Thursday, 8 November 2018

మెజారిటీ కావటమే శాపమా?



పెక్యులరిజం-20
- ఎం.వి.ఆర్‌.శాస్త్రి
..................



పావు శతాబ్దం కిందటి మాట. కర్ణాటకలోని మలయాళీలు టీచర్స్‌ ట్రెయినింగుకు ఓ కాలేజి పెట్టాలని ముచ్చటపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం కుదరదు పొమ్మంది. మలయాళీ సొసైటీ కోర్టుకెక్కింది - తమ మైనారిటీ హక్కులకు పుట్టి మునిగిందంటూ.



అలాంటి శిక్షణ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే ఒకటుందండి. ఇంకోటి పెట్టనిస్తే రెండిటి మధ్య అవాంఛనీయమైన పోటీ ఏర్పడి, శిక్షణ ప్రమాణాలు పలచబడవచ్చు కదాండి. అందుకే వద్దన్నాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంది. కర్ణాటక హైకోర్టు కస్సుమంది. కోరుకున్న విద్యా సంస్థను నడుపుకునే హక్కు మైనారిటీలకు ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును అడ్డుకోవటానికి మీరెవరు? అని ముక్క చివాట్లు పెట్టి పర్మిషన్‌ ఇప్పించింది.

గుజరాత్‌లోనూ ఒక టీచర్స్‌ ట్రెయినింగ్‌ కాలేజి ఉంది. దాన్ని నడిపేది క్రిస్టియన్‌ మైనారిటీ. అందులో 80 శాతం సీట్లను మేము చెప్పిన వాళ్లకు కేటాయించండి అని గుజరాత్‌ ప్రభుత్వం అడిగింది. యాజమాన్యం ఒప్పుకోలేదు. కాలేజికి ఇచ్చే ఎయిడ్‌ని ప్రభుత్వం నిలిపేసింది. క్రిస్టియన్‌ సొసైటీ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ప్రజా ప్రయోజనం, జాతీయ ప్రయోజనం అని చెప్పి మైనారిటీ విద్యాసంస్థ ప్రయోజనాన్ని దెబ్బతీయటానికి వీల్లేదు. మైనారిటీల ప్రాథమిక హక్కా? మజాకా? అని ప్రభుత్వాన్ని తిట్టి , ఆపేసిన ఎయిడ్‌ను సుప్రీంకోర్టు మళ్లీ ఇప్పించింది. (సిద్ధరాజ్‌ భాయ్‌ సభాయ్‌ కేసు 1963 AIR 540).

అదీ 30వ అధికరణం పవరు. అందులో మైనారిటీలకు ఇచ్చింది తిరుగులేని ప్రాథమిక హక్కు. శాసనాలు చేసే లెజిస్లేటివ్‌ పవరు అయినా దానికి తల ఒగ్గవలసిందేనని ఇంకో సందర్భంలో సుప్రీంకోర్టే చెప్పింది. అంతటి రాజ్యాంగ రక్ష ఉన్నది కాబట్టి మైనారిటీలకు చెందిన విద్యాసంస్థల తెరువు పోవటానికి సర్కారువారు భయపడతారు. తమ హద్దుల్లో తాముంటారు.

విద్యాసంస్థల్లో వెనకబడిన కులాలు వగైరా బలహీనవర్గాల రిజర్వేషన్లకు రాజ్యాంగం వరమిచ్చింది. కాని అది మైనారిటీ విద్యాసంస్థలకు వర్తించదు. నడిపేవాళ్లు మైనారిటీ అయితే వారు విద్యాసంస్థల్లో ఏ రిజర్వేషన్లూ పాటించనక్కర లేదు.

ప్రభుత్వ ఎయిడ్‌ తీసుకునే ఏ విద్యాసంస్థలోనూ మతం, కులం, భాష కారణంగా ఎవరికీ ప్రవేశం నిరాకరించరాదని 29(2) రాజ్యాంగ అధికరణం చెబుతుంది. 6 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా, కంపల్సరీగా విద్య నేర్పించాలని వాజపేయి ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సవరణ ద్వారా చొప్పించిన '21ఎ' అధికరణం నిర్దేశిస్తుంది. ఈ విద్యా హక్కుకు శాసన రూపం ఇస్తూ యు.పి.ఎ. సర్కారు Right to Education (RTE) చట్టం తెచ్చింది. ఆ చట్టం దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకూ చచ్చినట్టు వర్తిస్తుంది.

- ఒక్క మైనారిటీ విద్యాసంస్థలకు తప్ప.

కుల, మతాల కారణంగా విద్యాసంస్థల్లో ఎవరికీ ప్రవేశం నిరాకరించరాదని 29(2) అధికరణం స్పష్టంగా కట్టడి చేసినప్పుడు, పిల్లలకి నిర్బంధ, ఉచిత విద్య చెప్పించాలని 21 'ఎ' అధికరణం అంటున్నప్పుడు - వీటికి విరుద్ధంగా విద్యాహక్కు చట్టంలో మైనారిటీ స్కూళ్లకు మినహాయింపు ఇస్తే గొడవ అవుతుంది. లీగల్‌ చిక్కులూ వస్తాయి. కాబట్టి మైనారిటీలకి రక్ష, మెజారిటీపై కక్ష - వ్రతంగా పెట్టుకున్న సోనియమ్మ తల్లి గారి  బినామీ సర్కారు రాజ్యాంగ రక్షణను వమ్ము చేయడానికి పనిగట్టుకొని ఒక దిక్కుమాలిన రాజ్యాంగ సవరణ తెచ్చింది. 'మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం కారణంగా ఎవరిపట్ల వివక్ష కూడదు' అని ప్రకటించే రాజ్యాంగం 15వ అధికరణంలో 5వ నెంబరు క్లాజును అడ్డగోలుగా చొప్పించింది. ఇదిగో ఇలా :

"Nothing in this article shall prevent the state from making any special provision, by law, for the advancement of any socially and economically backward classes of citizens or for the scheduled castes or the Scheduled Tribes in so far as such provisions relate to their admission to educational institutions, whether aided or unaided by the state, other than the minority educational institutions referred to in clause (1) of Article 30"

(సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులకు, షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన పౌరుల అభివృద్ధి నిమిత్తం -

ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ విద్యా సంస్థలు సహా -

30 (1) అధికరణంలో పేర్కొన్న మైనారిటీ విద్యాసంస్థలు మినహా అన్ని విద్యా సంస్థలలోనూ -

అట్టివారి ప్రవేశానికి సంబంధించి చట్టరీత్యా ఎలాంటి ప్రత్యేక ఏర్పాటును ప్రభుత్వం చేయడానికైనా ఈ అధికరణంలో పేర్కొన్నదేదీ అడ్డురాదు.)

బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన విద్యాహక్కును కూడా తుంగలో తోక్కేందుకు ఈ 93వ రాజ్యాంగ సవరణ మైనారిటీల విద్యా సంస్థలకు వాటమైన అవకాశం ఇచ్చింది.



నిరక్షరాస్యత దేశం చిరకాలంగా ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. దాన్ని ఒక దారికి తెచ్చేందుకు సాంఘికంగా, ఆర్థికంగా వెనకబడిన అట్టడుగు వర్గాల పిల్లలకి ప్రభుత్వమే తన ఖర్చుతో నిర్బంధంగా విద్య నేర్పించాలన్నది ప్రశస్తమైన యోజన. ప్రభుత్వమే అందరికీ సరిపడా పాఠశాలలను కట్టించటం కష్టం కాబట్టి ఇప్పటికే నడుస్తున్న ప్రైవేటు స్కూళ్లలోనూ చదువుకునే అవకాశం అలాంటి పిల్లలకి కల్పించటం మంచిపని. అందుకయ్యే వ్యయాన్ని ఎలాగూ ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థల వారికి నష్టం లేదు. జాతి శ్రేయస్సు దృష్ట్యా ఒక అతిముఖ్య బృహత్కార్యంలో ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ అనే తేడా లేకుండా అన్ని ప్రైవేటు స్కూళ్లనూ కంపల్సరీగా ఇన్వాల్వు చేసినప్పుడు, మైనారిటీ స్కూళ్లకు మాత్రం ఆ బాధ్యత నుంచి మినహాయింపు ఇవ్వడంలో అర్థం లేదు. మైనారిటీ విద్యాసంస్థలలో మైనారిటీలు కాని పిల్లలనూ చేర్చుకోవడానికి సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వెసులుబాటు కల్పించింది. మైనారిటీలు కాని విద్యార్థులకు విచ్చలవిడిగా సీట్లు ఎలాగూ అమ్ముకుంటూనే ఉన్నారు. హిందువులు నడిపేస్కూళ్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎయిడూ పొందకపోయినా సరే ప్రభుత్వం చెప్పిన ప్రకారం బడుగు, బలహీన వర్గాల వారికి, సర్కారు నిర్ణయించే ధర్మ రుసుమును మాత్రం తీసుకుని చదువు చెప్పాల్సిందే అన్నప్పుడు- అదే రూలు మైనారిటీలు నడిపే స్కూళ్లకు మాత్రం ఎందుకు వర్తించకూడదు?

దానికి జవాబు సుప్రీంకోర్టు చెప్పింది వినండి :

"The minority character of the minority educational institutions may be affected by admissions of socially and educationally backward classes or the Scheduled Castes and the Scheduled Tribes, and it is for this reason that minority institutions, aided or unaided are kept outside the enabling power of the state under clause (5) of Article 15 with a view to protect the minority institutions from a law made by the majority.. This court has repeatedly held that the state has no power to interfere with the administration of minority institutions and has no power to force admission of students from amongst non-minority communities".
[Pramati Case, 2014, https://indiankanoon.org/doc/32468867/]

(సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలవారికి అడ్మిషన్లు ఇవ్వడం వల్ల మైనారిటీ విద్యా సంస్థల యొక్క మైనారిటీ శీలం దెబ్బతినవచ్చు. మెజారిటీ చేసే శాసనాల నుంచి మైనారిటీని రక్షించటానికి 15వ అధికరణం 5వ క్లాజు ప్రభుత్వ అధికారం నుంచి ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ మైనారిటీ విద్యాసంస్థలకు ఈ కారణం చేతే మినహాయింపు ఇచ్చింది. మైనారిటీ సంస్థ నిర్వహణలో జోక్యం చేసుకునే అధికారం, నాన్‌ మైనారిటీ వర్గాల విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని బలవంతం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు అని ఈ న్యాయస్థానం పదేపదే ప్రకటించింది.)

ఇదెక్కడి న్యాయం?

పార్లమెంటు చేసే ఏ చట్టమైనా మెజారిటీ సభ్యుల ఆమోదంతోనే శాసన రూపం దాల్చుతుంది. మెజారిటీ సభ్యులు సహజంగా మెజారిటీ (లేక నాన్‌ మైనారిటీ) వర్గాలకు చెందినవారే అయి ఉంటారు. "Law made by majority" (మెజారిటీ చేసిన లా నుంచి) మైనారిటీ సంస్థలను రక్షించటానికే 15(5) అధికరణం ఉన్నదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు అన్నమాటకు అర్థమేమిటి? దీన్నిబట్టి సర్వసత్తాకమైన పార్లమెంటు చేసే శాసనాలకు కూడా అతీతమైన మహా ప్రత్యేక రాజ్యాంగ రక్షణకవచం మైనారిటీలకు తొడగబడిందని మనం అనుకోవాలా? నూటికి 80 మంది దేశవాసులకు ప్రాతినిధ్యం వహించే మతంకంటే.. మెజారిటీ ప్రజలకు వర్తించే చట్టాలకంటే.. మైనారిటీలు, మైనారిటీ విద్యా సంస్థలు ఎక్కువా?

మెజారిటీ వర్గంతో సమానంగా మైనారిటీలకూ తమ మతం, భాష, సంస్కృతి కాపాడుకోవటానికి, విద్యాసంస్థల్లో ప్రవేశానికి, కోరిన విద్యాసంస్థలను పెట్టుకోవటానికి సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉండాలన్న పెద్ద మనసుతో రాజ్యాంగ కర్తలు 29, 30 అధికరణాలను పెట్టారు. వాటివెనుక ఉద్దేశాన్ని విస్మరించి, వాటిలో కనపడే 'మైనారిటీ' ప్రస్తావనలను భూతద్దంలో చూసి, వాటి ప్రాముఖ్యాన్ని అతిగా ఊహించుకుని న్యాయస్థానాలు విపరీతార్థాలు తీయటం అనవసరపు అనర్థాలకు ముఖ్యకారణం. ప్రజా ప్రయోజనాల కన్నా, జాతీయ ప్రయోజనాల కన్నా మైనారిటీ సంస్థల ప్రయోజనాలు మిన్న - అని అర్థ శతాబ్దం కింద ప్రకటించిన సిధాజ్‌భాయ్‌ సభాయ్‌ కేసు (1963 AIR 540) భలే తీర్పును ఇంతకు ముందు చూశాం. మైనారిటీలకు ఎక్కడాలేని, ఎవరూ ఊహించని స్పెషల్‌ కాటగిరీ రాజ్యాంగ ప్రతిపత్తిని ఆపాదించిన 2014 ప్రమతి ఎడ్యుకేషనల్‌ ట్రస్టు కేసులో పైన ఉటంకించిన తీర్పూ ఆ కోవలోదే.

మనం ఎంచుకున్నదీ, అనుసరిస్తున్నదీ మైనారిటీస్వామ్యం కాదు - ప్రజాస్వామ్యం! ఏదైనా మెజారిటీ ఇష్టాన్ని బట్టే జరగాలన్నది ప్రజాస్వామ్య మూల సూత్రం. మెజారిటీకి లేని హక్కు ఏదీ మైనారిటీకి ఉండటానికి వీలేలేదు. మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవటమైనా.. కోరుకున్న విద్య నేర్వడమైనా.. ప్రభుత్వ అనుచిత జోక్యం లేకుండా విద్యాసంస్థలను నడుపుకోవటమైనా మెజారిటీ, మైనారిటీ తేడా లేకుండా అన్నివర్గాల ప్రజల న్యాయమైన హక్కు. మైనారిటీలకు అది ఉంటుందని నొక్కి చెప్పటానికి రాజ్యాంగంలో వాడిన పదాలకు కోర్టులు పెడ అర్థం తీసి మైనారిటీలకు మాత్రమే ఆయా హక్కులు ఉంటాయని, మెజారిటీ సంగతి వాచ్యంగా పేర్కొనలేదు కనుక మెజారిటీకి ఆ హక్కులు వర్తించవని చెప్పటంతో నానా గత్తర అయింది. గవర్నమెంటు పెట్టే అడ్డమైన ఆంక్షలనుంచి, సవాలక్ష సతాయింపుల నుంచి తప్పించుకోవాలంటే 'మైనారిటీ గుర్తింపు'ను ఎలాగైనా పొందటం ఒకటే మార్గమన్న దురభిప్రాయం ప్రబలింది.

మెజారిటీ వర్గపు విద్యాసంస్థల్లో మైనారిటీలను చేరనివ్వరేమో.. దానివల్ల మైనారిటీలు చదువులో వెనకబడతారేమోనని అతిగా భయపడి మైనారిటీలకు సొంతంగా విద్యాసంస్థలు నడుపుకునే హక్కును రాజ్యాంగంలో చేర్చారు. చాలా బాగుంది. కాని మైనారిటీల కోసం ఉద్దేశించిన స్కూళ్లలో మైనారిటీల పిల్లలే చదువుకోవాలి కదా? వారి మతాన్ని, సంస్కృతిని పెంపొందించే రీతిలోనే వాటిలో నేర్పే చదువులు ఉండాలి కదా? మెజారిటీ వర్గాల పిల్లలని కూడా  ఇష్టమొచ్చినట్టు చేర్చుకోవచ్చు అన్నప్పుడు అని మైనారిటీ విద్యాసంస్థ ఎలా అవుతుంది? అన్ని స్కూళ్లలో నేర్పే సెక్యులర్‌ చదువే అక్కడా చెప్పేటప్పుడు దానిని మైనారిటీ విద్య అని ఎలా అనగలం? నడిపేవాడు మైనారిటీ అయితే చాలు, పిల్లలందరూ మెజారిటీ అయినా సరే అది మైనారిటీ విద్యాసంస్థ అయిపోతుందా?

'ఔను' అనే అంటాయి మన కోర్టులూ, గవర్నమెంట్లు! దాంతో ఈ దేశంలో మైనారిటీలుగా పుట్టే భాగ్యం పట్టని దురదృష్టవంతులు షార్ట్‌కట్లు వెతకసాగారు. అవసరార్థం ఒక మైనారిటీ సొసైటీని సృష్టించి, లేక ఒక మైనారిటీని బినామిగా పెట్టి విద్యాసంస్థను నడిపి, ప్రభుత్వపు అత్తపెత్తనపు కత్తిని 'మైనారిటీ' డాలుతో కాచుకోవటం విద్యారంగంలో పరిపాటి అయింది. విద్యాహక్కు చట్టంకింద బలహీనవర్గాల బికారి పిల్లలను చేర్చుకోకుండా తప్పించుకోవటానికీ 'మైనారిటీ' టాగ్‌ పనికొస్తున్నది. బడుగువర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన శాసనం మైనారిటీ విద్యాసంస్థల్లో చెల్లుబాటు కావటంతో విద్యాహక్కు దిక్కుమాలిన వివక్షకు లోనైంది .

అంతేకాదు . మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవటానికి మైనారిటీ ప్రతిపత్తి వాటంగా ఉపకరిస్తుంది అని తేలిపోవడంతో ఎక్కడెక్కడి వారూ ఆ ప్రతిపత్తి కోసం ఆరాటపడసాగారు. ఏ ఆదరణకూ నోచుకోని హిందూమతంలో భాగమని చెప్పుకోవడం తమకు నామోషీగా అనేక వర్గాలు భావించసాగాయి. అన్ని రకాల వివక్షలకూ టార్గెట్‌ అయిన హిందూ మతం నుంచి వేరుపడి, అన్ని హక్కులూ తెచ్చిపెట్టే మైనారిటీ గుర్తింపును ఏదో ఒకరకంగా సాధించాలన్న తపన పెరిగింది.

వివేకానందుడంతటి జగదేక హైందవ వీరుడు స్థాపించిన రామకృష్ణ మిషనే హిందూమతంతో తెగతెంపులు చేసుకుని, తనది వేరే మైనారిటీ మతమని ఆఫ్టరాల్‌ ఒక కాలేజిని నిలుపుకోవటం కోసం అడ్డదారి పట్టిన వైనాన్ని ఇంతకు ముందు చూశాం. వివేకానందుడి కంటే పూర్వం, ఆయనకంటే చండప్రచండంగా పోరాడి, సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టిన ఆధునిక ఋషి దయానంద సరస్వతి స్వామి స్థాపించిన ఆర్యసమాజ్‌ సైతం ఇదేరకమైన దౌర్బల్యానికి, అవకాశవాదానికి లోనవటం ఇంకో పెద్ద విషాదం.

స్వామి దయానంద సరస్వతి స్మారకార్థం ఆర్యసమాజ్‌ దేశంలోని పలు ప్రాంతాల్లో స్థాపించిన దయానంద ఆంగ్లో వేదిక్ (డి.ఎ.వి.) విద్యా సంస్థలకు పంజాబ్‌ యూనివర్సిటీ, గురునానక్‌ యూనివర్సిటీలలో కాలేజిల అఫీలియేషను, బోధనాభాష, పరీక్షల నిర్వహణలకు సంబంధించి అర్ధశతాబ్దం కింద గొడవలొచ్చాయి. ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం తమది హిందూ మతంతో సంబంధం లేని మైనారిటీ మతమని, కాబట్టి 30(1) అధికరణం రక్షణ తమకూ వర్తిస్తుందని చెబుతూ డి.ఎ.వి. కాలేజి ట్రస్టు ఏకంగా 15 రిట్లు వేసింది. వాటిమీద 1971 మే 5న ఇచ్చిన రెండు వేరు వేరు (1971 AIR 1731, 1971 AIR 1737) తీర్పుల్లో ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగమైన రిలిజియస్‌ డినామినేషనే తప్ప వేరే మతం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. (పంజాబ్‌ రాష్ట్రంలో మొత్తంగా హిందువులు మైనారిటీ అయినందువల్ల, హిందూ మతానికి చెందిన శాఖగా ఆర్య సమాజానికీ 30(1) రక్షణ వర్తిస్తుందని కోర్టు అంగీకరించడంతో వేరేమతం వాదం వీగిపోయినా డి.ఎ.వి. కాలేజిలకు ఉపశమనం దొరికింది.)

పంజాబ్‌లో హిందువులు మైనారిటీ కాబట్టి ఆ పద్దు కింద జలంధర్‌, భటిండాలలోని డి.ఎ.వి. కాలేజిలకు 30(1) మేలు జరిగింది సరే. కాని హిందువులు మెజారిటీ అయిన మిగతా రాష్ట్రాల మాటేమిటి? అక్కడా 30(1) అధికరణం కింద విద్యాసంస్థలు నిశ్చితంగా నడుపుకోవాలంటే మైనారిటీ బిళ్ల తప్పనిసరి. దానికో సం ఢిల్లీలోని ఆర్యసమాజ్‌ ట్రస్టు 1975లో తమది మైనారిటీ మతంగా గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ఆర్యసమాజ్‌ హిందూ మతంలో భాగమే తప్ప వేరే మతం కాదని, మైనారిటీ మతమన్న గుర్తింపు దానికి రాదని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. (AIR 1976 Delhi 207). ఈ సందర్భంలో  ఢిల్లీ హైకోర్టు ఒక మంచి మాట చెప్పింది. ఏమనంటే -

"There are so many classes and sections among Hindus with varieties of religions opinions. If each of them were to constitute a minority under Article 30(1) the Hindus would not remain a majority at all but would consist of numerous religious minorities".

(మత విషయంలో రకరకాల అభిప్రాయాలు కలిగిన వర్గాలు, తరగతులు హిందువులలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటీ 30(1) అధికరణం కింద మైనారిటీగా ఏర్పడే పక్షంలో హిందువులు అసలు మెజారిటీగా మిగలరు. అసంఖ్యాకమైన మత మైనారిటీలుగా విడిపోతారు.)

ఆ ఇంగితజ్ఞానమే మనలనేలే రాజకీయ క్షుద్రజీవులకు కొరవడింది. తమ రాజకీయ స్వార్థంకోసం హిందూసమాజంలో చీలికలు ప్రోత్సహించి, మైనారిటీ ఎరలను పలుకుబడిగల కొన్ని వర్గాలకు విసరటం వారికి ఎప్పటినుంచో అలవాటుగా మారింది. 1927లో హిందూ రిలిజియస్ ,  ఎండోమెంట్సు బిల్లును మద్రాసు అసెంబ్లీలో పెట్టారో లేదో తమను స్వతంత్ర కమ్యూనిటీలుగా గుర్తించాలంటూ కెనరా, మలబార్‌ ప్రాంతాలలోని హిందూ వర్గాల నుంచి వేర్పాటు రాగాలు మొదలయ్యాయి. కొద్దినెలల కింద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలన్న యావతో కాంగ్రెసు ప్రభుత్వం లింగాయతులను మైనారిటీగా గుర్తిస్తూ హిందూ సమాజంలో చిచ్చుపెట్టింది.

రామకృష్ణ మిషన్ ,ఆర్యసమాజ్ ,   బ్రహ్మ సమాజ్ , స్వామి నారాయణ్‌  వంటి హిందూ మతశాఖలు  మైనారిటీ ముద్రను లంకించుకోవాలని తహతహలాడుతూ కోర్టు తలుపులు తడుతున్నాయంటే దానికి కారణం హిందూమతం మీద ద్వేషం కాదు; హిందువులమని చెప్పుకోవడానికి సిగ్గుపడీ కాదు. అస్తమానం దిక్కుమాలిన రూల్సు రెగ్యులేషన్లతో సతాయించే ప్రభుత్వపు పీడ నుంచి తప్పించుకోవడానికి అంతకంటే దారిలేక! మైనారిటీ రక్షా కవచం ఉంటేగాని స్థిమితం ఉండని దౌర్భాగ్యపు దురవస్థను మన సంకర సెక్యులర్‌ అవ్యవస్థ తెచ్చిపెట్టటం వల్ల!!

No comments:

Post a Comment