జి.ఎస్. కుమార్
................
జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ దార్ పుల్వామాలో 40 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకుని నాలుగు రోజులు గడిచింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలకు ఎలా బదులిచ్చుకోవాలో తెలియక పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాలుగు రోజులు ఇల్లుదాటి బయటకు రాలేదు. కానీ, ఆ దాడి జరిగిన రోజు నుంచి పలువురు భారత నేతలు 'అయ్యో పాకిస్థాన్ పై నిందలు వేస్తున్నారే..' అంటూ చేసిన వ్యాఖ్యలు విని ఇమ్రాన్‌కు ధైర్యం వచ్చింది. మంగళవారం (19 ఫిబ్రవరి) నాడు మీడియా ముందుకొచ్చి పాత పాటే పాడాడు. పుల్వామా దాడితో పాక్‌కు సంబంధం లేదని, అన్యాయంగా తమపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారని, యుద్ధం జరిగితే సిద్ధమేనని, తిప్పికొడతామని పాకిస్థాన్ పాత ప్రధానులు, అధ్యక్షుల మాటల్ని వల్లెవేశాడు.
ఇమ్రాన్‌కు ధైర్యం నూరి పోసిన ఆ భారతీయులెవరనేది తెలియాలంటే ఇమ్రాన్ మీడియా ముందుకొచ్చిన మంగళవారం నాటి పత్రికలు తిరగేస్తే సరిపోతుంది. అసలు దాడి జరిగిన రోజునే పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ శివాలెత్తిపోయాడు. పంజాబ్‌ను ఏమన్నా ఫరవాలేదు గానీ... అమాయక పాకిస్తాన్‌ను పల్లెత్తు మాట అనొద్దు... అన్నట్టుగా ఉన్నాయి అతని వ్యాఖ్యలు. ఇదంతా పిరికిపందల చర్య అని, వారి దుశ్చర్యలకు పాకిస్తాన్‌ని నిందించడమేమిటని పొర్లి పొర్లి ఏడ్చాడు... ఇది చాలక తాను నిన్న మొన్నటి వరకూ బీజేపీలోనే ఉన్న సంగతి మర్చిపోయి 1999 నాటి కాందహార్ సంఘటనలో హస్తమున్నవారిని విడిచిపెట్టిందెవరని ఇప్పుడు అడుగుతున్నాడు.
ఆ తర్వాత సీన్‌లోకి వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కూడా పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలే చేశాడు. పాకిస్తాన్ పాత్రపై ఆధారాలుంటే చూపాలన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడింది భారత కశ్మీరీ అయితే పాకిస్తాన్‌ని నిందిస్తారా? అంటూ నికార్సైన పాకిస్తాన్ పౌరుడిలా భారత ప్రభుత్వాన్ని నిలదీశాడు.
చట్టబద్దమైన పదవిలో ఉన్న సిద్దు, సామాజిక కార్యకర్తగా ఎందరినో ప్రభావితం చేయగల స్థానంలో ఉన్న స్వామి అగ్నివేశ్ ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని సామాన్య పౌరులు సైతం చీదరించుకుంటున్నారు. ఆదిల్ దార్‌తో ఈ ఘోరం చేయించిన ఉగ్రవాద సంస్థ జైషేమహమ్మద్ సంస్థ అతనితో రికార్డ్ చేసిన రెండు వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ జైషేమహమ్మద్ అధినేత మసూద్ అజర్ పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్నాడు. ఇతని కుడి భుజం ఘాజీ రషీద్ నుంచే ఆదిల్ దార్ ఉగ్రవాద శిక్షణ పొందినట్లు ఆధారాలన్నీ బయటకొచ్చాయి. ఈ లోగా మంగళవారం నాడు జైషేమహమ్మద్ సంస్థ మరో వీడియో విడుదల చేసి పుల్వామా తరహా దాడి మరొకటి చేస్తామని హెచ్చరించింది. సిద్దూకి, అగ్నివేశ్‌కి ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలి?
గత ప్రభుత్వాల పాలనలోనూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలో ఇలాంటి దాడులు చేసిన సంగతి తెలిసిందే... అప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా పాకిస్తాన్‌ని నిందించాయి. మరి ఆనాడు ఈ సిద్దు, అగ్నివేష్‌లు ఆధారాలు ఎందుకు అడగలేదు?
సిద్దు, అగ్నివేశ్‌ల ఆవేశం తగ్గిందో లేదో.. తాను మాట్లాడకపోతే కొంపమునిగిపోతుందన్నట్టు తమిళనాడు నుంచి కమల్ హాసన్ సీన్‌లోకి వచ్చాడు. కశ్మీర్‌లో ఫ్లెబిసైట్ అంటూ వ్యాఖ్యలు చేసి చరిత్రకు సంబంధించి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఈ విశ్వరూపుడికి కశ్మీర్‌లో పండిట్ల కష్టాలకు కారకులెవరో, లక్షలాది మంది పండిట్లను కశ్మీర్ నుంచి తరిమేసిందెవరో అవసరం లేదు. ప్లెబిసైట్ ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అక్కర్లేదు. ప్లెబిసైట్ ఫలితాన్ని బట్టి కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కి ఇచ్చేయాలని లేదా ప్రత్యేక దేశం చెయ్యాలని అడిగేవారిలో బహుశా ఈయనే ముందుంటాడేమో...
భారత్‌లో సిద్దూ , అగ్నివేశ్ , కమల హాసన్ లాంటివారున్నప్పుడు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు, పాక్ సైన్యానికి, ఉగ్రవాదులకు అంతకంటే ఇంకేం కావాలి?
No comments:
Post a Comment