పాత ముచ్చట్లు -3
ఎం.వి.ఆర్.శాస్త్రి
........
పందొమ్మిదేళ్ళ కిందటి మాట .
" మార్చ్ 4 రాత్రి 11 - 26 కు హస్తినాపురం లో మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి ప్రవేశిస్తున్నాం . ఇన్విటేషన్ కార్డు పంపిస్తున్నాను . మీరు ఎలాగూ రారనుకోండి. " అన్నాను ఫోనులో .
" ఎందుకు రాను? కచ్చితంగా వస్తున్నాను . నేను రాకుండా మీ గృహప్రవేశం ఎలా అవుతుంది ? " అన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు .
"కబుర్లు బాగానే చెబుతారు . పాటల బిజీలో మర్చిపోతారు. మీ సంగతి నాకు తెలియదా " అంటే సహజ శైలిలో గట్టిగా నవ్వి " లేదు లేదు. వస్తాను " అన్నారు.
" వస్తే సంతోషమే. అయినా అంత రాత్రి అంత దూరం రావటం మీకెక్కడ కుదురుతుంది ? మర్నాడు శుక్రవారం ఉదయం సత్యనారాయణ వ్రతం . మీకు వీలయితే ఫ్యామిలీ తో వచ్చి భోజనం చేసి వెళ్ళండి మహానుభావా ! అది చాలు "
" నా గురించి ఏమనుకుంటున్నారు మీరు ? దానికీ వస్తా .దీనికీ వస్తా "
" నేను నమ్మను . మాటలు బాగా చెబుతారు. కానీ దేనికీ రారు. "
నాకైతే ఏకోశానా డౌటు లేదు. మనిషి చాలా మంచివాడే. స్నేహశీలే . నేనంటే చాలా ప్రేమ ,గౌరవం ఉన్నవాడే. కానీ సినిమా పాటల ఫీల్డులో యమా బిజీ. పాపం ఆయనకెక్కడ టైం ఉంటుంది ? గ్యారంటీగా రాడు అనుకున్నా. కానీ ఆశ్చర్యం ! ( 1999 మార్చి) 4 అర్ధరాత్రి దాటాక ఏ ఒంటి గంటకో తమ్ముళ్ళను కూడా వెంటబెట్టుకుని మెరుపుదాడి చేశారు సిరివెన్నెల వారు.
సాగర్ రోడ్డులో ఇన్నర్ రింగ్ రోడ్ దాటాక రెండు కిలోమీటర్లకు వస్తుంది హస్తినాపురం నార్త్. అప్పట్లో ఎక్కువ ఇళ్ళు లేవు. అర్ధరాత్రి జనసంచారం ఉండదు. చీకట్లో దారి వెతుక్కుని కొత్త ఇంటికి చేరటానికి పాపం నానా అవస్థ పడ్డారు. అక్కడక్కడే చాలా సేపు తిరిగారు. మొత్తానికి కష్టపడి వచ్చి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు శాస్త్రిగారు. " చాలా లేట్ అయింది . మీకు పెట్టటానికి అరటిపళ్ళు, ప్రసాదం తప్ప ఏమీ లేవు " అంటే " ఎందుకు ? రేపు భోజనానికి వస్తున్నా కదా " అన్నారు .
నిజంగానే అంత పనీ చేశారు. ఏ 2 గంటలకో అక్కడినుంచి వెళ్లి మళ్ళీ మధ్యాహ్నానికల్లా సకుటుంబంగా వచ్చారు.
అప్పటికే సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మగారు వచ్చి కవితాగానం చేస్తున్నారు. సిరివెన్నెల కూడా వచ్చేసరికి మజా ఎక్కువయింది. అందరూ వాళ్ళ చుట్టూ మూగారు. శాస్త్రిగారు శ్రోతలు కోరిన పాటలు ఏకధాటిగా వినిపించారు. అప్పటి శాసన సభాపతి , ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు , అసెంబ్లీ స్పెషల్ సెక్రటరీ సి.వెంకటేశన్ ,పోలీసు ఐ.జి.గా పనిచేస్తున్న సాహితీ ప్రియుడు కొడాలి సదాశివరావు గారు , సీనియర్ ఐ.పి.ఎస్. అధికారులు కె.ఆర్.నందన్ గారు , శ్రీరాం తివారిగారు, అనుకోని పాటకచేరిని విని ఆనందించారు. ఆ సమయాన తీసింది ఈ ఫోటో.
మాడుగుల వారు ఫోటో లో రామకృష్ణుడు గారి పక్క కుడివైపు చివరిలో ఉన్నారు. పోలిస్ అధికారి అరవిందరావుగారు, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి స్వామినాథన్ గారు, కాంగెస్ నాయకులు మైసూరారెడ్డి గారు, కె.కేశవరావు గారు, కెవిపి రామచంద్రరావు గారు కూడా ఆ నాటి వేడుకలో మాతో ఉన్నారు.
హస్తినాపురం గృహప్రవేశం లో అదృష్టం ఆ రోజు ఉదయం మా గురువుగారు పూజ్య సద్గురు శివానందమూర్తి గారికి కొత్త ఇంట్లో పాదపూజ చేసుకోగలగటం !
పాదపూజ కాగానే గురువుగారితో కొద్దిమంది అతిథులు కాసేపు ఇష్టాగోష్టి జరిపారు. సిరివెన్నెల గారు. విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్ గారు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి దేవరకొండ రామకృష్ణ గారు, బి.జి.పి. నాయకుడు ఎన్.రామచంద్రరావు గారు వారిలో ఉన్నారు.
అన్నట్టు ఆ రోజు పొద్దున్నే పుష్పగిరి పీఠం మహాస్వామి విద్యానృసింహ భారతీ స్వామి వారు నా మీద ప్రేమతో శ్రమ పడి కొత్త ఇంటికి వచ్చి మమ్మల్ని దీవించి వెళ్ళారు.
సిరివెన్నెల గారిని మొదట కలిసింది తిరుపతిలో. అప్పట్లో తి.తి.దే. సెక్యూరిటీ అధికారిగా ఉన్న నా ఆప్త మిత్రుడు వై.ఎస్.ఎన్.శర్మ గారి ఇంట్లో. చల్లటి రాత్రి చక్కని విందులో అద్భుతంగా పాడిన "క్షీరసాగర మథనం" కవితాధారను పరమానందం తో విన్నాక సిరివెన్నెల గారిని అడిగాను " మీరు సినిమారంగంలో ఎందుకున్నారు ?" అని.
ఆ మాట మేము కలిసినప్పుడల్లా ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు శాస్త్రిగారు. .
ఇప్పుడు హస్తినాపురం ఇల్లు లేదు. అమ్మేశాను. ఈ జ్ఞాపకాలు మిగిలాయి.
Super
ReplyDeleteMimmalni abhinaninche vaallu andaru...Mee gnapakaalu enjoy chestharu....nice sir...
ReplyDelete