పెక్యులరిజం - 19
ఎం.వి.ఆర్.శాస్త్రి
............
రాజ్యాంగ రక్షరేకు మైనారిటీలకే తప్ప మెజారిటీకి లేదు. కాబట్టి హిందువులు నడిపే స్కూళ్లూ, కాలేజీల మీద గవర్నమెంటు ఒంటికాలిపై లేస్తుంది. సంస్థ దైనందిన నిర్వహణ, చదువులు, సిలబసు, నియామకాలు వగైరాల్లో అడ్డమైన ఆంక్షలు. ఒకేరకమైన చట్టాలకు లోబడి ఒకే లాంటి చదువు చెప్పే విద్యాసంస్థల్లో మైనారిటీల ప్రాప్తం ఒకలాగ; హిందువుల కర్మం ఒకలాగ!!
ఈ అన్యాయాన్ని ఎవరు ప్రతిఘటించాలి? వివక్షకు లోనవుతున్నవాళ్లు. అది అంత తేలిక కాదు. ఎందుకంటే అన్యాయం జరిగింది రాజ్యాంగంలో. దానిని సరిచేసి, మైనారిటీలకున్న హక్కులను మెజారిటికీ వర్తింపజేస్తేగాని వివక్ష పోదు. దానికి జాతీయ స్థాయిలో పెద్ద కదలిక తేవాలి. ఆ పని దేశమంతటా విస్తృతమైన నెట్‌వర్కు, ప్రజల్లో మంచిపేరు ఉండి విద్యారంగంలో అనేక సంస్థలను నడుపుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థలకు మాత్రమే సాధ్యం.
అటువంటి జాతీయ మహా సంస్థలు హిందూ సమాజంలో ఏమున్నాయి అని ఆలోచిస్తే స్ఫురించే మొట్టమొదటి పేరు రామకృష్ణ మిషన్! అది ప్రధానంగా సేవా సంస్థ అయినా అనేక విద్యాసంస్థలనూ నడుపుతున్నది. వాటి నిర్వహణలో ప్రభుత్వాల నుంచి, అధికార గణాల నుంచి రకరకాల ఒత్తిళ్లను అది కూడా ఎదుర్కొంటున్నది. నాలుగు దశాబ్దాల కింద హిందూ మతాన్ని ద్వేషించే కమ్యూనిస్టు జమానాలో తన ప్రధాన కేంద్రం ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రామకృష్ణ మిషన్‌కు పెద్ద చికాకే కలిగింది.
వివేకానంద శతజ యంతి సందర్భాన బెంగాల్‌లోని రహరాలో 1962లో ఆయన పేరిట వివేకానంద సెంటినరీ కాలేజి వెలసింది. దాన్ని కట్టింది రామకృష్ణ మిషన్ స్థలంలో. కళాశాల నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అడిగిమరీ నిధులిచ్చినవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కాలేజి మిషన్ యాజమాన్యంలో నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. గవర్నింగ్ బోర్డూ ప్రభుత్వ ఆమోదంతో ఏర్పాటైంది. మిషన్ ఆధ్వర్యంలో ఇలా కాలేజిని పెట్టించాం, దానికి అవసరమైన అనుమతి ఇవ్వండి అని కోల్‌కతా యూనివర్సిటీకి రాసి, గుర్తింపు తెప్పించిందీ రాష్ట్ర విద్యాశాఖే.
సాధారణంగా ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేటు కళాశాలల గవర్నింగు బోర్డులన్నీ ఒకే మాదిరిగా ఉండాలని రాష్ట్ర విద్యాచట్టం చెబుతుంది. అయితే ఆ నియమం నుంచి క్రైస్తవ మిషనరీ, రామకృష్ణ మిషన్ వంటి కొన్ని సంస్థల కాలేజీలకు చట్టంలోనే మినహాయింపు ఇచ్చారు. మిగతా స్పాన్సర్డ్ కాలేజిలకు భిన్నంగా సొంత గవర్నింగు బోర్డు ఉండటానికి 1978 ఏప్రిల్ నాటి విద్యాశాఖ ఉత్తర్వు కూడా రామకృష్ణ మిషన్ కాలేజిని అనుమతించింది.
ఇలా కొంతకాలం సాఫీగా నడిచాక 1980లో గొడవ మొదలైంది. కాలేజి ప్రిన్సిపాల్ తప్పుకున్నాడు. ఆయన స్థానంలో బేలూరు మఠానికి చెందిన స్వామి శివమయానందను యాజమాన్యం నియమించింది. దానిని కాలేజి టీచర్ల కమ్యూనిస్టు సంఘం ప్రతిఘటించింది. టీచర్లు సమ్మెకట్టి కొత్త ప్రిన్సిపాల్‌ను పనిచేయనివ్వలేదు. కాలేజిని దౌర్జన్యంగా తమ చేతుల్లోకి తీసుకొని తమలో ఒక ప్రొఫెసరును ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా తామే నియమించారు. నడమంత్రపు పెత్తనాన్ని రద్దు చేసి, యథాపూర్వస్థితిని పునరుద్ధరించాలంటూ కాలేజి యజమాన్యం కోర్టుకెళ్లింది.
టీచర్ల సంఘం దీనికి పైఎత్తు వేసింది. మిగతా స్పాన్సర్డ్ కాలేజిల మాదిరిగా మా కాలేజి గవర్నింగ్ బోర్డునూ మార్పించండి; రాష్ట్ర విద్యాచట్టం మా కాలేజీకీ వర్తిస్తుందని ప్రకటించండి; కొత్త ప్రిన్సిపాల్ నియామకం రద్దు చేయండి అని అడుగుతూ కోల్‌కతా హైకోర్టులో ఉపాధ్యాయులు రిట్లు వేశారు. అదే సమయంలో నరేంద్రపూర్, హౌరాల్లో మిషన్ వారి మరో మూడు విద్యాసంస్థల గవర్నింగ్ బోర్డులను కూడా పునర్వ్యవస్థీకరించాలంటూ కోల్‌కతా యూనివర్సిటీ నోటీసులిచ్చింది. టీచర్ల యూనియన్ దూకుడు, ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు సతాయింపు, అదే సమయాన యూనివర్సిటీ పనిగట్టుకుని, వెంటపడ్డ తీరు చూస్తే లెఫ్ట్ ఫ్రంటు కామ్రేడ్లు, వారి చేతిలోని అధికారగణం పథకం ప్రకారం రామకృష్ణ మిషన్‌ను వేధిస్తున్నదని సామాన్యులకు సైతం అర్థమైంది. క్రిస్టియన్ మిషన్ల లాగే రామకృష్ణ మిషన్ కాలేజికి రాష్ట్ర విద్యా చట్టంలో మినహాయింపు ఇచ్చినందువల్ల మిగతా కాలేజిలలో వలె గవర్నింగు బోర్డులో టీచర్లకు ప్రాముఖ్యం లేకుండా పోయింది. యాజమాన్యం కరాఖండిగా ఉండటం వల్ల ట్రేడ్ యూనియన్లూ, కమ్యూనిస్టు లీడర్ల ఆటలూ సాగడం లేదు. ఈ అక్కసుతో మిషన్ నడుపుతున్న మిగతా విద్యాసంస్థల లోనూ మెల్లిగా గొడవలు మొదలెట్టారు.
ఇదీ 1980లో రామకృష్ణ మిషన్‌కు వచ్చిపడ్డ సమస్య. పశ్చిమబెంగాల్‌లో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో విషయం తీవ్రమైనదే. సందేహం లేదు. కాని మిషన్‌కి అది జీవన్మరణ సమస్య ఏమీ కాదు. యాజమాన్యం చట్టపరంగా ఏ తప్పూ చేయలేదు. ఏ నిబంధననూ ఉల్లంఘించలేదు. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులలో కూడా రామకృష్ణ మిషన్‌కి మినహాయింపు ఇచ్చినట్టు స్పష్టంగా ఉంది. న్యాయం తన పక్షాన ఉన్నప్పుడు ఏ సంస్థా భయపడాల్సిన పనిలేదు. గొప్ప చరిత్ర, ప్రజల్లో ప్రతిష్ఠ ఉన్న రామకృష్ణ మఠానికి అలాంటి అగత్యం అసలే లేదు. న్యాయమైన తన హక్కులను నిలబెట్టుకోవటానికి చట్టపరంగా సంస్థకు అనేక అవకాశాలున్నాయి.
ఇది కేవలం ఒక రామకృష్ణ మిషన్‌కే దాపురించిన కష్టం కాదు. మైనారిటీల వలె ప్రత్యేక రక్షణకు నోచుకోని హిందువులకు చెందిన విద్యాసంస్థలన్నీ సర్కారీ జులుం మూలంగా ఏదో ఒక రీతిలో పడుతున్న అవస్థే అది. తనకే అది అనుభవమైనప్పుడు రామకృష్ణ మిషన్ సవాలును ధైర్యంగా స్వీకరించి, వివేకానందుడి తరహాలో అన్నిటికీ తెగించి దృఢంగా నిలబడి ఉంటే కాస్త ఆలస్యంగా అయినా న్యాయం జరిగేది. దానివల్ల మొత్తం హిందూసమాజానికి మేలు జరిగేది. ఒకవేళ ఓడిపోయినా మహా అయితే ఒక కాలేజిమీద ఆ సంస్థకు కంట్రోలు పోయేది. అనేక రాష్ట్రాల్లో ఎన్నో సంస్థలను నడుపుతున్న మహా వ్యవస్థకు ఆ నష్టం ఒక లెక్కలోనిది కాదు.
మరి రామకృష్ణ మిషన్ ఏమిచేసింది? సవాలును ఎంత ధైర్యంగా స్వీకరించింది?
చెప్పుకుంటే సిగ్గుచేటు. సింహంలాంటి వివేకానందుడు స్థాపించిన మహాసంస్థను నమ్మశక్యం కాని నైతిక దౌర్బల్యం ఆవహించింది. ఒత్తిళ్లను, ఆరళ్లను నియమబద్ధంగా ప్రతిఘటించలేదు సరికదా - వాటి నుంచి తప్పించుకు నేందుకు మైనారిటీ రక్షరేకు కోసం రామకృష్ణమఠం వెంపర్లాడింది. ఆ దిక్కుమాలిన గుర్తింపుకోసం అసలు తాము హిందువులమే కామని, తమది వేరే మైనారిటీ మతమని జంకు లేకుండా బుకాయించింది.
కోల్‌కతా హైకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిటులోనూ, రాతపూర్వక వాదనల్లోనూ రామకృష్ణ మిషన్‌వారు ఒట్టేసి చెప్పిందేమిటంటే -
వారిది రామకృష్ణ మతమట. 'ఠాకూర్ శ్రీరామకృష్ణ పరమహంస దేవ' ఇస్లాం సహా వివిధ మతాలను సాధన చేసి, వాటి వెనుక మూల సత్యాన్ని కనుగొని ఈ కొత్త మతాన్ని స్థాపించాడట. దానికీ, హిందూ మతానికీ బొత్తిగా సంబంధం లేదట. దానికి దేవుడు వేరు; వ్యవస్థ వేరు; పూజా విధానం వేరు; ఫిలాసఫీ కూడా వేరు -ట! ఈ విశ్వమతాన్ని అనుస రించే వారిలో హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, ఇంకా ఇతర మతాల వాళ్లు ఉన్నారట. హిందువుల తాత్వికత, బౌద్ధుల కరుణ, మహమ్మ దీయుల సోదరతత్వం కలగలిపి మనం ఒక విశ్వమతాన్ని (Universal Religion) మొదలెడుతున్నాం అని - దీని స్థాపకుడైన వివేకానంద స్వామి చెప్పాడట !
ఈ అడ్డగోలు వాదనే విడ్డూరం. అంతకంటే ఆశ్చర్యం కొల్‌కత్తా హైకోర్టు దీనిని ఆమోదించటం! ఔను నిజమే! వీరు చెబుతున్నట్టు వీరిది వేరే మతం. కాబట్టి భారత రాజ్యాంగం 30వ అధికరణం విద్యా సంస్థల విషయంలో మైనారిటీలకి ఇచ్చిన హక్కులు రామకృష్ణ మిషన్ వారికి కూడా వర్తించును - అని సింగిల్ జడ్జిగారు 1981లో తీర్పు చెప్పారు. మఠం వారికి కోరుకున్న పని అయిపోయింది. గండం గడిచింది.
అక్కడితో కథ అయిపోలేదు. ఎగస్పార్టీ వాళ్లు సింగిల్ జడ్జి తీర్పు మీద డివిజన్ బెంచికి అపీలు చేశారు. పై బెంచి ముందూ మఠం వారు పాతపాటే పాడారు. డివిజన్ బెంచి విని ఊరుకోలేదు. విచారణ సందర్భంలో ఒక సూటి ప్రశ్న వేసింది :
'మీరేమో మీ మతం స్థాపించింది వివేకానందుడని అంటున్నారు. ఆయనేమో తనది హిందూ మతం అని గర్వంగా చాటాడు. ఈ రెండిటికీ ఎలా పొసుగుతుంది?'
దానికి మఠం వారు తడబడకుండా భలే జవాబు చెప్పారు-
వివేకానంద స్వామి మొదట హిందూమత ప్రచారకుడేనట. కాని అమెరికా వెళ్లాక, పాశ్చాత్య ఆలోచనతో అక్కడి జీవన విధానంతో పరిచయం పెరిగాక మతము, దాని ప్రాముఖ్యత గురించి ఆయన భావాలలో మార్పు వచ్చిందట. మతాల యొక్క ఐక్యత మీద శ్రద్ధ పెట్టగా పెట్టగా ఆయనకు క్రమేణా 'విశ్వమతం' మీద విశ్వాసం కుదిరిందట. ఆ పళాన ఆయన 'ప్రపంచ మతము'ను ప్రబోధించాడట. Miss Mary Louse Burk అనే ఆవిడ రాసిన 'Swami Vivekananda in the West' గ్రంథం రెండో సంపుటిని చదివితే ఈ దేవరహస్యం అర్థమవుతుందట. 'శ్రీ రామకృష్ణులు బోధించిందే అసలు వస్తువు. అదే హిందూయిజం అని హిందువులను అనుకోనివ్వండి. ఇతరులూ వారి పద్దతిలో దాన్ని పిలుచుకుంటారు' అని కూడా వివేకానందుల వారు చెప్పారటండోయ్!
ఇలా ఎక్కడెక్కడి గ్రంథాల నుంచో ఎవరెవరివో ఉటంకించి, చేంతాడంత వివరణ ఇచ్చేసరికి హైకోర్టు డివిజన్ బెంచికి కూడా జ్ఞానోదయమైంది. 'రామకృష్ణ మతము' యొక్క తత్వం బోధపడింది.
“Thoughts of Ramakrishna and Swami Vivekananda although were based on Vedanta, Writings and Speeches of Swami Vivekananda show that even though he had grown as a preacher of Hindu religion, he converted himself into a preacher of world religion different from Hindu religion, in latter years of his life being influenced by his greater acquaintance with western thought and way of life”.
(శ్రీరామకృష్ణ, స్వామి వివేకానందల ఆలోచనలు వేదాంతం మీద ఆధారపడిన మాట నిజమే. వివేకానందస్వామి హిందూమత ప్రచారకుడిగా పెరిగినప్పటికీ ఆయన రాతలను, ప్రసంగాలను గమనిస్తే హిందూ మత ప్రచారకుడి స్థాయి నుంచి ప్రపంచ మత ప్రబోధకుడుగా ఆయన పరివర్తన చెందినట్టు కనపడుతుంది. అనంతర సంవత్సరాల్లో పాశ్చాత్య ఆలోచన, జీవన విధానంలో పరిచయం పెరిగిన ప్రభావం వల్ల వచ్చిన మార్పు ఇది.)
- అని ప్రకటించి సింగిల్ జడ్జి తీర్పును ధ్రువీకరించి, రామకృష్ణ మతాన్ని ప్రత్యేక మైనారిటీ మతంగా 30వ అధికరణం కింద హైకోర్టు డివిజన్ బెంచి 1985లో నిర్ధారించింది.
దాంతో రామకృష్ణ మఠం పంట పడింది. అక్కర తీరింది. హైకోర్టు ముద్రకొట్టి ఇచ్చిన 'మైనారిటీ' గుర్తింపు ' కవచంతో గవర్నమెంటు సతాయింపును వారు జయప్రదంగా నిరోధించి తమ కాలేజిని తాము నిశ్చింతగా పరిపాలించుకో సాగారు.
సమయానుకూలంగా వైఖరి మార్చి కార్యం సాధించటం రామకృష్ణ మిషన్ వారికి కొత్తకాదు. మునుపు 1969లోనూ తమది వేరే మతమని నమ్మించి బిహార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాగే మైనారిటీ గుర్తింపును గుంభనంగా తెచ్చుకున్నారు. ఇప్పుడూ తమ నిర్వాకం బయటి ప్రపంచానికి పొక్కదనుకున్నారు. కాని హిందూమత పునరుజ్జీవానికి స్ఫూర్తి, చోదకశక్తి అయిన వివేకానందుడి సొంత సంస్థే తనకు హిందూమతంతో సంబంధమే లేదని చెప్పుకోవటమేమిటని, హిందూ సమాజం నిర్ఘాంతపోయింది. ముఫ్ఫై ఏళ్లకిందట దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.
హైందవంతో పేగుబంధం తెంచుకొని, తనమీద హిందూముద్రను చెరిపేసుకోవటానికి రామకృష్ణ మిషన్ ఎన్ని ఆపసోపాలు పడ్డా, చివరికి కథ అడ్డం తిరిగింది. హైకోర్టు డివిజన్ బెంచి తీర్పుమీద కాలేజి టీచర్లు, కోల్‌కతా యూనివర్సిటీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెంటనే అపీలు చేశాయి. తీర్పు రావటానికి షరామామూలుగా పదేళ్లు పట్టింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పక్షాన 1995 జూలై 2న జస్టిస్ వెంకటాచలయ్య వెలువరించిన తీర్పు మఠం వారి కట్టుకథను కొట్టిపారేసింది.
'హిందూమతం మాత్రమే సనాతన ధర్మం. ఎప్పుడూ ఉన్నది, ఎప్పటికీ ఉండేది హిందూమతం ఒక్కటే. ఇతర మతాలేవీ కలకాలం నిలిచేవి కావు' - అని శ్రీరామకృష్ణులు -
'నేను హిందువునని చెప్పుకోవటానికి గర్వపడతాను. ప్రపంచంలోని మతాలన్నిటికి తల్లి అయిన హిందూమతానికి చెందినందుకు గర్విస్తాను' - అని షికాగో విశ్వవేదిక మీద వివేకానందుడు పలికిన దివ్య వాక్కుల వంటివి ఎన్నిటినో ఉటంకించిన మీదట సుప్రీంకోర్టు ఇలా ప్రకటించింది.
It is a travesty of truth to say that Ramakrishna created a religion independent and apart from Hindu religion and called it a universal religion. That Swami Vivekananda changed his views in his latter years , even if true, the same cannot have the effect of Shri Ramakrishna himself bringing up a religion of his own according to the subsequent thinking of Swami Vivekananda. What Vivekananda proclaimed was that it is Vedanta and Hindu religion alone that can become the universal religion of man. The peculiar circumstances which led Ramakrishna Mission to make such claim, to save their college and other educational institutions from being taken away by the state Government...”
[1995 AIR 2089]
(హిందూ మతం నుంచి వేరుగా రామకృష్ణులు స్వతంత్ర మతాన్ని సృష్టించారని చెప్పటం సత్య దూరం. తరువాత సంవత్సరాలలో వివేకానంద స్వామి తన భావాలను మార్చుకున్నారని చెప్పటం ఒకవేళ నిజమే అనుకున్నా, భవిష్య కాలంలో వివేకానందుడి ఆలోచనల ప్రకారం రామకృష్ణులు సొంతంగా ఒక మతాన్ని పెట్టారని చెప్పటం కుదరదు. వేదాంతం, హిందూమతం మాత్రమే ప్రపంచమతం కాదగ్గదన్నదే వివేకానందుడు ప్రకటించిందల్లా! తమ కాలేజిని, ఇతర విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకుపోకుండా కాపాడు కునేందుకే రామకృష్ణ మిషన్ విచిత్ర పరిస్థితుల్లో అలా చెప్పుకోవడాన్ని హైకోర్టు మాన్య న్యాయమూర్తులు సమర్థించి ఉండాల్సింది కాదు).
No comments:
Post a Comment