Thursday, 28 December 2023

ఎందుకొచ్చిన హిందూ?!

                                                                                                                                                                                                                                                                                                                                                                                      
హిందూ నేషన్ -1            

      

 


      

      హిందూ నేషన్ .

      పుస్తకం టైటిలే కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు.

      మనమందరం భారతీయులం. మనది భారత జాతి . మన నేషనాలిటీ ఇండియన్ అని అందరం  అనుకుంటున్నాము కదా! మధ్యలో ఈ హిందూ నేషన్ ఏమిటి?

     హిందూ అనే పదం వాడటం , హిందువులమని పబ్లిగ్గా చెప్పుకోవటం మర్యాదస్తుల లక్షణం కాదు అని హిందూ పుటక పుట్టినవారిలో చాలామంది ఇప్పటికే ఫీలవుతున్నారాయె! ‘హిందూ’ అనే నాటు పదం మాని ‘ఇండిక్’ అనటం ఇప్పుడు చాలామంది మేధావులు అలవాటు చేసుకున్నారాయె! ఒకప్పుడు ‘హిందూ’ , ‘హిందూ’ అని గర్వంగా పలికిన కొన్ని మోతుబరి హైందవ సంస్థలు కూడా సాధ్యమైనంతవరకూ అది మానేసి ‘భారత్’ ,‘భారతీయ’ అనటమే ఈ కాలానికి తగ్గ ఫాషన్ అని నిర్ణయించుకున్నట్టు కనపడుతున్నాయాయె! ఆఖరికి హిందూ మతానికి పెద్దలు, పూజ్యులు, మార్గదర్శకులు అని గుర్తింపు పొందిన మహానుభావులు కూడా ‘హిందూమతమేమిటి? నాన్సెన్స్! హైందవం మతం కాదు. ధర్మం. అది ఒక జీవన విధానం’ అని గంభీరంగా చిన్ముద్ర వేసి జ్ఞానబోధ చేస్తారు. మళ్ళీ ఆ ధర్మం కూడా సనాతనధర్మమే తప్ప హిందూ ధర్మం అనటానికి వీల్లేదని బల్లగుద్ది  వాదిస్తారు.

     తాను మహమ్మదీయుడినని ప్రతి ముసల్మాన్ గర్వంగా ప్రకటించుకుంటాడు. తాను క్రైస్తవుడినని చెప్పుకోవటానికి ఏ క్రైస్తవుడూ సిగ్గుపడడు. కాని హిందూ తల్లిదండ్రులకు పుట్టి, హిందువుగా రికార్డుల్లో నమోదు కాబడి, తద్వారా వచ్చే బెనిఫిట్లు ఏమైనా ఉంటే వాటిని తేరగా అనుభవించేవారు ...  ఇంట్లో హిందూ దేవుళ్ళకు పూజలు,  చాటుగా దండాలు పెట్టుకుని, ఆపద వచ్చినప్పుడు మొక్కులు మొక్కేవారిలో కూడా   చాలామంది తాము హిందువులమని చెప్పుకోవటం నామోషీగా ఫీలవుతారు. ఇస్లాం పట్ల, క్రైస్తవం పట్ల, వాటి ఆచారాలు, విశ్వాసాల పట్ల  ఒళ్ళు దగ్గరపెట్టుకుని బహు గౌరవం కనపరచే విద్యావంతులు, సంస్కారులు, మేధావులు  చాలా మంది హిందూ మతమన్నా. హిందూ దేవుళ్లన్నా , హిందువుల ఆచారాలన్నా , సెంటిమెంట్లన్నా, మత విశ్వాసాలన్నా ఒంటికాలి మీద లేచి నోటికొచ్చినట్టు దుర్భాషలాడతారు. హిందువులుగా చెడబుట్టిన శాల్తీలైతే మరీనూ. హిందూ మతమే ఈ దేశం లో శాంతికీ, భద్రతకూ, మైనారిటీల మనుగడకూ పెద్ద బెడద;  హిందూ మతోన్మాదమే భారత పౌర సమాజానికి పెద్ద ముప్పు- అని ముప్పూటలా తిట్టిపోయనివాడు ఈ దేశంలో మేధావే కాడు. ముస్లిముల టోపీలు, గడ్డాలూ, బురఖాల పట్ల ఎనలేని గౌరవాదరాలు కనపరిచే వారు హిందువుల నుదుట బొట్టును, శిఖనూ, యజ్ఞోపవీతాన్ని ,నామాలను జుగుప్సాకరంగా  హేళన చేస్తారు.

     ఈ రకంగా అన్ని విధాలా నిరాదరణకు గురి అవుతున్న ‘హిందూ’ పదాన్ని ఏకంగా జాతికి జోడించి ‘మనది హిందూ నేషన్’ అనటం హిందువుల్లోనే చాలామంది లౌక్యులకు ఎబ్బెట్టుగా తోచవచ్చు.

     అసలు ‘హిందూ’ అన్న పదమే మన వేదాల్లో గాని , వేదాంగాలలో గాని ఎక్కడా కానరాదు. అది విదేశీయులు నడమంత్రంగా పుట్టించిన మాట.  ఒరిజినల్ గా అది తిట్టుపదం. అరబ్బులో , మరొకరో మనలనూ, మన దేశాన్నీ ఈసడిస్తూ వాడిన మాట .  అలాంటి చెత్త పదం  మనకెందుకు?  మొదటి నుంచీ  వైదిక మతం, వేద సంస్కృతి, ఆర్య నాగరికత,  ఆర్య ధర్మం, ఆర్య లేక వైదిక సంస్కృతి, సనాతన ధర్మం లాంటి పదాలే తప్ప హిందూ మతం, హిందూ ధర్మం అనేవి మహమ్మదీయులు వచ్చి పడేంతవరకూ  మనం ఎరుగం. అదే  ‘భరత భూమి, ‘భరతవర్షం’ , ‘భరత ఖండం’, ‘భరత’ , ‘భారత’, ‘భారతీయ’ పదాలయితే మనకు వేదకాలం నుంచీ వాడుకలో ఉండె ! స్వతంత్రం రావటానికి ముందూ తరవాతా భారతీయ పదాన్నే విరివిగా వాడుతూ వచ్చామాయె! రాజ్యాంగం లో కూడా ‘ఇండియా దటీజ్ భారత్’ అనే రాసుకున్నామాయె! ఇలా అన్ని విధాలా స్థిరమై, అందరికీ ప్రియమైన ‘భారతీయ’ ఎంచక్కా ఉండగా అది కాదని తీరికూర్చుని ‘హిందూ నేషన్’ పితలాటకం తెచ్చిపెట్టటం ఎందుకు? ఈ నేషన్ హిందువులది మాత్రమేనా? ముస్లిములదీ, క్రైస్తవులదీ, మరో మతం వారిదీ కాదా? హిందువులు మాత్రమే తప్ప వేరే మతాలవారెవరూ ఈ దేశంలో ఉండకూడదా? ఉండనివ్వరా? హైందవేతరులు ఇండియన్ రిపబ్లిక్ పౌరులు కారా? వారి పౌరసత్వం లాగెయ్యాలా? దేశం నుంచి గెంటెయ్యాలా? హిందూ మతస్థులకే తప్ప వేరెవరికీ ఈ దేశంలో ఉండే హక్కు లేదా? అలా అనటం ఫాసిజం, నాజీలను మించిన మతోన్మాదం, దురహంకారం కాదా? సభ్య సమాజంలో , నాగరిక ప్రపంచంలో అనవలసిన మాటేనా ఇది?

     ఈ ప్రశ్నలన్నీ నాకు నేనే వేసుకుని అన్నిటికీ దీటైన జవాబులు చెప్పగలననుకున్న తరవాతే ఈ గ్రంథ రచన  మొదలెట్టాను. ఇదీ, దీని తరవాత భాగమూ ప్రశాంతంగా చదివిన జిజ్ఞాసువులెవరికైనా సహేతుకమైన అనుమానాలు నివృత్తి కాగలవని ఆశిస్తున్నాను.

       ఈ గ్రంథ పరంపరకు ఉద్యుక్తమైనది  హైందవం , హిందుత్వం అంటే గిట్టని కుహనా మేధావుల , హిందూ ద్వేషుల  ఎడతెగని సవాళ్ళకు బదులు చెప్పి, హిందూ వ్యతిరేకులతో వాదులాడి  , హిందూ సమాజం లోని ధర్మద్రోహులను కన్విన్స్ చేసేందుకు ఎంతమాత్రం కాదు.  జాతీయ హిందూ సమాజంలో పైన ఉదాహరించిన అమాం బాపతు భ్రష్టులకంటే హిందూమతాన్ని,  హిందూధర్మాన్ని ప్రేమించి , హిందువుగా పుట్టినందుకు గర్వించి , దేశభక్తి, జాతిగర్వం గుండెల నిండా ఉన్న యోగ్యులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా నేటి యువతరంలో హిందుత్వస్ఫూర్తి పరిపూర్ణంగా ఉండి ధర్మవీరుల్లా విజృంభించగల చిచ్చరపిడుగులు అసంఖ్యాకంగా ఉన్నారు. తెలుసుకోవాలని ఉన్నా తెలియజెప్పేవారు దొరకక ... విరోధులు గుప్పించే నిందారోపణలకు ,అసత్య ప్రచారాలకు , అతితెలివి వెటకారాలను ఎలా తిప్పికొట్టాలో తెలియక...  కావలసిన వాస్తవ సమాచారాలు, , చారిత్రక సాక్ష్యాలు  అందుబాటులో లేక-  వారు తికమక పడుతున్నారు. హైందవం అంటే కేవలం మతమన్న దురభిప్రాయం హిందువులలోనే  చాలామందికి   ఉన్నది. హిందుత్వమంటే కేవలం మైనారిటీలతో  సమానమైన మతహక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరగటం, అస్తిత్వం నిలుపుకోవటానికి అన్య మతాలవారితో కొట్లాడటం , సోషల్ మీడియాలో వీరాలాపాలు చెయ్యటం , వృథాగా వాదులాడటం అన్న భ్రమలో పలువురు వీర హిందువులే  పడ్డారు.

      మొత్తంగా హిందూ సమాజానికి దాచిపుచ్చుకోవలసిన చీకటి కోణాలు , సిగ్గుపడవలసిన దౌర్బల్యాలు , సమర్థించలేని లొసుగులు , లుకలుకలు చాలా ఉన్నాయన్న దురభిప్రాయం-   హిందూ ద్వేషుల , జాతి వ్యతిరేకుల, వామపక్ష చరిత్రకారుల , విదేశీ తొత్తుల నిరంతర దుష్ప్రచారాల ఫలితంగా-   హిందుత్వ శ్రేణుల్లోనే చాలామందిలో కనిపిస్తుంది. విదేశీయులు అల్లిన అబద్ధాలను ఎండగట్టి,   హిందూ మత ఉజ్జ్వల చరిత్రగురించి , ప్రపంచంలో మరే జాతి సాటి రాలేనంతటి  హిందూ వీరుల శౌర్య పరాక్రమాల గురించి,  హిందూ జాతి పూర్వవైభవం గురించి ,  హిందూ సామాజిక వ్యవస్థ గొప్పతనం గురించి , హిందూ ధర్మ మహౌన్నత్యం గురించి , జాతి గర్వించదగ్గ  సాంస్కృతిక వారసత్వం గురించి నేటి హిందూ యువతకు సరైన అవగాహన కలిగితే  రెట్టించిన ఉత్సాహంతో , మరింత ఆత్మవిశ్వాసంతో కార్యోన్ముఖులై సింహాల్లా పోరాడగలరు. పరమాద్భుతాలే సాధించగలరు. దాదాపు ఒక శతాబ్దకాలంగా జాతికి పట్టిన రాజకీయ గ్రహణాన్ని పటాపంచలు చేయగలరు. హిందూ జాతికి , సిసలైన భారతీయతకు పూర్వ వైభవాన్ని తిరిగి సాధించగలరు. భారతవర్షాన్ని మళ్ళీ విశ్వవిజేతగా , విశ్వగురువుగా , మతకల్లోలిత ప్రపంచాన్ని శాంతి , సుస్థిరతల సురక్షిత తీరానికి చేర్చే ధార్మిక చుక్కానిగా చరితార్థం కావించగలరు.

      ఆ శుభ పరిణామానికి చేతనైన దోహదం చేయాలన్న తలంపే ఈ పుస్తక  రచనకు ప్రేరణ.

     ఇక  ‘భారతీయ’ , ‘హిందూ’ పదాల గుణదోషాలపై  పైన ప్రస్తావించిన వాదాలూ వాదనలకు సంబంధించి  ఒక వివరణ. ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’ అని నోరార కీర్తించే జాతి మనది. భారతభూమితో , భరతవర్షంతో మనకు వేద యుగం నుంచీ ప్రగాఢమైన అనుబంధం ఉంది. ఆ వివరాలు మునుముందు ‘ఒకే దేశం.. ఒకే జాతి’ అద్యాయంలో మీరు చదవబోతున్నారు. ఋగ్వేదం నుంచీ భారత ప్రస్తావన ఉండటం ఎంత కరెక్టో , వేద వేదాంగాలలోగాని , పురాణ వాజ్మయం లో గాని ప్రాచీన గ్రంథాలలో గాని  హిందూ అన్న పదం కనిపించదనటమూ అంతే కరెక్టు. ఆ సంగతి ఒప్పుకోవటానికి భేషజాలు అక్కర్లేదు.

      హిమాలయం సమారంభ యావదిందు సరోవరం |

      తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్ష్యతే||  

      హిమాలయాలు మొదలుకుని దక్షిణ సముద్రం వరకూ విస్తరించినట్టి దైవ నిర్మితమైన దేశాన్ని హిందుస్థానం అంటారన్న బృహస్పతి ఆగమాన్ని కొందరు పెద్దలు ఉటంకిస్తారు .కాని దాని ప్రాచీనత గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగని హిందూ అనేది సింధు నదికి  అరబ్బులు చేసిన అపభ్రంశమనీ , మనగురించి విదేశీయులు  నీచార్థంలో వాడిన తిట్టుపదమని చెప్పటం శుద్ధ తప్పు. తురకలు కాలు మోపటానికి ముందు  వరకూ హిందూ పదం మనం ఎరగమనటం  తప్పున్నర తప్పు.

      ప్రపంచ సారస్వతంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదం లోనే మన భూమినీ , ప్రజలనూ ‘సప్త సింధు’ అని ప్రస్తావించటం కనిపిస్తుంది. సంస్కృత ‘స’ ప్రాకృతంలో, పర్షియన్ తదితర విదేశీ భాషల్లో ‘హ’ గా మారటం కద్దు. ( దాని గురించి మరిన్ని వివరాలు ముందు అధ్యాయాల్లో ఇచ్చాను.) అలా ‘సప్త సింధు’ పలుకుబడిలో ‘హప్త హిందు’ గా మారి దాని నుంచి జాతివాచకంగా ‘హిందు’ పదం  సహజ రీతిలో దేశీయంగా ఉద్భవించిందని, ఆ పదం ద్వారా మనం అనంతరకాలంలో విదేశీయులకు తెలియబడ్డామని భాషావేత్తలు ఏనాడో తేల్చారు. నిజానికి అరబ్బులు, పారశీకుల కంటే చాలా పూర్వమే సింధు నదికి ఆవలి దేశం అన్న గౌరవ అర్థంలో గ్రీకులు INDU పదాన్ని ఉపయోగించారు. సింధు నదిని బట్టి...  సింధు అంటే సముద్రం అనికూడా అర్థం ఉన్నది కాబట్టి ... సముద్ర పరివేష్టితమైన మొత్తం దేశవాసులను  ‘సింధుల’ని పిలవసాగారు.  అదే పోనుపోను హిందువులుగా మారిందని మరొక అభిప్రాయం.  సింధు ప్రాంతంలో నివసించేవారు, వైదిక నాగరికతను అనుసరించేవారు అన్న భౌగోళిక, సాంస్కృతిక అర్థంలోనే జాతి వాచకంగా . గ్రీకులైనా, అరబ్బులైనా , పారశీకులైనా ‘హింద్’ పద ప్రయోగం చేశారన్నది గమనార్హం.

       ఇంగ్లిషు వాళ్ళు తమ సామ్రాజ్య ప్రయోజనాల కోసం , మనకు బుద్ధి మాంద్యం తెచ్చే చేతబడి చేసి ...

     బంగారంలాంటి మన చదువులకు రెండు వందల ఏళ్ల కిందట ‘తెల్ల చెదలు’ పట్టించి , మన బుర్రలు చెడగొట్టిన కారణంగా ....

      1947 ఆగస్టు 15 న మహా భయానక హింస, రక్తప్రవాహాల నడుమ  స్వాతంత్ర్యం అనే పేరిట అధికారపు మార్పిడి మాత్రమే జరిగి , ఆ ‘తెల్ల చెదలే’ నేటికీ మన చడువులనూ, మన బుర్రలనూ పీక్కుతింటున్న పర్యవసానంగా...

       మనం అల్జీమర్స్ రోగుల్లా తయారై మన జాతి మహోజ్వల గత వైభవ చరిత్రను మరచిపోయాము. అందువల్ల మనం దాదాపుగా అందరం   నేడు కలనైనా ఊహించలేని చారిత్రిక అద్భుత సత్యం  ఏమిటంటే-

      ఇవాళ మనం విదేశీయులు , మన దేశానికి, మన జాతికి  పేరు పెట్టేంత తాహతు గలవారు  అని భ్రమ పడుతున్న  గ్రీకులు,  అరబ్బులు , పర్షియన్లు ఎవరో కాదు. వారూ మన దేశం నుంచి వలస వెళ్ళిన మన పూర్వుల సంతతే. వారికి విద్యాబుద్ధులు గరపి నాగరికులను చేసిందీ మనమే. అది ఎలా అన్నది ముందు అధ్యాయాలలో వివరంగా.

      ఒకప్పుడు  ప్రపంచంలో ఎక్కడివారైనా ఏ విద్యకోసమైనా మన దేశానికే రాక తప్పేది కాదు.  పూర్వకాలాన మానవ విజ్ఞానమంతా భారతదేశం  పెట్టిన భిక్షే. అలా మనం చదువు చెప్పిన అరబ్బీ అబ్బీలు మనకు ఏదో తిట్టు పేరు పెడితే అదేదో గొప్ప అయినట్టు దాన్ని మనం తగిలించుకుని తిరగసాగామని చెప్పేవాడు మేధావి కాదు...  శుద్ధ శుంఠ! అరేబియన్లు భూమిమీదికి రావటానికి వేల ఏళ్ల పూర్వమే ప్రాచీన హిందూ దేశం ‘సింధు’ , ‘సప్తసింధు’ పేరిట ప్రపంచానికి సుపరిచితం.

     నిజానికి పూర్వకాలంలో ‘హిందు’ అనేది తిట్టు కాదు . పొగడ్త. ఉదాహరణకు -ప్రాచీన యూదు జాతీయులు బలాన్ని, ప్రతాపాన్ని సూచించే అర్థంలో ‘హిందు’ పదం వాడేవారు. ఇస్లాంకు పూర్వపు అరేబియాలో ‘సో హబ్ మో అలక్క్’ అనే పురాణ గ్రంథంలో ఒక చోట ‘బంధు మిత్రులు పెట్టే హింస ‘హిందూ కత్తి’ వేటు కంటే ప్రాణాంతకమైనదన్న పోలిక ఉన్నది. ప్రాచీన పారశీకుల నానుడిలో ‘హిందూ జవాబు ఇవ్వటం’ అంటే  దిమ్మతిరిగే దెబ్బ కొట్టటం.  పూర్వపు బాబిలోనియన్ల భాషలో  ‘సింధు వస్త్రం’ అంటే మహా నాణ్యమైన వస్త్రం.

     ‘హిందూ’ పదం ఎలా పుట్టింది , ఎప్పుడు పుట్టింది, వేదయుగానికి ముందా తరవాతా అన్నది కాదు. ఒకప్పుడు సింధు దేశాన్ని సూచించిన ‘హిందు’ పదం కాలక్రమంలో దేశ గౌరవానికి , జాతి ప్రతిష్ఠకు, వాటిని నిలబెట్టటానికి ప్రాణాలు బాలి ఇచ్చిన వేలాది , లక్షలాది ధర్మవీరుల పౌరుషానికి, భారతీయ క్షాత్రానికి ప్రతీక గా జాతిజనుల మనస్సులో ముద్రపడి పునీతమైనదన్నదే ఇక్కడ పాయింటు. ఒక హైందవ దేశభక్తుడు వర్ణించినట్టు “సనాతనులు, సత్నామీలు, సిక్కులు, ఆర్యులు, అనార్యులు , మరాఠాలు, మద్రాసీలు , బ్రాహ్మణులు, పంచములు – అందరూ హిందువులుగా భయానక బాధలు పడ్డారు. హిందువులు గానే అద్భత ధర్మవిజయాలు సాధించారు. శత్రువులు మనలను హిందువులుగా ద్వేషించారు. అటోక్ నుంచి కటక్ వరకూ, కాశ్మీరునుంచి కన్యాకుమారి దాకా ప్రజలనూ, జనపదాలనూ, కులాలనూ,తెగలనూ హిందుత్వ బంధమే ఏకం చేసి , వెయ్యి కదనరంగాలలో ధర్మ రక్షణకు ప్రాణాలు ధారవోసేందుకు పురికొల్పింది.”  వందల సంవత్సరాలపాటు హిందూ జాతి సాగించిన స్వాతంత్ర సంగ్రామంలో ఎందరెందరు దేశభక్తుల రక్తంతో,త్యాగంతో, శివాజీ మహారాజ్ వంటి ఎందరు ధర్మవీరుల మహావీరుల శౌర్యంతో, పరాక్రమంతో  హిందూ పదం పునీతమయిందో ఈ వరసలో తరవాతి  పుస్తకంలో మీరు చదువుతారు. ఇంత గొప్ప  వీరుల జాతి ప్రపంచ చరిత్రలో మరొకటి లేదని గర్వపడతారు.

     మహాత్మా గాంధి సైతం మెచ్చిన ప్రసిద్ధ విద్యావేత్త, స్వాతంత్ర్య యోధుడు , కాంగ్రెస్ నాయకుడు  లోక్ నాయక్ ,బాపూజీ  డాక్టర్ మాధవ్ శ్రీహరి Aney గారు ఇలాంటి వాస్తవాలన్నీ జాగ్రత్తగా ఆకళింపు చేసుకున్న మీదట  ఎనభై ఏళ్ల కిందటే ఏమని ధ్రువీకరించారో చూడండి:

     The Hindus are a nation or nationality by themselves. They have a distinctive characteristic culture. They have a common cultural language and a common cultural literature. They have their home-land distinctly marked out on the map from the rest of the world by  natural demarcations. They have developed a corporate sentiment which has enabled them to rise and attain their glorious position more than once during the last thousand years in spite of the invasions and conquests of the barbarous conquering hordes from the North and the West. Hindus in the North and South in spite of superficial difference have common basis for their magnificent architecture, painting, music, dancing and several other fine arts. No sane man can question the proposition that Hindus are a nation.

[ Dr . M.S.Aney in Foreword to We or Our Nationhood defined  By M. S. Golwalkar, pp.23-24]

     ( హిందువులు వారికి వారే  ఒక జాతి . వారిది ఒకే జాతీయత. వారికి విలక్షణమైన సంస్కృతి ఉన్నది. వారి సంస్కృతికి ఒక కామన్ భాష, కామన్ సాహిత్యం  ఉన్నాయి. సహజసిద్ధమైన ఎల్లలతో మిగతా ప్రపంచం నుంచి వేరుగా మాప్ లో  ప్రత్యేకంగా కనపడే  సొంత గడ్డ వారికి  సిద్ధించింది. ఉత్తరం నుంచి పడమర నుంచి ముష్కర మూకలు ఎన్ని దాడులు, ఆక్రమణలు చేసినా తట్టుకుని లేచి మహిమాన్వితమైన స్థితిని సాధించ గలిగిన సమష్టి భావసారూప్యం వారికి ఉన్నది. ఉత్తర, దక్షిణ దేశాల నడుమ పైపైకి  ఎన్ని విభేదాలు కానవచ్చినా శిల్పం, చిత్రలేఖనం , సంగీతం, నాట్యం, వంటి వివిధ లలిత కళల్లో హిందువుల  అద్భుత నైపుణ్యానికి కామన్ ప్రాతిపదిక ఉన్నది..హిందువులు ఒక నేషన్ అనటాన్ని మతి ఉన్నవాడెవడూ ప్రశ్నించలేడు.)

                                             

( నా  "హిందూ నేషన్" గ్రంథం లో  ఇది మొదటి అధ్యాయం. పుస్తకం, దాని అందుబాటు  వివరాలు  కింద )



 

 

    

 

    

    


No comments:

Post a Comment