పి. వేణుగోపాల రెడ్డి
' జాగృతి ' వారపత్రిక సంపాదకులు
..........
భారతదేశ చరిత్రలో స్వర్ణయుగాలూ ఉన్నాయి, సంక్షోభాలూ ఉన్నాయి. విదేశీ దండయాత్రలు, పాలన, ఆ పాలనలోని దోపిడీ, అమానుషత్వం ఆ యుగాలలోని స్వర్ణాన్ని హరించి, సంక్షోభాలను మాత్రం వర్తమాన భారతానికి అందించాయి. స్వాతంత్య్రం తరువాతనైనా ఈ సంక్షుభిత మాతృ భూమిని పునర్నిర్మించే పనిని తొలినాటి రాజకీయ నాయకత్వం సమదృష్టితో చేయలేదు. సరికదా, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి విరుద్ధమైన పోకడలకు పోయి కొత్త సమస్యలను జోడించింది. వలస పాలన అవశేషాలను కడిగి పారేయడానికి అవసరమైన విజ్ఞత, దూరదృష్టి, ముఖ్యంగా దేశీయమైన చింతన కరువైపోయాయి. ఈ మొత్తం పరిణామం వెనుక స్వార్థం, భ్రమలు ఉన్నాయి. కీర్తి కండూతి ఒక కొండలా కనిపిస్తూనే ఉంటుంది. దీని ప్రభావం ఈ దేశ చట్ట నిర్మాణ ప్రక్రియను విషపూరితం చేసింది. అధిక సంఖ్యాకుల మనోభావాలు అవమానానికి గురై, స్థానీయత లుప్తమైపోయింది. ఈ దుష్ట సమాగమం నుంచి ఉద్భవించినదే నేటి సెక్యులరిజం.
విదేశీయుల స్వార్థం మన గతాన్ని గాయ పరించింది. అలా అని వర్తమాన భారతం సజీవంగా, ఆరోగ్యంగా ఉందని భావించలేం. అలనాటి నాయకత్వం వర్తమాన భారత ప్రజానీకాన్ని, ప్రధానంగా హిందువుల జీవన విధానాన్ని- గాయ పరచడమే కాదు, భావి భారత హిందువులు కూడా క్షతగాత్రులుగానే పుట్టక తప్పని పరిస్థితిని సృష్టించి పెట్టింది. సెక్యులరిజం అనే ఒక అసంబద్ధ, వికృత భావనకు కాంగ్రెస్ ముఠాలు, కమ్యూనిస్టు పిడివాద బృందాలు, స్వయం ప్రకటిత మేధావుల కూటాలు కారణం. ఈ దేశంలో పేదరికం ఉంది. ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయి. బోలెడు నిరుద్యోగం ఉంది. రైతుల బలవన్మరణాలు ఉన్నాయి. నేత కార్మికుల వెతలున్నాయి. బలిపీఠం ఎక్కుతున్న బాల్యం ఉంది. మహిళా సమస్యలు ఉన్నాయి. అలాంటిది ఒక్క సెక్యులరిజం గురించే ఎందుకు ఇంత ఘోష? అని ఎవరైనా ప్రశ్నిస్తే, సెక్యుల రిజం అనే ఆ వికృత విన్యాసం పుణ్యమా అని ఈ దేశంలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. చివరికి అది రాజ్యాంగ స్ఫూర్తి మీద నీలినీడలు ప్రసరించే స్థాయికి చేరుతున్నది. అన్ని సామాజిక సమస్యలు, అమా నుషాలు, అకృత్యాలు ఈ దేశ ప్రజల దృష్టికి రాకుండా, నిష్పాక్షి కంగా ఆలోచించనివ్వకుండా చేస్తున్నది దొంగ సెక్యులరిజం అనే భూతమే. అసలు ఇక్కడ ఉన్నదే కుహనా సెక్యులరిజం. గడచిన దశాబ్ద కాలంలో దేశంలో మూడున్నర లక్షల మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు. పొట్ట గడవక ప్రాణాలు తీసుకున్న నేతన్నలు వేలాదిగా ఉన్నారు. వీటికి దేశం తలదించుకోవాలి. కొన్నిచోట్ల గోరక్షణ పేరుతో ఒక వర్గాన్ని హింసించారు. అదీ విషాదమే. కానీ టీవీ చానళ్లు, చాలా వార్తాపత్రికలు ఏ అంశాన్ని చర్చించాయి? దేనికి ప్రాధాన్యం ఇచ్చాయి? లక్షలలో చనిపోయిన ఆ వృత్తుల వారి విషాదానికి కాదు. వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన ‘గోరక్షణ బాధిత’ మైనారిటీల బాధల గాథలనే పదేపదే ఇచ్చాయి. శ్రీరాముడిని దూషించడానికి ఎంత సమయం, ఎంత చోటు కేటాయించింది మీడియా? హనుమంతప్ప అనే వీరజవాను మృతికి నివాళి ఘటించడానికి ఎంత సమయం ఇచ్చింది? దేశంలో ఇలాంటి ఒక విష సంస్కృతిని ఒక ప్రభంజనంలా వ్యాపింపచేసినది మీడియా, మేధావులే. కారణం, సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని ఈ దేశంలో అత్యధికులైన హిందువులను ఎప్పటికీ ద్వితీయశ్రేణి పౌరులుగా ఉంచాలన్న కుట్రకు ఇలాంటి గోరక్షణ హత్యల వాదనలలో, శ్రీరాముని నిందించడంలో బోలెడు అవకాశం ఉంది. ఈ కుట్ర ఎవరికీ తెలియదని అనుకోవద్దని హెచ్చరించే పుస్తకమే ‘పెక్యులరిజం’. సెక్యులరిజం అనే ఆ వికారపు భావన మీద ప్రముఖ పత్రికా రచయిత, గ్రంథకర్త ఎంవిఆర్ శాస్త్రి సంధించిన కొత్త అస్త్రమిది. ఈ దేశంలో, ఇక్కడి మేధావుల కుచ్చితపు మేధస్సులలో ‘సెక్యులరిజం’ అనే భావన ఎంతో వింతగా, వికారంగా పెరుగుతోంది. అందుకే ఆయన ‘పెక్యులరిజం’ పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. మొదటిగా గుర్తించవలసిన అంశం- ఇక్కడి లౌకికవాదం లక్ష్యం మత ప్రసక్తిలేని రాజ్యం కాదు. కేవలం హిందూమత ప్రసక్తి లేని రాజ్యమే. హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా తయారుచేయడమే. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నార్థకం చేయడమే. అత్యంత ప్రమాదకరమైన ఈ వక్రదృష్టే రచయిత చేత ఇలాంటి పుస్తకం రాయించిందని అనిపిస్తుంది.
‘పెక్యులరిజం’లో 26 వ్యాసాలు ఉన్నాయి. ‘అనుబంధం’లో మరో పది వ్యాసాలను జోడించారు. భారత సెక్యులరిజానిది ఎంతటి వికృత రూపమో, అంతటి అవాంఛనీయ నేపథ్యం కూడా. 1948లో రాజ్యాంగ రచనా సంఘం ఈ భావనను నిష్కర్షగా తిరస్కరించింది. అయినా 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా దొడ్డిదారిన రాజ్యాంగంలో ఈ పదం చొరబడింది. ఈ పరిణామాలు, ఫలితంగా హిందూ సమాజం మీద పడిన దుష్ప్రభావం ఎంత ప్రమాద కరమైనవో వివరించడానికి రచయిత గొప్ప కృషి చేశారు. ఇటీవలి కాలంలో హిందూ జీవన విధానం, అందులోని విశ్వాసాలమీద కోర్టులు, ప్రజా సంఘాలు ఎంలాంటి పక్షపాత వైఖరిని ప్రదర్శి స్తున్నాయో (అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు) కూడా రచయిత వివరించారు. అంటే స్వతంత్ర భారతంలో సెక్యులరిజం విషపుజాడ ఎంతగా విస్తరించి ఉందో ఈ వ్యాసాలు చెబుతున్నాయి.
ఇందులో తొలి వ్యాసం ‘హిందూమతాతీత లౌకిక రాజ్యం’. మొదటి వాక్యమే ‘మనకో పెద్ద భ్రమ’. మనది లౌకిక రాజ్యమన్నది పెద్ద భ్రమ అన్నారు రచయిత. ఎందుకంటే మెజారిటీ మతానికి ఇక్కడ విలువ లేదు. మైనారిటీల మాటకు తిరుగులేదు. ప్రపంచ వింత కాక మరేమిటి? విభజనానంతరం రాసుకున్న రాజ్యాంగంలో హిందువులకు గౌరవ ప్రదమైన స్థానం దక్కలేదన్నదే రచయిత ఆరోపణ. ఇందుకు బలమైన ఆధారాలను కూడా చూపించారు. దాదాపు 80 శాతం ఉన్నప్పటికీ హిందువులకు ఇక్కడ ఎందుకు ప్రాధాన్యం లేదు? ఈ రాజ్యాంగం, అందులో హక్కులు మైనారిటీల కోసమే అన్న అభిప్రా యానికి తీసుకెళ్లే అంశాలు ఏమిటి? ‘రాజ్యాంగం అనగానే మనకు స్ఫురించేది 30వ అధికరణం. 1. మెజారిటీ 2. మైనారిటీ. కాని- ఈ రెండు వర్గాలుగా సమాజాన్ని విభజించి, విద్యారంగంలో ప్రత్యేక హక్కులను, అవకాశాలను మైనారిటీలకు మాత్రమే కట్టబెట్టిన ఈ రాజ్యాంగ అధికరణం మెజారిటీ వర్గమైన హిందువులకు చేసిన నష్టం మేరలేనిది’ అని బల్లగుద్ది చెప్పారు రచయిత. దీనికి బాధ్యత ప్రథమ ప్రధానిదేననీ విస్పష్టంగా ప్రకటించారు. నిజానికి సెక్యులర్ అన్న పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలని ప్రొ.కె.టి.షా చేసిన ప్రతిపాదనను రాజ్యాంగ రచనా సంఘం తిరస్కరించింది. ఆ ప్రతిపాదనను ససేమిరా అన్నవారు సాక్షాత్తు డాక్టర్ అంబేడ్కర్ కావడం విశేషం. సెక్యులర్ అన్న పదం రాజ్యాంగంలో ఆనాడు లేకున్నా, మెజారిటీ, మైనారిటీ అన్న వర్గీకరణనే ఇతర మతాలు తమకి అనుకూలంగా మార్చేసుకున్నాయి. ఈ మాట అన్నది ఆర్ఎస్ఎస్, లేదా జనసంఘ్‌లు కాదు. ఫెలిక్స్ అల్ఫ్రెడ్ ప్లాట్నర్ అనే జెసూట్ మిషనరీ, ‘ఇండియాలో కాథలిక్ చర్చ్: నిన్న నేడు’ అన్న పుస్తకంలో ఈ మాటలు (1964) రాశాడు. ‘ఇండియాలో చర్చ్ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే దానికంటే ఎంతో బలమైన మత సముదాయాలతో సమానతనూ, స్వేచ్ఛాయుత వాతావరణాన్ని భారత రాజ్యాంగం దానికి గ్యారంటీ చేసింది…..’ అని ఆయన రాశాడు. మతాంతరీకరణలతో ఈశాన్య భారత సమస్య రావణకాష్టంగా మారిపోయిన తీరు ఈ వ్యాఖ్యలో ధ్వనించడం లేదా! ఒడిశాతో పాటు చాలా గిరిజన ప్రాంతాలు ఈ రోజు హిందూ జీవనానికి దూరం కావడం వెనుక ఉన్నది మిషనరీలే. వీరి మతాంతరీకరణల కార్యకలాపాలలో మతం ఒక్కటే ఉండదు. ఇతర బలమైన కారణాలు కూడా ఉంటాయన్నది నిజం. అవి నిస్సందేహంగా రాజ్యాంగ విరుద్ధమైనవే కూడా. ఇదంతా 25-30 అధికరణాల పుణ్యమే (తన వాదనకు దిగ్భ్రాంతి కరమైన తాజా రుజువును రచయిత అనుబంధంలో చూపించారు. దాని పేరు ‘హిందూ గవర్నర్ మాకొద్దు’. కుమ్మణం రాజశేఖరన్ అనే గవర్నర్ ఆర్ఎస్ఎస్ కాబట్టి, హిందూ సంస్థలతో సంబంధం కలిగిన వాడు కాబట్టి ఇక్కడ అవసరం లేదని మిజోరంలో గొడవ రేగిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి). ఇక గాంధీ, నెహ్రూ కాలం నుంచి ఓటు బ్యాంకు రాజకీయాలతో ముస్లింలను అంటకాగడం గురించి ఎంత రాసినా తరగదు.
అత్యవసర పరిస్థితి కాలంలో 1976లో మన రాజ్యాంగ స్ఫూర్తిని మొత్తం దెబ్బ తీస్తూ ఇందిరా గాంధీ సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను చేర్చారు. విస్తృతార్థంలో ఈ పదాల ఔన్నత్యాన్ని ఎవరూ కాదనలేరు. కానీ రాజ్యాంగ నిర్మాతలు వీటిని దూరంగా ఉంచారు. వాటి అవసరం ఈ దేశానికి లేదు. అయినా ఇందిర వారి ఆశయాన్ని భగ్నం చేస్తూ రాజ్యాంగంలో చేర్చారు. హిందువుల పరిస్థితి మరింత అధ్వానమయింది. వివాదాస్పదమైన 42వ రాజ్యాంగ సవరణతో ‘పీఠిక’లోని సర్వసత్తాక, ప్రజాస్వామిక అనే పదాల స్థానంలో సామ్యవాద, లౌకక అన్న పదాలను ఆమె చేర్చారు. అందుకు దోహదం చేసిన పరిస్థితులు ఏమిటి? వాటిని కూడా రచయిత వివరించారు.
ఈ పరిణామాల పర్యవసానం ఏమిటి? బుజ్జగింపు ధోరణి ప్రబలి, ఓటు అనే దాని చుట్టూ భారత రాజకీయం తిరగడం ఆరంభించింది. ఓటు బ్యాంకు చుట్టూ సాగుతున్న ఈ ప్రదక్షిణలలో అన్ని భారతీయ విలువలకు ముప్పు వాటిల్లింది. మత ప్రమేయం లేని లౌకిక రాజ్యమంటే మత వ్యవహారాలలో జోక్యం ఎందుకు? కానీ హిందూ ఆలయాలలో కోర్టులు, ప్రభుత్వాల జోక్యం జుగుప్స కలిగించే రీతిలో లేదా? అన్నదే ఈ రచయిత సూటి ప్రశ్న. ఈ దుండగీడు తనాన్ని ‘గవర్నమెంటే బందిపోటు’, ‘గుడుల గోడు’, ‘నటరాజస్వామి చూపిన దారి’ వ్యాసాలలో రచయిత ఎంతో ప్రభావవంతంగా ఆవిష్కరించారు. మసీదులు, మదర్సాలు; చర్చ్‌లు, మిషనరీ పాఠశాలల జోలికే పోని భారత లౌకిక ప్రభుత్వం కేవలం హిందూ ఆలయాల ఆస్తులను, ధార్మిక సంస్థల ఆస్తులనే ఎందుకు కబళించగలుగుతోంది? ఈ ప్రశ్న చాలామంది హిందువుల మనసులను వేధిస్తూనే ఉంది. కానీ ఆ ప్రశ్న వేసి సమాధానం కూడా ఇచ్చారు రచయిత. మరొక వ్యాసం ‘అయ్యప్పకు అపచారం’. శబరిమల దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని ముగ్గురు ‘పనికిమాలిన’ జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్ర యించడం, దాని పూర్వాపరాలు రచయిత సహేతుకంగా చర్చించారు. చివరి వ్యాసాలలో మరింత చర్చను జోడించారాయన. నిజమే, అయ్యప్ప ఆలయానికి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఆ గుడిలోకి మొత్తంగా స్త్రీలకు ప్రవేశం నిషిద్ధం కానేకాదు. పదేళ్ల లోపు, యాభయ్ ఏళ్ల పైబడినవారు వెళ్లవచ్చు. ఈ సంగతి తెలియకుండానే ఆ పనికి మాలిన జర్నలిస్టులు కోర్టుకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం ముందూవెనకా ఆలోచించకుండా తీర్పు ఇచ్చింది. ఫలితం మనం చూస్తున్నదే. కాగా, ఆ కేరళలోనే ఒక బిషప్ క్రైస్తవ సన్యాసినుల మీద జరిపిన లైంగిక అత్యాచారం కేసులో కోర్టులు ఎందుకంత ఉదాసీనంగా ఉన్నాయి? ఇది రచయిత ప్రశ్న. టీటీడీలో ఒక సినిమా చిత్రీకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవడం గురించి కూడా ఇందులో ఉంది. అక్కడ చిత్రీకరణలు నిషిద్ధమని పాలక మండలి చెబితే, ముఖ్యమంత్రి, ‘సినిమావారి విన్నపాన్ని పరిశీలించవలసింది’ అని మలి తాఖీదు లాంటి సూచన చేయడం గురించి చదివితే విస్తుపోతాం. ఇదీ, మన లౌకిక వ్యవస్థలోని మతాతీత ధోరణి.
ఇలాంటి వివాదాలు వాటికవే వచ్చి పడవు. ఎవరో ‘పెద్దలే’ పుణ్యం కట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితికి గాంధీ, నెహ్రూ, ఇందిర వంటివారిని రచయిత బాధ్యులను చేయడం తొందరపాటు కాదు. చారిత్రక వాస్తవం. ‘మొదటి ప్రపంచ యుద్ధకాలంలో దక్షిణాఫ్రికా నుంచి రాచమర్యాదలతో బొంబాయి రేవులో అడుగుపెట్టింది మొదలుకొని, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతమాతకు రంపపు కోత వరకూ గాంధీ మహాత్ముడు చేసిన వరస తప్పుల వల్ల జాతీయోద్యమం చిందరవందర అయింది. గాంధీ తాగించిన మేకపాలతో హిందువుల క్షాత్రం సన్నగిల్లింది. ఆయన ఇచ్చిన వత్తాసుతో, కురిపించిన ధ్రుతరాష్ట్ర ప్రేమతో ముస్లిం మతోన్మాదం పెట్రేగింది. మహాత్ముడు లొంగే కొద్దీ, బుజ్జగించే కొద్దీ హిందువుల మెడలు బలవంతంగా వంచే కొద్దీ మహమ్మదీయుల పంతం నానాటికీ పెరిగి చివరికి దేశాన్ని ముక్కలు చేసింది’ (పే.26) అంటారు రచయిత. ఇలాంటి వ్యాఖ్యలే నెహ్రూ తదితరు మీద కూడా కనిపిస్తాయి. చరిత్రకు కాంగ్రెస్ పెద్దలు, వారి తైనాతీ చరిత్ర కారులు మసిపూయడం వల్ల కానీ, లేకుంటే ఈ మాటలు వారి సమకాలినులలో చాలామంది బాహాటంగా చెప్పిన సంగతి ఈ తరానికి కూడా తెలిసేదే! వ్యక్తుల గొప్పతనం కంటే చారిత్రక వాస్తవాలు, జాతీయ ప్రయోజనాలు, జాతి శ్రేయస్సు ఎప్పుడూ గొప్పవే.
ఈ వ్యాసాలలో రచయిత వేసిన ప్రశ్నలకు సమాధానం కావాలి. భారత్ లౌకిక దేశమే అయి నప్పుడు మదర్సాలలో, మిషనరీ పాఠశాలల్లో వారి మతాల ప్రార్థనలను, బోధనలను అనుమతించి నప్పుడు హిందువులు ఎక్కువగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో సరస్వతీ ప్రార్థనకు నీచమైన రగడ దేనికి? ‘వందేమాతరం’ పాడడం మీద, జాతీయగీతం ఆలపిస్తుంటే లేచి నిలబడడం గురించి, భారత మాతకు జై అనడం మీద ఎందుకు ప్రేలాపనలు? నిజానికి ఈ పరిణామం ఇటీవలి కాలానిదే. అంటే మన సెక్యులరిస్టు భావన వెర్రితలలు వేసిన తరువాతిదే. పిల్లల పుస్తకాలలో ఇస్లాం, క్రైస్తవం గురించి నేరుగా బోధించే పాఠాలు ఉన్నాయి. మరి, కొందరు హిందూరాజుల, త్యాగధనుల చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చబోతే కాషాయీకరణ అంటూ రగడ ఎందుకు?
ఈ విష సంస్కృతిని అడ్డుకునే అవకాశం వాజపేయి, మోదీ హయాంలలో కూడా చేజార్చు కున్నామన్న రచయిత ఆవేదనను అర్థం చేసుకోవాలి. అలాగే సంకీర్ణ ప్రభుత్వాల పరిధిని కూడా ఇదే సమయంలో ఎవరైనా అర్థం చేసుకోవాలి. 30వ అధికరణం మైనారిటీలకే పరిమితం చేయకుండా, అందరికీ వర్తింప చేసి విద్యా సంస్థలను నెలకొల్పు కునే అవకాశం కల్పించాలంటూ వాజపేయి కాలంలో సయ్యద్ షహబుద్దీన్ 1995లోనే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో మురిగిపోయింది. ఇది విచారకరమే. చేజారిన సువర్ణావకాశమే. ఏమైన ప్పటికీ ఇలాంటి భావన మొత్తం హిందూ మేధావు లలో ఉన్నమాట నిజం. మోదీ చేయగలిగినవి కొన్ని ఉన్నా చేయకపోవడం గురించి కూడా రచయిత ప్రశ్నించారు. నిజమే మరి!
హిందువులు ముక్తకంఠంతో ప్రశ్నించవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు హిందువుల గళం స్ఫుటంగా వినిపించే వాతావరణం ఏర్పడింది. దానిని సద్వినియోగం చేసుఖకోమని చెబుతుంది ఈ పుస్తకం. చివరి వ్యాసం ‘హిందూ సమాజం కదలాలి’ ఉద్దేశం ఇదే. ఈ పుస్తకం అందరూ చదవాలి. ఆలోచించాలి. ఏమైనా, హిందూ సమాజం విపత్కర పరిస్థితులలో ఉన్నదన్న రచయిత ఆవేదనతో ఏకీభవించకుండా ఉండడం సాధ్యం కాదు.
No comments:
Post a Comment