స్టార్స్ X సైన్స్ - 6
ఎం.వి.ఆర్.శాస్త్రి
.........
ప్రధాని నెహ్రూకు మరణం ఆసన్నమైందని 1963 ఆగస్టు నుంచి 1964 మే వరకు ఆయనకు మరీ గడ్డుకాలమని 'ది ఆస్ట్రలాజికల్ మేగజిన్' 1962 జూలై సంచికలో నెహ్రూకు నడుస్తున్న దశాంతర్దశలను బట్టి బి.వి.రామన్ జోస్యం చెప్పాడు . 1964 మే 27న నెహ్రూ మరణించాడు .
చైనాతో యుద్ధాన్ని ముందుగా జోస్యం చెప్పింది దుర్గాదాస్ పుస్తకంలో ప్రస్తావించిన జ్యోతిష్కుడు ఒక్కడే కాదు. 1962లో గానీ చైనాతో యుద్ధం రాదని ఎనిమిదేళ్లు ముందుగా 1954 జనవరి ' ఆస్ట్రలాజికల్ మేగజిన్' లో బి.వి.రామన్ రాశాడు. అలాగే 1965లో పాకిస్తాన్ తో యుద్ధాన్ని సంవత్సరం ముందూ , 1971 యుద్ధాన్ని ఏడు నెలల ముందూ ఆయన తన పత్రికలో గ్రహచారాన్ని బట్టి జోస్యం చెప్పాడు.
ఇది కేవలం ఒక బి.వి.రామన్ కూ, ఒక ఆస్ట్రలాజికల్ మేగజిన్ కూ మాత్రమే పరిమితమైన ప్రత్యేక కళ కాదు. అలాంటి జ్యోతిష్కులకు, అలాంటి పత్రికలకు దేశంలో కొదవ ఏమీ లేదు. ఉదాహరణకు పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం 1999 నవంబర్ 8 లోగా పడిపోయి అధికారం మిలిటరీ హస్తగతమవుతుందని ఆ సంవత్సరం సెప్టెంబర్ 12 సంచికలో జ్యోతిష పత్రిక Babaji రాసింది. ఈ ఆకస్మిక మార్పు అప్పట్లో ఎవరూ ఊహించనిది. కానీ సరిగ్గా నెలకల్లా (అక్టోబర్ 12న) అదే జరిగింది. యుద్ధాలనూ సైనిక కుట్రలనే కాదు. ఎన్నికల ఫలితాలను కూడా జ్యోతిష్కులు కచ్చితంగా చెప్పగలిగిన దృష్టాంతాలు లెక్కలేనన్ని.
"Congress is likely to form a Government after the election with the help of some other parties under the leadership of a person other than Rajiv Gandhi" (ఎన్నికల తరవాత రాజీవ్ గాంధి కాక వేరొకరి నాయకత్వంలో ఇతర పార్టీల సాయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది)
-అని 1991 ఏప్రిల్ 9న Babaji పత్రిక జోస్యం చెప్పింది. అప్పటికి యునైటెడ్ ఫ్రంట్ రసాభాస ప్రయోగాలతో జనానికి మొగం మొత్తింది కనుక తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెసు గెలుస్తుందని చాలామంది అనుకున్నదే, కాని -తిరుగులేని ఏకైక నాయకుడు రాజీవ్ గాంధి ఉండగా మరొకరు కాంగ్రెస్ ప్రభుత్వాధినేత కావడమన్నది ఎవరూ కలనైనా ఊహించనది. కాని - అసంభవ మనుకున్నదే సంభవమైంది. సరిగ్గా ఆ పత్రిక రాసినట్టే రాజీవ్ కాక వేరొకరి నాయకత్వంలో కాంగ్రెస్ గద్దెనెక్కింది.
అధికారంలోకి రాడనే తప్ప రాజీవ్ కు మృత్యుగండాన్ని జోస్యులు ముందుగా చెప్పలేక పోయారందామా ? Sorry Rajiv;No chance for the time being! Take care of your person (సారీ రాజీవ్! ప్రస్తుతం మీకు ఛాన్సులేదు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి) అని 1990 జులై 10న వెలువడ్డ సంచికలో ఇదే 'బాబాజీ' పత్రిక జోస్యం చెప్పింది.
కాంగ్రెస్ గెలిచినా రాజీవ్ ప్రధాని కాలేడన్నారు సరే! కాని - ప్రధానమంత్రి ఎవరు అవుతారో కచ్చితంగా ఎవరూ చెప్పలేదు కదా అని పెదవి విరుద్ధామా?
రానున్న ఎన్నికల తరవాత పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి అవుతాడని వి.ఎల్.నరసింహన్ చెప్పిన జ్యోసాన్ని రాజీవ్ గాంధి జీవించి వుండగానే The Week ఆంగ్ల పత్రిక ప్రచురించింది.
ఇప్పుడు కీర్తిశేషుడైన వి.ఎల్.నరసింహన్ సికింద్రాబాద్ వాస్తవ్యుడు. జ్యోతిషంలో నమ్మకం ఉన్నవారికి ఆయన చిరపరిచితుడు. కేవలం ఇంట్యూషన్ బట్టి తనకు ఏది స్ఫురిస్తే దాన్ని జోస్యం చెప్పే మనిషి కాదాయన. చెప్పే ప్రతి ఫలితానికీ ప్రాతిపదిక ఏమిటో, అది అలా జరుగుతుంది అనడానికి శాస్త్ర ప్రమాణమేమిటో ఆయన దాపరికం లేకుండా విడమర్చి చెప్పేవాడు.
జ్యోతిష్యం మీద జోకులు, అవాకులు చవాకులు చాలానే వున్నాయి. యుద్ధంలో రెండుదేశాల మధ్య ... ఆటలో రెండు జట్ల మధ్య... సంఘర్షణ జరిగితే కొందరు జ్యోతిష్కులు వీరు గెలుస్తారంటారు. కొందరేమో వారిదే విజయం అంటారు. చివరికి ఎవరు గెలిచినా ఏదో ఒక వర్గం జ్యోతిష్కుల మాట నిజమైనట్టే! అలాగే ఒకడు కళ్లు మూసుకొని నూరు జోస్యాల రాళ్లు విసిరితే ఎనభై గురి తప్పినా ఇరవై పొరపాటున గురికి తగలవచ్చు. కాకతాళీయంగా నిజమైన పదో ఇరవయ్యో జోస్యాలను పటం గట్టుకుని తనను మించిన దైవజ్ఞుడు లేడంటూ ఊరేగడం పక్కా జనవంచన. ఇలాంటి తక్కువ అభిప్రాయం జ్యోతిషం మీద చాలామందికి ఉంది. మనకు కనపడే చాలామంది జ్యోతిష్కుల విషయంలో ఇది కరెక్టే కూడా. సాదారణంగా ఏ జోస్యుడైనా ఫలించిన జోస్యాల సంగతే గొప్పగా చెప్పుకుంటాడు. తుస్సుమన్న వాటి ఊసు ఎత్తనే ఎత్తడు. కాని - జోస్యాల్లో ఎన్ని నిజమవుతాయి. ఎన్ని కావు అన్నది కాదు పాయింటు. జ్యోతిషానికి శాస్త్రీయ ప్రాతిపదిక వుందా లేదా అన్నదే ఇక్కడ తేలాల్సిందల్లా.
మాటవరసకు జ్యోతిష్కుల్లో నూటికి 90 మంది మోసగాళ్లని, అజ్ఞానులని అనుకుందాం. కాని కనీసం నూటికి పదిమంది అయినా భవిష్యత్తును కచ్చితంగా చెప్పగలుగుతున్నారా లేదా? మొత్తం జోస్యాల్లో నూటికి 80 నిజం కాదనీ, మిగతా 20లో కూడా 19 యాదృచ్చికంగా ఫలించేవేనని కాసేపు ఒప్పుకుందాం. కాని - నూటికి ఒక్క జోస్యమైనా వెంట్రుకవాసి తేడా లేకుండా, మానవ మేధకు, హేతువాదానికీ అంతుబట్టనిరీతిలో, గతితార్కిక భౌతిక శాస్త్ర సూత్రాలన్నిటినీ తల్లకిందులు చేసే విధంగా నిజం కావడం ఎలా జరుగుతున్నది? ఎన్నికల్లో ప్రధానంగా రెండు పక్షాల మధ్య పోటి జరిగేటప్పుడు వారో వీరో గెలుస్తారని చెబితే కొందరి జోస్యాలైనా నిజం కావడంలో వింతలేదు. కాని - రాజీవ్ గాంధి బతికి వుండగా, ఆయనలేని కాంగ్రెస్ ను సమీప భవిష్యత్తులో ఎవరూ ఊహించలేని స్థితిలో... మూలపడి, వానప్రస్థానికి ఆయత్తమై వున్న పి.వి.నరసింహారావు తదుపరి ప్రధాని కాబోతున్నాడని ఒక జ్యోతిష్కుడైనా ఎలా చెప్పగలిగాడు?ముసలితనంలో వున్నవారికి 'ఆరోగ్యం జాగ్రత్త' అనో, మరణం దగ్గరపడిందనో చెప్పడానికి జ్యోతిషమే తెలియనక్కర్లేదు. కరక్టే. కాని - ఒక నెహ్రూ, ఒక పటేల్, ఒక మౌలానా ఆజాద్ సరిగ్గా ఫలానా రోజునే మరణించనున్నట్టు కనీసం ఒక జోస్యుడైనా ఎలా ఊహించగలిగాడు? మన సైన్సువాదులు కొట్టి పారేస్తున్నట్టు జ్యోతిష్యమంతా మూఢనమ్మకమే అయితే ఆకాశంలో గ్రహస్థితికి భూమి మీద మనిషి భవిష్యత్తుకు 'సైన్సు పార్టీ' వారంటున్నట్టు ఎటువంటి సంబంధం లేకపోతే గ్రహస్థితిని బట్టి వేసిన జాతకాల ఆధారంతో కొద్దిమంది జ్యోతిష్కులైనా భవిష్యత్తును చాలా కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?
పోనీ - వారు ఏదైనా అంజనం వేసో, మానవమాత్రుడు పోల్చుకోలేని తాంత్రిక విద్యతోటో, ఇంకేదో అతీంద్రియ శక్తితోనో భవిష్యత్తును ఊహించి చెబితే వేరే సంగతి. అటువంటి విద్యలు ఒకవేళ వున్నా మరొకరికి అర్థమయ్యేవి, పట్టుబడేవి కావు కనుక వాటి గురించి ఆలోచించడం టైము వేస్టు.
జ్యోతిషం అలాకాదే?! దానికి నిర్దిష్టమైన, ఎవరైనా తెలుసుకోగలగిన కొన్ని సూత్రాలున్నాయి. ఆయా సిద్ధాంతాలను వివరించి, నిత్య జీవితంలో వాటిని ఉపయోగించడం ఎలాగో బోధించటానికి ప్రామాణిక గ్రంథాలున్నాయి. అక్షాంశ రేఖాంశాల సాయంతో, ఆకాశంలో ప్రత్యక్షంగా కనపడే చుక్కలనుబట్టి గ్రహాల నక్షత్రాల ఉనికిని, సంచారాన్ని వాటి మధ్య దూరాన్ని , పరస్పర ప్రభావాలను విస్పష్టమైన గణితంతో లెక్కలువేసి, భూగోళం, వాతావరణాది ఇతర శాస్త్రాలలాగే కచ్చితమైన కాలిక్యులేషన్లు చేసి, శాస్త్ర గ్రంథాల్లో చెప్పినదానికి అనుభవంతో గ్రహించిన దానిని జోడించి భవిష్యత్తును ఊహించడమే జ్యోతిషం చేసే పని. ఓపిక, కోరిక వుంటే ఆ లెక్కలు ఎవరైనా చేయగలరు. ఆ సూత్రాలు ఎవరైనా నేర్వగలరు. ఆ ఫలితాలు ఎవరైనా చెప్పగలరు. ఇందులో మాయలు,, మర్మాలు ఏమీ లేవు. మూఢ నమ్మకాలకు చోటే లేదు. ఈ సంగతి మెడమీద తలకాయ వుండి, అందులో మెదడు పనిచేసే ప్రతివాడికి తెలుసు. మరి జ్యోతిషానికి ప్రాథమిక సూత్రాలంటూ ఏవీలేవని... తర్కబద్ధమైన రీతిలో నిర్దిష్ట నియమాలను ఎవరైనా విశ్లేషించి జ్యోతిష్కుడెవరన్న దానితో నిమిత్తం లేకుండా ఫలితాలు చెప్పగల ఆస్కారం లేనేలేదని సైన్స్ వాద యోధులు ఎలా దబాయించగలుగుతున్నారు? చేతబడులనూ, జ్యోతిషాన్ని ఒకే గాట ఎలా కడుతున్నారు?
ఎంతటి గొప్పవాడైనా తన సబ్జెక్టు వరకూ మాత్రమే ప్రవీణుడు. మిగతా విషయాల్లో తెలిసీ తెలియక మాట్లాడితే , మూర్ఖంగా వ్యవహరిస్తే అతడినీ మామూలు మూర్ఖుల్లో ఒకడిగానె చూడాలి. ఒక సైంటిస్టు తన సబ్జెక్టులో ఎంత గొప్పవాడైనా తనకు తెలియని, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని జ్యోతిషం గురించి అభూతకల్పనలు చేస్తే వాటన్నిటినీ శాస్త్రీయ అభిప్రాయాలుగా , సైన్స్ ఇచ్చిన తిరుగులేని తీర్పులుగా ఎందుకు గౌరవించాలి ?ఒకడికి ఒకటో రెండో సైన్స్సుకు సంబంధించిన డిగ్రీలు ఉంటె చాలు జ్యోతిషం లాంటి మూఢ నమ్మకాలను చిత్తం వచ్చినట్టు తూలనాడెందుకు తడికి అన్ లిమిటెడ్ లైసెన్సు ఉన్నట్టా ? అతడి నోట ఏది వస్తే అది శాస్త్ర ప్రామాణికమా ?జ్యోతిషశాస్త్రానికి ప్రమాణాలేమిటో, ప్రాతిపదికలేమిటో, గణితం ఎలా చేస్తారో ఫలితం ఎలా చెబుతారో తెలుసుకునే ప్రయత్నం వీరెప్పుడైనా చేశారా? ఏ బుక్ షాప్ లోనైనా విరివిరిగా కనపడే వందలాది జ్యోతిష సిద్ధాంత గ్రంథాల్లో ఏ ఒక్కదానినైనా అట్ట తెరిచి చూసిన పాపాన వీరు పోయారా? తాము ఊహిస్తున్నట్లు జ్యోతిషం పూర్తిగా మూఢనమ్మకమే అయితే దాని ఆధారంగా చెప్పే నిర్దిష్ట ఫలితాల్లో ఏ ఒక్కటి నిజం కాకూడదుకదా? వేయి జోస్యాల్లో ఒక్కటి నిజమైనా తమకు తెలిసినసైన్సుకూ భౌతిక సుత్రాలకూ అంతుబట్టనివిధంగా అది ఎలా జరిగిందో పరీక్షించి తెలుసుకోవాలన్న శాస్త్రీయ జిజ్ఞాస సోకాల్డ్ 'సైన్స్ బాడ్జిధారు' లలో ఎంతమందికి వుంది?
( 2 సెప్టెంబర్ 2001 న ఆంధ్రభూమి దినపత్రిక లో వచ్చిన వ్యాసం )
అయిపోయింది.
No comments:
Post a Comment