Tuesday, 2 January 2024

వింత మతం .. భలే ప్రవక్త!

హిందూ నేషన్ -5

                


      మోసాలు చేసి, ద్రోహాలకు పాల్పడి, కుట్రలు పన్ని తెల్లవాళ్ళు మన దేశాన్ని తేరగా కాజేసిన తొలినాళ్ళ ముచ్చట.

      దక్షిణ భారతాన ఈస్ట్ ఇండియా కంపెనీ కొలువులో ఒక యూరోపియన్ ఆఫీసరు ఉండేవాడు. అతడి అసిస్టెంటు ఆఫీసరు నాయుడు అనే స్థానికుడు. తెల్లదొరకు  ఒక ఆర్డర్లీ ఉండేవాడు. అతడు బ్రాహ్మణుడు. ఒకరోజు అధికారి రోడ్డు మీద వెళుతున్నాడు. ఆర్డర్లీ అతడి వెనుకే బహు వినయంగా ఒదిగి నడుస్తున్నాడు. అసిస్టెంటు వారికి ఎదురుపడ్డాడు. పై అధికారిని  విష్ చేసి హుందాగా  షేక్ హాండ్ చేశాడు. వెనుక నిలబడిన ఆర్దర్లీని చూడగానే తలపాగా తీసి కాళ్ళకు దండం పెట్టాడు.

      తెల్లవాడికి ఆశ్చర్యం వేసింది. “నేను నీ సీనియర్ ఆఫీసరును. అయినా నా ఎదుట నిటారుగా నిలబడి కరచాలనం చేశావు. ఇతడు ఆఫ్టరాల్ నా నౌకరు, కానీ నడి వీధిలో మోకరిల్లి ఇతడికి పాదాభివందనం చేశావు. ఏమిటి సంగతి?” అని కుతూహలం కొద్దీ అడిగాడు.

      “మీరు నా పై అధికారే కావచ్చు. కాని మీరు మ్లేచ్ఛులు. ఈయన ఒక ప్యూనే కావచ్చు. కాని మా ప్రజలు ఎన్నో శతాబ్దాలుగా గొప్ప గౌరవభావంతో ఉన్న కులీన వర్గానికి చెందినవాడు. వారి ముందు మోకరిల్లటం నా విధి” అని అసిస్టెంటు ఆఫీసరు బదులిచ్చాడు.

      తెల్ల దొరకు దిమ్మ తిరిగింది. వెంటనే ఆ వైనాన్ని సీమ అధికారులకు రిపోర్టు చేశాడు. ఈ సమాజంలో  అత్యున్నత గౌరవ స్థానంలో ఉన్న బ్రాహ్మణుడిని గెంటేసి ఆ స్థానాన్ని ఎలాగైనా ఇంగ్లీషువాడు ఆక్రమించి అంతకంటే ఎక్కువ గౌరవం పొందితే తప్ప మన సామ్రాజ్యం ఈ దేశంలో ఎక్కువకాలం నిలబడదు – అని అతడు రాసిన లేఖ ఇప్పటికీ లండన్ లోని ఇండియా ఆఫీసులో ఉంది.  సుప్రసిద్ధ విప్లవ నాయకుడు లాలా హర దయాళ్ చెప్పిన ఊసు ఇది.

[Bunch of Thoughts , M.S.Golwalkar, , p.135]

     ఇలాంటి రిపోర్టు లు లండన్ కు ఇంకా చాలా అందాయి. ఈస్టిండియా కంపెనీ ఆఫీసర్లు, గవర్నర్లు, క్రిష్టియన్ మిషనరీలు అనేక ప్రాంతాల నుంచి అనేక విషయాలకు సంబంధించి పంపిన నివేదికలను చూసిన మీదట సీమ దొరలకు ఒక విషయం బాగా అర్థమయింది. భారతీయులకు వారి దేశం మీద, వారి సంస్కృతిమీద, వారి మతం మీద, వారి ధర్మం మీద, దానిని తెలియజెప్పి సరైన దారిలో నడిపించే పురోహిత బ్రాహ్మణ్యం మీద గాఢమైన  భక్తి,  విశ్వాసం ఉన్నాయి. మిగతా పాషండ మతాల్లా భూమిని, ప్రకృతిని భోగ వస్తువులుగా కాక దైవ స్వరూపంగా చూడమని హిందూ మతం నూరిపోస్తున్నది. దేశాన్ని పుణ్యభూమిగా చూడాలన్న మత బోధనుంచే దేశభక్తి , దానిలోంచి జాతీయ భావం,, విదేశీ పాలనపై తిరగబడాలన్న పౌరుషం పుట్టుకొస్తున్నాయి. దానివల్లే ఈ దేశంలో చొరబడినది మొదలు తమకు అడుగడుగునా ప్రతిఘటన ,ఎవరిలో చూసినా తమపట్ల ద్వేషం, జుగుప్స , ప్రాణాలు పోయినా సరే విదేశీ చెరనుంచి మాతృభూమిని విముక్తం చెయ్యాలన్న తెగువ పెల్లుబుకుతున్నాయి. ఇది ఎప్పటికైనా తమ పుట్టిముంచక మానదు . కాబట్టి ఇండియన్ల పొగరుకు , విగరుకు మూలమైన హైందవం మీద, ఈ దేశానికి ప్రాణమైన సనాతన ధర్మం మీద  వేటు వేయ్యాలి.  తమ గతాన్ని, దాని  వైభవాన్ని , తమ సంస్కృతిని, జాతీయ వారసత్వాన్ని  చూసుకుని చెలరేగుతున్న భారతీయుల జాతి గర్వాన్ని అణచివేయ్యాలి.

      అసలు కీలకం బోధ పడ్డాక ఏమి చెయ్యాలో తెలివిమీరిన తెల్లవారికి తెలుసు. ఇక ఆ తరవాత ఇంగ్లిషు చదువుల ద్వారా విషం ఎక్కించారు. ఇంకా అనేక మార్గాల్లో దేశీయుల బుర్రలు చెడగొట్టారు. భారతీయులను వారి దేశంలో వారినే మానసికంగా పరాయి వాళ్ళను చేసేందుకు ఆంగ్లేయులు ఎన్ని నీచాలకు ఒడిగట్టారో  అందరికీ తెలుసు . ఆ వివరాలలోకి ఇక్కడ వెళ్ళనవసరం లేదు. 

     ఇలాంటి కుతంత్రాలు సామ్రాజ్యవాదులకు మామూలే. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిషు మహా సామ్రాజ్యం తన బారిన పడిన అనేకానేక ఆసియా, ఆఫ్రికా దేశాలలోనూ ఇటువంటి పాపిష్టి ఎత్తుగడలకు పాల్పడింది. ఆ దేశాలలోనూ భీకర స్వాతంత్ర్య పోరాటాలు జరిగాయి.  మనలాగే మిగతా దేశాలూ ఎట్టకేలకు విదేశీ పెత్తనం నుంచి విముక్తమయ్యాయి. స్వాతంత్ర్యం పొందాక ఏ దేశానికా దేశం తన జాతీయ మూలాలను పటిష్ఠపరచుకుని, తన  మూల సంస్కృతిని కాపాడుకుని , విదేశీ కశ్మలాన్ని ఊడ్చేసి సంప్రదాయబద్ధంగా ముందుకు సాగింది.

     ఒక్క భారతదేశం తప్ప. ఇక్కడ నమ్ముకున్న జాతీయనాయకులే మాతృభూమిని  చేజేతులా రంపపుకోతకు గురిచేసి జాతిని నట్టేట( కాదు- రక్తపు ఏట్లో)  ముంచారు. అధికారం చేతికందాక జాతీయ వారసత్వాన్ని కాక బ్రిటిష్ వారసత్వాన్నే పుణికి పుచ్చుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాల కోసం తెల్లవారు భారతజాతికి ప్రాణశక్తి అయిన సనాతన ధర్మాన్ని , దానికి ప్రతిరూపమైన హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ జాతీయతను  దెబ్బతియ్యాలని శాయశక్తులా  కుతంత్రాలు పన్నారు. కాంగ్రెసు రాజకీయ ప్రయోజనాల కోసం మనవారనుకున్నవాళ్ళు కూడా అదే దారి పట్టి అదే సనాతనధర్మాన్ని , అదే హిందూ మతాన్ని, అదే హిందూ సంస్కృతిని, జాతీయతను నామరూపాలు లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్నారు.

     “నేను విద్య పరంగా ఇంగ్లిషువాడిని. భావపరంగా అంతర్జాతీయుడిని. సంస్కృతిని బట్టి మహమ్మదీయుడిని. పుటకను బట్టి ప్రమాదవశాత్తూ హిందువుని” – అని గర్వంగా, పబ్లిగ్గా ప్రకటించుకున్నవాడు  ప్రమాదవశాత్తూ ( అంటే ప్రజల ఆరాధ్యనాయకుడైన స్వాతంత్ర్య మహావీరుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ విమానానికి జరిగిన ప్రమాద వశాత్తూ) హిందూ దేశానికి, స్వతంత్ర భారతానికి మొదటి ప్రధాని, దౌర్-భాగ్య విధాత అయ్యాడు. తన హైందవ ద్వేషాన్ని అతడేమీ దాచిపుచ్చుకోలేదు. “As long as I am at the helm of affairs, India will not become a Hindu State.” (నేను గద్దె మీద ఉన్నంతవరకూ ఇండియా  హిందూ రాష్ట్రం కాబోదు) అని 1947లో పగ్గాలు చేపట్టిన కొత్తలోనే బహిరంగంగా తొడగొట్టిన హిందూ ద్వేషి మిస్టర్ నెహ్రూ. ఇండియాలో ఉన్నవి హిందూ, ముస్లిం అనే రెండే జాతులు , అవి కలిసి ఉండటం అసంభవం – అన్న జిన్నా ద్విజాతి సిద్ధాంతానికి  కాంగ్రెస్ కూడా  చందా కట్టి , భారతమాతను అడ్డంగా చీల్చి , ముస్లిం జాతికి పాకిస్తాన్ ను పంచి ఇచ్చాక అవశేష దేశం హిందూ జాతికే కదా న్యాయంగా చెందవలసింది? హిందూ దేశంలో హిందూ రాజ్యమే కదా ఉండవలసింది అన్న ఇంగిత జ్ఞానం అతగాడికి లేకపోయింది.   

      హిందూ సంస్కృతి గురించి మాట్లాడటం ఇండియా ప్రయోజనాలను గాయపరుస్తుందని 1949లో ఫరుక్కాబాద్ బహిరంగ సభలో జవాహర్లాల్ నెహ్రూ ఘోషించాడు. “In practice, the individual (Hindu) is more intolerant and more narrowminded than almost any person in any other country.” (ఇంకే దేశంలోని మరే వ్యక్తికన్నా ఈ వ్యక్తి (అంటే హిందువు) ఓర్వలేనివాడు ; సంకుచితమనస్తత్వం కలవాడు ) అని 1953లో కైలాష్ నాథ్ కట్జూ కు రాసిన ఉత్తరంలో ఈ అంతర్జాతీయ షరాబు నిగ్గు తేల్చాడు. “The ideology of Hindu Dharma is completely out of tune with the present times and if it took root in India, it would smash the country to pieces.”( హిందూ ధర్మమనే భావజాలం కాలానికి పనికిరాదు. ఇండియాలో అది వేరూనితే దేశాన్ని ముక్కలు చేస్తుంది ) అని 1951 లో లక్నో యూనివర్సిటీలో చేసిన మహోపన్యాసంలో నెహ్రూ పండిట్జీ సెలవిచ్చాడు

     1901 లో వారణాసిలోని సెంట్రల్ హిందూ కాలేజిలో చేసిన చారిత్రాత్మక ప్రసంగంలో పరాయి దేశానికి చెందిన అనీ బిసెంటమ్మ ఏమన్నదో చూడండి:

     “After a study of some forty years of the great religions of the world, I find none so perfect, none so scientific ,none so philosophic, and none so spiritual as the great religion known by the name of Hinduism.  Make no mistake; without Hinduism, India has no future. Hinduism is the soil into which India’s roots are struck, and torn of that she will inevitably wither, as a tree torn out from its place.”    

    (ప్రపంచంలోని గొప్ప మతాలను నలభై ఏళ్ళు అధ్యయనం చేస్తే హిందూ మతం అంత పర్ఫెక్ట్, దానంత సైంటిఫిక్ , దానంత తాత్వికత, ఆధ్యాత్మికత నిండిన మతం వేరేదీ నాకు కనపడలేదు...  హైందవం లేకుండా ఇండియాకు భవిష్యత్తు లేదు. ఇండియా మొదళ్ళు హిందూ మతం అనే నేలలో పాతుకుని ఉన్నాయి.  హిందూ మతంలో పాతుకున్న వేర్లను పీకేస్తే ఇండియా కూడా నేలనుంచి పీకిన  చెట్టు లాగే వాడిపోతుంది.)

      సంస్కారవంతురాలైన విదేశీ మహిళకు ఇండియా వేర్లు హిందూ మతంలో ఉన్నాయని , ఆ మొదళ్ళు పీకేస్తే ఇండియా మాడిపోతుందని అర్థమయింది. నవభారత నిర్మాతగా ఆకాశానికి ఎత్తబడిన ఇండియా పాలకుడి తెల్లకామెర్ల కంటికేమో హిందూ మతం వేర్లూనితే ఇండియా ముక్కలవటం ఖాయమని తోచింది . అదీ అతడి సంస్కారం!

     రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్ , శ్యాం ప్రసాద్ ముఖర్జీ , పురుషోత్తమ్ దాస్ టాండన్ వంటి విజ్ఞులైన జాతీయ నాయకులు కాలధర్మం చెంది కాంగ్రెసూ  , దేశమూ తన పాపిష్టి వంశానికి హక్కుభుక్తమయ్యాక  నెహ్రూ మరీ బరితెగించాడు.  తాను బనాయించిన  అబద్ధం అత్యద్భుత ఐడియాలజీ అయినట్టు  లెఫ్టిస్టు, కమ్యూనిస్టు మేళగాళ్ళ పక్క వాద్య సహకారంతో దేశమంతటా తాషామర్పా మోగించబట్టాడు. రాజకీయ అవసరార్థం ప్రవక్త అవతారమెత్తి ‘సెక్యులరిజం’ అనే నడమంత్రపు మతాన్ని పుట్టించి, భారత గడ్డపై దాని వేర్లు నాటటానికి  గడ్డపార చేతపట్టాడు.

     ఆ రకంగా నెహ్రూ బ్యాండుమేళం గజ్జె కట్టించిన ‘సెక్యులరిజం’ అనబడు కొత్తమతానికి సిద్ధాంతాల, సువార్తల  హంగూ ఆర్భాటమూ దిట్టంగా అమిరాయి.. జవాహర్ ప్రవక్త సాయించిన పవిత్ర సూత్రాలు స్థూలంగా ఏమిటంటే-

      1 ఇండియా గడ్డ మీద నివసించేవారు యావన్మందినీ కలిపి  ‘ఇండియన్ నేషన్’ అని వ్యవహరింపబడును.

       వివరణ: కొత్త మతం ప్రకారం జాతి అనేది పక్కా రియలెస్టేట్ వ్యవహారం. కల్చర్, గిల్చర్ , సెంటిమెంట్, గింటిమెంట్, ఎమోషన్స్, గిమోషన్స్ జాన్తా నై!  భారత భూతలం మీద నివాసం ఉండటమే  ... వోటర్ కార్డు, రేషన్ కార్డు గట్రా కలిగి ఉండటమే జాతీయతకు ప్రధాన అర్హత. సదరు భారత నివాసులు ఈ దేశ సంస్కృతిని గౌరవిస్తారా, ఇంకేదో విదేశీ సంస్కృతిని అనుసరిస్తారా? ఈ దేశం పట్ల విధేయత , మమకారం కలిగి ఉంటారా, లేక దేశాన్ని, జాతినీ, జాతీయ వారసత్వాన్నీ ఏవగించుకుంటారా అన్నది చూడకూడదు. ఈ దేశం దయ్యాలకొంప, దాని మతం ఒక భూతం, దాని విలువలు, విశ్వాసాలు , సెంటిమెంట్లు , సంస్కారాలు పూచికపుల్ల కంటే హీనం అని ఉమ్మేవారికి కూడా...  ఈ నేలను తల్లిగా ఆరాధించి, దాని సంస్కృతిని , నాగరికతను ప్రేమించి వాటికోసం ప్రాణం ఇచ్చే భూమిపుత్రులతో సమానంగా, ఆ మాటకొస్తే ఇంకా ఎక్కువగా గౌరవం , ప్రాధాన్యం చచ్చినట్టు  ఇచ్చి తీరాలి. . దీనికి ‘కాంపోజిట్ కల్చర్’, “టెరిటోరియల్ నేషనలిజం’ అని పేరు.

     2. జాతీయులకు జాతీయ గీతం పట్ల, జాతీయ పతాకం పట్ల , జాతీయ వీరుల పట్ల, జాతీయ స్మారకచిహ్నాల పట్ల భక్తి భావం ఉండాలని కంపల్సరీగా  కట్టడి చేయటం పాపం.

      వివరణ: ‘వందే మాతరం’ లక్షలాది స్వాతంత్ర్య అమర వీరుల గొంతులతో పునీతమైనా సరే... చట్టపరంగా దానికి జాతీయగేయం ప్రతిపత్తి ఇచ్చినా సరే- దానిని పాడి తీరాలని ఎవరినీ నిర్బంధించకూడదు. తమ మతవిశ్వాసానికి భంగకరమని భావిస్తే వందేమాతరం పాడటమా, మానటమా, లేక కట్ చేసి పాడటమా అనేది ఆయా మతస్థుల ఇష్టానికి, విజ్ఞతకు వదిలివేయాలి. మన జాతికి కొత్త ప్రవక్తను ప్రసాదించిన మూల దేవుడు మహాత్మా గాంధీ గారు  1923లో ఈ రకమైన రూలింగు ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాలి. నడమంత్రపు మతం పాత నిబంధనల విషయంలో సందేహం వస్తే మార్గ దర్శనంకోనం మన సెక్యులర్ ఇలవేల్పుల  దివ్యజీవన లీలలను ఉపదేశాలుగా గ్రహించవలెను. అలాగే జాతీయ గీతమైన  జనగణమన పాడటానికి మతవిశ్వాసాల కారణంతో ఏ మైనారిటీ స్కూలు వారైనా , అక్కడి ఏ టీచరైనా నిరాకరిస్తే భారత జాతీయులుగా వారికున్న రాజ్యాంగబద్ధ పౌర స్వేచ్చను వినియోగించటం గానే దానిని  పరిగణించాలి. సినిమా హాల్లో జాతీయగీతాలాపనకు గౌరవ సూచకంగా లేచి నిలబడని వారి పౌర స్వాతంత్ర్యాన్ని గౌరవించాలే తప్ప బలవంతపెట్టకూడదు. జాతీయ పతాకాన్ని లెక్కచేయని వారినీ డిటో డిటో. ఇండియాని తుక్డా తుక్డా చేస్తామని రంకెలేయటం కూడా పౌరస్వేచ్ఛలో భాగమేనని గ్రహించవలయును.

      3 ఇండియా హిందూ దేశం కాదు. హిందూ జాతి కాదు. హైందవం అనేది కేవలం ఒక మతం. దేశంలోని అనేకానేక మతాలలో అదీ ఒకటి. మెజారిటీ మతానికి అంటూ ప్రాధాన్యం  ఏమీ ఉండరాదు. సర్వధర్మ సమభావం , సకల మత సహిష్ణుత మన జాతి ప్రత్యేకత. అన్ని మత సముదాయాలూ కలిస్తేనే  భారతీయ జాతి , లేక ఇండియన్ నేషన్ .

      వివరణ: తమది ఒక నేషన్ అన్న భ్రమ నుంచి  హిందువులు బయటపడాలి. ఇండియా, ఇండియన్, భారత, భారతీయ-లకు అనాదిగా ఉన్న అర్థాలకు కాలం చెల్లిందని గ్రహించాలి. క్రైస్తవులు , మహమ్మదీయులు లాగే హిందువులూ సెక్యులర్ దేశం లోని జస్ట్ ఒక రిలిజియస్ కమ్యూనిటీ. అంతే!

        ఈ రకంగా భారత జాతికి, భారతీయతకు అనూచానంగా స్థిరమైన అర్థాలకు నూకలు చెల్లి, సరికొత్త ‘భారతీయ’ భావన మొలుచుకొచ్చాక,  ‘సెక్యులరిజం’ అధికారిక మతంగా పోలిటీలో పాతుకుపోయాక మారిన విధానానికి  తగ్గట్టు కొన్ని కొంగొత్త ఆలోచనలు, వాటికి తగ్గ సవరణలు, సంస్కరణలు, కట్టుదిట్టాలు అవసరమయ్యాయి. అవేమిటంటే-

       1 ఉన్న బోలెడు మతసముదాయాలలో కెల్లా పెద్దది హిందూ కమ్యూనిటీ అయినందున సహజంగా అది మిగతా కమ్యూనిటీల ఉనికికి ఎల్లప్పుడూ  ప్రమాదకారి !

       2. మిగతా మతాలను హిందూ మతం మింగి వేసే ప్రమాదం ఉన్నది కాబట్టి హిందూ మతాన్ని ఏ మేరకు బలహీనపరిస్తే ఆ మేరకు అన్యమతాలకు, జాతి హితానికి  క్షేమం.

        3. సరికొత్త సెక్యులర్ జాతీయతలో మైనారిటీ మత వర్గాలు సమగ్ర ,అతిముఖ్య భాగం. కాబట్టి హైందవేతర మతాల ప్రయోజనాలను ప్రోత్సహించటమే జాతి కి శ్రేయోదాయకం. దీనికి corollary ఏమిటంటే- హిందూ మత ప్రయోజనాలను  కుంగతీయటమే అన్యమతాలకూ, జాతి అభివృద్ధికి  శ్రేయస్కరం.  హిందువుల అణచివేత జాతీయతకు కీలకం . హిందూ వ్యతిరేకత సెక్యులర్ ఇండియా జాతిలక్షణం.

      4. హిందూ మతానికి మూలం, ప్రాణం సనాతన ధర్మం కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని ఎన్ని విధాల కుళ్ళబొడిస్తే , ఎంతలా అప్రతిష్ఠ పాలు చేస్తే ,ఎంత భ్రష్టు పట్టిస్తే జాతి అభ్యుదయానికి, నేషనల్  ఇంటిగ్రేషన్ కీ , ఇతర మతాల పురోభివృద్ధికీ అంత  మేలు.

      5.సర్వధర్మ సమభావం లేక సర్వమత సమానత్వం మనం ఎంచుకున్న జాతీయ విధానం . కాబట్టి  ప్రత్యేకంగా ఏ ఒక్క మతానికీ , ముఖ్యంగా మెజారిటీ హిందూ మతానికి  జాతీయ జీవనంలో ఏ రకంగానూ  ప్రత్యెక ప్రాముఖ్యం ఉండరాదు. హిందువుల వీరులను జాతీయ వీరులుగా , హిందువుల పండుగలను జాతీయ పండుగలుగా , హైందవ సంస్కర్తలను జాతీయ సంస్కర్తలుగా, హిందూ దేశ చరిత్రను జాతీయ చరిత్రగా పరిగణింపకూడదు. అనేక మతాలలో ఒకటైన హిందూ మతం సంస్కృతిని జాతీయ సంస్కృతిగా గుర్తించరాదు. సర్వమత సమానత్వం ప్రకారం ఇస్లాం, క్రైస్తవ మతాల చరిత్రలను, ఐడియాలజీలను కూడా జాతీయ చరిత్రలో , జాతీయ ఐడియాలజీలో భాగంగానే భావించాలి.

     ప్రపంచంలో ఏ సమాజంలోనూ, ఏ ప్రజాస్వామిక దేశంలోనూ కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ వర్గాన్ని దారుణ వివక్షకు గురిచేసే విధంగా ఇలాంటి ముదనష్టపు ఆలోచనలను రుబ్బి , నికృష్ట విధానాలను పొదిగి  నెహ్రూ ప్రవక్త తయారుచేసిన  ‘సెక్యులరిజం’ అనే మతాన్ని కాలక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఔదలదాల్చాయి. పైన ఉదాహరించిన  అలిఖిత, అప్రకటిత  సెక్యులరిస్టు కమాండ్ మెంట్లను పైకి చెప్పకుండా గుట్టుగా అమలుపరచటమే తమ సెక్యులర్ శీలానికి అగ్ని పరీక్ష అని కాంగ్రెస్, నాన్ కాంగ్రెస్ తేడా లేకుండా కేంద్ర రాష్ట్రాలలో అన్ని సర్కార్లూ భావించటంతో పోనుపోను ఇదే జాతీయ ఏకాభిప్రాయంగా , నేషనల్ పాలిసీగా రాజకీయ జీవుల మనసులలో ముద్రపడి పోయింది . సెక్యులరిజమే మన జాతీయ వారసత్వం , అదే భారత జాతీయతకు ప్రాణం , ప్రణవం అని మిడిమేలపు మీడియాగాళ్లు, అభారతీయ , హిందూ వ్యతిరేక , అమాంబాపతు కుహనా మేధావులు నాన్ స్టాప్ గా ఊదర పెట్టటంతో ఔను కాబోలని అమాయక జనమూ అనేసుకున్నారు. దేవతా వస్త్రాల కథలో లాగా దిగంబరంగా ఊరేగుతున్న సెక్యులరిస్టు రాజుగారి ఒంటిమీద ఉడుపులు లేవని  అంటే తమ పుట్టుకల మూలాలకు ఏమి ముప్పోనన్న భయంతో హిందూ సమాజంలో అన్నీ తెలిసిన పెద్దలు కూడా నోళ్ళు కుట్టేసుకున్నారు. 

      ఇదీ హిందూ దేశానికీ , హిందూ జాతికి, హిందూ జాతీయతకు, హిందూ మతానికి  వచ్చిన అసలు సంకటం. దీని ఫలితాలూ పర్యవసానాలూ వచ్చే అధ్యాయంలో.

      ( అదనపు సమాచారం కోసం Abhas Chatterjee ఉపన్యాస పాఠమైన చిరుపుస్తకం  “The Concept of Hindu Nation” చదవండి. ‘Voice of India’ ప్రచురణ . ప్రతి హిందువు, ప్రతి జాతీయ మేధావి చదివి తీరవలసిన పుస్తకం. )



                                             -------------------------------

 

 

 

 

 

    

 

     

     

  

 

 

     

 


No comments:

Post a Comment