పెక్యులరిజం - 22
ఎం.వి.ఆర్.శాస్త్రి
........
ఇంటిపేరు సమానత్వం ! ఇల్లంతా అసమానతల దుర్గంధం !! చట్టం ముందు అందరూ సమానులే అని ఘోషిస్తుంది భారత రాజ్యాంగం 14వ అధికరణం.కాని 'ఇండియా దటీజ్ భారత్'లో పౌరులందరూ సమానులు ఎంతమాత్రం కారు.
ఉన్నవి రెండే తరగతులు
1.ఎక్కువ సమానులు 2. తక్కువ సమానులు. ఈ రకం అసమానత ప్రపంచమంతటా ఉన్నదే ననుకోండి.
సంఖ్యాపరంగా బలవంతులైన వాళ్లు ఎక్కువ సమానులు. అల్పసంఖ్యాకులైన బలహీనులు తక్కువ సమానులు. ఇది సాధారణం లోకరీతి. మన విషయం దీనికి పూర్తిగా విరుద్ధం.
జనాభాలో 80 శాతం ఉన్న హిందువులు ఏ ప్రత్యేక హక్కుకూ నోచుకోని తక్కువ సమానులు.
నిండా 20 శాతం లేని అన్యమతస్థులేమో సమస్త ప్రత్యేక హక్కులూ ఉన్న ఎక్కువ సమానులు. మతం కారణంగా ఏ భారత పౌరుడిపట్లా వివక్ష చూపే ముచ్చటే లేదంటుంది 15వ అధికరణం.
కాని వాస్తవానికి ఉన్న వివక్షంతా మతం కారణం గానే. మైనారిటీ అన్న గుర్తింపు ఉంటే చాలు. గవర్నమెంటు పోరు, పీడ లేకుండా గుళ్లూ గట్రా నడుపుకోవచ్చు.
ప్రభుత్వం గొంతు పట్టుకొని నిధులూ, అనుమతులూ రాబట్టి మతపరమైన చదువులు పిల్లలకు చెప్పించవచ్చు.
ఎవరికి లాభసాటి అయిన విద్యాసంస్థను వారు ప్రభుత్వ పెత్తనాల బాధలేకుండా యధేచ్ఛగా పెట్టుకోవచ్చు.
చదువుల్లో, కొలువుల్లో, సంక్షేమ పథకాల్లో సెక్యులర్ సర్కార్ల నుంచి పబ్లిగ్గానో, గుంభనంగానో బోలెడు
ఉపకారాలు పొందవచ్చు. ఈ రకంగా మన నాయకులూ, పార్టీలూ, ప్రభుత్వాలూ బహు కష్టపడి మనదేశాన్ని 'మైనారిటీల స్వర్గం' చేశారు. చాలా బాగుంది. దీనంతటికీ కారణం మైనారిటీల మీద ప్రేమా? మెజారిటీ మతం మీద ద్వేషమా? మైనారిటీల మీద ప్రేమ ధారాళంగా కారి పోతూండటం వల్లే ఈ ప్రత్యేక అవకాశాలు, ప్రత్యేక హక్కులూ
ధారపోశారనుకుంటే- ఆ ప్రత్యేక సౌకర్యాలన్నీ ఏ మతానికి చెందిన మైనారిటీలకైనా సమానంగా సమకూర్చాలి కదా? తమ దేశంలో తాము మైనారిటీలుగా మారే దుర్గతి కలలోకూడా పట్టకూడదనే ఏ హిందువైనా కోరుకుంటాడు.
కాని అడ్డూ అదుపూ లేకుండా చిరకాలంగా సాగుతున్న అడ్డగోలు మతాంతరీకరణల వల్ల, ఇంకా ఇతర కారణాల
వల్ల ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో హిందువుల సంఖ్య దారుణంగా పడిపోయింది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఆ రాష్ట్రాల్లో హిందువుల శాతం ఇదిగో ఇలా ఉంది :
1. మిజోరం - 2.75% 2. నాగాలాండ్ - 8.75% 3. మేఘాలయ - 11.53% 4. జమ్మూ, కాశ్మీర్ - 28.44% 5. అరుణాచల్‌ప్రదేశ్ - 29.00% 6. మణిపూర్ - 31.39% 7. పంజాబ్ - 38.40% కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లోనైతే హిందువులు కనాకష్టంగా 2.5 శాతం.
మరి ఈ రాష్ట్రాల్లో మైనారిటీలైన హిందువులకు 'మైనారిటీ' అన్న గుర్తింపు ఉందా? రాజ్యాంగపరంగా,
చట్టపరంగా, ప్రభుత్వ పరంగా మిగతా మైనారిటీలు పొందుతున్న ఉపకారాలకూ, ప్రత్యేక హక్కులకూ లేక
రక్షణలకూ ఆ రాష్ట్రాల్లో హిందువులకు అర్హత ఉన్నదా? లేదు. మైనారిటీ అయిన రాష్ట్రాల్లో కూడా హిందువులు మెజారిటీ కిందే లెక్క. జనాభాలో అన్యమతాల వారే
అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో సైతం అన్యమతాల వారు మైనారిటీ కిందే పరిగణన! ఉదాహరణకు మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో మెజారిటీ ప్రజలు క్రైస్తవులు. అయినా చట్టం
దృష్టిలో ఆ రాష్ట్రాల్లో కూడా క్రైస్తవులు పాపం మైనారిటీలే! ఉన్నదంతా వారే! పెత్తనం, అధికారం యావత్తూ
వారిదే! అయినా రాజ్యాంగ రక్షణలు, మైనారిటీ హక్కులు కూడా వారివే. నిండా పదిశాతం లేని హిందువులు
ఆ రాష్ట్రాల్లో సైతం ఏ రక్షణకూ నోచుకోని, ఏ ప్రత్యేక సహాయమూ అవసరం లేని మెజారిటీయే -
మన దిక్కుమాలిన చట్టాల దృష్టిలో. జమ్మూకాశ్మీర్ సంగతి ఇంకా ఘోరం. అక్కడ హిందువులు ఒకప్పుడు బాగా బతికిన వారే.
పావుశతాబ్దం కిందట ముస్లింలు వారి ఇళ్లు తగలబెట్టి, ఊచకోత కోసి, దారుణంగా హింసించి కాశ్మీర్‌లోయ
నుంచి లక్షల మందిని బలవంతంగా వెళ్లగొట్టారు. మాన, ప్రాణాలకు భద్రత లేనందున ఎన్నో లక్షలమంది
వలసపోయారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడు మహమ్మదీయులు 69 శాతం. హిందువులది 28 శాతం. అయితేనేమి?
చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం అక్కడ కూడా దిక్కులేని హిందువులే మెజారిటీ అనుకోవాలిట. మైనారిటీ
హక్కులు కూడా మెజారిటీ అయిన మహమ్మదీయులకేనట! ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఎందుకిలా? మహమ్మదీయులకు, క్రైస్తవులకు మాత్రమే మైనారిటీ హోదా;
జన సంఖ్య ఎంత తక్కువైనా హిందువులకు ఆ ప్రాప్తం లేదు - అని రాజ్యాంగం చెప్పిందా? దాదాపుగా లక్షన్నర (1,45,000) పదాలు, 5 తక్కువగా 400 అధికరణాలు ఉన్న మన అతి పేద్ధ
రాజ్యాంగ గ్రంథంలో మైనారిటీల ప్రస్తావన ఉన్నది నాలుగే నాలుగు చోట్ల! 30వ అధికరణంలో 2 సార్లు;
29, 30 అధికరణాల హెడ్‌నోట్లలో చెరోసారి. అంతే! 1947 ఏప్రిల్ 16న ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగ నిర్మాణ సభకి సబ్‌కమిటీ నివేదించిన
ముసాయిదాలో ఇప్పటి 30వ అధికరణం ఊసే లేదు. తరువాత కె.ఎం.మున్షీ ఉబలాటం వల్ల ఆ ముసాయిదాలోకి
ఇప్పటి 29వ అధికరణం వచ్చిచేరింది. అందులో కూడా 'మైనారిటీ' అన్న పదాన్ని అంబేద్కర్ గారు తీసివేసి,
దానిలో పేర్కొన్న హక్కులను 'అన్ని వర్గాల పౌరులకూ' చెందేట్లు మార్చారు. పాఠాన్ని సరిదిద్దిన తరువాత కూడా 29వ అధికరణం హెడ్ నోటులో 'మైనారిటీ' పదం పొరపాటున మిగిలిపోవడం వేరే సంగతి. రాగా పోగా రాజ్యాంగంలో మైనారిటీల ప్రస్తావన ఉన్నది నికరంగా ఒక్క 30వ అధికరణంలోనే! తాము కోరుకున్న విద్యాసంస్థలను నెలకొల్పి, నడుపుకునేందుకు, ప్రభుత్వం నుంచి ఎయిడ్ పొందేందుకు
30వ అధికరణం మైనారిటీలకు వరమిచ్చింది. ఆ వరం జాతీయ స్థాయిలో మైనారిటీలైన ముస్లిం, క్రిస్టియన్ వగైరా మతాల వారికి మాత్రమేననీ - హిందూ మతానికి అది ఎంతమాత్రమూ వర్తించదనీ రాజ్యాంగంలో రాసిపెట్టారా? లేదు. 30వ అధికరణంలో పేర్కొన్నది కేవలం జాతీయ స్థాయి మైనారిటీలను కాదు. ఆ మాటకొస్తే మతపరమైన
మైనారిటీలను మాత్రమే కాదు. "All Minorities, Whether based on religion or language"
(మతము లేక భాష రీత్యా మైనారిటీలు అయిన వారందరు) అని ఆ అధికరణంలో ఉంది. మరి ఆ మైనారిటీలను నిర్ధారించటం ఎలా? నాలుగు చోట్ల 'మైనారిటీలు' అన్నారే తప్ప మైనారిటీ అనగా ఏమి? దానిని ఎలా నిర్ణయించాలి?
అన్నది రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించలేదు. జాతీయ స్థాయి జనాభా శాతాలను బట్టి మైనారిటీ ప్రతిపత్తి
ఉంటుందన్న షరా అసలే లేదు. కోరిన విద్యా సంస్థలను యథేచ్ఛగా నడుపు కోవటానికి 30వ అధికరణం.. సంస్కృతినీ, భాషనూ,
లిపినీ కాపాడుకునేందుకు 29వ అధికరణం మైనారిటీలకు ప్రత్యేక హక్కులు ఇచ్చారని వినగానే 'మైనారిటీ'
అన్న గుర్తింపు కోసం వెంపర్లాట ఎక్కడెక్కడి వారికీ మొదలైంది. మత పరంగా, భాష పరంగా తమను మైనారిటీగా
గుర్తించాలంటూ కోర్టులో విరివిగా కేసులు పడ్డాయి. ఆ స్థితిలో 'మైనారిటీ' అన్న మాటకు అర్థమేమిటి?
దానిని ఎలా నిర్ణయించాలి అన్న అంశంపై పదకొండు మంది జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం
TMA Pai Foundation కేసులో (2002 (8) SCC 481) దృష్టి సారించి, ఈ కింది ధర్మనిర్ణయం చేసింది: “Linguistic and religious minorities are covered by the expression ‘minority’ under
Article 30 of the Constitution. Since reorganisation of the States in India has been on
linguistic lines, for the purpose of determining the minority, the unit will be the State
and not the whole of India. Thus religious and linguistic minorities, who have been put on
a par in Article 30, have to be considered statewise.”
(30వ అధికరణంలో 'మైనారిటీ' అన్న పదం కిందికి భాషపరమైన, మతపరమైన మైనారిటీలు వస్తారు.
ఇండియాలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాష ప్రాతిపదికన జరిగింది కాబట్టి భాషాపరంగా మైనారిటీలను
నిర్ణయించడానికి మొత్తం దేశాన్ని కాక, రాష్ట్రాన్ని మాత్రమే యూనిటుగా తీసుకోవాలి. భాష, మత పరమైన
మైనారిటీలను 30వ అధికరణం ఒకే ఫాయాలో ఉంచినందువల్ల ఆ రెండు రకాల మైనారిటీలనూ రాష్ట్రాల
వారీగానే నిర్ణయించాలి.)
ఒక భాష మాట్లాడే హిందువులు వేరే భాష మాట్లాడే ప్రాంతానికి వలసపోతే కొత్తచోట వారు భాషాపరమైన
మైనారిటీగా గుర్తింపు పొందుతారు. మరి జాతీయ స్థాయిలో మెజారిటీ అయిన హిందువులు తమ రాష్ట్రంలోనే
అల్పసంఖ్యాకులైతే..? మైనారిటీల నిర్ధారణకు రాష్ట్రం ప్రాతిపదిక అన్న సూత్రాన్ని బట్టి ఆ రాష్ట్రంలో వారు
మైనారిటీలే కావాలి కదా? 'ఔను' అని ఉన్నత న్యాయస్థానాలు అనేక సందర్భాల్లో ప్రకటించాయి. ఉదాహరణకు పంజాబ్‌లో ఇలాంటిదే
ఒక సమస్య వచ్చింది. అక్కడ డి.ఎ.వి.కళాశాలలు నడిపే ఆర్యసమాజ్ వారు తాము మైనారిటీలమన్నారు.
దేశవ్యాప్తంగా హిందువులు మెజారిటీ కాబట్టి ఒక రాష్ట్రంలో మీరు మైనారిటీ అనడం కుదరదని ప్రభుత్వ పక్షం
వాదించింది. దానిపై సుప్రీంకోర్టు-
“Arya Samaj is who were Hindus, were a religious minority in the State of Punjab, even though
they may not have been so in relation to the entire country. What constitutes a linguistic or
religious minority must be judged in relation to the State and not in relation to the whole of
India.”
(మొత్తం దేశంలో కాకపోయినా పంజాబ్ రాష్ట్రంలో హిందువులు మతపరంగా మైనారిటీలు.
కాబట్టి హిందువులైన ఆర్య సమాజికులు పంజాబ్‌లో మైనారిటీలే. భాషాపరంగా గాని, మతపరంగా గాని ఏది
మైనారిటీ అనేది మొత్తం దేశాన్ని బట్టి కాక రాష్ట్రాన్ని బట్టే తేల్చాలి).
- అని 1971 మే 5న ఒకే రోజు వెలువరించిన రెండు తీర్పుల్లో స్పష్టం చేసింది.
(1971 AIR 1731, 1971 AIR 1737)
“This court has consistently held that, with regard to a state
law, the unit to determine a religious or linguistic minority can only be the State”.
(రాష్ట్ర చట్టానికి సంబంధించినంత వరకూ మత లేక భాష పరంగా మైనారిటీ నిర్ణయానికి రాష్ట్రాన్నే యూనిట్‌గా
తీసుకోవాలని ఈ కోర్టు అనేక సందర్భాల్లో ప్రకటించింది.) అని పైన ఉటంకించిన TMA Pai Foundation కేసులో (2002 అక్టోబరు 31న) సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. అత్యున్నత న్యాయపీఠాలు చేసిన ఈ ధర్మ నిర్ణయంలో సందిగ్ధత ఉందా? మైనారిటీల నిర్ణయం దేశం మొత్తాన్ని
బట్టి కాదు; ఏ రాష్ట్రానికారాష్ట్రంలో జన సంఖ్యను బట్టి జరగాలి - అని సుప్రీంకోర్టే ఢంకా కొట్టి చాటినప్పుడు
ఇంకా ఆలోచించాల్సింది ఏముంది? ఏడు రాష్ట్రాల్లో అల్ప సంఖ్యాకులైన హిందువులు 'మైనారిటీ' కాక
ఏమవుతారు? చట్ట పరంగా, ప్రభుత్వపరంగా మైనారిటీల చేయూతకు ఉద్దేశించిన సౌకర్యాలు, అవకాశాలు,
రక్షణలు ఆ రాష్ట్రాల్లో హిందువులకు ఎందుకు అందడం లేదు?
ఎందుకంటే మనది ఒక విచిత్ర వ్యవస్థ కనుక! సంఖ్యాపరంగా మైనారిటీలే కావచ్చు. కాని మైనారిటీల కమిషన్
శంఖంలో పోస్తేగాని గుర్తింపు తీర్థం దక్కదు.
రాజ్యాంగం 1950లో మొదలైతే, అందులో మైనారిటీల రక్షణకు పొందు పరచిన రక్షణలు సరిగా అమలయేట్టు
చూడటానికి, మైనారిటీల నిర్ధారణకు తగు చర్యలు తీసుకోవటానికి ఒక మైనారిటీస్ కమిషన్‌నంటూ ఏర్పాటు
చేయటానికి, ఏలినవారికి 28 ఏళ్లు పట్టింది. దానికి చట్ట ప్రతిపత్తినిస్తూ 'నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్
యాక్ట్' అనే జాతీయ చట్టాన్ని తేవడానికి ఇంకో పదిహేనేళ్లు పట్టింది. ఆ చట్టంలో మైనారిటీల నిర్ధారణకు ఒక
పద్ధతి అంటూ ఏదీ లేదు. కేంద్ర సర్కారు వారు ఎవరిని నోటిఫై చేస్తే వారు మైనారిటీగా గుర్తించబడుదురు!
శాసనంలోని 2 (సి) సెక్షన్ కింద భారత సర్కారు వారు 1993 అక్టోబరు 23న ఐదు కమ్యూనిటీలను గుర్తించారు.
వారెవరంటే 1. ముస్లింలు, 2. క్రైస్తవులు, 3. సిక్కులు, 4. బౌద్ధులు, 5. పార్శీలు.
ఈ లిస్టులో సిక్కులను చేర్చటమే తప్పు. ఎందుకంటే సిక్కులు మొదటి నుంచీ హిందూ మతానికి బాసటగా
నిలిచారు. కాశ్మీరీ హిందువులను ఔరంగజేబ్ రాక్షసత్వం నుంచి రక్షించటం కోసమే గురుతేజ్ బహాదూర్
చిత్రవధకు సిద్ధపడి తన ప్రాణాన్ని బలి ఇచ్చాడు. ప్రఖ్యాత మేధావి కుష్వంత్ సింగ్ సేకరించిన వివరాల
ప్రకారం సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆదిగ్రంథ్‌లో భగవంతుని నామ స్మరణ 15వేల చోట్ల ఉంటుంది.
వాటిలో హరినామం 8000 సార్లు, 'రామ' నామం 2,533 సార్లు, గోపాల, గోవింద, పరబ్రహ్మ నామాలు
కొన్నివేల సార్లు కనిపిస్తాయి. సిసలైన సిక్కు నామం 'వాహెగురు' 16 చోట్ల మాత్రమే ఉంటుంది. సిక్కులకు
పరమ పవిత్రమైన స్వర్ణదేవాలయానికీ హరిమందిరమని పేరు. తెల్లవాళ్ల కుట్రల వల్ల, రాజకీయ దుష్ప్రభావాల
కారణంగా హిందువులకు దూరమైన సిక్కు కమ్యూనిటీని నచ్చచెప్పి, నమ్మకం కలిగించి, హిందూ స్కంధావారంలోకి
చేర్చవలసింది పోయి దాన్ని వేరే మైనారిటీ మతంగా ముద్రవేయటం హిందూ సమాజానికి పెద్ద దెబ్బ.
అనాదిగా హిందూ మతంలో అంతర్భాగమైన ఇంకో వర్గం జైనులది. 2014 ఎన్నికలకు ముందు ఓట్ల కక్కుర్తితో
సోనియమ్మ బినామీ సర్కారు జైనులనూ మైనారిటీగా ప్రకటించి, హిందువుల ఐక్యతకు ఇంకో గండి కొట్టింది.
ఈ దుష్ట సంప్ర దాయాన్నే పుణికి పుచ్చుకుని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక కాంగ్రెసు సర్కారు
లింగాయతులను మైనారిటీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'మైనారిటీ' గుర్తింపు ఎరను విసిరి ఒక కమ్యూనిటీ తరవాత ఒక కమ్యూనిటీని వేరు చేసి హిందూ సమాజాన్ని
అంతకంతకూ బలహీన పరచాలని కుయుక్తులు పన్నే పాలకులు మొత్తంగా హిందువులే మైనారిటీ అయిన
రాష్ట్రాల్లో మాత్రం వారికి మైనారిటీ 'ప్రతిపత్తి' ఇవ్వరు.ముస్లిం మెజారిటీ జమ్మూ కశ్మీర్‌కు అసలు మైనారిటీల కమిషన్ జాతీయ చట్టమే వర్తించదు. కేంద్ర ప్రభుత్వం
పట్టుబడితే దాన్ని వర్తింప జేయగలదు. కాని సర్కారు పట్టుబట్టదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలోని ముస్లిం
సమూహాలతో, పార్టీలతో అధికారపార్టీకి సవాలక్ష మొగమాటాలు. జమ్మూ కాశ్మీర్ వలె ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి
లేని మిగతా రాష్ట్రాల్లోనైనా హిందూ మైనారిటీల బాగోగులు తిన్నగా పట్టించుకున్నారా అంటే ఆ ఆశా లేదు.
రాష్ట్రస్థాయిలో మైనారిటీలను చట్టరీత్యా నోటిఫై చేయవలసింది రాష్ట్రాల్లోని మైనారిటీ కమిషన్లు. రాష్ట్రస్థాయి
మైనారిటీల కమిషన్ ఏర్పాటుకే తొమ్మిది రాష్ట్రాల్లో ఇంతవరకు దిక్కులేదు. అవి గజ్జెకట్టిన రాష్ట్రాల్లో కూడా
హిందువులు కానివారికే తప్ప హిందూ మైనారిటీలకు న్యాయం సున్న. మైనారిటీల గుర్తింపు, వారి యోగక్షేమాల
విషయంలో జాతీయ, రాష్ట్ర కమిషన్ల నడుమ సమన్వయం లేదు. రాష్ట్రాల్లో మైనారిటీల గుర్తింపు మా పనికాదని
ఎవరికి వారు చేతులు దులుపుకోవటంతో, హిందూ వ్యతిరేక రాజకీయ లాబీ కేంద్రంగా నేషనల్ కమిషనే
తయారవడంతో అన్ని విధాల చితికిన హిందువులకు దిక్కుతోచని దుస్థితి. ఆ ఘోష అంతా ఏకరువు పెట్టి అశ్వనికుమార్ ఉపాధ్యాయ అనే ఢిల్లీ బిజెపి ప్రముఖుడు హిందువులు
మైనారిటీ అయిన రాష్ట్రాల్లో వారిని మైనారిటీలుగా గుర్తించేట్టు చేయమంటూ నిరుడు సుప్రీంకోర్టును
ఆశ్రయించాడు. అదేదో నేషనల్ మైనారిటీస్ కమిషన్ వారికే చెప్పుకోమని చెప్పి కోర్టు వారు కేసు కొట్టేశారు.
నేషనల్ కమిషనే సవ్యంగా పనిచేస్తే లేనిదేముంది? కోర్టుకెక్కాల్సిన అవసరమేమిటి? అసలు చట్టప్రకారం మైనారిటీలను నోటిఫై చేయాల్సింది ప్రభుత్వమే కదా? కేంద్రంలో నాలుగున్నరేళ్లుగా
రాజ్యమేలుతున్న మోదీ సర్కారు గట్టిపట్టుబడితే ఏడు రాష్ట్రాల హిందువులను మైనారిటీగా గుర్తించేట్టు
చెయ్యలేదా? కనీసం ఆ దిశగా ప్రయత్నమైనా జరిగిందా? ఇప్పుడు కూడా కాకపోతే హిందువులకు మరెప్పుడు
న్యాయం జరుగుతుంది? ఏమో! వారే చెప్పాలి.
No comments:
Post a Comment