పాత ముచ్చట్లు - 5
ఎం.వి.ఆర్.శాస్త్రి
......
......
నవ్వుల పాలైన నాయకులూ, నవ్వులపాలవుతున్న పాలకులూ ఈ కాలంలో కొల్లలు.
హాయిగా నవ్వులు పంచే పరిపాలకుడు ఎక్కడో ,ఎప్పుడో తప్ప కానరాడు.
అలాంటి బహు అరుదైన ప్రభువుల్లో ఎన్నదగ్గ వాడు టంగుటూరి అంజయ్య.
' ఆరణాల కూలీ 'అంజయ్య ( అది ఆయన గర్వంగా చెప్పుకున్న విశేషమే) పేరు తలచుకుంటే ఆ కాలపు వాళ్ళకు ఇప్పటికీ నవ్వొస్తుంది.
తనను చూసి నవ్వుతున్నారంటే సాధారణంగా ఎవరైనా తెగ గింజుకుంటారు. ఉక్రోషంతో లోలోన రగిలిపోతారు. అంజయ్య అలా కాదు. ఇంకా నవ్వుకోమంటాడు. ఆ మాట సంతోషంగా చెపుతాడు.
అలాగని అంజయ్య హాస్యగాడు కాదు. సీరియస్ రాజకీయ నాయకుడు. ఇప్పటి నేతాశ్రీలలా పుట్టెడు స్కాముల అపకీర్తి ఉన్నవాడు కాదు. తాను అనే మాటలకు, చేసే పనులకు ఎవరికైనా నవ్వు వస్తే నవ్వుకోండి నాకు అభ్యంతరం లేదు అంటాడు. కావాలని హస్యాలాడడు . కానీ ఆయన మాట తీరే నవ్వు తెప్పిస్తుంది. ఒక రకం గా లాలూ యాదవ్ టైపు. కాని లాలు లా గడ్డి తినే రకం కాదు. పెద్దమనిషి. మంచి మనిషి .
కాంగ్రెస్ర్ పార్టీలో మొదటినుంచీ అంతులేని అసమ్మతిని అదుపుచేయటానికి ఆనాడు ఆయన ఆశావహులనందరినీ మంత్రివర్గ పుష్పకం లోకి ఎక్కన్చినందువల్ల ఇప్పుడు కొమ్ములు తిరిగిన ఒకనాటి అనామకులు చాలామందికి మంత్రియోగం పట్టింది. దానివల్ల అసమ్మతి ఇంకా పెరిగి చివరికి అంజయ్య గద్దెకు ఎక్కి పదహారు నెలలు అయిందో లేదో మోసం తెచ్చింది. కాని అప్పటి ఆయన 'జుంబో కాబినెట్ ' రాజకీయాలలో ఆయనను అన్యాయం గా ఒక జోకర్ ను చేసింది. ఇలాంటి ఉదాహరణలు చాల ఉన్నాయి.
సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఇప్పటి మారాజుల్లో బొత్తిగా కానరాదు. వేరే దురుద్దేశం లేకుండా , సున్నితంగా విమర్శిస్తూ తమ మీద ఒక పత్రిక కార్టూన్ వేస్తె నేటి పాలకులు సాధారణంగా భగ్గుమంటారు. కక్షగట్టి తమను నవ్వులపాలు చేస్తున్నారని ఉడుక్కుంటారు . వీలయితే అది వేసినవారి వెంట పడతారు. మళ్ళీ అలాంటి కార్టూన్ ఆ పత్రికలో రాకుండా శాయశక్తులా తంటాలు పడతారు.
అంజయ్య అలా కాదు. తన మీద వేసే కార్టూన్లను మహా ఎంజాయ్ చేసేవాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మీద కార్టూన్ లేని రోజు ఈనాడు లో సాధారణంగా ఉండేది కాదు. అంజయ్య సరదా పడి కొనిపించి ," యాదగిరి " అని పేరు పెట్టుకున్న ప్రభుత్వ హెలికాప్టర్ ఆయన కు ' ట్రేడ్ మార్కు. ఆట బొమ్మలా దానికి దారం కట్టి ముఖ్యమంత్రి చేతులో పెట్టి ఆయనని ఆటపట్టిస్తూ 'పాప' రోజూ కార్టూన్ వేసేవాడు. తన సహజ శైలిలో ఏ సభ లోనో , ప్రెస్ కాన్ఫరెన్స్ లోనో ఏదో తమాషా ప్రకటన చేసిన ప్రతిసారీ ' రేపు కార్టూన్ వస్తదా ? ' అని అక్కడున్న ఈనాడు రిపోర్టర్ ని అంజయ్యగారు నవ్వుతూ అడిగేవాడు.
అచ్చమైన తెలంగాణా యాస లో అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగు అని అప్పటి 'ఆస్థానకవి ' దాశరథి అంటే దాన్ని వెక్కిరిస్తూ 'సముద్రం ల తేల్ పడ్డది ... " లాంటి మాటలతో ఈనాడు వేసిన కార్టూన్ ను చూసి అంజయ్య హాయిగా నవ్వుకున్నాడు. ఇప్పుడు కనుక అలాంటి కార్టూన్ వస్తే పత్రికను జనం తగలపెడతారు.
అంతకుముందు రోడ్డు మీద చాయ్ తాగుతూ అందరితో కలివిడిగా ఉన్న వాళ్లకు కూడా అధికారస్థానం లో కూచున్నాక కళ్ళు నెత్తికెక్కుతాయి. నెత్తిమీద కొమ్ములు కూడా మొలుస్తాయి. కిందటి రోజు దాకా తనతో కలిసి మెలిసి ఉన్నవాళ్ళు ఎవరినీ గుర్తు పట్టలేని , దగ్గరకు రానివ్వని చిత్రమైన మదం ఆవహిస్తుంది.
అంజయ్య గారు ఈ సాధారణ లోక రీతికి చక్కని మినహాయింపు. ముఖ్యమంత్రి గా తన అధికార నివాసంగా ఎంచుకున్న గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ కు 'ప్రజా భవనం ' ( అని గుర్తు ) పేరు పెట్టాడు. దానికి తగ్గట్టే అందులో అందరికీ అందుబాటులో ఉండేవాడు. భేషజాలు లేకుండా ప్రతి సామాన్యుడిపట్ల ఆత్మీయత చూపేవాడు. కోరిన పని చేసినా చేయకపోయినా 'అంజన్న ' చూపు తోనే వచ్చిన వారికి కడుపు నిండేది.
అలాంటి శ్రీమాన్ టంగుటూరి అంజయ్యను 1980 అక్టోబర్ లో ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్దిరోజులకు 'ప్రజాభవన్' లో మేము కలిశాము. ఇప్పుడైతే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ దొరకటానికి జర్నలిస్టులు చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. ఎవరెవరినో పట్టుకుని తెగ పైరవీ చేయాలి. సిఎంఓ అనే దుర్బేధ్యమైన కంచుకోట ను చేరటానికి ఎన్నో అగడ్తలు దాటాలి. ఎన్ని విధాల అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం దక్కితే చాలా గొప్పే.
వెనకటి రోజుల్లో ఈ బాధలేవీ ఉండేవి కాదు. పి ఆర్ ఓ లు పంపే ప్రెస్ రిలీజ్ లను కళ్ళకద్దుకుని వాటినే ప్రత్యెక వార్తలుగా అచ్చేసుకునే ఖర్మ అప్పట్లో పత్రికలవాళ్లకు పట్టలేదు. సాధారణం గా ఏ ముఖ్యమంత్రినైనా సులభంగా కలవగలిగి , నేరుగా మాట్లాడగలిగే వాళ్ళు చెప్పుకోదగ్గ ప్రతి పత్రికలోనూ కనీసం ఒకరిద్దరైనా ఉండేవాళ్ళు. ఇక అంజయ్య జమానా లో అయితే చెప్పనే అక్కర్లేదు.
" ముందుగా అపాయింట్ మెంట్ ఏమీ అక్కర్లేదు .మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు " అన్నాడు ఎస్.ఎన్.శాస్త్రి గారు. ఆయన జర్నలిస్టు పితామహులనదగ్గ వారిలో ఒకడు. అప్పట్లో ఈనాడు కు స్పెషల్ కరస్పాండెంట్ గా ఉండే వాడు. ఇంకేం ? ఒక రోజు సాయంత్రం అధికార నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశాం. అప్పుడు తీసింది మీరు చూస్తున్న ఫోటో.
ఎడమ వైపు చివర ఉన్నది నేను. నా పక్కన వరసగా ఈనాడు రిపోర్టర్ సుందర సాయి, ఎస్.ఎన్.శాస్త్రి, ఎస్.ఆర్.రామానుజన్ .
ముందు అపాయింట్ మెంట్ మాకే కాదు ఎవరికీ అక్కర్లేదు కాబట్టి మేము వెళ్ళేసరికే బంగళా కిటకిటలాడుతున్నది. ఏ రూమ్ కేసి చూసినా వేచి ఉన్న జనం. తన ఆఫీసు రూమ్ లో ఉన్నవాళ్ళతో మాట్లాడుతూనే మధ్య మధ్య ముఖ్యమంత్రి బయటికొచ్చి వారినీ వీరినీ పలకరించి పోతున్నారు. ' మంచిగున్నవా ', 'చాయ్ తాగినవా ', చాయ్ తాపించవా ?' అంటూ ! లోపల కుర్చీలు ఖాళీ అయ్యేదాకా మేము ఇంకో చోట వెయిట్ చేయాల్సి వచ్చింది.
మేము వెళ్లి కూచున్నాక కూడా ముఖ్యమంత్రి మాతో మాట్లాడుతూనే లోపలికి వచ్చి పోయే ఆమ్ ఆద్మీలతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరో వచ్చి ఏదో పని విషయం గుర్తుచేస్తే ' రేపు సెక్రటేరియట్ కి రా ! సి.ఎం. సెక్రటరీ తో మాట్లాడి నీ పని చేయిస్తా ' అంటున్నాడు . బహుశా పాత అలవాటు కొద్దీ . ఇప్పుడు తానే సి.ఎం. ని, సెక్రటరీ తన కిందనే పని చేసే వాడు అన్న సంగతి అంజయ్య గారి బుర్రలో పూర్తిగా ఇంకినట్టు లేదు.
మధ్యమధ్య అంతరాయాలతోనే మాతో ముఖ్యమంత్రి చాల సేపే అరమరికలు లేకుండా మాట్లాడాడు. very lovabe man అనిపించాడు. మేము ఏమి అడిగాము, ఆయన ఏమి చెప్పాడు అన్న వివరాలు ఇప్పుడు గుర్తు లేవు .
అంజయ్య గారి గురించి చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి తరువాయి భాగంలో.
No comments:
Post a Comment