీటింగు అప్పటికే మొదలైందని చెప్పారట.



      ఎవరూ లేకుండా మీటింగు ఏమిటి అని ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్లి చూద్దును గదా ఆడిటోరియం కిటకిటడుతున్నది. ముందు వరసలో నా కోసమే అన్నట్టు ఒక్క సీటు ఖాళీగా ఉన్నది. ఎక్స్ ట్రా చెయిర్లు కూడా వేసి ఉన్నాయి. అవిగాక కొంతమంది వరసలలో నెల మీద కూచుని ఉన్నారు. హౌస్ ఫుల్ అయినా హాలంతా నిశ్సబ్దంగా ఉన్నది. ఎవరూ ఎవరినీ పట్టించుకునే స్థితి  లో లేరు. అందరి దృష్టీ నడుస్తున్న కార్యక్రమం మీద  లగ్నమై ఉన్నది. పెద్ద వేదిక . దాన్ని మధ్య మూడే మూడు కుర్చీలు. మధ్యలో మెగా మాగ్నెట్ సామవేదం వారు. అటూ ఇటూ ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు ; కంచి పీఠం చల్లా విశ్వనాథ శాస్త్రిగారు , ఇద్దరూ పది పదిహేను నిమిషాలు క్లుప్తంగా మాట్లాడారు. షణ్ముఖ శర్మగారూ 40నిమిషాలకంటే ఎక్కువ సమయం తీసుకోలేదు.




      అమెరికా నుంచి , ఇతర దేశాలనుంచి సకుటుంబంగా వచ్చిన ఎంతో మంది    శిష్యులు-  గొప్ప గొప్పఎం.ఎన్.సీ .లలో చాలా పెద్ద హోదాలో ఉన్న చిన్నవయసు దిగ్గజాలు సంప్రదాయ వైదిక దుస్తుల్లో నేలమీద భక్తిశ్రద్ధలతో నిష్టగా కూచోవటం, పిల్లాజెల్లా ఉన్నా చప్పుళ్ళు , కేకలు లేకపోవటం, వాలంటీర్ల హడావుడి లేకుండా సుదీర్ఘ  కార్యక్రమం మిలిటరీ క్రమశిక్షణతో చకచకా నడిచిపోవటం చూసి ముచ్చట వేసింది. సామవేదం షణ్ముఖ శర్మగారు ఊళ్లు, దేశాలు పట్టుకుని ప్రవచనాలు చేయటం, ఋషిపీఠం పత్రిక నడపటం మాత్రమే కాదు -వారి ట్రస్టు సనాతన ధర్మ సంరక్షణకు, ఆర్ష విద్య, సంస్కృతి, కళల అభ్యున్నతికి దేశంలోనూ, దేశాంతరాలలోనూ వేలమందిని సమీకరించి బృహత్ వ్యూహంతో నిశ్శబ్ద ధార్మిక విప్లవానికి తనవంతు కృషి పటాటోపం లేకుండా సాగిస్తున్నదని నాకు అర్థమయింది. నేను లోపలికి వెళ్ళటం లాగే రెండుగంటల తరవాత బయటికి రావటమూ ఎవరూ గమనించలేదు. నేనా సభలో ఉన్నట్టు శర్మగారికి కూడా బహుశా ఇప్పటికీ తెలియదు.

      ధర్మం గురించి గావుకేకలు పెట్టి, సొంత లాభానికి ధర్మాన్ని అడ్డంగా వాడుకునే ఆధ్యాత్మిక ఆషాఢభూతుల కంటే మౌనంగా వేగంగా ప్రణాళికాబద్దంగా ధర్మవిజయానికి వేలమందిని నిమగ్నం చేయిస్తున్న సామవేదం వంటి వారి వల్లే ధర్మం నిలబడుతుంది. హిందూ దేశంలోనే హిందువుల మనుగడ ప్రశ్నార్థకమై , రకరకాల మానసిక , సామాజిక , రాజకీయ వైకల్యాలతో హిందూ సమాజం నిస్తేజం, నిర్వీర్యం అయిన ప్రస్తుత దురవస్థనుంచి బయటపడి హిందూ దేశంలో హిందూ రాజ్యం సర్వమతాలకు శ్రేయోదాయకంగా సుప్రతిష్ఠితమవటానికి తాజా వీడియోలో నేను చేసిన సూచన షణ్ముఖశర్మ గారికి నచ్చి తాను సైతం ఆదిశగా అడుగువేస్తానని చెప్పటం చాలా సంతోషం. ధార్మిక , ఆధ్యాత్మిక రంగాలలో దిగ్దంతులైన ఆయన వంటి మహానుభావులు పూనుకుని సమష్టి కార్యాచరణకు ఆయత్తం కాగలిగితే అంతకంటే కావలసింది ఏముంది?    

https://youtu.be/7dtjLr8xQTk?si=1pp96gpDFoIit48m

     సామవేదం వారితో ఇంతకు ముందు ఒకసారి నేను ధర్మ సంబంధమైన వీడియో సంభాషణ చేశాను. యు ట్యూబ్  లో దాన్ని చాలామంది చూశారు. దానికి కొనసాగింపుగా సమకాలిక ధర్మ సంకటాలు, హిందుత్వ అస్తిత్వ సమస్యలపై ఆయనతో ఇంకో సంవాదం చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నా ఇప్పటి దాకా కుదరలేదు. ఆ సంగతే ఇవాళ ఫోన్లో మాట్లాడగా జూలై చివరి వారంలో అమెరికా నుంచి తిరిగి వచ్చాక వీలైనంత త్వరలో ఒక పూట సావకాశంగా కలుద్దామని శర్మ గారు అన్నారు. శుభం.

                                                ---------------------------------

No comments:

Post a Comment