Thursday, 20 February 2020

మనసున్న మహామేధావి

పాత ముచ్చట్లు -7

ఎం.వి.ఆర్ .శాస్త్రి
.............

     (రాంభట్ల కృష్ణమూర్తి  శతజయంతి సంచికకు రాసిన వ్యాసం) 


     జగమెరిగిన మార్క్సిస్టు మహామేధావి ...  ఎన్నో వందల  మంది కమ్యూనిస్టు మేధావులకు  , అభ్యుదయ రచయితలకు స్ఫూర్తిప్రదాత అయిన  రాంభట్ల కృష్ణమూర్తి గారి గురించి నాకు తెలిసింది తక్కువ. ఆయనతో నా సాహచర్యమూ కొద్దిదే. నా మీద  ఆయన ప్రభావం కూడా పెద్దగాలేదు. కాబట్టి శతజయంతి సంచికకు నేనేమి రాయగలనని తటపటాయించాను. కాని మిత్రుడు ఆర్. వి. రామారావుగారు " కాబూలీవాడి" లా  వదలలేదు. చివరి గడువు చివరి రోజున ఈ నాలుగు మాటలు రాయక తప్పలేదు.
    రాంభట్ల గారిని నేను మొదట కలిసింది 1969 లో. నంద్యాల కాలేజి విద్యార్థులకు రాజకీయ తరగతి అధ్యాపకుడిగా ఆయన వచ్చిన సందర్భంలో. అప్పట్లో నేను నంద్యాల గవర్నమెంటు పాలిటెక్నిక్ లో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగు రెండో సంవత్సరం విద్యార్థిని. కాలేజీ ఎగ్గొట్టి మరీ - మార్క్సిజం సిద్ధాంత గ్రంథాలను దీక్షగా చదువుతున్న వాడిని. ఏ.ఐఎస్ ఎఫ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్న వాడిని.  మా నాయకుడు కామ్రేడ్ వి.వి.రామారావు. ( అనంతరకాలంలో రాష్ట్ర ఎఐటియుసి అధ్యక్షుడు; విశాఖపట్నం పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు ).  రామారావు సివిల్ ఇంజినీరింగు విద్యార్థిగా ఉంటూ పూర్తికాలం స్టూడెంట్స్ ఫెడరేషన్,  కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంస్థల ఆర్గనైజర్ గా అవస్థలు పడుతూ పనిచేస్తూ నా వంటి కుర్రాళ్ళను ఇన్ స్పైర్ చేస్తూండేవాడు. అప్పట్లో మా  విప్లవ తమకం ఎలాంటిదంటే ... ఓ సారి నాకో పెద్ద సమస్య వచ్చింది. కాలేజి ఎగ్గొడుతున్నానని తెలిసి మండిపడి మా నాన్న నన్ను చదువు మానేసి ఇంటికి రమ్మంటూ తిట్లదండకంతో ఉత్తరం రాశాడు. ఆ సంగతి  రామారావుకు చెబితే -
    " కామ్రేడ్. మహా అయితే ఇంకో రెండేళ్ళు ఇలాంటి తిప్పలు తప్పవు.ఎలాగో వోర్చుకోవాలి. ఆ తర్వాత ఎలాగూ విప్లవం రాక తప్పదు. సోషలిస్టు రాజ్యం వచ్చాక ఎవరికీ ఏ సమస్యా ఉండదు" అన్నాడు ఎంతో నమ్మకంతో. అంతేకదా అని నేనూ నమ్మకంతో నిట్టూర్చాను.
    అలాంటి నెత్తురుమండిన , శక్తులు నిండిన విప్లవ స్వాప్నిక  కాలంలో  నేను రాంభట్ల గారిని మొదటిసారి చూశాను. నంద్యాల లో మేమున్న టెక్కె ప్రాంతంలో  రామారావు రూములో బస చేసి రెండురోజులు   పూర్తిగా ఆయన మాతోనే ఉన్నారు. మార్క్సిజం గురించి, కమ్యూనిస్టు ఆలోచనా విధానం గురించి , చరిత్రను చూడాల్సిన గతితార్కిక  పధ్ధతి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. ఆది ద్రావిడుల నాగరికతను నాశనం చేసిన ఆర్యుల అజ్ఞానపు ఆనవాళ్లు అంటూ ఆయన వేదాలలోని వృత్రాసుర , త్రిపురాసుర గాథలను వివరిస్తుంటే మేము ఆశ్చర్యంతో నోరువెళ్ళబెట్టాం. నంద్యాల టౌన్ లో జరిగిన  బహిరంగ సమావేశంలో రాంభట్లగారు ఐతరేయ బ్రాహ్మణం నుంచి సంసృతంలో గడగడ కొటేషన్లు ఇస్తూ ఆంధ్రులకూ  , సోవియట్ యూనియన్ లో తాను చూసిన అర్మేనియాకూ ముడిపెట్టిన తీరు మాకు అద్భుతం అనిపించింది. ఇంతటి పాండిత్యం , ఇంతటి మేధాశక్తి నాకు ఏనాటికైనా అబ్బితే ఎంత బాగుండు అనుకుకున్నాను. అటుమీద చాలాకాలం నేను రాంభట్లగారికి ఏకలవ్యశిష్యుడిని.
     కాలేజీ చదువు తరవాత నేను మా ఊరు (కృష్ణా జిల్లా  జగ్గయ్యపేట)  చేరాను. ఉద్యోగం చేసే ఉద్దేశం ఎంతమాత్రమూ లేక , కమ్యూనిస్టుపార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనసాగాను. అందులో భాగంగా జగ్గయ్యపేటలో అభ్యుదయ రచయితల సంఘం శాఖను మొదలెట్టాం. దానికి నేను సెక్రెటరీని . రాంభట్ల గారేమో రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి. మా కొత్త శాఖకు మార్గదర్శనం కోసం 1974లో కాబోలు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయనను కలిసాను. అప్పట్లో చార్మినార్ చౌరస్తా లోని సంగం థియేటర్ దగ్గర ఆయన అన్నగారికి AGE WORKS అని చిన్న ఫేక్టరీ ఉండేది. ఈయనా రోజూ కాసేపు అందులో కూచునే వాడు. అక్కడే నాతొ చాలా గంటలు ఆప్యాయంగా మాట్లాడారు. చిక్కడపల్లి రోడ్ల మీద నాతొ కలిసి నడుస్తూ విలువైన ఎన్నో సూచనలు ఇచ్చారు.
      అప్పట్లోనే జగ్గయ్యపేటలో ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ( ఇస్కస్ ) శాఖనుపెట్టదలిచాం. దాని విషయంలో ఒక పేచీ వచ్చింది. ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు , ఉమ్మడి మద్రాసు రాష్ట్ర, ఆంధ్ర శాసనసభల్లో ప్రముఖ ప్రతిపక్ష నేత అయిన పిల్లలమర్రి వెంకటేశ్వర్లు  గారిది మా ఊరే . పెట్టబోయే ఇస్కస్ కమిటీలో ఎవరుండాలన్న దానిపై ఆయన చెప్పింది  మా కుర్రకారుకి నచ్చలేదు. మేము అన్నదానికి ఆయన ఒప్పుకోలేదు. చిన్నవాళ్ళం కాబట్టి కమ్యూనిస్టుపార్టీ లోతుపాతులు మాకు తెలియవు. మనందరం కలిసి నడుపుకునే సంఘంలో ఈ పెద్దాయన పెత్తనమేమిటి అని చిర్రెత్తింది.
     ఏమి చెయ్యాలి అని అడగటానికి మళ్ళీ హైదరాబాద్ వెళ్లి రాంభట్లగారిని  కలిశాను. ఎందుకంటే ఆ కాలాన ఇస్కస్ కు కూడా  ఆయనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.' ఓస్! దీనికేముంది!  మెంబర్లు అందరూ ఎలా అనుకుంటే అలాగే కానివ్వండి' అని ఆయన చెప్పారు. 'పిల్లలమర్రిగారు ఒప్పుకోరు' అంటే ' రాష్ట్ర కార్యదర్శిని నేను . మీ కమిటీని ఆమోదించాల్సింది నేను' అన్నారు. మా మాటే నెగ్గినందుకు నాకు మహా సంతోషం వేసింది.  'ప్రారంభ సభకు మీరు తప్పక రావాలి ' అన్నాను. ' తప్పక వస్తాను. అన్నీ దగ్గరుండి నడిపిస్తాను ' అని ఆయన భరోసా ఇచ్చారు. అంతటివాడే అభయం ఇచ్చాక ఇంకేమి కావాలి అని ఈల వేస్తూ ఇంటికెళ్ళాను. స్టేట్ సెక్రెటరీనే మాకు అండగా ఉన్నాడన్న పొగరుతో పిల్లలమర్రిగారికి ప్రారంభసభ సంగతి మేము చెప్పనైనా చెప్పలేదు. చెపితే ఎక్కడ చెడగొడతాడోనని భయం.
      అన్నట్టే   రాంభట్ల గారు మా ఊరు వచ్చారు. మా ఇంట్లోనే బస చేశారు.  'మంచి బ్రాహ్మడు .  వేదాలు, పురాణాల గురించి ఎంత చక్కగా చెపుతున్నాడో' అని మా అమ్మ తెగ సంతోషించింది. భోజనం చేశాక ఆయన్ను ఏవో సందేహాలు కూడా అడిగింది ఆ బ్రాహ్మడు చక్కగా సమాధానం చెప్పి మా అమ్మను మెప్పించాడు. ఇక  సభ దగ్గర  కథ అడ్డం తిరిగింది. పిల్లలమర్రిగారు పిలవకపోయినా వచ్చి మొత్తం కార్యక్రమాన్ని తన చేతిలోకి తీసుకుని తాను కోరిన  వాళ్ళతో కమిటీ వేయించారు. ఆయన చెప్పినదానికల్లా రాంభట్ల 'సరే' అన్నారు.  నేను తెల్లబోయాను. 'ఇలా చేశారేమిటి మహానుభావా' అని తరవాత అడిగితే  తేలిగ్గా నవ్వేసి ' ఏం చేస్తాం ? ఆయన పార్టీ రాష్ట్ర కమిటీ మెంబరు. ఆయన ఏరియాలో  ఆయన మాటకు నేను ఎదురు చెప్పకూడదు.' అన్నారు.  నాకు ఇంకా అర్థం కాలేదు. అది గ్రహించి ' అనువుగానప్పుడు పంతానికి పోకూడదు. ఏదో జోక్ వేసి ఇరకాటంనుంచి తప్పించుకోవాలంతే. నన్ను చూసి  నేర్చుకో ' అని నాకు హితబోధ చేసి బస్సెక్కారు.
     ఎన్నో అనుభవాలు అయి కమ్యూనిస్టు తత్త్వం బోధపడ్డాక నేను ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీకి గొడుగు పట్టటం లాంటి విప్లవ కార్యక్రమాలు కట్టిపెట్టి బతుకు తెరువు నిమిత్తం హైదరాబాద్  ఈనాడు దివాణానికి చేరాను. ఆ సమయాన రాంభట్ల గారు ఈనాడుకు ఎడిటర్ ( ఎడ్మినిస్ట్రేషన్ ) గా ఉన్నారు. నేను రామోజీరావుగారికి ఉత్తరం రాయటం, ఆయన నన్ను పిలిపించి మాట్లాడి సెంట్రల్ న్యూస్ బ్యూరో బాధ్యత చూసేపని  ఆఫర్ చెయ్యటం 1978 ఫిబ్రవరి 10 న నేను ఉద్యోగంలో చేరేదాకా ఆయనకు తెలియదు. తెలిశాక చాలా సంతోషించారు. సంపాదకీయం రాయటానికి గజ్జల మల్లారెడ్డిగారు రోజూ ఈనాడు ఆఫీసుకు వస్తుండేవారు. ( అప్పటికింకా ఆయన ఎడిటర్ గా చేరలేదు. ) రాచమల్లు రామచంద్రారెడ్డి గారు ఎడిట్ పేజీకి పనిచేస్తుండే వారు. వీరు, రాంభట్ల సోమాజీగూడ ఈనాడు ఆఫీసు రెండో అంతస్థులో ఒకే కాబిన్లో కూర్చునేవారు. నా సీటు కూడా దాని పక్కనే . ముగ్గురు దిగ్గజాల ముచ్చట్లు వినటం , ఫస్ట్ ఫ్లోర్ లోని కాంటీను కు వారితో కలిసి వెళ్లి మాట్లాడటం గొప్ప అనుభవం.
     రాంభట్లగారు చొరవ తీసుకుని ' మీజాన్ ' లో తన పాత సహచరుడైన బుద్ధవరపు చిన ( బి.సి.) కామరాజు అనే " తూలికాభూషణ్ "ను ఈనాడులో న్యూస్ ఎడిటర్ గా చేర్పించారు. వారిద్దరూ ఆప్తమిత్రులు. వారితోబాటు  డైనింగ్ హాల్ లో మాట్లాడుకుంటూ భోంచేయటం వల్ల తెలుగు పత్రికారంగ పూర్వాపరాల గురించి చాల విషయాలు నాకు తెలిశాయి  .అప్పుడప్పుడూ తిరుమల రామచంద్రగారు వారిని కలవటానికి వస్తుండే వారు. ఆయనా మీజాన్ లో పనిచేసినవాడేనట. ఆయన రాసిన 'నుడి-నానుడి' వెనుక రాంభట్ల హస్తం చాలా  ఉందని ప్రతీతి. నేను అడిగినా రాంభట్లగారు  అసలు గుట్టు విప్పలేదు.
      చేరిన కొద్దికాలానికే కామరాజుగారు ఈనాడునుంచి అలిగి వెళ్ళిపోయారు. రాంభట్ల గారు జోక్యం చేసుకోగలిగి కూడా చేసుకోక నిర్వికారంగా మిన్నకుండిపోయారు. పేరుకు ఎడిటర్  ( ఎడ్మినిస్ట్రేషన్ ) అయినా  సంతకాలు పెట్టటానికి మించి ఆయనకు నిర్ణయాధికారాలు పెద్దగా ఉండేవికావు. ఉన్న కొద్దిపాటి అధికారాన్ని కూడా ఆయన వినియోగించుకునే వాడు కాదు. అంతకుముందు జగ్గయ్యపేటలో నాకు అనుభవమయినట్టే ఈనాడులోనూ  ప్రతి విషయంలో ఆయన తామరాకు మీద నీటిబొట్టు. ఆఫీసు వ్యవహారాల్లో ఆయన ఎల్లప్పుడూ His Master's Voice .
      రామోజీరావుగారు,  రాంభట్లగారు  చాల ఏళ్ల నుంచీ మిత్రులు. ఈనాడు పెట్టక ముందు కూడా అబిడ్స్ లోని మార్గదర్శి ఆఫీసులో పనివేళల తరవాత వారు తరచుగా కలిసి ఆత్మీయంగా ఇంగ్లీషులో మాట్లాడుకునేవారట. యజమాని దగ్గర అంత చనువు ఉన్నదన్న  దర్పాన్ని రాంభట్ల గారు ఎవరిముందూ  కనపరిచేవారుకాదు.  'ఈనాడులో పని చేసినంత కాలమూ ఆఫీస్ బాయ్ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ దాకా ఆయన  అందరితోనూ ఒకే విధంగా స్నేహభావం చూపేవారు. అదే సమయంలో తన డిస్టెన్స్ తాను మెయింటైన్ చేసేవారు. ఏ పనిదొంగో ఆయనని ఏ కాంటీన్ లోనో మాటలలోకి దించి హస్కుకొట్టి ఆ తరవాత ఇంచార్జి చేత తిట్లు తిని  పితూరీ చేస్తే ఈ పెద్దాయన 'నీదే తప్పు. అతడలా అనవలసిందే . నువ్వు పడవలసిందే ' అని నిష్కర్షగా చెప్పేవాడు.
      రాంభట్ల గారు మాటలపోగు. రోజూ ఒకటిరెండు సార్లు ఎడిటోరియల్ డెస్క్ కు వచ్చి కూచునే వారు.  ఏ సబెడిటరో రాస్తున్న ఏ వార్తనో పట్టుకుని ఆయన ఎడ్యుకేట్ చేస్తూ పొతే ఎవరికీ సమయం తెలిసేది కాదు. డెడ్ లైన్లు పాటించవలసిన న్యూస్ ఎడిటరుకూ షిఫ్ట్ ఇంచార్జీలకూమాత్రం మహా ఇబ్బందిగా ఉండేది. కాని అవతలివాడు సాక్షాత్తూ ఎడిటరు.  ఏం చేస్తాం అని గొణుక్కునేవాళ్ళు. ఒక సందర్భాన మోఫసిల్ డెస్క్ ఇంచార్జీగా ఉన్న నేనూ , న్యూస్ ఎడిటరు సంతపురి రఘువీరరావు గారూ కలిసి రామోజీరావుగారి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాం. ఆయన నవ్వి , రాంభట్ల గారిని పిలిచి " ఇదుగో రాంభట్లా ! రేపటినుంచి డెస్క్ కి వెళ్ళకు " అన్నారు. ఆయన 'సరే ' అన్నారు. ఏం లాభం ? మర్నాడు యథా ప్రకారం వచ్చి మామూలు కంటే ఎక్కువ సేపు " లాఠీచార్జి " ( అది ఆయన బాధితులు అభిమానంతో పెట్టుకున్న పేరు) చేశాడు. అదీ ఎంత బాగా అంటే - కిందటిరోజు ఫిర్యాదు చేసిన నేను కూడా ఆయన అనర్గళ ప్రసంగాన్ని అత్యాసక్తితో వింటూ కూచున్నాను!
      అప్పట్లో నేను సికందరాబాదు నుంచి సైకిల్ మీద సోమాజీగూడ ఈనాడు ఆఫీసుకు వెళుతుండే వాడిని . రాంభట్ల గారేమో సాయంత్రం సోమాజీగూడ ఆఫీసునుంచి చిక్కడపల్లి లోని తన ఇంటికి ఈవెనింగ్ వాక్ గా నడిచి వెళుతుండే వారు.   సైకిల్ నడిపించుకుంటూ ఆరు కిలోమీటర్లూ ఆయనతో బాటు నేనూ వెళ్ళేవాడిని. ఏ సుమేరియన్ సంస్కృతి గురించో , హనుమంతుడు సంజీవి పర్వతం మోసుకురావటం గురించో, సత్య హరిశ్చంద్రుడి అబద్ధాల గురించో , కంచర్ల గోపన్న పాపాల గురించో ఆయన అపర గిరీశం లా లెక్చరు ఇస్తూ  మింట్ కాంపౌండ్ మీదుగా చకచక నడిచి పోతుంటే వింటున్న నాకు ఒళ్ళు తెలిసేది కాదు.  ఇల్లు చేరాక కూడా సబ్జెక్టు పూర్తికాకపోతే నన్ను  ఆయన ఇంట్లో కూచోబెట్టి ఇంకో అరగంటో గంటో కంటిన్యూ చేసేవారు. విన్నదంతా నెమరు వేసుకుంటూ మళ్ళీ చిక్కడపల్లి నుంచి సికందరాబాదుకు ఇంకో ఆరు కిలోమీటర్లు సైకిలు మీద వెళ్ళేవాడిని. ఆ రకంగా చాల నెలల 'దారి ముచ్చట్ల ' వల్ల  1955 మధ్యంతర ఎన్నికలలో కమ్యూనిస్టు - కాంగ్రెస్ సైద్ధాంతిక సంఘర్షణల వంటి అనేక ఘట్టాలపై రింగ్ సైడ్ వ్యూ నాకు అవగతమయింది. ఆయనే సరదాగా అన్నట్టు -  రాంభట్లతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్!
     రోజువారీ సంపాదకీయాన్ని గజ్జెల మల్లారెడ్డిగారు రాస్తే ఆదివారం ఎడిటోరియల్ రాంభట్ల గారు రాసే వారు. 1980 లో కాబోలు రాంభట్లగారు ఈనాడు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరవాత రామోజీరావుగారు నా చేత అప్పుడప్పుడూ సంపాదకీయాలు, ఎడిట్ పేజి వ్యాసాలు రాయించే వారు. మల్లారెడ్డిగారు 1983లో ఆంధ్రభూమికి వెళ్ళాక రోజువారీ సంపాదకీయాన్ని నేను, వరదచారిగారు, 'సహవాసి' ఉమమహేశ్వరరావు గారిలో ఒకరం రాసేవాళ్ళం. ఆదివారం సంపాదకీయం మాత్రం ఉద్యోగవిరమణ తరవాత కూడా చాలా రోజులు రాంభట్ల గారే రాసేవారు.  బ్రాహ్మలకు పూర్వీకులు మాలలు అని తేలుస్తూ ఎడిటర్ గా ఉండగానే 'కులమతాల మతలబు' శీర్షికతో  ఆయన రాసిన సంపాదకీయానికి బ్రాహ్మణసమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దివాకర్ల వెంకటావధానిగారిలాంటి పెద్దలు వచ్చి రామోజీరావుగారిని కలిసి నిరసన తెలిపారు. ఆ సంపాదకీయానికి పత్రికా ముఖంగా విచారం వ్యక్తపరిచినట్టు నాకు జ్ఞాపకం . కానీ రాంభట్లగారు మాత్రం బెసగలేదు. తాను రాసింది తప్పంటే ఒప్పుకోలేదు.
    నేను రాసిన ఎడిటోరియల్ అయినా ఎడిట్ పేజీ వ్యాసమైనా , స్పెషల్ స్టోరీ అయినా నేరుగా రామోజీరావుగారితోనే చర్చించి ఆయనకే చూపెవాడిని. కాబట్టి ఉద్యోగపరంగా నా రాతల విషయంలో రాంభట్ల ప్రమేయం ఉండేది కాదు. అయినా నేను రాసింది పత్రికలో శ్రద్ధగా చదివి మెచ్చుకోళ్ళనూ చివాట్లనూ ధారాళంగా అందిస్తుండేవారు. 1984ఆఖరులో నేను తీవ్రంగా జబ్బుపడి మూడునెలలు ఇంటిపట్టున ఉన్న సమయాన పోతన భాగవతం , వేయి పడగలు , కథలు -గాథలు  లాంటి గ్రంథాలను విరివిగా చదివాను. ఆ తరవాత డ్యూటిలో చేరి నేను రాసిన మొదటి సంపాదకీయాన్ని చూసి ' శాస్తుల్లూ! బాగా చదివినట్టున్నావు. మాటలు బాగా పిక్కావు' అని తనదైన శైలిలో రాంభట్ల మెచ్చుకున్నారు.
     రాంభట్ల గారు ఒకప్పుడు ప్రసిద్ధ కార్టూనిస్టు. స్వతహాగా ఆర్టిస్టు. ఆయన ఏది రాసినా బొమ్మ గీసినట్టు, శిల్పం చెక్కినట్టు ఉండేది. ఒక్క కొట్టివేత గానీ , హంసపాదు గాని ఉండేదికాదు. ఏ సబ్జెక్టు మీద అయినా ఎంత తక్కువ వ్యవధిలో అయినా అలవోకగా ప్రామాణిక రచనని బహు సొగసుగా ఆయన రాయగలరు. అయినా డిక్టేటర్ గా ఉండటమే ఆయనకు ఇష్టం. ఆదివారం సంపాదకీయం ఆయన చెప్పే పద్ధతికూడా చిత్రంగా ఉండేది. ఉద్యోగవిరమణ తరవాత ఆయన సీటులో నేను కూచునేవాడిని. ప్రతి గురువారం అనుకున్న సమయానికి ఆయన ఠంచన్ గా వచ్చేవారు. వస్తూనే ' శాస్తుల్లూ ! ఉత్తిష్టంతు ' అనేవారు.( ఏ వైదిక కార్యమైనా మొదలెట్టేముందు భూతపిశాచాలను ఆ చోటు నుంచి లేచివెళ్ళమంటూ ' ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏ తే భూమిభారకాః ..' అన్న శ్లోకం చెపుతారు. నన్నూ అలాగే లేచి తన సీటు తనకు ఇవ్వమని గురువుగారి ఆదేశం! నన్ను భూత పిశాచాలతో పోల్చినందుకు నవ్వుకుంటూ నేను లేచాక ఆయన కూచునే సరికి టైపిస్టు వస్తుంది. లేక వస్తాడు . వెంటనే ఆయన కుర్చీలో వెనక్కి వాలి డిక్టేషను మొదలు పెడతారు. ఒక్కోసారి తనకు ఏదీ తట్టకపోతే 'నీకు ఏ సబ్జెక్టు కావాలి ? అని టైపిస్టునో మరోకరినో  అడిగి వారు  ఏది కోరుకుంటే ఆ విషయం మీద  గడగడ డిక్టేట్ చేస్తారు. మధ్యలో నా వంటి వాళ్ళు ఏదైనా అంటే దాని మీద ఒక అర్ద గంట లెక్చరిచ్చి , తాను ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మళ్ళీ ఎత్తుకుంటారు. పూర్తి  అయిన తరవాత   ప్రూఫు కూడా ఆయన చూడరు. తేట తెనుగులో  పొట్టి పొట్టి వాక్యాలే తప్ప దీర్ఘ సమాసాలు, చేంతాడంత వాక్యాలు ఆయన వాడరు. వర్ధమాన జర్నలిస్టులకు , ఔత్సాహిక రచయితలకు రాంభట్ల రచనలు అవశ్య పఠనీయాలు. విశాలాంధ్రలో పనిచేసిన రోజుల్లో అసెంబ్లీ సమావేశాలలో కమ్యూనిస్టు సభ్యుల ప్రసంగాల గురించి వి.హనుమంతరావు గారు ట్రంక్ కాల్ లో ఐదు నిమిషాలలో చెప్పిన దాన్ని తాను ఒక గ్యాలీ మాటరుగా విస్తరించి రాస్తే ఆయా సభ్యులే మహా ఆనందించేవారని రాంభట్లగారు అనేవారు.
    1983 మార్చి 24 న చిక్కడపల్లి కోనసీమ ద్రావిడ సంఘం హాలులో నా పెళ్లి అయింది . అది చిన్న హాలు . దగ్గరి బంధుమిత్రులు, కొలీగ్స్  ని మాత్రమె పిలిచాను. రాంభట్ల గారిని వెళ్లి ఆహ్వానించలేదు. కనీసం కార్డయినా పంపలేదు. అయినా ఆయన నా మీద ప్రేమ కొద్దీ పెళ్ళికి  వచ్చారు.  ' మా శాస్తుల్లు పెళ్లి అని తెలిసింది. నన్ను ఒకరు పిలవాలా? నేనే వచ్చాను' అంటూ అందరితో కలివిడిగా మాట్లాడారు. పెళ్ళికానుకగా నాకో సిగరెట్టిచ్చి సరదాగా తానూ ఒకటి ముట్టించారు.


     దటీజ్ రాంభట్ల ! కపటం, డాంబికం లేని , మల్లెపూవులా స్వచ్చమైన మనసుగల మంచిమనిషి కాబట్టే రాంభట్ల కృష్ణమూర్తి గారంటే అందరికీ ఇష్టం.
     1990 చివరిలో నేను డిప్యూటీ ఎడిటరుగా  ఆంధ్రప్రభకు , అక్కడినుంచి 1994 లో ఎడిటరుగా ఆంధ్రభూమికి వెళ్ళాక రాంభట్లగారితో సాంగత్యం క్రమేణా సన్నగిల్లింది. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం. ఒక సారి బర్కత్  పురా లో తాము కొత్తగా కొనుక్కున్న ఫ్లాట్ చూడమని పిలిచి  చాలా సేపు మాట్లాడారు. అదే మా చివరి కలయిక.

 


 



No comments:

Post a Comment