Thursday, 8 November 2018

మెజారిటీ కావటమే శాపమా?



పెక్యులరిజం-20
- ఎం.వి.ఆర్‌.శాస్త్రి
..................



పావు శతాబ్దం కిందటి మాట. కర్ణాటకలోని మలయాళీలు టీచర్స్‌ ట్రెయినింగుకు ఓ కాలేజి పెట్టాలని ముచ్చటపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం కుదరదు పొమ్మంది. మలయాళీ సొసైటీ కోర్టుకెక్కింది - తమ మైనారిటీ హక్కులకు పుట్టి మునిగిందంటూ.



అలాంటి శిక్షణ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే ఒకటుందండి. ఇంకోటి పెట్టనిస్తే రెండిటి మధ్య అవాంఛనీయమైన పోటీ ఏర్పడి, శిక్షణ ప్రమాణాలు పలచబడవచ్చు కదాండి. అందుకే వద్దన్నాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంది. కర్ణాటక హైకోర్టు కస్సుమంది. కోరుకున్న విద్యా సంస్థను నడుపుకునే హక్కు మైనారిటీలకు ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును అడ్డుకోవటానికి మీరెవరు? అని ముక్క చివాట్లు పెట్టి పర్మిషన్‌ ఇప్పించింది.

గుజరాత్‌లోనూ ఒక టీచర్స్‌ ట్రెయినింగ్‌ కాలేజి ఉంది. దాన్ని నడిపేది క్రిస్టియన్‌ మైనారిటీ. అందులో 80 శాతం సీట్లను మేము చెప్పిన వాళ్లకు కేటాయించండి అని గుజరాత్‌ ప్రభుత్వం అడిగింది. యాజమాన్యం ఒప్పుకోలేదు. కాలేజికి ఇచ్చే ఎయిడ్‌ని ప్రభుత్వం నిలిపేసింది. క్రిస్టియన్‌ సొసైటీ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ప్రజా ప్రయోజనం, జాతీయ ప్రయోజనం అని చెప్పి మైనారిటీ విద్యాసంస్థ ప్రయోజనాన్ని దెబ్బతీయటానికి వీల్లేదు. మైనారిటీల ప్రాథమిక హక్కా? మజాకా? అని ప్రభుత్వాన్ని తిట్టి , ఆపేసిన ఎయిడ్‌ను సుప్రీంకోర్టు మళ్లీ ఇప్పించింది. (సిద్ధరాజ్‌ భాయ్‌ సభాయ్‌ కేసు 1963 AIR 540).

అదీ 30వ అధికరణం పవరు. అందులో మైనారిటీలకు ఇచ్చింది తిరుగులేని ప్రాథమిక హక్కు. శాసనాలు చేసే లెజిస్లేటివ్‌ పవరు అయినా దానికి తల ఒగ్గవలసిందేనని ఇంకో సందర్భంలో సుప్రీంకోర్టే చెప్పింది. అంతటి రాజ్యాంగ రక్ష ఉన్నది కాబట్టి మైనారిటీలకు చెందిన విద్యాసంస్థల తెరువు పోవటానికి సర్కారువారు భయపడతారు. తమ హద్దుల్లో తాముంటారు.

విద్యాసంస్థల్లో వెనకబడిన కులాలు వగైరా బలహీనవర్గాల రిజర్వేషన్లకు రాజ్యాంగం వరమిచ్చింది. కాని అది మైనారిటీ విద్యాసంస్థలకు వర్తించదు. నడిపేవాళ్లు మైనారిటీ అయితే వారు విద్యాసంస్థల్లో ఏ రిజర్వేషన్లూ పాటించనక్కర లేదు.

ప్రభుత్వ ఎయిడ్‌ తీసుకునే ఏ విద్యాసంస్థలోనూ మతం, కులం, భాష కారణంగా ఎవరికీ ప్రవేశం నిరాకరించరాదని 29(2) రాజ్యాంగ అధికరణం చెబుతుంది. 6 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా, కంపల్సరీగా విద్య నేర్పించాలని వాజపేయి ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సవరణ ద్వారా చొప్పించిన '21ఎ' అధికరణం నిర్దేశిస్తుంది. ఈ విద్యా హక్కుకు శాసన రూపం ఇస్తూ యు.పి.ఎ. సర్కారు Right to Education (RTE) చట్టం తెచ్చింది. ఆ చట్టం దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకూ చచ్చినట్టు వర్తిస్తుంది.

- ఒక్క మైనారిటీ విద్యాసంస్థలకు తప్ప.

కుల, మతాల కారణంగా విద్యాసంస్థల్లో ఎవరికీ ప్రవేశం నిరాకరించరాదని 29(2) అధికరణం స్పష్టంగా కట్టడి చేసినప్పుడు, పిల్లలకి నిర్బంధ, ఉచిత విద్య చెప్పించాలని 21 'ఎ' అధికరణం అంటున్నప్పుడు - వీటికి విరుద్ధంగా విద్యాహక్కు చట్టంలో మైనారిటీ స్కూళ్లకు మినహాయింపు ఇస్తే గొడవ అవుతుంది. లీగల్‌ చిక్కులూ వస్తాయి. కాబట్టి మైనారిటీలకి రక్ష, మెజారిటీపై కక్ష - వ్రతంగా పెట్టుకున్న సోనియమ్మ తల్లి గారి  బినామీ సర్కారు రాజ్యాంగ రక్షణను వమ్ము చేయడానికి పనిగట్టుకొని ఒక దిక్కుమాలిన రాజ్యాంగ సవరణ తెచ్చింది. 'మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం కారణంగా ఎవరిపట్ల వివక్ష కూడదు' అని ప్రకటించే రాజ్యాంగం 15వ అధికరణంలో 5వ నెంబరు క్లాజును అడ్డగోలుగా చొప్పించింది. ఇదిగో ఇలా :

"Nothing in this article shall prevent the state from making any special provision, by law, for the advancement of any socially and economically backward classes of citizens or for the scheduled castes or the Scheduled Tribes in so far as such provisions relate to their admission to educational institutions, whether aided or unaided by the state, other than the minority educational institutions referred to in clause (1) of Article 30"

(సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులకు, షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన పౌరుల అభివృద్ధి నిమిత్తం -

ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ విద్యా సంస్థలు సహా -

30 (1) అధికరణంలో పేర్కొన్న మైనారిటీ విద్యాసంస్థలు మినహా అన్ని విద్యా సంస్థలలోనూ -

అట్టివారి ప్రవేశానికి సంబంధించి చట్టరీత్యా ఎలాంటి ప్రత్యేక ఏర్పాటును ప్రభుత్వం చేయడానికైనా ఈ అధికరణంలో పేర్కొన్నదేదీ అడ్డురాదు.)

బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన విద్యాహక్కును కూడా తుంగలో తోక్కేందుకు ఈ 93వ రాజ్యాంగ సవరణ మైనారిటీల విద్యా సంస్థలకు వాటమైన అవకాశం ఇచ్చింది.



నిరక్షరాస్యత దేశం చిరకాలంగా ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. దాన్ని ఒక దారికి తెచ్చేందుకు సాంఘికంగా, ఆర్థికంగా వెనకబడిన అట్టడుగు వర్గాల పిల్లలకి ప్రభుత్వమే తన ఖర్చుతో నిర్బంధంగా విద్య నేర్పించాలన్నది ప్రశస్తమైన యోజన. ప్రభుత్వమే అందరికీ సరిపడా పాఠశాలలను కట్టించటం కష్టం కాబట్టి ఇప్పటికే నడుస్తున్న ప్రైవేటు స్కూళ్లలోనూ చదువుకునే అవకాశం అలాంటి పిల్లలకి కల్పించటం మంచిపని. అందుకయ్యే వ్యయాన్ని ఎలాగూ ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థల వారికి నష్టం లేదు. జాతి శ్రేయస్సు దృష్ట్యా ఒక అతిముఖ్య బృహత్కార్యంలో ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ అనే తేడా లేకుండా అన్ని ప్రైవేటు స్కూళ్లనూ కంపల్సరీగా ఇన్వాల్వు చేసినప్పుడు, మైనారిటీ స్కూళ్లకు మాత్రం ఆ బాధ్యత నుంచి మినహాయింపు ఇవ్వడంలో అర్థం లేదు. మైనారిటీ విద్యాసంస్థలలో మైనారిటీలు కాని పిల్లలనూ చేర్చుకోవడానికి సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వెసులుబాటు కల్పించింది. మైనారిటీలు కాని విద్యార్థులకు విచ్చలవిడిగా సీట్లు ఎలాగూ అమ్ముకుంటూనే ఉన్నారు. హిందువులు నడిపేస్కూళ్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎయిడూ పొందకపోయినా సరే ప్రభుత్వం చెప్పిన ప్రకారం బడుగు, బలహీన వర్గాల వారికి, సర్కారు నిర్ణయించే ధర్మ రుసుమును మాత్రం తీసుకుని చదువు చెప్పాల్సిందే అన్నప్పుడు- అదే రూలు మైనారిటీలు నడిపే స్కూళ్లకు మాత్రం ఎందుకు వర్తించకూడదు?

దానికి జవాబు సుప్రీంకోర్టు చెప్పింది వినండి :

"The minority character of the minority educational institutions may be affected by admissions of socially and educationally backward classes or the Scheduled Castes and the Scheduled Tribes, and it is for this reason that minority institutions, aided or unaided are kept outside the enabling power of the state under clause (5) of Article 15 with a view to protect the minority institutions from a law made by the majority.. This court has repeatedly held that the state has no power to interfere with the administration of minority institutions and has no power to force admission of students from amongst non-minority communities".
[Pramati Case, 2014, https://indiankanoon.org/doc/32468867/]

(సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలవారికి అడ్మిషన్లు ఇవ్వడం వల్ల మైనారిటీ విద్యా సంస్థల యొక్క మైనారిటీ శీలం దెబ్బతినవచ్చు. మెజారిటీ చేసే శాసనాల నుంచి మైనారిటీని రక్షించటానికి 15వ అధికరణం 5వ క్లాజు ప్రభుత్వ అధికారం నుంచి ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ మైనారిటీ విద్యాసంస్థలకు ఈ కారణం చేతే మినహాయింపు ఇచ్చింది. మైనారిటీ సంస్థ నిర్వహణలో జోక్యం చేసుకునే అధికారం, నాన్‌ మైనారిటీ వర్గాల విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని బలవంతం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు అని ఈ న్యాయస్థానం పదేపదే ప్రకటించింది.)

ఇదెక్కడి న్యాయం?

పార్లమెంటు చేసే ఏ చట్టమైనా మెజారిటీ సభ్యుల ఆమోదంతోనే శాసన రూపం దాల్చుతుంది. మెజారిటీ సభ్యులు సహజంగా మెజారిటీ (లేక నాన్‌ మైనారిటీ) వర్గాలకు చెందినవారే అయి ఉంటారు. "Law made by majority" (మెజారిటీ చేసిన లా నుంచి) మైనారిటీ సంస్థలను రక్షించటానికే 15(5) అధికరణం ఉన్నదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు అన్నమాటకు అర్థమేమిటి? దీన్నిబట్టి సర్వసత్తాకమైన పార్లమెంటు చేసే శాసనాలకు కూడా అతీతమైన మహా ప్రత్యేక రాజ్యాంగ రక్షణకవచం మైనారిటీలకు తొడగబడిందని మనం అనుకోవాలా? నూటికి 80 మంది దేశవాసులకు ప్రాతినిధ్యం వహించే మతంకంటే.. మెజారిటీ ప్రజలకు వర్తించే చట్టాలకంటే.. మైనారిటీలు, మైనారిటీ విద్యా సంస్థలు ఎక్కువా?

మెజారిటీ వర్గంతో సమానంగా మైనారిటీలకూ తమ మతం, భాష, సంస్కృతి కాపాడుకోవటానికి, విద్యాసంస్థల్లో ప్రవేశానికి, కోరిన విద్యాసంస్థలను పెట్టుకోవటానికి సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉండాలన్న పెద్ద మనసుతో రాజ్యాంగ కర్తలు 29, 30 అధికరణాలను పెట్టారు. వాటివెనుక ఉద్దేశాన్ని విస్మరించి, వాటిలో కనపడే 'మైనారిటీ' ప్రస్తావనలను భూతద్దంలో చూసి, వాటి ప్రాముఖ్యాన్ని అతిగా ఊహించుకుని న్యాయస్థానాలు విపరీతార్థాలు తీయటం అనవసరపు అనర్థాలకు ముఖ్యకారణం. ప్రజా ప్రయోజనాల కన్నా, జాతీయ ప్రయోజనాల కన్నా మైనారిటీ సంస్థల ప్రయోజనాలు మిన్న - అని అర్థ శతాబ్దం కింద ప్రకటించిన సిధాజ్‌భాయ్‌ సభాయ్‌ కేసు (1963 AIR 540) భలే తీర్పును ఇంతకు ముందు చూశాం. మైనారిటీలకు ఎక్కడాలేని, ఎవరూ ఊహించని స్పెషల్‌ కాటగిరీ రాజ్యాంగ ప్రతిపత్తిని ఆపాదించిన 2014 ప్రమతి ఎడ్యుకేషనల్‌ ట్రస్టు కేసులో పైన ఉటంకించిన తీర్పూ ఆ కోవలోదే.

మనం ఎంచుకున్నదీ, అనుసరిస్తున్నదీ మైనారిటీస్వామ్యం కాదు - ప్రజాస్వామ్యం! ఏదైనా మెజారిటీ ఇష్టాన్ని బట్టే జరగాలన్నది ప్రజాస్వామ్య మూల సూత్రం. మెజారిటీకి లేని హక్కు ఏదీ మైనారిటీకి ఉండటానికి వీలేలేదు. మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవటమైనా.. కోరుకున్న విద్య నేర్వడమైనా.. ప్రభుత్వ అనుచిత జోక్యం లేకుండా విద్యాసంస్థలను నడుపుకోవటమైనా మెజారిటీ, మైనారిటీ తేడా లేకుండా అన్నివర్గాల ప్రజల న్యాయమైన హక్కు. మైనారిటీలకు అది ఉంటుందని నొక్కి చెప్పటానికి రాజ్యాంగంలో వాడిన పదాలకు కోర్టులు పెడ అర్థం తీసి మైనారిటీలకు మాత్రమే ఆయా హక్కులు ఉంటాయని, మెజారిటీ సంగతి వాచ్యంగా పేర్కొనలేదు కనుక మెజారిటీకి ఆ హక్కులు వర్తించవని చెప్పటంతో నానా గత్తర అయింది. గవర్నమెంటు పెట్టే అడ్డమైన ఆంక్షలనుంచి, సవాలక్ష సతాయింపుల నుంచి తప్పించుకోవాలంటే 'మైనారిటీ గుర్తింపు'ను ఎలాగైనా పొందటం ఒకటే మార్గమన్న దురభిప్రాయం ప్రబలింది.

మెజారిటీ వర్గపు విద్యాసంస్థల్లో మైనారిటీలను చేరనివ్వరేమో.. దానివల్ల మైనారిటీలు చదువులో వెనకబడతారేమోనని అతిగా భయపడి మైనారిటీలకు సొంతంగా విద్యాసంస్థలు నడుపుకునే హక్కును రాజ్యాంగంలో చేర్చారు. చాలా బాగుంది. కాని మైనారిటీల కోసం ఉద్దేశించిన స్కూళ్లలో మైనారిటీల పిల్లలే చదువుకోవాలి కదా? వారి మతాన్ని, సంస్కృతిని పెంపొందించే రీతిలోనే వాటిలో నేర్పే చదువులు ఉండాలి కదా? మెజారిటీ వర్గాల పిల్లలని కూడా  ఇష్టమొచ్చినట్టు చేర్చుకోవచ్చు అన్నప్పుడు అని మైనారిటీ విద్యాసంస్థ ఎలా అవుతుంది? అన్ని స్కూళ్లలో నేర్పే సెక్యులర్‌ చదువే అక్కడా చెప్పేటప్పుడు దానిని మైనారిటీ విద్య అని ఎలా అనగలం? నడిపేవాడు మైనారిటీ అయితే చాలు, పిల్లలందరూ మెజారిటీ అయినా సరే అది మైనారిటీ విద్యాసంస్థ అయిపోతుందా?

'ఔను' అనే అంటాయి మన కోర్టులూ, గవర్నమెంట్లు! దాంతో ఈ దేశంలో మైనారిటీలుగా పుట్టే భాగ్యం పట్టని దురదృష్టవంతులు షార్ట్‌కట్లు వెతకసాగారు. అవసరార్థం ఒక మైనారిటీ సొసైటీని సృష్టించి, లేక ఒక మైనారిటీని బినామిగా పెట్టి విద్యాసంస్థను నడిపి, ప్రభుత్వపు అత్తపెత్తనపు కత్తిని 'మైనారిటీ' డాలుతో కాచుకోవటం విద్యారంగంలో పరిపాటి అయింది. విద్యాహక్కు చట్టంకింద బలహీనవర్గాల బికారి పిల్లలను చేర్చుకోకుండా తప్పించుకోవటానికీ 'మైనారిటీ' టాగ్‌ పనికొస్తున్నది. బడుగువర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన శాసనం మైనారిటీ విద్యాసంస్థల్లో చెల్లుబాటు కావటంతో విద్యాహక్కు దిక్కుమాలిన వివక్షకు లోనైంది .

అంతేకాదు . మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవటానికి మైనారిటీ ప్రతిపత్తి వాటంగా ఉపకరిస్తుంది అని తేలిపోవడంతో ఎక్కడెక్కడి వారూ ఆ ప్రతిపత్తి కోసం ఆరాటపడసాగారు. ఏ ఆదరణకూ నోచుకోని హిందూమతంలో భాగమని చెప్పుకోవడం తమకు నామోషీగా అనేక వర్గాలు భావించసాగాయి. అన్ని రకాల వివక్షలకూ టార్గెట్‌ అయిన హిందూ మతం నుంచి వేరుపడి, అన్ని హక్కులూ తెచ్చిపెట్టే మైనారిటీ గుర్తింపును ఏదో ఒకరకంగా సాధించాలన్న తపన పెరిగింది.

వివేకానందుడంతటి జగదేక హైందవ వీరుడు స్థాపించిన రామకృష్ణ మిషనే హిందూమతంతో తెగతెంపులు చేసుకుని, తనది వేరే మైనారిటీ మతమని ఆఫ్టరాల్‌ ఒక కాలేజిని నిలుపుకోవటం కోసం అడ్డదారి పట్టిన వైనాన్ని ఇంతకు ముందు చూశాం. వివేకానందుడి కంటే పూర్వం, ఆయనకంటే చండప్రచండంగా పోరాడి, సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టిన ఆధునిక ఋషి దయానంద సరస్వతి స్వామి స్థాపించిన ఆర్యసమాజ్‌ సైతం ఇదేరకమైన దౌర్బల్యానికి, అవకాశవాదానికి లోనవటం ఇంకో పెద్ద విషాదం.

స్వామి దయానంద సరస్వతి స్మారకార్థం ఆర్యసమాజ్‌ దేశంలోని పలు ప్రాంతాల్లో స్థాపించిన దయానంద ఆంగ్లో వేదిక్ (డి.ఎ.వి.) విద్యా సంస్థలకు పంజాబ్‌ యూనివర్సిటీ, గురునానక్‌ యూనివర్సిటీలలో కాలేజిల అఫీలియేషను, బోధనాభాష, పరీక్షల నిర్వహణలకు సంబంధించి అర్ధశతాబ్దం కింద గొడవలొచ్చాయి. ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం తమది హిందూ మతంతో సంబంధం లేని మైనారిటీ మతమని, కాబట్టి 30(1) అధికరణం రక్షణ తమకూ వర్తిస్తుందని చెబుతూ డి.ఎ.వి. కాలేజి ట్రస్టు ఏకంగా 15 రిట్లు వేసింది. వాటిమీద 1971 మే 5న ఇచ్చిన రెండు వేరు వేరు (1971 AIR 1731, 1971 AIR 1737) తీర్పుల్లో ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగమైన రిలిజియస్‌ డినామినేషనే తప్ప వేరే మతం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. (పంజాబ్‌ రాష్ట్రంలో మొత్తంగా హిందువులు మైనారిటీ అయినందువల్ల, హిందూ మతానికి చెందిన శాఖగా ఆర్య సమాజానికీ 30(1) రక్షణ వర్తిస్తుందని కోర్టు అంగీకరించడంతో వేరేమతం వాదం వీగిపోయినా డి.ఎ.వి. కాలేజిలకు ఉపశమనం దొరికింది.)

పంజాబ్‌లో హిందువులు మైనారిటీ కాబట్టి ఆ పద్దు కింద జలంధర్‌, భటిండాలలోని డి.ఎ.వి. కాలేజిలకు 30(1) మేలు జరిగింది సరే. కాని హిందువులు మెజారిటీ అయిన మిగతా రాష్ట్రాల మాటేమిటి? అక్కడా 30(1) అధికరణం కింద విద్యాసంస్థలు నిశ్చితంగా నడుపుకోవాలంటే మైనారిటీ బిళ్ల తప్పనిసరి. దానికో సం ఢిల్లీలోని ఆర్యసమాజ్‌ ట్రస్టు 1975లో తమది మైనారిటీ మతంగా గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ఆర్యసమాజ్‌ హిందూ మతంలో భాగమే తప్ప వేరే మతం కాదని, మైనారిటీ మతమన్న గుర్తింపు దానికి రాదని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. (AIR 1976 Delhi 207). ఈ సందర్భంలో  ఢిల్లీ హైకోర్టు ఒక మంచి మాట చెప్పింది. ఏమనంటే -

"There are so many classes and sections among Hindus with varieties of religions opinions. If each of them were to constitute a minority under Article 30(1) the Hindus would not remain a majority at all but would consist of numerous religious minorities".

(మత విషయంలో రకరకాల అభిప్రాయాలు కలిగిన వర్గాలు, తరగతులు హిందువులలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటీ 30(1) అధికరణం కింద మైనారిటీగా ఏర్పడే పక్షంలో హిందువులు అసలు మెజారిటీగా మిగలరు. అసంఖ్యాకమైన మత మైనారిటీలుగా విడిపోతారు.)

ఆ ఇంగితజ్ఞానమే మనలనేలే రాజకీయ క్షుద్రజీవులకు కొరవడింది. తమ రాజకీయ స్వార్థంకోసం హిందూసమాజంలో చీలికలు ప్రోత్సహించి, మైనారిటీ ఎరలను పలుకుబడిగల కొన్ని వర్గాలకు విసరటం వారికి ఎప్పటినుంచో అలవాటుగా మారింది. 1927లో హిందూ రిలిజియస్ ,  ఎండోమెంట్సు బిల్లును మద్రాసు అసెంబ్లీలో పెట్టారో లేదో తమను స్వతంత్ర కమ్యూనిటీలుగా గుర్తించాలంటూ కెనరా, మలబార్‌ ప్రాంతాలలోని హిందూ వర్గాల నుంచి వేర్పాటు రాగాలు మొదలయ్యాయి. కొద్దినెలల కింద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలన్న యావతో కాంగ్రెసు ప్రభుత్వం లింగాయతులను మైనారిటీగా గుర్తిస్తూ హిందూ సమాజంలో చిచ్చుపెట్టింది.

రామకృష్ణ మిషన్ ,ఆర్యసమాజ్ ,   బ్రహ్మ సమాజ్ , స్వామి నారాయణ్‌  వంటి హిందూ మతశాఖలు  మైనారిటీ ముద్రను లంకించుకోవాలని తహతహలాడుతూ కోర్టు తలుపులు తడుతున్నాయంటే దానికి కారణం హిందూమతం మీద ద్వేషం కాదు; హిందువులమని చెప్పుకోవడానికి సిగ్గుపడీ కాదు. అస్తమానం దిక్కుమాలిన రూల్సు రెగ్యులేషన్లతో సతాయించే ప్రభుత్వపు పీడ నుంచి తప్పించుకోవడానికి అంతకంటే దారిలేక! మైనారిటీ రక్షా కవచం ఉంటేగాని స్థిమితం ఉండని దౌర్భాగ్యపు దురవస్థను మన సంకర సెక్యులర్‌ అవ్యవస్థ తెచ్చిపెట్టటం వల్ల!!

Tuesday, 6 November 2018

Hindus !Awake , Arise !!

https://www.pgurus.com/kerala-police-unleashes-reign-of-terror/

How dare they lock toilets , cut off water supply , starve devotees and unleash reign of terror in Sabarimala ?

It is the indifference of  Hindus that is bane of this country and responsible for all the incessant assaults on Dharma  since 1947. If even Sabarimala doesnt awaken them from Kumbhakarna mode and start nationwide struggle , one can write off Hinduism from Hindustan.

There is no point in expecting some Hindu outfit to lead Hindus in this ultimate struggle for survival . Had Ayyappa devotees waited for such a lead , Sannidhanam  would be brimming with menstruating Fatimas by now. Hindus have to rise spontaneously and start nationwide protests. Organisations will follow in due course.

Ayodhya-centric Sadhus and Sants should also pay some urgent attention on the Communist Government's atrocities on Sanatan Dharma . Northern India should realise gravity of the situation in Sabarimala , it's implications and consequences.

This is not time for cool electoral calculations and strategizing Modi's 2019 comeback . Hindus are not pawns on BJP's political chessboard. Ayodhya can wait. Sabarimala can not.Commie Sarkar of Kerala is deadlier than Aurangzeb. Its not Kerala's but Dharma's battle for survival .


Friday, 2 November 2018

విన్నావా వివేకానందా ?!

పెక్యులరిజం - 19
ఎం.వి.ఆర్.శాస్త్రి

............






రాజ్యాంగ రక్షరేకు మైనారిటీలకే తప్ప మెజారిటీకి లేదు. కాబట్టి హిందువులు నడిపే స్కూళ్లూ, కాలేజీల మీద గవర్నమెంటు ఒంటికాలిపై లేస్తుంది. సంస్థ దైనందిన నిర్వహణ, చదువులు, సిలబసు, నియామకాలు వగైరాల్లో అడ్డమైన ఆంక్షలు. ఒకేరకమైన చట్టాలకు లోబడి ఒకే లాంటి చదువు చెప్పే విద్యాసంస్థల్లో మైనారిటీల ప్రాప్తం ఒకలాగ; హిందువుల కర్మం ఒకలాగ!!

ఈ అన్యాయాన్ని ఎవరు ప్రతిఘటించాలి? వివక్షకు లోనవుతున్నవాళ్లు. అది అంత తేలిక కాదు. ఎందుకంటే అన్యాయం జరిగింది రాజ్యాంగంలో. దానిని సరిచేసి, మైనారిటీలకున్న హక్కులను మెజారిటికీ వర్తింపజేస్తేగాని వివక్ష పోదు. దానికి జాతీయ స్థాయిలో పెద్ద కదలిక తేవాలి. ఆ పని దేశమంతటా విస్తృతమైన నెట్‌వర్కు, ప్రజల్లో మంచిపేరు ఉండి విద్యారంగంలో అనేక సంస్థలను నడుపుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థలకు మాత్రమే సాధ్యం.

అటువంటి జాతీయ మహా సంస్థలు హిందూ సమాజంలో ఏమున్నాయి అని ఆలోచిస్తే స్ఫురించే మొట్టమొదటి పేరు రామకృష్ణ మిషన్‌! అది ప్రధానంగా సేవా సంస్థ అయినా అనేక విద్యాసంస్థలనూ నడుపుతున్నది. వాటి నిర్వహణలో ప్రభుత్వాల నుంచి, అధికార గణాల నుంచి రకరకాల ఒత్తిళ్లను అది కూడా ఎదుర్కొంటున్నది. నాలుగు దశాబ్దాల కింద హిందూ మతాన్ని ద్వేషించే కమ్యూనిస్టు జమానాలో తన ప్రధాన కేంద్రం ఉన్న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో రామకృష్ణ మిషన్‌కు పెద్ద చికాకే కలిగింది.



వివేకానంద శతజ యంతి సందర్భాన బెంగాల్‌లోని రహరాలో 1962లో ఆయన పేరిట వివేకానంద సెంటినరీ కాలేజి వెలసింది. దాన్ని కట్టింది రామకృష్ణ మిషన్‌ స్థలంలో. కళాశాల నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అడిగిమరీ నిధులిచ్చినవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కాలేజి మిషన్‌ యాజమాన్యంలో నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. గవర్నింగ్‌ బోర్డూ ప్రభుత్వ ఆమోదంతో ఏర్పాటైంది. మిషన్‌ ఆధ్వర్యంలో ఇలా కాలేజిని పెట్టించాం, దానికి అవసరమైన అనుమతి ఇవ్వండి అని కోల్‌కతా యూనివర్సిటీకి రాసి, గుర్తింపు తెప్పించిందీ రాష్ట్ర విద్యాశాఖే.

సాధారణంగా ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేటు కళాశాలల గవర్నింగు బోర్డులన్నీ ఒకే మాదిరిగా ఉండాలని రాష్ట్ర విద్యాచట్టం చెబుతుంది. అయితే ఆ నియమం నుంచి క్రైస్తవ మిషనరీ, రామకృష్ణ మిషన్‌ వంటి కొన్ని సంస్థల కాలేజీలకు చట్టంలోనే మినహాయింపు ఇచ్చారు. మిగతా స్పాన్సర్డ్‌ కాలేజిలకు భిన్నంగా సొంత గవర్నింగు బోర్డు ఉండటానికి 1978 ఏప్రిల్‌ నాటి విద్యాశాఖ ఉత్తర్వు కూడా రామకృష్ణ మిషన్‌ కాలేజిని అనుమతించింది.

ఇలా కొంతకాలం సాఫీగా నడిచాక 1980లో గొడవ మొదలైంది. కాలేజి ప్రిన్సిపాల్‌ తప్పుకున్నాడు. ఆయన స్థానంలో బేలూరు మఠానికి చెందిన స్వామి శివమయానందను యాజమాన్యం నియమించింది. దానిని కాలేజి టీచర్ల కమ్యూనిస్టు సంఘం ప్రతిఘటించింది. టీచర్లు సమ్మెకట్టి కొత్త ప్రిన్సిపాల్‌ను పనిచేయనివ్వలేదు. కాలేజిని దౌర్జన్యంగా తమ చేతుల్లోకి తీసుకొని తమలో ఒక ప్రొఫెసరును ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా తామే నియమించారు. నడమంత్రపు పెత్తనాన్ని రద్దు చేసి, యథాపూర్వస్థితిని పునరుద్ధరించాలంటూ కాలేజి యజమాన్యం కోర్టుకెళ్లింది.

టీచర్ల సంఘం దీనికి పైఎత్తు వేసింది. మిగతా స్పాన్సర్డ్‌ కాలేజిల మాదిరిగా మా కాలేజి గవర్నింగ్‌ బోర్డునూ మార్పించండి; రాష్ట్ర విద్యాచట్టం మా కాలేజీకీ వర్తిస్తుందని ప్రకటించండి; కొత్త ప్రిన్సిపాల్‌ నియామకం రద్దు చేయండి అని అడుగుతూ కోల్‌కతా హైకోర్టులో ఉపాధ్యాయులు రిట్లు వేశారు. అదే సమయంలో నరేంద్రపూర్‌, హౌరాల్లో మిషన్‌ వారి మరో మూడు విద్యాసంస్థల గవర్నింగ్‌ బోర్డులను కూడా పునర్వ్యవస్థీకరించాలంటూ కోల్‌కతా యూనివర్సిటీ నోటీసులిచ్చింది. టీచర్ల యూనియన్‌ దూకుడు, ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంటు సతాయింపు, అదే సమయాన యూనివర్సిటీ పనిగట్టుకుని, వెంటపడ్డ తీరు చూస్తే లెఫ్ట్‌ ఫ్రంటు కామ్రేడ్లు, వారి చేతిలోని అధికారగణం పథకం ప్రకారం రామకృష్ణ మిషన్‌ను వేధిస్తున్నదని సామాన్యులకు సైతం అర్థమైంది. క్రిస్టియన్‌ మిషన్ల లాగే రామకృష్ణ మిషన్‌ కాలేజికి రాష్ట్ర విద్యా చట్టంలో మినహాయింపు ఇచ్చినందువల్ల మిగతా కాలేజిలలో వలె గవర్నింగు బోర్డులో టీచర్లకు ప్రాముఖ్యం లేకుండా పోయింది. యాజమాన్యం కరాఖండిగా ఉండటం వల్ల ట్రేడ్‌ యూనియన్లూ, కమ్యూనిస్టు లీడర్ల ఆటలూ సాగడం లేదు. ఈ అక్కసుతో మిషన్‌ నడుపుతున్న మిగతా విద్యాసంస్థల లోనూ మెల్లిగా గొడవలు మొదలెట్టారు.

ఇదీ 1980లో రామకృష్ణ మిషన్‌కు వచ్చిపడ్డ సమస్య. పశ్చిమబెంగాల్‌లో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో విషయం తీవ్రమైనదే. సందేహం లేదు. కాని మిషన్‌కి అది జీవన్మరణ సమస్య ఏమీ కాదు. యాజమాన్యం చట్టపరంగా ఏ తప్పూ చేయలేదు. ఏ నిబంధననూ ఉల్లంఘించలేదు. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులలో కూడా రామకృష్ణ మిషన్‌కి మినహాయింపు ఇచ్చినట్టు స్పష్టంగా ఉంది. న్యాయం తన పక్షాన ఉన్నప్పుడు ఏ సంస్థా భయపడాల్సిన పనిలేదు. గొప్ప చరిత్ర, ప్రజల్లో ప్రతిష్ఠ ఉన్న రామకృష్ణ మఠానికి అలాంటి అగత్యం అసలే లేదు. న్యాయమైన తన హక్కులను నిలబెట్టుకోవటానికి చట్టపరంగా సంస్థకు అనేక అవకాశాలున్నాయి.

ఇది కేవలం ఒక రామకృష్ణ మిషన్‌కే దాపురించిన కష్టం కాదు. మైనారిటీల వలె ప్రత్యేక రక్షణకు నోచుకోని హిందువులకు చెందిన విద్యాసంస్థలన్నీ సర్కారీ జులుం మూలంగా ఏదో ఒక రీతిలో పడుతున్న అవస్థే అది. తనకే అది అనుభవమైనప్పుడు రామకృష్ణ మిషన్‌ సవాలును ధైర్యంగా స్వీకరించి, వివేకానందుడి తరహాలో అన్నిటికీ తెగించి దృఢంగా నిలబడి ఉంటే కాస్త ఆలస్యంగా అయినా న్యాయం జరిగేది. దానివల్ల మొత్తం హిందూసమాజానికి మేలు జరిగేది. ఒకవేళ ఓడిపోయినా మహా అయితే ఒక కాలేజిమీద ఆ సంస్థకు కంట్రోలు పోయేది. అనేక రాష్ట్రాల్లో ఎన్నో సంస్థలను నడుపుతున్న మహా వ్యవస్థకు ఆ నష్టం ఒక లెక్కలోనిది కాదు.



మరి రామకృష్ణ మిషన్‌ ఏమిచేసింది? సవాలును ఎంత ధైర్యంగా స్వీకరించింది?

చెప్పుకుంటే సిగ్గుచేటు. సింహంలాంటి వివేకానందుడు స్థాపించిన మహాసంస్థను నమ్మశక్యం కాని నైతిక దౌర్బల్యం ఆవహించింది. ఒత్తిళ్లను, ఆరళ్లను నియమబద్ధంగా ప్రతిఘటించలేదు సరికదా - వాటి నుంచి తప్పించుకు నేందుకు మైనారిటీ రక్షరేకు కోసం రామకృష్ణమఠం వెంపర్లాడింది. ఆ దిక్కుమాలిన గుర్తింపుకోసం అసలు తాము హిందువులమే కామని, తమది వేరే మైనారిటీ మతమని జంకు లేకుండా బుకాయించింది.

కోల్‌కతా హైకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిటులోనూ, రాతపూర్వక వాదనల్లోనూ రామకృష్ణ మిషన్‌వారు ఒట్టేసి చెప్పిందేమిటంటే -

వారిది రామకృష్ణ మతమట. 'ఠాకూర్‌ శ్రీరామకృష్ణ పరమహంస దేవ' ఇస్లాం సహా వివిధ మతాలను సాధన చేసి, వాటి వెనుక మూల సత్యాన్ని కనుగొని ఈ కొత్త మతాన్ని స్థాపించాడట. దానికీ, హిందూ మతానికీ  బొత్తిగా సంబంధం లేదట. దానికి దేవుడు వేరు; వ్యవస్థ వేరు; పూజా విధానం వేరు; ఫిలాసఫీ కూడా వేరు -ట! ఈ విశ్వమతాన్ని అనుస రించే వారిలో హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, ఇంకా ఇతర మతాల వాళ్లు ఉన్నారట. హిందువుల తాత్వికత, బౌద్ధుల కరుణ, మహమ్మ దీయుల సోదరతత్వం కలగలిపి మనం ఒక విశ్వమతాన్ని (Universal Religion) మొదలెడుతున్నాం అని - దీని స్థాపకుడైన వివేకానంద స్వామి చెప్పాడట !

ఈ అడ్డగోలు వాదనే విడ్డూరం. అంతకంటే ఆశ్చర్యం కొల్‌కత్తా హైకోర్టు దీనిని ఆమోదించటం! ఔను నిజమే! వీరు చెబుతున్నట్టు వీరిది వేరే మతం. కాబట్టి భారత రాజ్యాంగం 30వ అధికరణం విద్యా సంస్థల విషయంలో మైనారిటీలకి ఇచ్చిన హక్కులు రామకృష్ణ మిషన్‌ వారికి కూడా వర్తించును - అని సింగిల్‌ జడ్జిగారు 1981లో తీర్పు చెప్పారు. మఠం వారికి కోరుకున్న పని అయిపోయింది. గండం గడిచింది.

అక్కడితో కథ అయిపోలేదు. ఎగస్పార్టీ వాళ్లు సింగిల్‌ జడ్జి తీర్పు మీద డివిజన్‌ బెంచికి అపీలు చేశారు. పై బెంచి ముందూ మఠం వారు పాతపాటే పాడారు. డివిజన్‌ బెంచి విని ఊరుకోలేదు. విచారణ సందర్భంలో ఒక సూటి ప్రశ్న వేసింది :

'మీరేమో మీ మతం స్థాపించింది వివేకానందుడని అంటున్నారు. ఆయనేమో తనది హిందూ మతం అని గర్వంగా చాటాడు. ఈ రెండిటికీ ఎలా పొసుగుతుంది?'

దానికి మఠం వారు తడబడకుండా భలే జవాబు చెప్పారు-

వివేకానంద స్వామి మొదట హిందూమత ప్రచారకుడేనట. కాని అమెరికా వెళ్లాక, పాశ్చాత్య ఆలోచనతో అక్కడి జీవన విధానంతో పరిచయం పెరిగాక మతము, దాని ప్రాముఖ్యత గురించి ఆయన భావాలలో మార్పు వచ్చిందట. మతాల యొక్క ఐక్యత మీద శ్రద్ధ పెట్టగా పెట్టగా ఆయనకు క్రమేణా 'విశ్వమతం' మీద విశ్వాసం కుదిరిందట. ఆ పళాన ఆయన 'ప్రపంచ మతము'ను ప్రబోధించాడట.  Miss Mary Louse Burk అనే ఆవిడ రాసిన 'Swami Vivekananda in the West' గ్రంథం రెండో సంపుటిని చదివితే ఈ దేవరహస్యం అర్థమవుతుందట. 'శ్రీ రామకృష్ణులు బోధించిందే అసలు వస్తువు. అదే హిందూయిజం అని హిందువులను అనుకోనివ్వండి. ఇతరులూ వారి పద్దతిలో దాన్ని పిలుచుకుంటారు' అని కూడా వివేకానందుల వారు చెప్పారటండోయ్‌!

ఇలా ఎక్కడెక్కడి గ్రంథాల నుంచో ఎవరెవరివో ఉటంకించి, చేంతాడంత వివరణ ఇచ్చేసరికి హైకోర్టు డివిజన్‌ బెంచికి కూడా జ్ఞానోదయమైంది. 'రామకృష్ణ మతము' యొక్క తత్వం బోధపడింది.

“Thoughts of Ramakrishna and Swami Vivekananda although were based on Vedanta, Writings and Speeches of Swami Vivekananda show that even though he had grown as a preacher of Hindu religion, he converted himself into a preacher of world religion different from Hindu religion, in latter years of his life being influenced by his greater acquaintance with western thought and way of life”.

(శ్రీరామకృష్ణ, స్వామి వివేకానందల ఆలోచనలు వేదాంతం మీద ఆధారపడిన మాట నిజమే. వివేకానందస్వామి హిందూమత ప్రచారకుడిగా పెరిగినప్పటికీ ఆయన రాతలను, ప్రసంగాలను గమనిస్తే హిందూ మత ప్రచారకుడి స్థాయి నుంచి ప్రపంచ మత ప్రబోధకుడుగా ఆయన పరివర్తన చెందినట్టు కనపడుతుంది. అనంతర సంవత్సరాల్లో పాశ్చాత్య ఆలోచన, జీవన విధానంలో పరిచయం పెరిగిన ప్రభావం వల్ల వచ్చిన మార్పు ఇది.)

- అని ప్రకటించి సింగిల్‌ జడ్జి తీర్పును ధ్రువీకరించి, రామకృష్ణ మతాన్ని ప్రత్యేక మైనారిటీ మతంగా 30వ అధికరణం కింద హైకోర్టు డివిజన్‌ బెంచి 1985లో నిర్ధారించింది.

 దాంతో రామకృష్ణ మఠం పంట పడింది. అక్కర తీరింది. హైకోర్టు ముద్రకొట్టి ఇచ్చిన 'మైనారిటీ' గుర్తింపు ' కవచంతో గవర్నమెంటు సతాయింపును వారు జయప్రదంగా నిరోధించి తమ కాలేజిని తాము నిశ్చింతగా పరిపాలించుకో సాగారు.

సమయానుకూలంగా వైఖరి మార్చి కార్యం సాధించటం రామకృష్ణ మిషన్‌ వారికి కొత్తకాదు. మునుపు 1969లోనూ తమది వేరే మతమని నమ్మించి బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాగే మైనారిటీ గుర్తింపును గుంభనంగా తెచ్చుకున్నారు. ఇప్పుడూ తమ నిర్వాకం బయటి ప్రపంచానికి పొక్కదనుకున్నారు. కాని హిందూమత పునరుజ్జీవానికి స్ఫూర్తి, చోదకశక్తి అయిన వివేకానందుడి సొంత సంస్థే తనకు హిందూమతంతో సంబంధమే లేదని చెప్పుకోవటమేమిటని, హిందూ సమాజం నిర్ఘాంతపోయింది. ముఫ్ఫై ఏళ్లకిందట దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.

హైందవంతో పేగుబంధం తెంచుకొని, తనమీద హిందూముద్రను చెరిపేసుకోవటానికి రామకృష్ణ మిషన్‌ ఎన్ని ఆపసోపాలు పడ్డా, చివరికి కథ అడ్డం తిరిగింది. హైకోర్టు డివిజన్‌ బెంచి తీర్పుమీద కాలేజి టీచర్లు, కోల్‌కతా యూనివర్సిటీ, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెంటనే అపీలు చేశాయి. తీర్పు రావటానికి షరామామూలుగా పదేళ్లు పట్టింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పక్షాన 1995 జూలై 2న జస్టిస్‌ వెంకటాచలయ్య వెలువరించిన తీర్పు మఠం వారి కట్టుకథను కొట్టిపారేసింది.

'హిందూమతం మాత్రమే సనాతన ధర్మం. ఎప్పుడూ ఉన్నది, ఎప్పటికీ ఉండేది హిందూమతం ఒక్కటే. ఇతర మతాలేవీ కలకాలం నిలిచేవి కావు'  - అని శ్రీరామకృష్ణులు -

'నేను హిందువునని చెప్పుకోవటానికి గర్వపడతాను. ప్రపంచంలోని మతాలన్నిటికి తల్లి అయిన హిందూమతానికి చెందినందుకు గర్విస్తాను' -  అని షికాగో విశ్వవేదిక మీద వివేకానందుడు పలికిన దివ్య వాక్కుల వంటివి ఎన్నిటినో ఉటంకించిన మీదట సుప్రీంకోర్టు ఇలా ప్రకటించింది.

It is a travesty of truth to say that Ramakrishna created a religion independent and apart from Hindu religion and called it a universal religion. That Swami Vivekananda changed his views in his latter years ,  even if true, the same cannot have the effect of Shri Ramakrishna himself bringing up a religion of his own according to the subsequent thinking of Swami Vivekananda. What Vivekananda proclaimed was that it is Vedanta and Hindu religion alone that can become the universal religion of man. The peculiar circumstances which led Ramakrishna Mission to make such claim, to save their college and other educational institutions from being taken away by the state Government...”
[1995 AIR 2089]

(హిందూ మతం నుంచి వేరుగా రామకృష్ణులు స్వతంత్ర మతాన్ని సృష్టించారని చెప్పటం సత్య దూరం. తరువాత సంవత్సరాలలో వివేకానంద స్వామి తన భావాలను మార్చుకున్నారని చెప్పటం ఒకవేళ నిజమే అనుకున్నా, భవిష్య కాలంలో వివేకానందుడి ఆలోచనల ప్రకారం రామకృష్ణులు సొంతంగా ఒక మతాన్ని పెట్టారని చెప్పటం కుదరదు. వేదాంతం, హిందూమతం మాత్రమే ప్రపంచమతం కాదగ్గదన్నదే వివేకానందుడు ప్రకటించిందల్లా! తమ కాలేజిని, ఇతర విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకుపోకుండా కాపాడు కునేందుకే రామకృష్ణ మిషన్‌ విచిత్ర పరిస్థితుల్లో అలా చెప్పుకోవడాన్ని హైకోర్టు మాన్య న్యాయమూర్తులు సమర్థించి ఉండాల్సింది కాదు).