Monday, 18 February 2019

ఇంత ఘోరం జరిగినా ఆ ఫోటో అక్కడే ఉంది...

జి.ఎస్. కుమార్

..............
మన రక్షణ కోసం జీవితాల్ని అంకితం చేసిన 40 మంది జవాన్లను కోల్పోయి జాతి యావత్తూ కన్నీరు పెడుతోంది. అసలు ఈ కన్నీటికి కారణం పాక్ ప్రేరేపిత ఉగ్రభూతం కాగా... ఆ ఉగ్రవాదానికి మూలం మహమ్మద్ అలీ జిన్నా వల్ల జరిగిన దేశవిభజన. ఆ జిన్నా ఫోటో ఇప్పటికీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)లో భారత్‌ను వెక్కిరిస్తూ వేలాడుతూనే ఉంది. దేశ విభజనకు కారకుడై లక్షలాది ప్రజల జీవితాల్ని అథోగతి పాలు చేసిన ఈ జిన్నా ఫోటోను తొలగించేందుకు ప్రయత్నిస్తే గతేడాది ఎంత గొడవ చేశారో తెలియంది కాదు. అక్కడి జిన్నా ఫోటోకు ఓటు వేసినవారిలో కాంగ్రెస్ నేతలు కూడా ఉండటం దురదృష్టకరం.

ఇలాంటి నేతలకు బుద్ధి చెప్పేలా కీలక నిర్ణయం తీసుకుంది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA). మొహాలీ క్రికెట్ స్టేడియంలోని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌, గ్యాలరీ, లాంగ్‌ రూమ్‌, రిసెప్షన్‌ తదితర ప్రదేశాల్లో ఉన్న 15 మంది పాకిస్థాన్ ఆటగాళ్ల ఫొటోలటన్నింటినీ తీసి పక్కన పడేసింది. వీటిలో పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌, జావేద్‌ మియాందాద్‌, వసీమ్‌ ఆక్రమ్‌, అఫ్రీది ఫోటోలున్నాయి.


ఇక జిన్నా ఫోటో ఇంకా ఏఎంయులో ఎందుకని అడిగితే... ఆయనకు స్టూడెంట్ యూనియన్ సభ్యత్వం ఉందని, పైగా అదెప్పుడో ఆయన పాకిస్తాన్ డిమాండ్ చెయ్యక ముందటి ఫోటో అని కథలు చెబుతున్నారు. అలాగైతే హిట్లర్, ముస్సోలినీ లాంటి క్రూర నియంతల చిన్నప్పటి ఫోటోలు పెట్టుకుని... వీళ్ళు పెద్దయ్యాక కదా తప్పులు చేసిందని పూజలు చేస్తారా? PCA నిర్ణయం తెలిస్తే... దేశవిభజనకు, ఉగ్రవాదానికి నేరుగా సంబంధాలు లేని పాక్ క్రికెటర్ల ఫోటోలు ఎందుకు తొలగించారని కూడా రేపోమాపో ప్రశ్నిస్తారేమో... ఇలా ఉన్నాయి వీళ్ళ తెలివి తేటలు. ఆ వివాదం తర్వాత గతేడాది అక్టోబర్ నెలలో AMUలో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనలో గాంధీ-జిన్నాలు పక్కపక్కనే ఉన్న ఫోటోలను ప్రదర్శించారు.


ఒకవైపు దేశంలో ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ అందరూ ఏకమవుతున్నారు. చైనా, పాక్ తప్ప ప్రపంచమంతా భారత్‌కు మద్దతుగా నిలిచాయి. గత నాలుగైదు రోజుల్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించడం, పోలీసులు కేసులు పెట్టి విచారణ చేపట్టడం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా... ఈ మొత్తం దుష్పరిణామాలకు మూలమైన పాకిస్తాన్ కన్నతండ్రి జిన్నా ఫోటో మాత్రం.. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ లో - మన చేతగాని సర్కారులను, జవాన్ల త్యాగాలను వెక్కిరిస్తూ ఇంకా అక్కడే ఉంది.

No comments:

Post a Comment