Friday, 2 March 2018

తెల్లవాడు తెచ్చిన తంటా

మనుధర్మం -4

ఎం.వి.ఆర్. శాస్త్రి


    ఒకే సమాజానికి చెందిన మనుషుల మధ్య నిమ్నోన్నత తరగతుల్ని సృష్టించి పోషించింది హిందూ మతం ఒక్కటే... అది చేయని ఘోరం లేదు రాజుల చేత చేయించని ఘోరం లేదు.వేలాది సంవత్సరాలుగా సాగిన ఆ దురంతాల నీడలు నేటికీ  హిందూ సమాజాన్ని వీడలేదు . ఈ స్థితి కల్పించిన గ్రంథాల్లో మనుస్మృతి దే అగ్రస్థానం. ... ...కనీసం వేయి సంవత్సరాలకు పైగా అమలులో ఉన్నది మనుస్మృతి ... స్మృతుల అధికారం కొంతలో కొంత విదేశీ , విమత పాలకుల కాలంలోనే ఈ దేశంలో క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది ... ఈ దేశం పరాయి పాలనలోకి పోకుండా మన పూర్వపు రాజరికాలే కొనసాగి ఉంటే , ఇప్పటికీ మనుస్మృతి తరహా శాసనాలు అమలులో ఉండేవని మనం మరచి పోకూడదు... 
[మనుస్మృతి మైనస్ అశుద్ధం , రావిపూడి వేంకటాద్రి  , పే.2 , 32 ]

    ఇలాంటి అభిప్రాయం మన దేశంలో చాలా మంది మేధావులకు చాలా కాలంగా ఉంది. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ దేశంలో బ్రాహ్మణ పూజారివర్గం తన చెప్పుచేతల్లోని రాజులద్వారా క్రూరంగా , నీచాతినీచంగా అమలుజరిపించిన మను ధర్మం ఇక్కడి ఆదివాసులను, దళితులను ,శూద్రులను, స్త్రీలను రాచి రంపాన పెట్టి కాళ్ళ కింద తొక్కివేసిందనీ .. మన అదృష్టం కొద్దీ ఇంగ్లీషు వారు వచ్చి , చక్కగా పరిపాలించసాగాకే ..  నీచ నికృష్ట మనుస్మృతి  పీడ దేశానికి వదిలిందనీ ... బుద్ధి శుద్ధి జరిగిన మన బుద్ధిజీవులకు పెద్ద భ్రమ .

    నిజానికి  ... నమ్ముతారో లేదో ,  ఇంగ్లీషు వారు దొంగచాటున  పచ్చి మోసాలతో మనదేశాన్ని దుర్మార్గంగా ఆక్రమించాకే  మనుస్మృతికి మహారాజ యోగం పట్టింది !!

    అంతకుముందు అనేక వేల సంవత్సరాలుగా మనుస్మృతి వ్యవహారంలో ఉంది. స్మృతులన్నిటిలోకీ తలమానికమైనదిగా విద్వాంసులు , ధర్మవేత్తలు దానిని గౌరవించే వారు. కానీ దానికి చట్ట ప్రతిపత్తి , రాజ్యాంగ ప్రతిపత్తి పూర్వం ఏనాడూ లేదు. నేరాలూ శిక్షలకు సంబంధించి ఏ నిర్ణయమైనా మనుస్మృతి లో చెప్పినట్టే జరగాలని ఏ ప్రభువూ చెప్పలేదు. ఏ కాలం లోని ఏ న్యాయస్థానమూ , ఏ రాజాస్థానమూ మనుస్మృతిని పరమ  ప్రమాణంగా, అనుల్లంఘనీయ శాసనంగా పరిగణించి అమలు జరిపిన దాఖలాలు చరిత్రలో కనపడవు. మనకు లెక్కకు మిక్కిలిగా ఉన్న స్మృతులవలె అదికూడా ఒక ధర్మ సూత్ర సంహిత మాత్రమే. న్యాయ నిర్ణయం , ధర్మ నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు మనుధర్మాన్ని అనుసరించాలా వద్దా అనేది ఐచ్చికమే తప్ప నిర్బంధం ఏనాడూ కాదు.  ఆ సంగతి పాశ్చాత్య విద్వాంసులు కూడా అంగీకరించారు.

  "In the opinion of the best contemporary orientalists, Manusmriti does not, as a whole, represent a set of rules ever actually administered in Hindustan. It is in great part an ideal picture of that which, in the view of a Brahmin, ought to be law".

    మనుస్మృతి నియమావళి మొత్తంగా ... హిందూస్తాన్ లో ఏ కాలంలోనూ అమలు జరపబడలేదు.  శాసనం అంటే ఎలా ఉండాలి అని ఒక   బ్రాహ్మణుడు భావిస్తాడు అన్నది మాత్రమే అది ప్రధానంగా చిత్రిస్తుంది . ప్రాచ్య నాగరికతను అధ్యయనం చేసిన వారిలో కెల్లా ఉత్తములైన వారి  అభిప్రాయం ఇదే ..అని Family Law and Customary Law in Asia: A Contemporary Legal Perspective గ్రంథం  (204 పేజి) లో  David Buxbaum రాశాడు. అలాగే...

  "There is no historical evidence for either an active propagation or implementation of Manusmriti by a ruler or any state – as distinct from other forms of recognizing, respecting and using the text. Thinking of the Dharmasastra as a legal code and of its authors as lawgivers is thus a serious misunderstanding of its history".

     మనుస్మృతి ని గుర్తించటం, గౌరవించటం , దాని పాఠాన్ని ఉపయోగించటం జరిగిందే తప్ప ... ఒక ప్రభువుకాని , ఒక రాజ్యం కాని మనుస్మృతి ని చురుకుగా వ్యాప్తిచేసినట్టుగాని,  అమలుపరిచినట్టుగాని చారిత్రక సాక్ష్యం ఒక్కటీ లేదు . ఈ ధర్మ శాస్త్రాన్ని న్యాయసంహితగా, దానిని రచించిన వారిని శాసనకర్తలుగా భావించటం  చరిత్రను తప్పుగా అర్థం చేసుకోవటమే అవుతుంది  .. అంటాడు The Spirit of Hindu Law గ్రంథం ( 14వ పేజి} లో Donald Davis. మనుస్మృతి ఒక " theoretical resource" మాత్రమే అని  Hindu Law: Beyond Tradition and Modernity గ్రంథం లో Werner Menski స్పష్టం చేశాడు.

     మరి - ఏ కాలంలోనూ చట్టప్రతిపత్తి లేని  మనుస్మృతికి  మునుపు కనీవినీ ఎరుగని ప్రాముఖ్యం , ప్రాధాన్యం మన ఆధునిక కాలంలో ఎలా వచ్చి పడ్డదంటారా ?

     హిందూ దేశంలో హిందూ రాజుల పాలనలో ఏనాడూ లేని గిరాకీని మనుస్మృతికి ఏరికోరి, కట్టబెట్టింది తెల్లవాళ్ళు. అది కూడా మనుధర్మం మీద ఎనలేని భక్తి ప్రపత్తులతో కాదు. వారి అవసరం కొద్దీ !ఎలాగంటే..

     18 వ శతాబ్దం లో మొదటి సగం దాటాక హిందూదేశం లో అత్యధిక భాగం ఇంగ్లిషు వాళ్ళ ప్రాబల్యం లోకి వచ్చేసింది. మొఘల్ చక్రవర్తి పనుపున ఏజెంట్లము అని పైకి చెప్పినా , వాస్తవంగా రాజ్యాధికారమంతా  ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. అప్పటిదాకా  " కుంఫిణీ వాటాదారులకు లాభాలు గడించటం ఒకటే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చిన ఆంగ్లేయుల మీద పరిపాలనా బాధ్యత పడింది. రాజకీయ ,పాలనా విషయాలతో పాటు శాసన , న్యాయపరమైన వ్యవహారాలను కూడా వారే నిర్వహించవలసి వచ్చింది. అందులో భాగంగా  ఆస్తి హక్కులు , ఆస్తి పంపకాలు , కుటుంబ తగాదాలు , పెళ్ళీ పెటాకులు వగైరాలకు సంబంధించి ,  మతధార్మిక సామాజిక విషయాలపైన పౌర సమాజం తగవులను సైతం వారే తేల్చాల్సి వచ్చింది.

      ఏకాడికీ  లాభాల దృష్టే తప్ప నడమంత్రపు పెత్తనం లో లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవటం "కంపెనీ "దొరలకు  గానీ ,బ్రిటిషు మారాజులకు గాని ఇష్టంలేదు.స్థానిక వాసులతో గొడవ రాకుండా ఉండాలంటే వారి సంప్రదాయం, ఆచారాలలో జోక్యం చేసుకోకుండా వాటి  ప్రకారమే పరిపాలన సాగించినట్టు కనిపించటం  మంచిదని వారు తలిచారు.   

     ఇందులో మహమ్మదీయులకు సంబంధించినంత వరకూ సమస్య  లేదు. వారి వ్యవహారాలన్నీ షరియా ప్రకారమే నడుస్తాయి. పరిపాలన లో దానిని ఎలా పాటించాలన్నది al-Sirjjiyah ,  Fatawa-i Alamgiri ల పేరిట ఔరంగజేబు కాలంలోనే క్రోడీకరించబడ్డాయి. ఎటొచ్చీ హిందువుల తోనే తంటా !

      కిరస్తానీ సమాజంలో ఆచారం తో ముడిపడిన వ్యవహారాలన్నీ క్రైస్తవ మత సూత్రాలు, సంప్రదాయాల ప్రకారం నిర్ణయమవుతాయి . వాటికి  సంబంధించి Canonical Law అనేది ఉన్నది. దానిపై అనుమానం వస్తే అడగటానికి మతాచార్యుల వ్యవస్థ ఉంటుంది.  కాబట్టి తమలాగే   హిందూ సమాజానికి కూడా అలాంటి ఏర్పాటే ఉంటుందని సీమదొరలు తొలుత అనుకున్నారు. కాని  వారికి  బైబిల్ లాగా హిందువులకు ఒక పవిత్ర గ్రంథమూ లేదు ;  మతపరంగా ఒక న్యాయ శాసనమూ లేదు ;   ప్రామాణిక  న్యాయసంహిత ఇదీ అని చెప్పటానికి ఏదీలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం !ఒక్కో న్యాయ విధానం! ఒక మత వర్గం లోనే ఎన్నో తేడాలు! అనుసరించే విదినిషేధాల్లో ఎన్నో వైరుధ్యాలు! ధర్మ సూత్రాలు, స్మృతులు చాల ఉన్నా వాటికి విధిగా కట్టుబడాలన్న నిర్బంధం దేశంలో ఏనాడూ లేదు! కట్టుబడను పొమ్మంటే ఎవరినీ చేయగలిగింది ఏమీ లేదు. క్రైస్తవులకు పోప్ వలె హిందువులకు ప్రత్యేకంగా ఒక పీఠాధిపతి అంటూ లేడు. ఈ స్థితిలో ఉపఖండమంత విశాలమైన మహాదేశం  మొత్తానికీ వర్తించేట్టు న్యాయపరిపాలన చేయటం ఎలాగా అని దొరలు జుట్లు పీక్కున్నారు.

       నిజానికి న్యాయవిధానానికి సంబంధించి మన దేశం లో ఏనాడూ గందరగోళం లేదు. ఏ ఊరికి ఆ ఊరిలో గ్రామ పెద్దలతో కూడిన పంచాయతీలు ఊరిజనం మధ్య  వ్యాజ్యాలను విచారించి తీర్పులు చెప్పేవి .ఏ కులానికి సంబంధించిన గొడవలను ఆ యా కులపంచాయతీలు తెల్చేవి.  మతపెద్ద  లతో గాని మత గ్రంథాలతో గాని , ప్రత్యేకంగా ఒక ధర్మశాస్త్రం తో గాని వాటికి పని లేదు. తీవ్రమైన నేరాలను రాజ్యాన్నేలే ప్రభువులు విచారించేవారు. ధర్మ సూత్రాలను దృష్టిలో పెట్టుకుని ధర్మబద్ధంగా నిర్ణయం చేసేవారే గాని , ప్రత్యేకంగా ఒక ధర్మ శాస్త్ర గ్రంథాన్ని అందరు ప్రభువులూ అనుసరించే వారు కారు. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో పాతుకు పోయి చక్కగా సాగుతున్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థను అర్థం చేసుకోకుండా యిక్కడ ఏదో గందరగోళం ఉన్నట్టు ఊహించుకుని దొరలే పెద్ద గందరగోళం లో పడ్డారు.

       తమ దృష్టి దోషపు, అవగాహనా లోపపు అయోమయం నుంచి తమను బయట వేయటానికి వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొలువులో 11 మంది హిందూ పండిట్లను నియమించ్చాడు.  ధర్మశాస్త్రాలను క్రోడీకరించి దేశమంతటికీ ఒకే Code of Law ను రూపొందించే పనిని వారి మీద పెట్టాడు. ఆ అసంపూర్ణ ప్రజ్ఞావంతులందరూ కిందా మీదా పడి ఒక కలగా పులగాన్ని తయారు చేశారు. A Code of Gentoo Laws పేరిట దాన్ని ఆర్భాటంగా ప్రకటించారు. కాని అందులో ఉన్నది డొల్ల అన్ని కొద్దికాలానికే అర్థమయింది. ఆక్షేపణలు , అభ్యంతరాలు ముసురుకొని అయోమయం ఇంకా ఎక్కువయింది. పైగా ధర్మ శాస్త్రం ఏమి చెబుతున్నదీ తమకు తెలియపరిచి న్యాయ నిర్ణయం సరిగా  అయ్యేందుకు సహకరించవలసిన ఆస్థాన పండితులు ఎవరి స్వార్థం కోసం వారు పక్షపాత బుద్ధితో ధర్మ సూత్రాలకు సమయానుకూల వ్యాఖ్యానాలు చేస్తూ పోయారు. ఒక పండితుడు చెప్పేది ప్రమాణికమని ఇంకో పండితుడు ఒప్పుకునే వాడు కాదు. స్మృతులు, ధర్మసూత్రాలు సంస్కృతం లో ఉంటాయి. ఇంగ్లీషు జడ్జిలకు అవి బోధపడవు. దుబాసీల మీద ఆధారపడితే వాళ్ళు సరిగా తర్జుమా చేస్తున్నారో లేదో తెలిసే ఆస్కారం లేదు.
    
    ఇలా రకరకాల సమస్యలు చుట్టుముట్టి , ఆ గందరగోళం నుంచి ఎలా బయటపడాలా అని బుర్రలు బద్దలు కొట్టుకున్న మీదట తెల్ల దొరలకు ఒకటే పరిష్కారమార్గం తోచింది. అన్ని స్మృతుల లోకీ ఎక్కువ ప్రాచుర్యం పొందింది , ఎక్కువమంది గౌరవించేది మనుస్మృతి అని ఎక్కువగా వినపడుతున్నది కాబట్టి హిందువులందరికీ కలిపి దేశమంతటా అదే ప్రమాణం అనుకుంటే సరిపోతుందని వారు ఏకపక్షంగా తమకు తాము  నిర్ణయించేశారు.

    మరి మనుస్మృతికి సంబంధించి కూడా రకరకాల పాఠాలు చలామణీలో ఉన్నాయి కదా? వాటిలో దేన్ని ఖరారు చేయాలి ?
    ఓస్! దానికేముంది ? ఈస్ట్ ఇండియా కంపెనీ దొరతనానికి రాజధాని కలకత్తా కదా  ? అక్కడ ప్రచారం లో ఉన్నది కుల్లుకభట్టు వ్యాఖ్యానం కదా ? సదరు " కలకత్తా మాన్యుస్క్రిప్టు " ను పండితుల సాయంతో కలకత్తా సుప్రీం కోర్టు జడ్జి  విలియం జోన్స్  ఇంగ్లీషులోకి కొత్తగా అనువాదం కూడా చేశాడు కదా ? కాబట్టి ఎంచక్కా ఇంగ్లీషు లో ఉన్న ఆ పుస్తకాన్నే standardise చేస్తే ఏ బాధా ఉండదు అని దొరవార్లు కూడబలుక్కున్నారు.
   ఆ విధంగా మనుస్మృతికి హిందూ రాజరికాలలో ఎన్నడూ లేని  "విచిత్ర ఆధికారిక ప్రతిపత్తి "  ఇంగ్లీషువాళ్ళు వచ్చాకే ... ఇంగ్లీషు వాళ్ళ అవసరం కోసమే .. యాదృచ్చికంగా సమకూడింది.

  "That in all suits regarding inheritance, marriage, caste and other religious usages or institutions, the law of the Koran with respect to Mahometans [Muslims], and those of the Shaster with respect to Gentoos [Hindus] shall  invariably be adhered to." ( వారసత్వ హక్కులు , పెళ్ళి , కులం, ఇంకా ఇతర విషయాల మతాచారాలు, కట్టుబాట్లకు సంబంధించిన దావాలన్నిటిలో మహామ్మదీయులకైతే ఖొరాన్ , హిందువులకైతే శాస్త్రం తప్పనిసరిగా అనుసరించబడును ) అని 1772 లో గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్  ప్రకటించిన న్యాయ విధానం ఆ రకంగా ముందుకు పోయింది !

   " విచిత్ర ఆధికారిక ప్రతిపత్తి " అని పైన ఎందుకన్నామంటే ...

    అధికారికంగా , శాసనపరంగా మనుస్మృతి కి ప్రామాణిక గ్రంథమన్న గుర్తింపు తెల్లదొరలు ఇవ్వలేదు. దానిలో చెప్పిన ప్రకారమే హిందువులకు సంబంధించిన ఆస్తిపాస్తుల ,కుటుంబ , సామాజిక వివాదాలు నిర్ణయించబడునని  ఎన్నడూ ప్రకటించలేదు . మనుస్మృతిలో పేర్కొన్న విధంగా ఆ యా నేరాలకు ఆయా  శిక్షలు విధించేలా ఇండియన్ పీనల్ కోడ్ నూ మార్చే పిచ్చిపనినేమీ చేయలేదు. దానికి పెద్దపీట వేస్తామని ప్రభుత్వపరంగా ఎవరూ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ... న్యాయ స్థానాల్లో సివిల్ వ్యాజ్యాల విచారణలో ధర్మ మీమాంస వచ్చినప్పుడు  న్యాయమూర్తులు విలియం జోన్స్ అనువదించిన మనుస్మృతి నే రిఫర్ చేసేవారు. ధర్మశాస్త్రం ప్రస్తావన వచ్చినప్పుడల్లా అది మాత్రమే హిందువులకు పరమప్రమాణమైన ధర్మ శాస్త్ర గ్రంథం అయినట్టు మాట్లాడేవారు. దానికి విరుద్ధమైన అంశాలను ఇతర స్మృతుల నుంచి ఎవరైనా ఎత్తిచూపినా దానికి ఇచ్చిన విలువ వేరే వాటికి సర్వ సాధారణంగా బ్రిటిషు న్యాయమూర్తులు ఇచ్చేవారు కాదు.

   ముసల్మాన్లకు ఖోరాన్ ఎంతో హిందువులకు మనుస్మృతి అంత అనుకుంటే సరి . మనకు ఒక పని అయిపోతుంది అని తెల్లదొరలు అనుకోవటం బాగానే ఉంది. దాని వల్ల వారి పని బాగానే అయింది. కానీ నీతిసూత్రాలకూ, న్యాయ శాసనానికీ నడుమ తేడాను కానకుండా మనుస్మృతిని పల్లకీ ఎక్కించి రాజశాసనానికి దాదాపుగా సమానమనిపించేటంత  ప్రాధాన్యం ఇవ్వటం ( లేక ఇచ్చినట్టు కనిపించటం )వల్ల  పుట్టెడు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. తెల్లవాళ్ళు ఇచ్చిన అనవసరపు  ఆర్భాటం మూలంగా ఏనాడో మూలన పడిన మనుస్మృతి కి వల్లమాలిన ప్రచారం వచ్చి మరింత గబ్బుపట్టిపోయింది . కాలక్రమంలో  అల్లరిపాలైంది.

    అనాదిగా అమలవుతున్న  హిందూ ధర్మ సూత్రాల ప్రకారమే తాము Hindu Jurisprudence ను రూపొందించి సంప్రదాయబద్ధంగా అమలుపరుస్తున్నట్టు ఇంగ్లీషు దొరలు లోకాన్ని భ్రమింప చేయటానికైతే  మనుస్మృతి పునరుజ్జీవం పనికి వచ్చింది.  కానీ పూర్వం ఎన్నడూ లేని విధంగా మనుస్మృతికి  Law Code ప్రతిపత్తిని ఇవ్వకనే ఇచ్చి , దానినే హిందువుల Personal Law గా పరిగణిస్తున్నారన్న అభిప్రాయం లోకానికి కలిగించి ,   ఆ మూస కు లోబడే దేశమంతా హిందువులకు న్యాయనిర్ణయం జరుగుతోందన్నట్టు ఎక్కడ లేని హడావిడి చేయటంతో   కొత్త సమస్యలు వచ్చాయి. అప్పటి దాకా స్త్రీలకూ , శూద్ర కులాలకూ సంబంధించిన వివాదాలు స్థానిక ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పంచాయతీలలో పరిష్కరమయ్యేవి. రెడీమేడ్ మనుస్మృతిలో  పేర్కొన్న  ప్రకారం ఈ కాలానికి బొత్తిగా సరిపడని, ఆ మాట కొస్తే ఏ కాలంలోనూ ఎవరూ సమర్థించ రాని .. చరిత్రలూ ఎన్నడూ చెల్లుబాటు కాని  వింత న్యాయాలు, అనాగరిక  శిక్షలు అమలు జరపబోతే హాహాకారాలు లేచాయి.  Islam and the Secular State    గ్రంథం లో    Abdullahi Ahmed An-Na'im అన్నట్టు ...

      British colonial administrators reduced centuries of vigorous development of total ethical, religious and social systems to fit their own preconceived European notions of what Muslim and Hindu "law" should be.

      (ముస్లిములకు , హిందువులకు  " లా  " ఎలా ఉండాలి అన్నదానిపై  ముందే  ఊహించి పెట్టుకున్న తమ యూరోపియన్  భావాలకు సరిపోయే విధంగా  బ్రిటిషు వలస పాలకులు  ఈ దేశంలో శతాబ్దాలతరబడి  ఉధృతంగా  అభివృద్ధి అయిన  నైతిక, సాంఘిక , మతపరమైన  వ్యవస్థలను  కుంగతీశారు.)

     పూర్వం నుంచీ ఉన్నదానినే  తాము  బుద్ధిగా  కొనసాగిస్తున్నామని  తెల్ల వారు  డప్పు కొట్టటంతో  వారు  కొత్తగా నెత్తికెత్తుకున్న అతుకులమారి మనుస్మృతే  ,అందులో రోత పుట్టించే  సామా జిక  దుర్వివక్షే వేల ఏళ్ళుగా అమలులో  ఉండేది కాబోలన్న అపోహ  ఇంగ్లీషు వారి  మెకాలే  బడిలో బుద్ధి  శుద్ధి జరిగిన  మన మేధావి వర్గంలో  ప్రబలింది. మనం చేసుకున్న పుణ్యం కొద్దీ ఇంగ్లీషు వారు దేవుళ్ళలా వచ్చి రక్షించారు కాబట్టి సరిపోయింది . లేకపోతే స్త్రీలపై  ,  శూద్రులపై, దళితులపైబ్రాహ్మణ రాక్షసుల ఘోరాలు ,ఘాతుకాలు ఇంకా చెలరేగుతూనే ఉండేవి అని వారు గుండెలు బాదుకున్నారు. అవును సుమీ అదే నిజం అని తెల్ల వాళ్ళు, వారి మానస పుత్రులు వంతపాడి గట్టి చేశారు. 

    అదిగో రెండు శతాబ్దాల కింద పుట్టిన ఆ పచ్చి అబద్ధాన్నే అక్షర సత్యమైనట్టు, తిరుగులేని చారిత్రక వాస్తవమైనట్టు  ఇప్పటికీ మనలో చాలామంది నమ్ముతున్నారు.  














2 comments:

  1. "అప్పటి దాకా స్త్రీలకూ , శూద్ర కులాలకూ సంబంధించిన వివాదాలు స్థానిక ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పంచాయతీలలో పరిష్కరమయ్యేవి. రెడీమేడ్ మనుస్మృతిలో పేర్కొన్న ప్రకారం ఈ కాలానికి బొత్తిగా సరిపడని, ఆ మాట కొస్తే ఏ కాలంలోనూ ఎవరూ సమర్థించ రాని .. చరిత్రలూ ఎన్నడూ చెల్లుబాటు కాని వింత న్యాయాలు, అనాగరిక శిక్షలు అమలు జరపబోతే హాహాకారాలు లేచాయి. "

    నిజంగా అమలు జరిపిన ఉదాహరణలు ఉంటే తెలియజేయగలరు.

    ReplyDelete