మనుధర్మం -3
ఎం.వి.ఆర్.శాస్త్రి
స్త్రీ స్వేచ్చ గురించి రంగనాయకమ్మ ఒకలా చెబుతుంది. రాంగోపాల్ వర్మ ఇంకోలా అంటాడు.
రెండిటి మధ్యా ఎక్కడా పొంతన ఉండదు. కానీ ఎవరి రాతలో వారు చెప్పే విషయాల వరకూ కనీసం పొంతన ఉంటుంది కదా ?
సాధారణంగా లోకంలో ఏ రచయిత అయినా తాను రాసే మాటల్లో పొంతన ఉండేలా ,వైరుధ్యాలు లేకుండా సాధ్యమైనంత జాగ్రత్త పడతాడే ?! విజ్ఞుడు, విశాల దృష్టి కలవాడు, విశ్వమానవులందరికీ అన్ని కాలాల్లో పనికొచ్చే విషయాలు చెప్పినవాడు అని ఎందరో పాశ్చాత్య మహా మేధావులే మెచ్చుకున్న మను మహర్షి తాను చాటే ధర్మసూత్రాలలో పొంతన , సూత్రబద్ధత ఉండేట్టు చూసుకోడా ? అతడే స్పష్టంగా ప్రకటించిన నియమాలు , ప్రమాణాలకు , మొత్తంగా అతడి ధర్మశాస్త్రం తీరుకు, తత్వానికి పూర్తి విరుద్దంగా ఏవైనా అసంబద్ధతలు, అపభ్రంశాలు కనపడితే అవి మధ్య కాలంలో ఎవరో ప్రబుద్ధులు చొప్పించినవని స్పష్టమే కదా? నడమంత్రంగా చేర్చబడిన వాటి పాపాన్ని మూల రచయితకు అంటగట్టటం న్యాయమేనా?
యుగయుగాలుగా యావద్భారతానికి పరమ పవిత్ర గ్రంథమైన రామాయణం లోనే ఎన్నో ప్రక్షిప్తాలున్నాయని పండితులు చెబుతారు. నేపాల్ లో వెయ్యి సంవత్సరాల కింద భద్రపరిచిన తాళపత్ర మూల ప్రతిలో లేని శ్లోకాలు ఈ కాలపు రామాయణ ప్రతులలో చేరాయి. నిన్నమొన్నటి వేమన అసలు రాసింది శతకమే అయినా , అతడు రాసినవేనంటూ ఇవాళ కొన్ని వేల పద్యాలు చలామణిలో ఉన్నాయి. వాటిని చూసి పామరులు మోసపోవచ్చు. కాని మూల తత్వాన్ని బట్టి , శైలిని బట్టి, భాషను బట్టి ఏవి అసలువి , ఏవి నకిలీవి అన్నది విద్వాంసులు కనుగొన్నారు. విశ్వదాభి రామ వినురవేమ అని చివరిలో ఉన్నది కాబట్టి ఎవడో కల్పించిన ప్రతి గాడిద పద్యానికీ వేమనే ముద్దాయి అని బుద్ధి ఉన్న వాడెవడూ అనడు. నీతిని బోధించటానికి ఉద్దేశించిన ప్రాచీన గ్రంథాలలోనే, ఆధునిక నీతి శతకాలలోనే చేతి వాటాలు చోటు చేసుకున్నప్పుడు సమాజం లోని వివిధ వర్గాల జీవనానికి, అనేకానేక పబ్లిక్ కార్యకలాపాలకు, సామాజిక కట్టుబాట్లకు , నేరాలకు, వాటికీ విధించే శిక్షలకు సంబంధించి ప్రామాణికమనుకోబడే ధర్మ శాస్త్రాలలో కలగలుపులు , చేతివాటాలు లేకుండా ఎలాఉంటాయి ?
ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవలసిన వాస్తవాలు ఇవి :
1. మనుస్మృతి లో ప్రక్షిప్తాల ఊసు బాధిత సామాజిక వర్గాలలో చైతన్యం పెరిగిన దరిమిలా ఇటీవలి కొన్ని దశాబ్దాలలో మాత్రమే వినవస్తున్నది కాదు. శతాబ్దానికి పైగా కాలంలో మహర్షి దయానంద సరస్వతి, విశ్వనాథ్ నారాయణ్ మండలిక్ , తులసీరాం , భారతరత్న పి.వి.కాణే వంటి ఎందరో పండితులు గుర్తించి వివరంగా చర్చించినదే. మరుగునపడి ఉన్న మనుస్మృతి ని ఆధునిక ప్రపంచానికి ఘనంగా పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగినవాడు George Buhler. మనుస్మృతికి సంబంధించి ఆధునికులు ఎవరైనా నేటికీ ప్రామాణికంగా పరిగణిస్తున్నది బూలర్ గ్రంథాన్నే. 1886 లొ LAWS OF MANU పేరుతొ వెలువరించిన పరిశోధనాత్మక గ్రంథం పీఠిక లో బూలర్ చెప్పింది మచ్చుకు కొన్ని వాక్యాలు చూడండి :
This work contains also an admixture of modern elements... If we examine Manu's text according to these principles, the whole first chapter must be considered as a later addition...Chapters II-VI, on the other hand, seem to represent with tolerable faithfulness the contents of the corresponding sections of the Manava Dharma-sutra ... Nevertheless, the hand of the remodeller is not rarely visible...There are a considerable number of smaller and some larger interpolations...More doubtful are the discussions on the duty of conjugal intercourse (vv. 46-50), on the honour due to women (vv. 55-60), on the excellence of the order of householders (vv. 79-80)... ...
[LAWS OF MANU by George Buhler ,Introduction pp.Ixvi-Ixviii]
(ఈ గ్రంథంలో తరవాత వచ్చి చేరిన అంశాలు కూడా ఉన్నాయి... పై నియమాల ప్రకారం మను ప్రతిని పరీక్షిస్తే మొదటి అధ్యాయం మొత్తం తరవాత జోడించబడినదని భావించాలి...రెండు నుంచి ఆరు అధ్యాయాలు మానవ ధర్మ సూత్రాలకు మొత్తమ్మీద అనుగుణంగానే ఉన్నట్టు కనిపించినా అక్కడ కూడా తిరిగి కూర్చిన వాడి చేతి వాటం లేదనలేము. ... చిన్నా పెద్దా ప్రక్షిప్తాలు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. వైవాహిక సంభోగానికి సంబంధించిన విధులు, మహిళలకు ఇవ్వదగిన గౌరవాలు , గృహస్థాశ్రమ ప్రాశస్త్యం వగైరాల పై చేసిన చర్చలు కూడా అనుమానించ దగ్గవే. ... ... )
2. వర్ణాల మధ్య వివాహాలు, ఎనిమిది రకాల వివాహాల మంచిచెడ్డలు, శ్రాద్ధాలూయజ్ఞాలలో జంతువధాలు, మాంస భక్షణలు, నిస్సంతులకు నియోగపు విధానం ద్వారా సంతానం వంటి విషయాలలో .... శూద్రులూ , స్త్రీల కు సంబంధించిన అంశాలలో పరస్పర విరుద్ధ నిర్దేశాలు మనుస్మృతిలో అనేకం కానవస్తాయి. ఫలానా విధంగా చేయాలి అని చెప్పిన వెనువెంటనే అలా చేయటం చాల తప్పు , నికృష్టం అని ఖండించటం కద్దు. ఒక చోట చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా ఇంకో చోట ఇంకోలా పేర్కొనడం కూడా ఉంది. ఇది కాలక్రమంలో కలగలుపుల వల్ల జరిగింది .
3.ఏవి ప్రక్షిప్తాలు అన్నవి పోల్చుకోవటం కష్టమే. కాని అసాధ్యం కాదు. తాను బోధిస్తున్న ధర్మానికి లక్షణాలేమిటో మను మహర్షి విస్పష్టంగా ముందే ప్రకటించాడు ఇలా :
వేదో ఖిలో ధర్మ మూలం ... ( 2-6 )
(సమస్త ధర్మానికి వేదమే మూలం )
వేదః స్మృతిస్సదాచారః స్వస్య చ ప్రియమాత్మనం
ఏతచ్చతుర్విధం ప్రాహుః సాక్షాద్దర్మస్య లక్షణం (2-12 )
(వేదము, స్మృతి ,సదాచారము, తన మనస్సుకు ఇష్టము అనే నాలుగు ధర్మానికి లక్షణాలు )
అన్నిటికంటే పరమ ప్రమాణం వేదం. దానిలో ప్రక్షిప్తాలు లేవు. వేరు వేరు పాఠాలు లేవు. ఎక్కడా ఒక అక్షరం పొల్లుపోకుండా, ఎవరూ మార్చటానికి వీలు లేకుండా తిరుగులేని కట్టడితో అనాదిగా కాపాడబడుతూ వసున్నది కాబట్టి వేదం విషయంలో సందిగ్ధత లేదు. ఆది మూలం వేదం అని మనువే చెప్పినందున వేదంలో చెప్పినదానికి విరుద్ధంగా మనుస్మృతిలో ఏదైనా చెబితే అది మనువు అభిప్రాయం కాదని నిర్ధారించ వచ్చు. " ధర్మశాస్త్రం తు వై స్మృతి: " అని అంతకు ముందు (2- 10 ) శ్లోకం లో ఉన్నది కనుక స్మృతి అంటే ధర్మశాస్త్రం. స్మృతులు ఎన్ని ఉన్నప్పటికీ వాటి బోధనల సారమైన ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది అన్నది విద్వాంసులకు తెలుసు. కాబట్టి ధర్మ విరుద్ధమైన అంశాలు ఎక్కడున్నా గుర్తుపట్టవచ్చు. అందులో అనుమానమేదైనా ఉంటే మూడవ ప్రమాణమైన సదాచారాన్ని గమనించవచ్చు. వేదములనెరిగిన ధర్మవేత్తలు నిర్దేశించిన , అనుసరిస్తున్న మంచి ఆచారాలను బట్టి తప్పొప్పుల నిర్ణయం చేయవచ్చు. ఒకవేళ వేదం వారించకపోయినా, ధర్మ శాస్త్రం లో నిషేధం లేకపోయినా , శిష్టాచారానికి వ్యతిరేకం కాకపోయినా .. అవన్నీ తెలిసీ, వాటిమీద పరిపూర్ణ గౌరవం ఉండికూడా ఏదైనా విషయం తన అంతరాత్మ అంగీకరించలేకపోతే మనసుని చంపుకుని దానిని పాటించాల్సిన పనిలేదని మనువే మినహాయింపు ఇచ్చాడు. ప్రపంచంలో వేరే ఏ మతమూ , అన్యమతాలకు చెందిన ఏ ధర్మశాస్త్రమూ మానవులకు అనుమతించని వెసులుబాటు ఇది. సైన్సు చెప్పే ఆసిడ్ టెస్టులకు తీసిపోని ఈ నాలుగు ప్రమాణాల సాయంతో మనుస్మృతిలో తప్పాతాలూ వేరు చేయటం అసంభవమేమీ కాదు.
4. ఈ దిశలో ఇప్పటికే కొంత ప్రయత్నం జరిగింది కూడా. 1. విషయవిరుద్ధం 2. ప్రసంగ విరోధం ౩. పరస్పర విరోధం 4.పునరుక్తిదోషం 5. శైలీవిరోధం 6.అవాంతర విరుద్ధం 7. వేదవిరుద్ధం అనే ఏడు పెరామీటర్లను ఎంచుకుని... ఆ దోషాలలో ఏ ఒకటైనా ఉంటే అది మనుధర్మానికి విరుద్ధమనీ , ఏడింటిలో ఏ దోషమూ అంటనిది శుద్ధమనీ తెల్చుతూ ప్రొఫెసర్ ఆర్. సురేంద్రకుమార్ కొన్నేళ్ళ కింద "విశుద్ధ మనుస్మృతి "అనే గ్రంథాన్ని హిందీలో వెలువరించారు. తెలుగులోనూ దాని అనువాదం వచ్చింది. సురేంద్రకుమార్ పెట్టుకున్న పెరామీటర్ల వరకూ ఆక్షేపించవలసింది లేదు. కానీ వాటి ఆసరాతో.. తన దృష్టిలో ఈ కాలానికి సరిపడనివి , నేటి దేశకాల పరిస్థితులలో సమర్థనీయం కానివి , వివాదాస్పదమైనవి ఆయన టోకున ఎత్తివేయటంతో మొత్తం 2685 శ్లోకాలలో ఏకంగా 1471 శ్లోకాలు అంటే సగానికి పైగా ఎగిరిపోయాయి. మొదటి అధ్యాయంలో మనువుల ప్రజాసృష్టి , యుగధర్మములు, తపః ప్రశంస ... రెండవ అధ్యాయంలో ఓంకారము, గాయత్రీ మంత్రం మూడవ అధ్యాయంలో అతిముఖ్యమైన శ్రాద్ధ కర్మ విధానము, నాలుగవ అధ్యాయంలో ఆహితాగ్ని విధులు, అనధ్యయనాలు ... ఐదవ అధ్యాయంలో సాపిండ్య లక్షణములు, అశౌచ విధి ... పదవ అధ్యాయం లో సంకీర్ణ జాతులు, ఆపద్ధర్మాలు ... పదకొండవ అధ్యాయంలో ప్రాయశ్చిత్తకాండ లకు సంబంధించి అతిముఖ్యమైన శ్లోకాలు వందల సంఖ్యలో కత్తికోతకు గురి అయ్యాయి. ఈ కాలపు తెలిసీ తెలియని ఆక్షేపకుల మెహర్బానీ కోసమా అన్నట్టు గొప్ప ధర్మ శాస్త్రాన్ని అనవసరపు అతిజాగ్రత్తతో ముక్కలు చేయటంతో సురేంద్రకుమార్ పడిన విలువైన శ్రమ ఆర్య సమాజ్ వారిని మినహా విశాల విజ్ఞ సమాజాన్ని మెప్పించలేకపోయింది. మనుస్మృతి లో ప్రక్షిప్తాలను గుర్తించటానికి విశాల ప్రాతిపదికపై అఖిల భారత స్థాయిలో బృహత్ కృషి జరగవలసి ఉంది.
5. ఈ కాలపు ప్రమాణాల , ఆధునిక ఆలోచనా రీతుల ప్రకారం చూసినా మనుస్మృతిలో అభ్యంతరకరమైన శ్లోకాల సంఖ్య మహా అయితే మూడు వందలకు మించదు. " మనుస్మృతి " లోని మొత్తం 2685 శ్లోకాలలో అది తొమ్మిదో వంతు మాత్రమే. అంటే తొమ్మిదింట ఎనిమిది వందల శ్లోకాలకు ధర్మం, మనుస్మృతి పూర్వాపరాలు తెలిసిన వివేకవంతులెవరికీ ఆక్షేపణ ఉండాల్సిన పని లేదు. ఏ ధర్మశాస్త్రాన్ని అయినా అది వెలువడిన నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే చూడాలి తప్ప నేటి ఆలోచనా లోచనాలతో నాటి భావాలపై తీర్పు చెప్పకూడదు. అలా ఆధునిక ప్రమాణాలతో వెల గట్ట బోతే మన మేధావులకు ముద్దొచ్చే ఏ విదేశీ మతానికి చెందిన ఏ పవిత్ర గ్రంథమూ నిలబడదు.
6.మనుస్మృతిలో కొన్ని శ్లోకాలలోని అసంబద్ధతలు, విపరీతాంశాలు కొత్తగా బయటపడ్డవి కావు. ప్రపంచ పండితులందరూ ప్రామాణికంగా పరిగణిస్తున్న కుల్లూక భట్టు వ్యాఖ్యానంతో కూడిన ప్రతిలో కూడా అవన్నీ ఉన్నాయి. ఆ " కలకత్తా మాన్యుస్క్రిప్టు"ను మూలంగా తీసుకునే సర్ విలియం జోన్స్ 1792 లో The Institutes of Hindu Law or Ordinances of Menu పేరిట మనుస్మృతికి మొట్టమొదటి ఇంగ్లీషు అనువాదాన్ని కలకత్తాలో ప్రచురించాడు.
https://www.lawbookexchange.com/pictures/43995.JPG?v=1374696346అందులో మనకు ఇప్పుడురోతపుట్టించే వాటితో సహా మొత్తం 2685 శ్లోకాలూ ఉన్నాయి. కలగలుపులు, ప్రక్షిప్తాలూ గట్రా అని మనం అనుకునేవి చూసిన తరవాత కూడా మనుస్మృతిని అర్జెంటుగా తగలబెట్టెయ్యాలని జోన్స్ అనుకోలేదు. ఆయనేమీ అల్లాటప్పా మనిషి కాదు. కలకత్తాలోని అప్పటి సుప్రీం కోర్టులో న్యాయ మూర్తి గా పని చేసిన వాడు. ఇండియా కు వచ్చాక పండితుల దగ్గర సంస్కృతం నేర్చుకుని ధర్మ శాస్త్రాలనే అనువాదం చేయగలిగిన ప్రావీణ్యం సంపాదించిన వాడు. జన్మతః విదేశీయుడు , క్రైస్తవుడు అయికూడా మన మనుస్మృతి ని గ్రంథం తొలిపలుకులో జోన్స్ ఎంతగా కొనియాడాడో చూడండి :
A spirit of sublime devotion of benevolence to mankind , and of amiable tenderness to all sentient creatures , pervades the whole work. The style of it has a certain austere majesty, that sounds like the language of legislation and extorts a respectful awe. The harsh admonitions even to the kings are truly noble ... Whatever opinion in short may be formed of Manu and his laws , in a country happily enlightened by sound philosophy and only true revelation, it must be remembered that those laws are actually revered as the words of the most high.
[Institutes of Hindu Law, Sir William Jones , preface]
( మానవాళి పట్ల అవ్యాజమైన ఔదార్యం , చైతన్యవంతమైన ప్రాణులన్నిటి మీదా దయార్ద్రత ఈ గ్రంథం నిండా పొంగిపొర్లుతాయి. దీని శైలి లో కఠోరమైన రాజసం ఉంది. దీని భాష శాసనం లా ధ్వనిస్తూ వినమ్ర సంభ్రమాన్ని కలిగిస్తుంది. రాజులకు సైతం కఠినంగా శాసించటం నిజంగా ఉదాత్తం...మనువుమీద , అతడి అనుశాసనాల మీదా స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చే ముందు .. గొప్ప తాత్విక చింతనతో , నిజమైన దివ్యజ్ఞానంతో విరాజిల్లే దేశంలో ఆ శాసనాలు దైవవాక్కులుగా శిరసావహించబడుతున్నాయని గుర్తుంచుకోవాలి. )
ఎక్కడో పరాయి దేశం లో పుట్టి , వయసు మీరాక సంస్కృతం నేర్చుకుని మనుధర్మాన్ని అధ్యయనం చేసిన జోన్స్ దొరకేమో మనువు ఏ ప్రాణికీ హింసను తలపెట్టని దయాసముద్రుడైన మానవతామూర్తి గా , రాజులను సైతం కఠినంగా కట్టడి చేయగలిగిన శాసన కర్తగా పొడగట్టాడు. వేదభూమిలో, ఆర్ష సంస్కృతిలో పుట్టినందుకు సిగ్గుపడే మనమేమో మనువును మహా క్రూరుడిలా, సభ్య సమాజానికి పీడాకారుడిలా చూస్తున్నాం. మనుస్మృతి గ్రంథాన్ని చేత పట్టుకొని ఉన్న విలియం జోన్స్ విగ్రహాన్ని ఆయన మహోన్నత కృషికి నివాళిగా లండన్ లోని సెయింట్ పాల్స్ కేథడ్రాల్ లో ( బొమ్మ చూడండి ) ఇంగ్లీషు వారు నెలకొల్పారు. నాగరికులమనుకునే మనమేమో మనుస్మృతి ని తగలపెట్టటమే నాగరికతకు , సామాజిక న్యాయానికి , అభ్యుదయ దృష్టికి గుర్తు అని గట్టిగా నమ్ముతున్నాం.
[ ఇంకా ఉంది ]
No comments:
Post a Comment