Sunday, 10 March 2019

పాక్ భక్త సిద్దు ... సిగ్గు సిగ్గు !


జి.ఎస్.కుమార్

.....
పుల్వామా దాడులు జరిగిన తర్వాత... సిక్సర్ల సిద్దూగా ఒకప్పుడు క్రికెట్‌లో పేరు తెచ్చుకున్న ప్రస్తుత పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ముందే పాకిస్తాన్‌ని వెనకేసుకొచ్చాడు. నెటిజన్లు ఆయన్ని ఆ చెంపా ఈ చెంపా వాయించడంతో నాలుగు రోజులు నోరు మూసుకున్నట్టు నటించాడు. కానీ... "భారత వైమానిక దళాలు మా చెట్లను మాత్రమే కూల్చాయి... మాకేం నష్టం కలగలేదు" అని పాక్ సైనిక వర్గాలు ఒక కల్లబొల్లి ప్రకటన చెయ్యగానే ఈ సిద్దూ మళ్ళీ ఒళ్ళు విరుచుకున్నాడు. "పాకిస్తాన్‌లో మనవాళ్ళు 300 మంది ఉగ్రవాదుల్ని ఏరేశారా.. చెట్లు కూల్చారా?" అని ట్వీట్ చేశాడు. పలువురు కాంగ్రెస్ నేతలు, వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా సిద్దు మార్గంలోనే నడిచారు. ఆ వెంటనే మన వైమానిక దళం అధికారులు రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న బాలాకోట్‌లో తాము జరిపిన దాడులు, అక్కడ ఉగ్రవాద స్థావరాలకు కలిగిన నష్టాన్ని వివరించేలా 12 పేజీల ఉపగ్రహ చాయాచిత్రాలను విడుదల చేశారు.

భారత రాజ్యాంగ విధి విధానాల ప్రకారం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్రమంత్రిగా చట్టబద్ధమైన పదవిలో ఉన్న సిద్దు పాక్ చూపించే సాక్ష్యాలకు మాత్రం విలువనిచ్చి, పాకిస్తాన్‌కి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ మన దేశాన్ని నిరంతరం రక్షిస్తున్న మన దళాలను దారుణంగా అవమానిస్తున్నాడు. ఈయనకు మన దళాలు చూపించే సాక్ష్యాలు అవసరం లేదు. పాకిస్తాన్ గత, వర్తమాన చరిత్రలను పరిశీలిస్తే... ప్రత్యేకించి కార్గిల్ యుద్ధమప్పుడు... భారత సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పాక్ సైనికుల మృతదేహాలను... "వాళ్ళెవరూ మావాళ్ళు కాదు" అంటూ తీసుకోవడానికి నిరాకరించింది. అప్పుడు మనదేశమే పాక్ సైనికులకు గౌరవప్రదంగా అంతిమసంస్కారాలు నిర్వహించింది. పాక్ సైనికుల క్రౌర్యానికి మరో ఉదాహరణ ఏమిటంటే, పలుమార్లు వాళ్ళు మన భూభాగంలోకి అడుగుపెట్టి మన జవాన్లను దారుణంగా చంపేశారు. మన జవాన్ల ప్రాణం తీసిన తర్వాత వదిలేయకుండా ఆ భౌతిక కాయాలపై రక్కిన గుర్తులు, ముఖాలు చెక్కేసిన ఆనవాళ్ళు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదికలు స్పష్టం చేశాయి. మానవత్వం అనే పదానికి చోటేలేని పాక్ సైన్యం ఇచ్చే సాక్ష్యాలకు రాష్ట్రమంత్రి హోదాలో ఉన్న సిద్దు ఇస్తున్న విలువ, ప్రకటనలు చూస్తే "కనకపు సింహాసనంబున..." అనే సుమతీ శతకకారుని పద్యం పదే పదే జ్ఞాపకం వస్తోంది.


ఒక పక్క పంజాబ్ రాష్ట్ర యువతరం మాదకద్రవ్యాల బారినపడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఆ రాష్ట్రంలో ఇదిగాక పలు సమస్యలున్నాయి. మంత్రి హోదాలో ఉన్న సిద్దు 24 గంటలూ పని చేసినా తరగనంత పని ఉంది. ఇవన్నీ పక్కనపడేసి "కపిల్ శర్మ షో" అనే ప్రముఖ టీవీ షోకి యాంకర్‌గా పనిచేస్తూ వచ్చాడు. మంత్రిగా ఉన్న సిద్దు ఇలా టీవీ షోలు చెయ్యడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తే... దానికి తాను పారితోషికం తీసుకోవడం లేదని, అది లాభదాయక పదవి కాదని అడ్డగోలుగా వాదించి ఆ షో చేసుకుంటూ వచ్చాడు. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌పై జాలి చూపిస్తూ సిద్దు మొదట చేసిన ప్రకటనతో "కపిల్ శర్మ షో" అనే ప్రముఖ టీవీ షో నుంచి అతన్ని తొలగించారు.

వింగ్ కమాండర్ అభినందన్‌ని పాక్ ప్రభుత్వం భారత్‌కు పంపినప్పుడు ఆయనకు స్వాగతం చెబుతానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వయంగా వాఘా వెళ్ళేందుకు సిద్ధపడ్డారు. అయితే డిఫెన్స్ ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళలేదు. గతంలో భారత సైన్యంలో సేవలందించిన అమరీందర్‌కు మన జవాన్ల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంటే, ఆయన మంత్రివర్గంలో ఉన్న సిద్దు మాత్రం తన ప్రకటనలతో తన రాష్ట్రానికి, దేశానికి కళంకంగా మారాడు. మన దేశ సైన్యంలో విశేష సేవలందించిన పంజాబీ వీరులకు తలవంపులుగా మారాడు.

No comments:

Post a Comment