అదేమిటో ఇవాళ వరసగా రెండు దుర్వార్తలు. కె.ఎల్.రెడ్డి మరణవార్త వెనువెంటనే పాత్రికేయ పితామహుడు జి.ఎస్. వరదాచారి గారు మరి లేరన్న కబురు. రెడ్డి గారి లాగే వరదాచారి గారు కూడా ఈనాడులో నా పూర్వ సహచరులు. నేను లీడర్ రైటర్ గా ఉండగా ఆయన ఆంధ్రభూమి నుంచి అసిస్టెంట్ ఎడిటర్ గా వచ్చారు. డెస్క్ బాధ్యత పంచుకుంటూ అడపాదడపా సంపాదకీయాలూ రాసేవారు. ఆయన సమర్థతకు తగినట్టు ఆయన సేవలను ఈనాడు ఉపయోగించుకోలేక పోయింది. తరవాత కొద్ది కాలానికే అక్కడ నుంచి తెలుగు యూనివర్సిటీకి వెళ్లి జర్నలిజం కోర్సుకు కొత్త రూపునిచ్చారు.
వరదాచారి గారు పెద్ద మనిషి. అజాతశత్రువు. నిండు కుండ . ఎంత ఒత్తిడిలోనూ సంయమం కోల్పోడు. మెత్తగా కూడా కత్తిలా రాయటం ఎలాగో ఆయనను చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా సినిమా జర్నలిజంలో వరదాచారి గారిది ప్రత్యేక ముద్ర.
సజ్జనుడు, సాత్వికుడు కాబట్టి తను అంతగా పట్టించుకున్నట్టు లేదు గాని వరదాచారికి వృత్తిపరంగా రావలసినంత గుర్తింపు లేదు. ముఖ్యంగా ఆంధ్రభూమిలో . గోరా శాస్త్రిగారి కంటే ముందు నుంచీ ఆయన ఆ పత్రికలో ఉన్నారు. తొలి సంపాదకుడు పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు ముందు అనుకున్న ప్రకారం ఏడాది కల్లా నిష్క్రమించాక వరదాచారి గారిని ఎడిటర్ చేస్తామని చెప్పి యాజమాన్యం మాట తప్పింది . గోరాశాస్త్రి గారి హయాంలో ఎడిటోరియల్ విభాగం మొత్తాన్ని వరదాచారి గారే చక్కగా నిభాయించేవారు. గోరాశాస్త్రి గారి తరవాతా ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. అది ఆయనకంటే కూడా పత్రికా రంగానికి ఎక్కువ నష్టం.
నేను ఆంధ్రభూమి ఎడిటర్ అయ్యాక ఆయనతో సమకాలిక పత్రికలలో లోటుపాట్లు ఎత్తిచూపే "దిద్దుబాటు" కాలమ్ చాలాకాలం రాయించాను. అది జర్నలిస్టులకు పెద్ద బాలశిక్ష. అందులో మొదట్లో వేరే పత్రికల తప్పులను ఆయన తూర్పార పడితే మావాళ్లు బాగా ఎంజాయ్ చేశారు. తరవాత ఆయన కలం మా పత్రికలో తప్పులనూ చూపించి చెవులు మెలేసింది. "అది వెయ్యాలా వద్దా" అని మా స్టాఫ్ అడిగారు. తప్పకుండా వెయ్యాల్సిందే నని చెప్పాను. రేపు మీ ఎడిటోరియల్ లోనూ ఆయన తప్పులెన్నుతారేమో అని ఎవరికో సందేహం వచ్చింది. అదీ వెయ్యాల్సిందే అన్నాను. అదృష్ట వశాత్తూ నేను ఆయనకు చిక్కలేదు.
ఈ సంగతులే ఈమధ్య ప్రెస్ క్లబ్ లో "పరిణత పాత్రికేయం" ఆవిష్కరణ సభలో ఆయన ముందే చెప్పాను . హాయిగా నవ్వారు. అదే ఆయనను చివరి సారి చూడటం.
వరదాచారి గారి నిష్క్రమణంతో తెలుగు పాత్రికేయం పెద్ద దిక్కు ను కోల్పోయింది.
No comments:
Post a Comment