జి.ఎస్. కుమార్
.........
కశ్మీర్‌లో ఉగ్రవాది ఆదిల్ దార్ నీచ కృత్యానికి 40 మంది జవాన్లు బలైపోయి జాతి యావత్తూ కంటతడి పెడుతుంటే, ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన ఒక వార్త ఉగ్రవాదికి వత్తాసు పలికేలా ఉంది. అమరులైన జవాన్ల ప్రాణత్యాగానికి తగిన నివాళి అర్పించడం వదిలేసి పరమ నీచస్థాయికి దిగజారిపోయింది మన మీడియా. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ చిన్నప్పుడు సైన్యం చేతిలో అవమానం పాలయ్యాడని, అందువల్లే అతను కక్ష పెంచుకుని ఈ పాపానికి ఒడిగట్టాడంటూ ఉగ్రవాది పట్ల సానుభూతి కలిగేలా అతని తల్లిదండ్రులు చెప్పిన విషయాల్ని గొప్ప వార్తగా చిత్రీకరించి జనం మీదకు వదిలారు.
అదే నిజమైతే, దాడికి మూలకారణమైన ఈ విషయాన్ని "మీరు ఈ వీడియో చూసేసరికి నేను స్వర్గంలో ఉంటా"నని దాడికి ముందు ఆదిల్ విడుదల చేసిన వీడియోలో ఎందుకు ప్రస్తావించలేదు? ఆ వీడియోను చిత్రీకరించిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు కూడా ఆ మాటలు రికార్డ్ చేయించే వారు కదా? ఆదిల్ తల్లిదండ్రులు మరో మాట కూడా చెప్పారని మన మీడియా రాసింది. అదేంటంటే... భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడల్లా ఆదిల్ భారత్‌కే మద్దతు పలికేవాడట. ఇదంతా అస్సలు పొంతన లేకుండా ఉందని మన మీడియా ఆ మాత్రం గ్రహించలేక పోయిందా? భారత సైన్యం చేతిలో అవమానం పాలై ఈ దేశాన్ని ద్వేషించి ఉగ్రవాది అయిన అదిల్, క్రికెట్ విషయంలో మాత్రం భారత్‌ను ప్రేమిస్తున్నాడంటే నమ్మాలా...
ఆ వీడియోలో ఆదిల్ మరో విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. గోమూత్ర సేవనం చేసేవారి ప్రాణాలు తీయడమే తన లక్ష్యమన్నాడు. అంటే హిందువులే తన టార్గెట్ అని తేల్చి చెప్పాడు. ఇది పూర్తిగా మతపరమైన దాడి అని తెలుస్తూనే ఉంది. మరి మీడియా ఈ విషయాన్ని ఎందుకు హైలైట్ చెయ్యలేదు? వాస్తవాలను దాచాల్సిన అవసరమేంటి? ఇది ఇస్లామిక్ టెర్రర్ కాదా? హిందువుల విషయంలో అయితే ఏమీ లేనిదానికే హిందూ టెర్రర్ అని గగ్గోలు చేసిన మీడియాకు ఆదిల్ చేసిన పని ఇస్లామిక్ టెర్రర్ అనిపించలేదా? ఇదంతా మన పిరికిపంద మీడియా చేతగానితనం తప్ప మరొకటి కాదు.
ఇక Times of India తీరు మరీ ఘోరంగా ఉంది. దాడి చేసిన ఉగ్రవాది ఆదిల్ local youth అట. భారత ప్రభుత్వమే పాకిస్తాన్ పై నిందలు వేస్తోందట. ఆదిల్ ద్వారా ఈ దారుణం చేయించింది జైషే మహ్మద్ అని స్పష్టంగా తెలిసి అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ పాక్ తీరును తప్పు పడుతుంటే Times of India లాంటి పత్రికలు మాత్రం భారత ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నాయి. ఈ చర్య మన అమర జవాన్లను అవమానించడమే. మీడియా నైచ్యానికి పరాకాష్ట ఇది.
ఇదిలా ఉంటే, ఆప్ఘనిస్థాన్ నుంచి సేనల్ని ఉపసంహరించుకోవాలన్న అమెరికా నిర్ణయం తమ విజయమేనని తాలిబన్లు చేసిన ప్రకటన స్ఫూర్తితోనే అదిల్ సూసైడ్ బాంబర్‌గా మారాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త ప్రచురించింది.
https://timesofindia.indiatimes.com/india/pulwama-suicide-bomber-was-inspired-by-taliban-victory-over-us-in-afghanistan/articleshow/68000323.cms
*దాడికి ముందు ఆదిల్‌తో రెండు వీడియోల్ని జైషే మహ్మద్ సంస్థ రికార్డ్ చేయించింది. ఈ రెండు వీడియోల్లోనూ సైన్యం చేతిలో అవమానం గురించి అతను మాట్లాడలేదు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన తమ కుమారుడి పట్ల, తన కుటుంబం పట్ల సమాజంలో ద్వేషం కలుగుతుందేమోనన్న భయంతో సానుభూతి కోసం ఆదిల్ తల్లిదండ్రులు ఈ ప్రకటన చేసి ఉంటారు. కానీ, మీడియాకు బుర్ర ఉండాలి కదా. ఆ ప్రకటన ముందువెనుకలు ఆలోచించకుండా జనం మీదకు వదలటం ఎంతవరకూ సబబు?
ఈ సందర్భంగా మన మీడియా ఒక ముఖ్యమైన విషయాన్ని ఘోరంగా పక్కన పడేసింది... ఒకనాడు ఉగ్రవాదిగా ఉన్న నజీర్ అహ్మద్ వాని ఆ తర్వాత వాస్తవాలు గ్రహించి ఆ మార్గాన్ని వదిలేస్తే భారత సైన్యం అక్కున చేర్చుకుని జవానుగా సేవలందించే భాగ్యం కలిగించింది. అతను కూడా అంతే చిత్తశుద్ధితో దేశం కోసం పనిచేసి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు. అతని త్యాగాన్ని భారత ప్రభుత్వం గుర్తించి మరణానంతరం అశోక్ చక్ర అవార్డుతో గౌరవించింది. అలాంటి మన సైన్యం ఆదిల్‌ని అవమానించిందని ఆ కుటుంబం చెప్పడం... అది నమ్మి వార్తలివ్వడం ఎంత సిగ్గు చేటు?
*125 ఏళ్ల కిందట స్వామి వివేకానంద చికాగోలో చేసిన ప్రసంగంతో మన దేశం పట్ల విదేశీయులకు ఎంతో గౌరవం పెరిగింది. ఎందరో ఆయన శిష్యులై ఈ దేశానికి వచ్చారు. మన జాతి ఔన్నత్యాన్ని గురించి విదేశీయులు అర్థం చేసుకున్నారు గానీ, మన స్వదేశీ మీడియాకు ఇవేమీ అక్కర్లేదు. వీళ్ళను మార్చడానికి ఆయన మరోసారి పుట్టాలేమో...*
No comments:
Post a Comment