"ఆమె మరణించలేదు. విశ్వశక్తిలో విలీనమయింది. ఆమె మీ నుంచి ఏమీ కోరటం లేదు. ఏ కర్మకాండా ఆమెకు చేయనవసరంలేదు."
- శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్
"ఆ తల్లి తాను వచ్చిన పని పూర్తి చేసుకొని సద్గతి పొందినది."
- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
రెణ్నెల్ల కింద (జూలై 15 వేకువన) గోదావరి ఎక్స్ ప్రెస్ లో తన్మయి, నేను విశాఖపట్నం చేరాము. మధ్యాహ్నం అక్షయ్ హాస్పిటల్ లో డాక్టర్ పెద్దపల్లి అప్పారావుగారిని మేము కలవాలి. "చాలా టైముంది. కనకమహాలక్ష్మి గుడికి వెళతావా?" అని అడిగాను. "భీమిలి అమ్మవారి గుడికి పోదాం" అంది మా అమ్మాయి.
భీమునిపట్నం లోని తమ ఆనందవనంలో పూజ్యసద్గురు శివానందమూర్తి గారు ప్రతిష్ఠించిన, దేశంలోకెల్లా అరుదైన ఆద్యాది మహాలక్ష్మి దేవాలయం లో నిబంధనలు స్ట్రిక్టు. అర్చకుడు మనోహర్ కి ఫోన్ చేస్తే 10-30 లోగా రండి అన్నాడు. కారులో మేము చేరేసరికే 10-45 దాటింది. అయినా గుడి తెరిచే ఉంది. భక్తులు వేరెవరూ లేరు. మా అమ్మాయిని మహాలక్ష్మి మరకత విగ్రహం ఎదుట కూర్చోబెట్టి సహస్రనామార్చన చేశారు. అమ్మవారికి కట్టిన చీరను తన్మయికి ఇచ్చారు. అది అరుదైన ప్రాప్తం.
తరవాత గురువుగారి ఆశ్రమానికి వెళ్లాము. ముప్ఫై ఏళ్లుగా అక్కడికి వెళుతున్నా మేము ఎన్నడూ చూడని గురువుగారి పడక గదిలో పాన్పు దగ్గరా, ఆయన పూజచేసి తీర్థం ఇచ్చిన గది లోనూ కూర్చుని చాలాసేపు తన్మయి ధ్యానం చేసింది. వెలిగిపోతున్న ముఖంతో కారెక్కింది.
ఇది గొప్ప శుభసూచకం; అమ్మవారు, గురువుగారు పిలిచి ఆశీస్సులిచ్చి డాక్టర్ అప్పారావుగారి దగ్గరికి పంపారు కనుక అమ్మాయికి జబ్బు నయమవుతుంది. తప్పక కోలుకుంటుంది- అని మేము ఆనందపడ్డాము. కాని తన్మయి చేసుకున్న ప్రార్థన వేరు. అమ్మవారే పిలిపించి చీర, గాజుల సారె పెట్టి ఆమెను సాగనంపిందన్న సంగతి ఆ తరవాత కానీ నాకు అర్థంకాలేదు.
"ఇది మెడికల్ కేసు కాదు. ఈ అమ్మాయి అన్నీ, అందరినీ, ఏకంగా ప్రపంచాన్నే మనసునుంచి వదిలేసింది. ఆ స్థితిలో, కోలుకోవాలన్న కోరికే లేక మైండు నంబ్ అయినప్పుడు ఏ మందూ, ప్రపంచంలోని ఏ వైద్యమూ ఆమె మీద పనిచేయదు" అని హైదరాబాద్ పంజాగుట్టలోని "మహా సిద్ధ వైద్య చికిత్సాలయ" అధిపతి, అపర ధన్వంతరి డాక్టర్ కె. వి. ప్రసాద్ గారు జూలైలోనే తన్మయి నాడి చూసి చెప్పారు. ఆయన పల్సును బట్టి మొత్తం శరీరాన్ని స్కాన్ చేయటమే కాదు- అనేక జన్మల కర్మప్రభావాలను కూడా పట్టెయ్యగలరు. అక్కడికీ బ్లడ్, ఓజోన్, మాగ్నెటిక్ థెరపీలు చేసి, జర్మనీ నుంచి తెప్పించిన అత్యాధునిక యంత్రాల మీద ఆమె ఒళ్లంతా శోధించి , ఎన్నో మందులిచ్చి శాయశక్తులా ప్రయత్నించారు. ఏదీ ఫలించదని నాడి చూసిన ప్రతి సారీ ఆయనకు తెలుస్తూనే ఉంది. మాకే అర్థం కాలేదు.
"విజయవాడలోని ఆమె అత్తవారు, కట్టుకున్నవాడు తన్మయి సర్వనాశనానికి భయానక క్షుద్రశక్తిని కొన్నేళ్లకిందటే ప్రయోగించారు. అది అడుగడుగునా అడ్డుపడుతున్నా పదకొండు రాత్రులు వారాహి జపం చేసి ఆమెను కాపాడాను. ఆమెను నా ఆరాధ్యదైవమైన ఉచ్చిష్ట గణపతికి అప్పగించాను. ఆమెలో ఏమీ లేదని మా అయ్యగారు చెబుతున్నాడు. ఏదో ఉందని ఏ డాక్టరు చెప్పినా నేను నమ్మను" అన్నారు పటాన్ చెరు లోని పాదుకాంత పూర్ణదీక్షాపరులు, మా అమ్మాయికి మంత్రగురువులు జివికె రావు గారు.
నిజమే! ఆమెలో ఏమీ లేదు. బంధమేదీ మిగలలేదు. ఆమె రోజూ పూజించే ఇష్టదైవమైన గణపతికే రావుగారు ఆమెను అప్పగించారు. ఆయన స్వీకరించాడు. వినాయక చవితి (2026 సెప్టెంబర్ 14) రాత్రి ఆమెని తన దగ్గరికి చేర్చుకున్నాడు.
శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ కు నేనంటే మహా ప్రేమ. మా కుటుంబంలో ఎవరికి ఏ ప్రాణగండం వచ్చినా ఆయనకు చెబుతాను. ఏ దేశాన ఉన్నా ఆయన వెంటనే అభయమిస్తారు. తన భక్తులలోని సంబంధిత వైద్యనిపుణులతో మాట్లాడి, పలుమార్లు శ్రద్ధగా చర్చించి, నయమయ్యేంత వరకూ ఫోన్లు చేస్తూ కుశలం కనుక్కుంటుంటారు. అలాంటిది నా ప్రియాతిప్రియమైన కూతురుకు బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతకంగా మళ్లీ ప్రకోపిస్తే స్వామి అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఆమెరికాలోని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారితో ఒకమారు మాత్రం మాట్లాడి ఊరుకున్నారు. "సర్జరీ చేయించాలా? వేరే ప్రత్యామ్నాయం చూసుకోమంటారా? " అని గుచ్చిగుచ్చి అడిగినా " నీకు వివేకం ఉంది. ఏదైనా ఆలోచించి సరైన నిర్ణయమే చేస్తావు. నువ్వు, నీ శ్రీమతి ఎలా నిర్ణయించినా నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి" అనేవారు. ఎందుకంత ఉదాసీనత అని మేము నొచ్చుకున్నాము. "ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. ఆమె స్థితి నాకు ముందే తెలుసు. విశ్వశక్తిలో తను కలిసి పోయింది. ఇక ఆమెకు జన్మ ఉండదు. ఏ కర్మకాండా ఆమెకు చేయనవసరం లేదు" అని విశ్వంజీ స్వామి అంతా అయిపోయాక మాకు రహస్యం వెల్లడించారు.
"మీ వంటి ప్రజ్ఞానిధులకు ధైర్యం చేకూరాలని స్వామిని ప్రార్థిస్తున్నాను . ఆ తల్లి తాను వచ్చిన పని పూర్తి చేసుకొని సద్గతి పొందినది ."అన్నారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.
చెన్నై లోని అపోలో హాస్పిటల్ వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేయక తప్పదని తేల్చాక ఆగమేఘాలమీద హైదరాబాద్ కిమ్స్ కు మావాళ్లు పరుగెట్టారు. అక్కడి న్యూరో సర్జన్ మానస్ పాణిగ్రాహి గారు చాలా గంటలు వెయిట్ చేయించి, పది రోజుల తరవాత కాని సర్జరీ చేయటానికి తనకు ఖాళీ లేదని సెలవిచ్చారు. వెంటనే చేయకపోతే ప్రాణానికి ముప్పు కాదా అని అడిగితే "ఫర్వాలేదు. అమ్మాయి ఇప్పుడు చక్కగా ఉన్నది కదా?" అన్నారట. ఆ విధంగా నిరర్థకమైన సర్జరీ బాధ ఆఖరి నిమిషంలో దైవికంగా తన్మయికి తప్పింది.
వెళ్లపోవటానికి ఆరు రోజులముందు ( సెప్టెంబర్ 8న) ఉదయం ఐదింటికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి మధ్యాహ్నం రెండింటికి విశాఖపట్నంలో దిగింది. ఎకాఎకి కారులో రెండు గంటలు ప్రయాణం చేసి చోడవరం దగ్గరిలోని ఆశ్రమ వైద్యశాలలో డాక్టర్ పెద్దపల్లి అప్పారావు గారిని కలిసి ఖరీదైన టీకా వేయించుకుంది. మళ్ళీ అదే రాత్రి దురంతో ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారేసరికి తిరిగి సికింద్రాబాద్ చేరింది.
(అప్పారావుగారు ముచ్చటపడి తీయించుకున్న ఫోటోచూడండి.)ఆరేళ్లకింద బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు మా అమ్మాయి భరించలేని తలనెప్పితో యమయాతన పడింది. ఈ సారి ట్యూమర్ అంతకంటే ఉద్ధృతంగా పెరిగినా పిసరంత కూడా తలనెప్పిలేదు. శరీరానికి ఏ బాధా లేదు. ఏనాడూ జ్వరం లేదు. ఎలాంటి సమస్యా లేదనే ప్రతి పూటా చెప్పేది. ఎప్పుడు చూసినా ముఖం నిర్మలంగా కళకళలాడేది. చివరి రోజు కూడా జపం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంది. పిల్లల సంగతి కూడా నీకు అక్కర్లేదా అంటే "లేదు" అన్నట్టు నిర్విచారంగా తల ఊపింది. తల్లి ఇచ్చిన పళ్లరసం తాగి రాత్రి 8 గంటలకు హాస్పిటల్ కు వెళ్లింది. 11 గంటలకు వరసగా ఫిట్లు వచ్చాయి. శరీరం ఎడమవైపు పెరాలసిస్ రానున్నదని ఐసియు డాక్టర్ అంటుండగానే హార్ట్ బీట్ 200 నుంచి అధాటున 0 కి పడిపోయింది. ప్రాణం పోయాక కూడా ఏ యాతన చాయలూ లేకుండా వదనం కళగా ఉంది.
ట్యూమర్, కాన్సర్ అంటూ మేము హడలిపోయాము. ప్రతి వైద్యుడూ తన ముందే అన్నీ చెబుతున్నా అది తన విషయం కానట్టు నిర్లిప్తంగా విన్నదే తప్ప తన్మయిలో భయమూ లేదు. ఆందోళనా లేదు. . చివరి వరకూ స్పృహలోనే ఉంది. ప్రతిదీ గుర్తున్నది. అవసరమైతే చక్కగా మాట్లాడగలిగేది. లలితా సహస్రాన్ని గొంతెత్తి పారాయణ చేయగలిగేది.
పిల్లలే ప్రాణంగా బతికిన మనిషి చివరి దశలో వారి మీద మమకారాన్ని కూడా వదిలేసింది. మురిపెంగా చూసేదే తప్ప పిల్లల గురించి బెంగపడలేదు.ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుమొగంతో ఉండేది. భవబంధాలను స్వచ్ఛందంగా, నిశ్చింతగా వదిలేసుకుని... కర్మ, ఋణం తీరగానే అనాయాసంగా వెళ్లిపోయింది.
నా ఇంట్లో నా దగ్గరే ఉన్నా ఆమె ఎవరో, తన ఆధ్యాత్మిక స్థితి, కాలక్రమంలో చెందిన పరిణతి ఎలాంటివో నేను గుర్తించలేక పోయాను. ఆ పుణ్యాత్మురాలిని కని పెంచినందుకు మేము ధన్యులమయ్యాము.










