Monday, 1 January 2024

జాతి ఎందుకు కాదు?!

 

 హిందూ నేషన్ -4                                         

       అసలు హిందువుల మధ్యే ఐక్యత లేదు. వారిలో ఎన్నో వర్గాలు . ఎన్నో తెగలు. వాటిలో వాటికి ఎన్నో గొడవలు. భాషలో, సంస్కృతిలో, మత విశ్వాసాలలో , అచార వ్యవహారాలలో  బోలెడు తేడాపాడాలు. ఇక వారు కలిసి ఒక జాతి ఎలా అవుతారు?

       అవుతారు. ఎలాగంటే-

       భూమి మీద ఏ ఇద్దరూ ఒక లాగ ఉండరు. భాష, సంస్కృతి, జాతి, మతం అన్నీ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండే  ప్రజలు ఏ దేశం లోనూ దొరకరు. అంతర్గతంగా వారిలో వారికి ఎన్ని విభేదాలు, ఎన్ని వైరుధ్యాలు , ఎన్ని అసమానతలు అయినా ఉండనీ!   పైకి కనిపించే విభేదాలకు మించిన అనుబంధమేదో వారి నడుమ బలీయంగా ఉన్నదా? ఆ బంధమే, ఆ సమానాంశమే  ప్రపంచం లోని మిగతా జాతులతో పోల్చితే వారిని ప్రత్యేకంగా , విలక్షణంగా నిలబెడుతుందా? అంతర్గతంగా వారిలో వారికి ఉన్న అంతరాలకంటే  కూడా వారికీ ప్రపంచంలోని మిగతా జన సముదాయాలకూ నడుమ ఉన్న అంతరం పెద్దదా? అదిగో-  విలక్షణమైన అలాంటి ప్రత్యేక లక్షణాన్ని బట్టే ఆ ప్రజలు  ఒక ప్రత్యేక  జాతిగా గుర్తించబడతారు.

      హిందువులది ప్రత్యేక నేషన్ అంటే ఒప్పుకొని వారు కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలను (USA), గ్రేట్ బ్రిటన్ , రష్యా , జర్మనీ వగైరాలను నేషన్స్ గా గుర్తిస్తారు. అక్కడి ప్రజలను నేషన్ అని పిలవటానికి ప్రతిపదిక ఏమిటి?

      ఉదాహరణకు గ్రేట్ బ్రిటన్ నే తీసుకోండి. అక్కడ ఎలా చూసినా మూడు రకాల భాషలున్నాయి. గతంలో వారిలో వారు చచ్చేట్టు కొట్టుకునేవారు. ఇప్పటికీ వేరువేరు బీజాలు, రక్తాలు, రేస్ (Race) ల ఆనవాళ్ళు అక్కడ కనపడతాయి. అయితేనేమి? వారికంటూ ఒక కామన్ దేశం , కామన్ భాష, కామన్ సంస్కృతి, కామన్ పవిత్రభూమి కలిగి ఉన్నారు కాబట్టి వారిది ఒక నేషన్ అని మీరంటారా? అవన్నీ హిందువులకు  లేవా?



      హిందువులకూ  హిందూస్తాన్ అనే సహజ సిద్ధంగా ప్రకృతి మలచిన కామన్ దేశం ఉంది. అన్ని దేశభాషలకూ తల్లి అయిన సంస్కృతం అనే కామన్ భాష ఉన్నది. అనాదిగా వారి పూర్వీకులు పరమపూజ్యంగా  తలుస్తున్న  పవిత్ర గ్రంథాలు , ప్రామాణిక శాస్త్ర గ్రంథాలు అన్నీ సంస్కృతంలోనే రాయబడి ఉన్నాయి. వారి పూర్వులు కూడా ఆ భాషలోనే మాట్లాడుకునేవారు.  సామాజిక ఉత్సవాలు, పండుగలు, సాంస్కృతిక కళారూపాలు కూడా ఇంగ్లిషు వారి కి ఉన్నపాటి కంటే ఎక్కువ కామన్ గానే వారికీ  ఉన్నాయి.

      హిందువుల పూర్వీకులు బందిపోట్లు, సముద్రపు దొంగలు కారు. సగర్వంగా స్మరించదగ్గ మహానుభావులైన వైదిక ఋషుల సంతతి వారు. పాణిని, పతంజలి వారికి వ్యాకరణ గురువులు. భవభూతి, కాళిదాసు వారి దృష్టిలో షేక్స్ పియర్ ను తలదన్నిన వారు. వారి ఆదర్శ పురుషులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. శౌర్య పరాక్రమాలలో ఆంగ్లో సాగ్జన్ వీరుల  కంటే వెయ్యి రెట్లు గొప్పవారు . శివాజీ, రాణా ప్రతాప్ , గురు గోవింద్ లు హిందువులందరికీ స్ఫూర్తి ప్రదాతలు. బుద్ధుడు , మహావీరుడు, కణాదుడు, శంకరుడు వంటి ఎందరో ప్రవక్తలమీద కామన్ గా హిందువులందరికీ భక్తిప్రపత్తులు ఉన్నాయి. ప్రాచీన యుగాల నుంచి ఆధునిక కాలం దాకా హిందువుల చరిత్ర కామన్. మూల భాష కామన్. నాగరీ లిపి కామన్ . హితైషులు కామన్. శత్రువులు కామన్.  ప్రమాదాలు కామన్. వాటిని ఎదుర్కోనటంలో సాధించిన విజయాలు కామన్. పరాజయాలు కామన్.  ఇన్నిన్ని ఉమ్మడి సమానాంశాలు కలిగి...  వైభవాలనూ,  ఉపద్రవాలనూ స్వదేశంలో కలిసి అనుభవించి , కాలపు కత్తుల వంతెన మీద యుగాల పర్యంతం కలిసి ప్రయాణించి కష్టాలను, సుఖాలను కలిసి పంచుకున్న హిందువులది ప్రత్యేక నేషన్ కాకపొతే .. నేషన్ అనిపించుకునే యోగ్యత ప్రపంచంలో వేరేవరికి ఉంది?!

      కొన్ని జాతుల వారికి - ఉండే దేశం వేరు. పవిత్రంగా తలచే పుణ్యభూమి వేరు. జాతిపరంగా ఒక దేశంలో నివసిస్తూనే విశ్వాసపరంగా వారి విధేయత వేరొక వైపు ఉంటుంది. జాతీయతకూ , మత విధేయతకూ నడుమ ఘర్షణ సైతం ఒక్కోసారి పొడసూపటం కద్దు. ఆ ఖర్మ హిందువులకు పట్టలేదు. ఎందుకంటే ఇతర జాతులకు వలె వారి పవిత్రభూమి మాతృభూమి  వెలుపల ఎక్కడో లేదు. స్వదేశమే వారి పుణ్యభూమి; కర్మభూమి.  రాష్ట్రీయ  ఏకాత్మత కొన్ని బాపతుల ఇతర జాతీయులకంటే  హిందువులకు హెచ్చు. అదే హిందూ జాతిని ప్రపంచంలోని మిగతజాతుల కంటే భిన్నంగా , విలక్షణంగా నిలబెడుతుంది. ఇదుగో ఈ తేడాయే, ఈ విలక్షణ ఏకాత్మతే వారిలో వారికి విభేదాలు,  వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ హిందువులు  ప్రత్యేక నేషన్ అనటానికి అతి ప్రధాన అర్హత.  రాష్ట్రీయ చైతన్యం పెరిగే కొద్దీ , హిందూ సంగఠన బలపడేకొద్దీ , సామాజిక సంస్కరణ ఉద్యమాల ప్రభావం వల్లా హిందువులలో పరస్పర విభేదాలు , వైరుధ్యాలు కూడా ఈ కాలంలో  త్వరితగతిన తగ్గిపోతున్నాయి.

       నీగ్రోలు, జర్మన్లు, ఆంగ్లో సాగ్జన్ల  భీకర యుద్ధాలతో రక్తపుటేర్లు పారి, గౌరవంగా చెప్పుకోగలిగిన కామన్ చరిత్ర అంటూ మొదలై నాలుగైదు శతాబ్దాలు మించని ఉత్తర అమెరికాది (USA)  జాతి అని గుర్తిస్తారు కదా? మరి-  చరిత్రకు అందినంతలో వేల సంవత్సరాల పర్యంతం శాంతి , సౌభ్రాతృత్వ , సహజీవన సౌరభాలను నిఖిల జగతికి గుబాళింపజేసిన హిందువులది నేషన్ కాదని ఎవరు అనగలరు? జాతుల నిర్ధారణకు ప్రపంచమంతటా సాధారణంగా పరిగణించే – కామన్ దేశం, కామన్ రేస్ , కామన్ రిలిజియన్, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి భాష లాంటి ఏ ప్రమాణాన్ని బట్టి చూసినా హిందువులది కచ్చితంగా ప్రత్యేక జాతే. మనది ముమ్మాటికీ హిందూ నేషనే.

      భారత దేశం మనకు ఎందుకు ప్రియమైనదంటే – మన హిందూ జాతికి అది జన్మభూమి కాబట్టి. మన దేవుళ్ళకూ , దైవ సమానులైన మన మహాత్ములకూ, మహర్షులకూ, ప్రవక్తలకూ, మన మహా వీరులకూ అది ఆటపట్టు కాబట్టి. కేవలం నేలగానే చూస్తే దీనికంటే సంపన్నమై , బంగారం, వెండి కొండలతో వెలిగిపోయే  దేశాలు భూమి మీద చాలా ఉండవచ్చు.  నదిని నదిలా చూస్తే గంగకూ మిసిసిపీకీ పెద్ద తేడా లేదు. గంగాజలమూ , వోల్గా నీరూ చూడటానికి ఒకలాగే ఉంటాయి. హిందూస్తాన్ లోని రాళ్ళూ, చెట్లూ , పచ్చదనాలూ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి.  అయినా హిందూస్తాన్ మనకు పితృభూమి, పుణ్యభూమి ఎందుకైందంటే – అలాంటి భూమి ప్రపంచంలో వేరెక్కడా లేకపోవటంవల్ల కాదు. అది అనాదిగా మన పితరుల నెలవు కాబట్టి. మన తల్లులు మనకు ఇక్కడే పాలిచ్చి పెంచారు కాబట్టి. తరతరాలుగా మన తండ్రులు మనలను ఇక్కడే మోకాళ్ల మీద ఊగించారు కాబట్టి. మన చరిత్రతో ఈ భారత భూమి పెనవేసుకుపోయింది కాబట్టి.  ఇంగ్లిషువారికి ఇంగ్లాండు ఎంతో, జర్మన్ జాతికి జర్మన్ ఎలాగో, జపానీయులకు జపాన్ ఎంతో హిందువులకు హిందూ దేశం అంత. దీనిని ఎవరు కాదనగలరు?

      హిందూ జాతి పుట్టింది వేద యుగంలో కనీసం కొన్ని వేల సంవత్సరాల కిందట.  మన పూర్వీకులు సప్త సింధు తీరాల వెంబడి నివసించి, వర్ధిల్లి , భవిష్యత్తులో మహా శక్తిగా ఎదగబోయే హిందూ జాతికి పునాదులు వేశారు. జాతి(రేస్) పరంగా, సంస్కృతి రీత్యా వారు ఆర్యులు అనబడ్డారు.  భూమి పరంగా వారు సప్తసింధు పేరు ధరించారు. సింద్ పేరిట ఈ కాలానికీ ఒక రాష్ట్రం (province) ఉంది. అక్కడి వారిని సింధీలు అంటారు. మన పూర్వులు సరస్వతి, గంగా తీరాలను , వింధ్య పర్వతాలను దాటి గోదావరి తీరాల వరకూ విస్తరించారు. భారత దేశపు దక్షిణ, పశ్చిమ, తూర్పు కోసలవరకూ జైత్రయాత్ర చేశారు.  రాజకీయ, సాంస్కృతిక, జాతీయ సంబంధాలు, సంపర్కాలు, సంఘర్షణలు, సమీకరణాల ద్వారా అనార్య ప్రజలను క్రమేణా  తమలో కలిపేసుకుని ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణ సముద్రం వరకూ, సింధు నుంచి తూర్పు సముద్రం వరకూ ఒక నేషనల్ యూనిటుగా మలిచారు. కామన్ రిలిజియను, కామన్ భాష , కామన్ మాతృభూమి, కామన్ పుణ్యభూమి , కామన్ సంస్కృతి ప్రాతిపదికలుగా ప్రజలను కలిపి ఏక జాతి (రాష్ట్రం)గా రూపొందించే సుదీర్ఘ ప్రక్రియలో పాలిటిక్సూ రిలిజియనూ పోటీలు పడ్డాయి. సంఘర్షణ లోంచి సామరస్యం ఉద్భవించింది. అది శాంతియుత సహజీవనానికి బాట వేసింది. ఆ సంఘీభావం, సౌభ్రాతృత్వం పునాదిగా జాతీయ ఏకాత్మత రూపు దిద్దుకున్నది.  

      మన మాతృభూమికి  ఎల్లల వలె నాలుగు దిక్కులా నిలచిన బద్రీ కేదార్ – జగన్నాథ్ – రామేశ్వరం –ద్వారక  పుణ్యధామాలను గమనించండి. పురాణ కాలాన్ని పక్కనబెట్టి  మనకు తెలిసిన కచ్చితమైన చరిత్రమొదలైన కాలంనుంచే చూడండి. చంద్రగుప్త మౌర్యుడు, గుప్త చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు,యశోవర్ధనుడు, పులకేశి , శ్రీహర్షుడు, ఇంకా ఎందరో మహా చక్రవర్తుల  సార్వభౌమత్వంలో మన ప్రజలు సంఘటితమై సమష్టి రాజకీయ , జాతీయ అస్తిత్వాన్ని ఎలా అనుభూతి చెందారో పరిశీలించండి. గ్రీకులు, శకులు, హూణులు ఇత్యాది విజాతీయులు ఎంత భీకరంగా దాడులు చేసి మన ప్రజలను ఎంతలా అతలాకుతలం చేసినా ఉమ్మడి ముప్పు ను ఎదుర్కోవటానికి సంఘటితమై ఒక్కోమారు శతాబ్దాల పర్యంతం మన వారు ఎన్ని మహా పోరాటాలు సాగించలేదు?

      ఇలా సహజీవనాల, కలిసి ప్రయాణాల , కలిసి పోరాటాల ఆత్మీయత నుంచి మనకు సాంస్కృతిక, రాజకీయ , జాతిపరమైన , ధర్మ సంబంధమైన దగ్గరితనం, ఏకీభావం బలపడ్డాయి. వాటినుంచి జాతీయ చైతన్యం పురివిప్పింది. అంతర్గత విభేదాలు, తారతమ్యాలు, సామాజిక చీకటి కోణాలు ఎన్ని ఉన్నా ఆ సమష్టి చైతన్యమే ప్రపంచంలోని ఇతరేతర నేషనల్ యూనిట్లకు భిన్నంగా హిందూ సమాజాన్ని నిలబెట్టింది.

      ఎట్టకేలకు హూణులను అణచి వేశాక , మహమ్మదీయుల దండయాత్రల వరకూ నడుమ ప్రశాంతంగా గడచిన శతాబ్దాల సుదీర్ఘ కాలం మన ప్రజలు మరింత సంఘటితం కావటానికి తోడ్పడింది. జాతి, మత, సంస్కృతి , రాజకీయ పరంగా వారి ఏకాత్మత  ఆ కాలాన  మహావైభవంగా వర్ధిల్లింది.

      ప్రాచీన వేద యుగంలో సప్త సింధు నుంచి వ్యుత్పత్తి అయిన హిందు నామం పృధ్వీరాజ్ కంటే పూర్వమే జాతికి గౌరవ వాచకంగా , దాని శౌర్యానికి  ప్రియమైన ప్రతీకగా మారింది. వరస దాడుల దరిమిలా మహమ్మదీయుల ఆధిపత్యం ప్రబలి దిల్లీలో ముస్లిం సామ్రాజ్యం నెలకొన్నాక దెబ్బతిన్న హిందువులలో  రాజకీయ ఐక్యత కాశ్మీర్ నుంచి రామేశ్వరం వరకు, సింధ్ నుంచి బెంగాల్ దాకా వెనకటి కంటే మరింత బలిష్టమయింది. హిందూ మతం గౌరవాన్ని కాపాడటం కోసం వేలాది ధర్మవీరులు ప్రాణాలను బలి ఇచ్చి ధన్యులయ్యారు.  రాజులు, రైతులు ఒకే విధంగా తిరగబడి , హిందూ పతాకం కింద హిందువులుగా సంఘటితమై హైందవ వ్యతిరేకులైన శత్రువులతో పోరాడుతూ నేలకొరిగారు.

      అప్పుడు వీర శివాజీ పుట్టాడు. హైందవ విజయభేరిని మోగించాడు. ముస్లిముల ఆధిపత్యానికి చెల్లుచీటీ ఇచ్చాడు. హిందువులు అనే  సర్వనామం పేరిట  , హిందూ ఉమ్మడి ధ్వజం కింద, ఉమ్మడి హైందవ నాయకత్వాన ‘హిందూ పద పాదుషాహి స్థాపన’ ఆదర్శంగా, హిందూస్తాన్ రాజకీయ విమోచన  అనే ఉమ్మడి ధ్యేయం తో , విజాతీయుల చెర నుంచి మాతృభూమి విముక్తికి దీక్షాబద్ధమై  భారతభూమి ఎల్లెడలా హిందువులు సింహాల్లా ముందుకు దూకారు. దాని ఫలితంగా మరాఠా  సమాఖ్య  ధర్మ ఖడ్గం చేతపట్టి ముస్లిం నవాబులను, నిజాం లను, బాద్షాలను, పాదుషాలను  నూరు  యుద్ధరంగాలలో నేలకరిపించింది. మరాఠా వీరులు నాలుగు దిక్కులా దిగ్విజయంగా జైత్ర యాత్ర సాగిస్తూ తంజావూరు, గుంటి, కొల్హాపూరు, బరోడా, ధార్ , గ్వాలియర్, ఇండోర్ , ఝాన్సీ లను వశం చేసుకుని అటక్ దాకా చేరారు.  మొఘలాయీ ముసల్మాన్  చక్రవర్తులను పాదాక్రాంతం చేసుకుని , బందీలను చేసి తాము విదిల్చే భరణాల బిచ్చం మీద బతికే స్థితికి  తీసుకొచ్చారు. సిక్కు హిందువులు పంజాబ్ ను పరిపాలిస్తే , గూర్ఖా హిందువులు నేపాల్ ని ఏలారు. రాజపుత్ర హిందువులు రాజస్థానంలో విరాజిల్లితే మరాఠాలు దిల్లీ నుంచి తంజావూరు వరకూ , ద్వారక నుంచి పూరీ వరకు ఏకచ్ఛత్రాధిపత్యం సాగించారు. ఆ విధంగా వైదిక సింధులు కాలక్రమాన మహా శక్తిమంతమైన హిందూ సంతతిగా , హిందూ జాతిగా రూపాంతరం చెంది  బాజీరావు, సదాశివరావుల  చేతిలో హిందూ పద పాదుషాహి కత్తిలా వీరవిహారం చేశారు.

      “మన దేశం ఇంకేమాత్రం  తుర్కస్తాన్ కాదు...  హిందుస్థాన్! అటక్ నది నుంచి హిందూ మహాసముద్రం వరకూ హిందువుల రాజ్యం విస్తరించింది. పాండవుల నుంచి విక్రమాదిత్యుడి వరకూ ఇవే మన సరిహద్దులు. వారు వాటిని పరిరక్షించి సామ్రాజ్యాలను ఏలారు. అనంతరకాలంలో వచ్చిన పాలకుల నీరసత్వం మూలంగా ముస్లిములు మనలను  జయించగలిగారు. మహాద్ జీ షిండే వీర ఖడ్గం ద్వారా పీష్వాల నాయకత్వంలో మన రాజ్యం మళ్ళీ మనకొచ్చింది. హిందూ సామ్రాజ్యం మళ్ళీ సుస్థాపితమయింది. మన దిగ్విజయ కీర్తి దశ దిశలా మారుమోగుతున్నది”

       నిజాం రాజ్యం లో మరాఠా రాయబారిగా ఉన్న గోవిందరావు కాలే 1793 లో నానా ఫడ్నవీస్ కు రాసిన లేఖ లోని ఈ వాక్యాలు  ఎట్టకేలకు హిందూ సామ్రాజ్య పునః స్థాపన జరిగినందుకు ఆ కాలపు  హిందువుల పరమానందానికి మచ్చు తునక.  

     బహుశా చైనా  మినహా  ప్రపంచంలో ఇంకే జాతికీ హిందూ జాతికున్నంత ఆవిచ్ఛిన్న జీవన స్రవంతి లేదు.  కుంగదీసే  కష్టాలు , నడుములు విరిగే నష్టాలు, భయానక అనుభవాలు శతాబ్దాల పర్యంతం ఎన్ని ఎదురైనా తట్టుకుని నిలబడి , ఎన్ని ఉపద్రవాలు ఒకే సారి పైనబడి ఉసురు తీయజూసినా  కకావికలు కాక, అస్మితను వదులుకోక హిందువులవలె తన ఉనికిని కాపాడుకోగలిగిన  జాతి మానవ చరిత్రలో మరొకటి కనిపించదు.

      ప్రపంచంలో కొన్ని జాతులవలె హిందూ జాతిది కుక్కగొడుగు లాంటి పెరుగుదల కాదు. ఏవో పరిస్థితుల్లో ఏదో కారణం చేత ఏవో దేశాల నడుమ కుదిరిన ఒడంబడిక ఫలితంగా పుట్టిన Treaty Nation కాదు హిందూ జాతి. ఏదో ప్రయోజనాన్ని ఆశించి ఎవరో చేసిన కాగితం బొమ్మ కాదు హిందూ జాతి. ఎవరి ఆర్డరు ప్రకారమో , ఏ సామ్రాజ్య కూటనీతిలో భాగంగానో , ఏ శక్తుల కుత్సితపు ఎత్తుగడ వల్లో జాతిజన్మ ఎత్తే కర్మ హిందూ జాతికి పట్టలేదు. ‘హిందూ జాతి’ ఏ మతం వారిని భయపెట్టటానికో, వేరేవరినో మోసం చెయ్యటానికో అల్లిన  అబద్ధం కాదు. అది ఉత్తర సరిహద్దును కాపుకాసే హిమాలయాలంత  దృఢమైన, స్థిరమైన వాస్తవం.

     మనలో మనకు వెయ్యిన్నొక్క తేడాలూ పేచీలూ ఉన్నా , మనలో మనం ఎంత కొట్లాడుకున్నా చరిత్ర, సంస్కృతి, మతం, జన్యుబంధం  వంటి అంశాలలో సమానత , ఏకాత్మత ల కారణంగా ప్రత్యేకమైన సజాతీయ సమూహంగా ప్రపంచంలో నదరుగా కనపడతాము. మిగతా అన్ని జాతులకూ  భిన్నంగా ప్రత్యేక అస్తిత్వం కలిగి ఉన్నాము. కాబట్టి మనది ప్రత్యేక జాతి. హిందూ జాతి.

      Yes, we Hindus are a Nation by ourselves.

      ఔను . హిందువులం మనకు మనమే ఒక నేషన్.

      ఈ అధ్యాయంలో ఇప్పటిదాకా మీరు చదివినవి నా మాటలు కావు. 1937, 1938, 1939 సంవత్సరాలలో అఖిల భారతీయ హిందూ మహాసభ వార్షిక జాతీయ సభలలో హిందూ వీరుడు , గొప్ప విప్లవకారుడు వినాయక దామోదర వీర సావర్కర్ చేసిన అధ్యక్షోపన్యాసాల నుంచి సేకరించి,  కూర్చిన వాక్యాల గంగా ప్రవాహమిది. ఆసక్తి ఉన్నవారు ఆ ప్రసంగాల పూర్తి పాఠాల మాలిక Hindu Rashtra Darshan’ ను ఈ వెబ్ సైటు నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://savarkar.org/en/pdfs/hindu-rashtra-darshan-en-v002.pdf

      మరిన్ని వివరాల కోసం సావర్కర్ గారు రాసిన “Hindutva” , ‘ Hindu Pad Padashahi’ గ్రంథాలను చదవవచ్చు. ఇంటర్నెట్ లో దొరుకుతాయి.

      హిందుత్వానికి తొలి సిద్ధాంత కర్త అనదగ్గ వీర సావర్కర్ మాటలు వినటం, చదవటం మరవలేని అనుభవం. మన మెదడులో లో పేరుకుపోయిన తుప్పును వదిలించే సాధనం.



                                            .....................................................

 

No comments:

Post a Comment