జి.ఎస్.కుమార్
............తాజాగా కాంగ్రెస్ దిగ్గజనేత డిగ్గీరాజా అనబడే దిగ్విజయ్ సింగ్ అనే వృద్ధనేతకు గాభరా పుట్టింది. "పుల్వామా ఉగ్రదాడి, మన సైనికుల సర్జికల్ స్ట్రైక్స్ గురించి అందరూ మాట్లాడేస్తున్నారు... నేను మాట్టాడకపోతే నా పని ఐపోయిందనుకుంటార"ని కంగారుపడి ఉన్నట్టుండి తెరపైకి వచ్చారు. అభినందన్‌ని వదిలిపెట్టినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని మెచ్చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ని అమెరికా సీల్స్ మట్టుబెట్టినప్పుడు ఆధారాలు చూపించారని, అలాగే పాకిస్తాన్‌పై మన సైన్యం తాజాగా చేసిన దాడులలో చనిపోయినవారికి సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ముందుగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. బిన్ లాడెన్‌ను అమెరికన్ సీల్స్ చంపిన ఆపరేషన్ వీడియో గానీ, అతని మృతదేహం ఫోటోలు గానీ అమెరికా బయటపెట్టలేదు. ఆ శవాన్ని ఎవరికీ చూపించలేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జలసమాధి చెయ్యాలని నిర్ణయించుకుని లాదెన్‌ని చంపిన కొన్ని గంటల్లోనే ఆ పని కానిచ్చేశారు. ఇవేవీ అప్పటి పత్రికలు, టీవీ ఛానెళ్ళు సహా ప్రధాన మీడియాలో కనిపించలేదు. అమెరికన్ సీల్స్ ఎక్కుపెట్టిన తుపాకుల తూటాలతో కన్నాలు పడిపోయిన లాదెన్ ఫోటోలంటూ వెబ్ మీడియాలో కొన్ని ఫోటోలు వచ్చాయి గానీ అవి నిజమైనవి కావని ప్రధాన మీడియాకు చెందిన డిజిటల్ విభాగాలు స్పష్టం చేశాయి. కావాలంటే కింది లింకు చూసుకోవచ్చు....
https://www.theguardian.com/world/2011/may/02/osama-bin-laden-photo-fake
ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ పరిసరాల్లోని ఉగ్రశిబిరాలపై భారత సైన్యం చేసిన దాడుల్లో వారికి చెప్పుకోదగిన నష్టం జరిగి ఉండకపోతే, పాక్ వైమానిక దళాలు మన సైనిక స్థావరాలను ఎందుకు లక్ష్యం చేసుకున్నాయి. అలా వచ్చిన పాక్ వైమానిక దళాలను తరుముకుంటూ వెళ్ళినప్పుడే కదా మన వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్ళడం, అతన్ని బంధించడం, భారత ప్రభుత్వ తీవ్ర హెచ్చరికల నడుమ 60 గంటల్లో అతను తిరిగిరావడం చకచకా జరిగిపోయాయి. మన సామర్థ్యానికి ఇవి సాక్ష్యాలని కాంగ్రెస్ వారికి ఎప్పటికీ అనిపించదు. బాలాకోట్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన జైషే మహమ్మద్ నేతలు మళ్ళా పుల్వామా తరహా దాడులు చేస్తామని వీడియోలు విడుదల చేశారు. జైషే అధినేత మసూద్ అజర్ సోదరుడు అమ్మర్ మార్చి 2న ఆడియో టేపు ద్వారా స్పందించాడు. కాశ్మీరులో జిహాద్ కోసం శిక్షణ పొందుతున్న తమ రిక్రూటర్ల శిబిరంపై భారత వైమానిక దళం దాడి చేసిందని స్పష్టంగా చెప్పాడు. మన సైన్యం చేతలకు ఇది సాక్ష్యం కాదా?...
బాలాకోట్‌లో ఉగ్రవాదులకు చావుదెబ్బ తగిలిందని ఇటలీకి చెందిన ఒక మహిళా జర్నలిస్టు క్షేత్రస్థాయిలోని పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి ఇచ్చిన కథనం ఒకపక్కన కదలాడుతున్నా కొన్ని మీడియా సంస్థలకు అవేవీ పట్టవు. భారత వైమానిక దాడుల్లో పాకిస్తాన్‌కు గానీ, ఉగ్రవాదులకు గానీ నష్టమేదీ జరగలేదని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు అంటున్నాయంటూ వాటికెందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఇదే నిజమైతే భారత సైనిక స్థావరాలపైకి అమెరికా నుంచి తెచ్చుకున్న F-16 విమానాలతో పాక్ దళాలు ఎందుకు వచ్చాయి? అసలు ఉగ్రవాదుల వేటకు మాత్రమే వాడాల్సిన ఈ విమానాలను భారత్ పై దాడికి ఎందుకు వాడారని పాక్ సర్కారును అమెరికా నిలదీసి వివరణ అడిగింది. ఇవేవీ మన ప్రతిపక్షాలకు, మీడియా సంస్థలకు అవసరం లేదు.
అభినందన్ పాక్ అదుపులో ఉన్నప్పుడు అతని నుంచి భారత సైనిక రహస్యాలు సహా అతని వ్యక్తిగత వివరాలన్నీ రాబట్టేందుకు పాక్ సైనికాధికారులు ప్రయత్నించారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. కానీ ఈ విషయంలో మన మీడియా ప్రవర్తించిన తీరు మరీ ఘోరం. ఒకవైపు అభినందన్ దేశరహస్యాలు కాపాడే ప్రయత్నంలో ఉంటే, పాకిస్తాన్ శ్రమపడకుండానే అతని కుటుంబం గురించిన వివరాలన్నీ మన మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మన టీవీ చానెల్ ఒకటి గతంలో అభినందన్ బృందంతో చేసిన ఇంటర్వ్యూల ఫీడ్ కూడా పాక్‌కు చేరింది. చివరికి లోక్‌సభ ఎన్నికల ముందు యుద్ధం జరుగుతుందని బీజేపీ నేతలు తనతో రెండేళ్ళ కిందటే అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారంటూ పాకిస్తాన్‌కి చెందిన ప్రముఖ పత్రిక డాన్‌తో పాటు అక్కడి పలు మీడియా సంస్థలు కథనాలిచ్చాయి. దీనిపై పవన్ మార్చి 2న స్పందిస్తూ ప్రముఖ వార్తా ఛానెళ్ళు, రాజకీయ విశ్లేషకులే వ్యాఖ్యలకు ఆధారమన్నాడు. ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటున్న పవన్ మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? ఈ లింకులు చూడండి...
https://epaper.andhrajyothy.com/c/37257305
https://www.dawn.com/news/1466936
ఎన్నికల సమయంలో ఉగ్రవాద దాడులు జరగడమేంటని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు... వీటిపై చర్చలు జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిస్పందన.. పాకిస్తాన్‌పై నిందలేస్తున్నారంటూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్, పంజాబ్ మంత్రి సిద్ధూల కన్నీరు... పాక్ కంట పన్నీరు... ఇదీ స్వతంత్ర భారతావనిలో నాయకత్వం తీరు.
అసలు ఒక దేశంపై పొరుగు దేశం నుంచి దాడి జరిగి విలువైన ప్రాణాలు పోతే... బాధిత దేశంలోని ప్రతిపక్షపార్టీలు లేదా మీడియా ఆ పొరుగు దేశం మీద జాలి చూపించడం మీరెక్కడైనా చూశారా? ఇప్పటివరకూ చూడకపోతే ఇప్పుడు చూడండి... భారతదేశంలో జరుగుతోంది అదే. పుల్వామా వద్ద 40 మంది భారత జవాన్లను పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదదాడులు బలిగొన్న తర్వాత, మన మీడియా, ప్రతిపక్ష నేతల, ప్రకటనలను గమనించండి. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి మన ధనమానప్రాణాలను కాపాడుతున్న సైనికులను లక్ష్యం చేసుకుని వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అన్నం పెట్టే చేతిని నరికే నీచనికృష్టుల్లాగా... సైనికులపై నిందలు వేస్తూ పరమ కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. వీరి తీరు పాకిస్తాన్‌కి ఉపశమనం కలిగించేలా ఉంది తప్ప... తాము కూర్చున్న కొమ్మను తామే నరుకుతున్నామన్న కనీస ఇంగిత జ్ఞానం లేదు. మన దేశంలో ఇలాంటి వాళ్ళుంటే పాకిస్తాన్‌కు అంతకంటే ఇంకేం కావాలి? ఐక్యరాజ్యసమితి మద్దతు కూడా అవసరం లేదు. మన మీడియా కంటే సోషల్ మీడియాలోని నెటిజన్లు పరిపక్వత ప్రదర్శిస్తున్నారు, ఈ నేతలకంటే సాధారణ పౌరులు విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు.
No comments:
Post a Comment