హిందూ
నేషన్-2
నమో
హిందుమాతా
సుజాతా
నమో జగన్మాతా || నమో||
అమోఘ
దివ్య మహిమ సమేతా
అఖండ
వర భారత ఖండ మాతా ||నమో||
వింధ్య
హిమాద్రులె వేణీభరముగ
గంగా
యమునలె కంఠ హారముగ
ఘన
గోదావరి కటిసూత్రంబుగ
కనులకు
పండువ ఘటించు మాతా ||నమో ||
గోలుకొండ
నీ రత్నకోశమట
కోహినూరు
నీ జడలో పువ్వట
తాజ్
మహలు నీ దివ్య భవనమట
ఆహాహా
నీ భాగ్యము మాతా
నమో
హిందుమాతా సుజాతా నమో జగన్మాతా
స్వాతంత్ర్య మనబడేది రావటానికి
ముందు... వచ్చాక చాలా సంవత్సరాలవరకు కూడా తెలుగు నాట బడికి వెళ్ళగానే పిల్లలచేత పాడించిన
ప్రార్థన గీతమిది . భారతమాతను పట్టుకుని హిందు మాత అనిపిస్తారేమిటి అని అప్పట్లో
ఎవరూ తగవుకొచ్చే వారు కారు.
అప్పట్లో ఇండియాను తెలుగులో “హిందూ దేశం” అనే అనువదించేవారు. “ఇండియన్
హిస్టరీ”ని “హిందూదేశ చరిత్ర” అనే వ్యవహరించే వారు . ఆ అలవాటు చొప్పునే విఖ్యాత
చరిత్రకారుడు ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారు 1955 లో రాసిన తన ప్రామాణిక
చరిత్ర గ్రంథానికి “హిందూ దేశ చరిత్ర” అని పేరుపెట్టారు. నిక్షేపం లాంటి భారత
దేశాన్ని పట్టుకుని “హిందూ దేశం” అంటావేమిటయ్యా , ఈ దేశం హిందూ మతం వారికి మాత్రమే
సొంతమా?-అని ఎవరూ ఆయన మీద ఎగిరిపడలేదు.
1960లలో కూడా మేమందరం ఇండియా అంటే హిందూ
దేశం అనే సోషల్ స్టడీస్ పాఠాల్లో చదువుకున్నాం. అది అభ్యంతరం తెలపవలసిన విషయం అన్న
ఆలోచన ఆ కాలాన ఎవరికీ రాలేదు. ఎందుకంటే సంకర సెక్యులరిజం అనే రాచపుండు అప్పటికి ఇంకా
పుట్టలేదు!
హైందవం అనేది కేవలం ఒక మతమే కాదు. అది ఈ
జాతి జీవన విధానం. మనది హిందూ దేశం, హిందూ జాతి, హిందూ సంస్కృతి, హిందూ సమాజం అన్న వివేకం 20 వ శతాబ్దం మొదటి పాదం వరకూ
మతభేదాలకు అతీతంగాఈ దేశవాసుల్లో అందరికీ ఉండేది. ఆ శతాబ్దంలో పెద్ద ఎత్తున లేచిన
మొట్టమొదటి జాతీయ ఉద్యమానికి అదే స్ఫూర్తి. 1905లో బెంగాల్ విభజన కు వ్యతిరేకంగా హిందూ
మతస్థులు, మహమ్మదీయ మతస్థులు, క్రైస్తవ మతస్థులు అన్న తేడా లేకుండా మొత్తం జాతి సింహంలా లేచింది. కోలకతా మహానగరంలో 50 వేల
మంది హైందవ దేశభక్తులు ‘వందేమాతరం’ నినాదాలతో కదలి పావన గంగలో పవిత్ర స్నానం చేసి,
నుదుట తిలకం ధరించి , చేతిలో భగవద్గీతను పట్టుకుని కాళీఘాట్ దేవాలయానికి వెళ్ళారు. తెల్ల
రాకాసులను తరిమి వేసి భారత మాత దాస్య శృంఖలాలు తెగగొడతామని కాళీమాత ఎదుట సామూహిక
శపథం చేశారు. సనాతన ధర్మం వేరు, జాతీయ భావం వేరు అని అప్పట్లో ఎవరూ అనుకోలేదు.
భారత జాతికి సనాతన ధర్మమే చోదక శక్తి అన్న అవగాహన పండితులకూ పామరులకూ సమానంగా
ఉండేది.
ఒక్క “దేశం” అనే అర్థంలోనే కాదు .”జాతి”
అర్థంలో కూడా “హిందూ”, “హిందువులు “ అనే పదాలను వెనకటి రోజుల్లో ధారాళంగా
ఉపయోగించే వారు. ఇందాక మనం చెప్పుకున్న “స్వదేశీ”, “వందేమాతరం” ఉద్యమం ఉవ్వెత్తున
సాగిన కాలాన 1907 ఏప్రిల్ లో జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరంలో
వరసగా మూడు రోజులు సభలు
పెట్టి ఆంగ్లంలో గొప్ప ప్రసంగాలు చేశారు. ప్రతిరోజూ ఆయన మాట్లాడిన తరువాత,
ఆనాటి ప్రసంగ
సారాంశాన్ని ప్రఖ్యాత రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు అనువాదం చేసేవారు. చివరి రోజున పాల్ గారి మాటల
ఉత్తేజంతో ఆయనలోని దేశభక్తి ఉప్పొంగి మహాసభలో ఈ ప్రసిద్ధ పద్యం వినిపించారు:
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
“ఆ తేటగీతి పద్యమును విని సభా సదులు సంతోష పారవశ్యమున
బ్రహ్మాండము పగులునట్లు చప్పట్లు కొట్టిరి. ఈ పద్యము అన్ని పత్రికలలోనూ పడెను. ఈ పద్యమెట్లు ప్రాకి వెళ్ళెనోగాని కృష్ణా నది
వంతెన గోడల మీద పెన్సిళ్ళతో వ్రాయబడెను..” అని చిలక మర్తి వారు
తన “స్వీయ చరిత్ర”లో రాసుకున్నారు. మొత్తం భారత
జాతీయులందరికీ “హిందువులు” అని
ముద్రవేశావేమిటయ్యా ? మేము ‘హిందువులం” ఎలా అవుతాం? – అని హైందవేతర మతాల వారెవరూ
మండిపడలేదు. మతాలతో నిమిత్తం లేకుండా భారత జాతీయులందరినీ “హిందువులు” అని వ్యవహరించటం ఆ కాలాన మామూలే.
అదృష్టవశాత్తూ మోహన్ దాస్ గాంధీ గారు అప్పటికింకా దక్షిణాఫ్రికా లోనే ఉన్నారు.
కాకినాడ కాంగ్రెస్ జాతీయ మహాసభల్లో “వందేమాతరం” జాతీయగీతాన్ని పాడటానికి వీల్లేదని
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ ఆలీ గారు చిరుబురులాడటం , మహాత్ములవారు అతడికి
వంతపాడటం లాంటి జాతీయవైపరీత్యాల దౌర్భాగ్యం మన దేశానికి అప్పటికింకా పట్టలేదు.
బిపిన్ చంద్ర పాల్ గారు రాజమహేంద్రవరం వచ్చి
సభలు చేస్తున్న కాలాన ఇంకో దేశభక్తుడు
ఇంగ్లండులో ఉండి మాతృభూమి విముక్తి కోసం రహస్యంగా విప్లవ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. కర్మంచాలక తెల్లవారికి
పట్టుబడ్డాడు. రెండు యావజ్జీవ శిక్షలు అనగా మొత్తం 50 ఏళ్ల కారాగారవాసాన్ని
అనుభవించటం కోసం అండమాన్ నరకానికి పంపించబడ్డాడు . అక్కడి సెల్యులార్ జైలులో గాలీ
వెలుతురూ లేని ఏకాంత నిర్బంధం గడుపుతూ “అసలు హిందువు అంటే ఎవరు? హిందూ పదం దేనికి
సంకేతం ?” అని తీవ్రంగా ఆలోచించాడు.
మేధోమధనంలో తాను గ్రహించిన దానిని జాతిజనులతో పంచుకోవటానికి అక్షర రూపం
ఇవ్వదలిచాడు.
చిత్రహింసల
చెరసాలలో రాసుకునేందుకు పెన్నూ పేపరూ దొరకవు. పిసరంత కాగితం ముక్క కనపడ్డా ఖైదీకి
దెబ్బలు, సంకెళ్ళు తప్పవు. శతకోటిదరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఆ చిక్కుకూ
ఒక దారి దొరికింది. సున్నంవేసిన గోడ కాగితమయింది! ముళ్ళు, కోసురాళ్ళు పెన్సిళ్ళు
అయ్యాయి!! అలా తెల్ల గోడ మీద అక్షరాలు గిలుకుతూండగా ఒంటరి చీకటి గదిలో ఆ దేశభక్త
భావుకుడి మదిలోనుంచి జాలువారిన శ్లోకమిది:
ఆసింధు సింధు పర్యంతా యస్య భారత భూమికా I
పిత్రుభూ: పుణ్యభూశ్చైవ స వై హిందురితి
స్మృతః I I
(సింధు నది నుంచి సముద్రాల వరకూ
విస్తరించి ఉన్న భారతవర్షాన్ని తన
పితృభూమిగా, పుణ్యభూమిగా తలచేవాడు హిందువు అనబడతాడు)
“హిందువు” ఎవరు అన్నదానికి ఇలా సార్వజనీనమయిన , శిరోధార్యమైన తొలి నిర్వచనం
ఇచ్చిన చరితార్థుడు వినాయక్ దామోదర్
సావర్కర్ . లేక ‘వీర్ సావర్కర్” .
జైలు గోడమీద
ముల్లుతో రాయటమైతే రాశాడు. కాని - రాసినది వెలుగులోకి రావటం ఎలా? రెండు యావజ్జీవ
శిక్షలు పడి ప్రవాసం లో మగ్గుతున్నతాను జీవితకాలంలో బయటికి వచ్చే ఆశ లేదు. కనుక
త్వరలో విడుదల కానున్న తోటి ఖైదీల చేత గోడమీద రాతలను తలా కాస్త కంఠస్థం చేయించి ,
వారిద్వారా విడతల వారీగా స్వదేశానికి
చేరవేయించాడు. అలా 1917-19 మధ్య అండమాన్ నుంచి విడుదల అయిన
రాజకీయ ఖైదీల ముఖతః కొంచెం కొంచెంగా అందిన
ఉల్లేఖనాలను సావర్కర్ సహచరులు గుదిగుచ్చి , కొద్దిమంది ప్రముఖులకు రహస్యంగా
పంపితే “హిందూ సంగఠన” వర్గాలలో అది పెద్ద
సంచలనమయింది .
వంచనచేసి భారత దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వంచకులను , క్షమాబిక్ష ప్రార్థనతో తెలివిగా వంచించి 12 ఏళ్ల నిర్బంధం తరవాత ఊహించని రీతిలో
వీర సావర్కర్ 1922లో అండమాన్ చెర నుంచి బయట పడ్డాడు. ఇండియాకు చేరాడో లేదో మళ్ళీ జైలు! రత్నగిరి చెరసాలలో అక్కడి కాంగ్రెస్ రాజకీయ ఖైదీల సౌజన్యంతో కాగితాలూ పెన్సిళ్ళూ సంపాదించి తన మనసులోని భావాలను సావర్కర్ కాగితం మీద పెట్టాడు. అలా రూపు దిద్దుకున్నదే 1923 లో అజ్ఞాత రచయిత పేరిట తొలి వెలుగు చూసిన “Hindutva : Who Is A Hindu?” . హిందుత్వానికి సంబంధించి అందుబాటులో ఉన్నవాటిలో అదే మొట్టమొదట ఎన్నదగ్గ సిద్ధాంత గ్రంథం.
“నమో హిందుమాతా!” అని నోరార స్తుతించి మనది హిందూదేశం అని సగర్వంగా చెప్పుకున్న కాలం నుంచి- హిందువులమని చెప్పుకోవటానికి చాలామంది హిందువులే సిగ్గుపడే దౌర్భాగ్య దుర్గతికి హిందూ సమాజం ఎందుకు , ఎలా దిగజారింది? దేశవాచకమైన , జాతి వాచకమైన” హిందూ” పదం కేవలం ఒక మతానికి ఎందువల్ల , ఎవరి చలవవల్ల పరిమితమైంది? వాస్తవానికి హిందువు ఎవరు? హిందుత్వం అంటే ఏమిటి?
తరువాయి అధ్యాయాలలో చూద్దాం.
------------------------------------
No comments:
Post a Comment