Friday, 13 September 2019

ఇకనైనా మీరు మారరా!!


డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్

(ఊపిరితిత్తుల వైద్య నిపుణులు

WHO - Corona IPC Observer.)

.............

      2019డిసెంబర్ 31 న్యూఇయర్ వేడుకల్లో మునిగితేలే ప్రజానీకానికి తెలియని విఘాతం ప్రపంచ ఆరోగ్య సంస్థ డోర్ తట్టింది.

     ఒకటో తారీకు పొద్దున తలుపు తెరిచి చూసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివ్వెర  పోయె నిజాలను
తెలుసుకునే లోపే, కంటి ముందర పిడుగు పడితే ఎలా ఉంటుందో, ప్రపంచ ఆరోగ్య సంస్థ లో నున్న వైద్యులకి,  పరిశోధకులకు, పాలక మండలికి వెన్నులో వణుకు వచ్చింది.

      చైనా ఏది చెప్పినా కూడా రెండుసార్లు ఆలోచించాలని ప్రపంచంలో అందరికీ తెలుసు!! కానీ ఈ సారి మాత్రం చైనా చెప్పిన మాటల్లో  కొంత సత్యం కనబడ్డది.

      చిన్నపాటి జ్వరం, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, వంటి సాధారణమైన ఫ్లూ లక్షణాలు గా ఉన్న  వైరస్ గమనిస్తూ ఉండగానే, మానవాళిని కుదిపేసే, ప్రపంచ జీవనానికి సవాల్ విసిరే ఓ మహమ్మారిగా coronavirus ప్రత్యక్షమైంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

      కొరోనావైరస్ ఎలా వచ్చింది?ఎలా ఉంటుంది? ఎలా నియంత్రణ చేయాలి? అని తెలుసుకునే లోపు, వేల సంఖ్యలో చైనాలో ప్రజలు దీపపు పురుగులు చచ్చినంత సులువుగా చనిపోయారు.

       అక్కడి నుంచి మొదలైన ఈ  కొరోనా వైరస్ మహమ్మారి , చైనాని తన గుప్పిట్లోకి తీసుకొని, సర్వ నాశనం చేసి,  మిగతా ప్రపంచ దేశాలపై కన్నేసింది.

         ఏ ఏ దేశాల్లో అయితే ప్రజలు వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ,అత్యంత నిర్లక్ష్య ధోరణి వహించారో వారిపై     కొరోనావైరస్ పంజా విసిరింది.
            మాకేమీ కాదు, మేము చాలా గట్టి వాళ్లం, మా చుట్టూ మనుషులు, డబ్బు,ధనము, అంతస్తు,  అధికారము, అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది, మాకు  కొరోనావైరస్ సోకే అవకాశమే  లేదు, అనుకుని అహంకరించిిన అమెరికా, జర్మనీ, జపాన్, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల వారే దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. పదుల నుంచి మొదలుకొని, వందలు వేల లెక్కచొప్పున రాలిపోతున్నారు.

        ఇక మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం!
        వ్యాధి వచ్చిన తర్వాత కూడా, వ్యాధితో నేనున్నానని  తెలియకుండా  మాయ లో ఉంచే వ్యాధి coronavirus. ఇది ముక్కు, నోటి ద్వారా శరీరంలో ప్రవేశించి ఊపిరితిత్తుల లోపలికి వెళ్లి, ఊపిరితిత్తుల నాశనం మొదలు  అయ్యేంత వరకూ ...ఇది చాలా సర్వసాధారణమైన లక్షణాలు అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వ్యాధిగా మనము భావించి, వైద్యుడి దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకొని,ఖర్మగాలి Corona Virus నిర్ధారణ అయితే..... అప్పటికే మీ శరీరంలో పుష్కలంగా, లక్షల లో కోరనా వైరస్  క్రీములు, వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది.
      అశ్రద్ధ చేసినట్లయితే, Corona వైరస్ సోకిన మనిషి తెలుసుకొని, చికిత్స విధానము కొరకు  వైద్య వ్యవస్థ ని ఆశ్రయించే టప్పటికి, ఈ వైరస్ ఊపిరితిత్తులు నాశనము చేసి, కుళ్లిపోయే నిమోనియా మార్పులు తెచ్చి, శ్వాస ప్రక్రియలో తీవ్ర అంతరాయం  కలిగిస్తుంది, ఆరడుగుల మనిషిని   అరరోజు లో,  ఆరు అడుగుల ఐ సి యు  మంచంపై  జీవచ్ఛవంలా పడేస్తుంది .

        ఊపిరితిత్తుల్లో సాధారణంగా క్షయ వ్యాధి వచ్చినప్పుడు, అశ్రద్ధ  చేసిన రోగులకు ఆరు నెలలకి , ఫైబ్రోసిస్ (fibrosis- Permanent damaged scaring)అనే శాశ్వతమైన మార్పులు ఏవైతే  వస్తాయో... వాటన్నిటినీ Corona virus  15 నుంచి నెల రోజుల  లోపలే తీసుకొని వస్తుందంటే, ఈ వైరసు   ఎంత  ప్రమాదకర మైనదో, దాని విషము మానవ శరీరాన్ని  ఎంత నాశనం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

         ఇంతటి భయంకరమైన Corona Virus పట్ల ఏ మాత్రం అశ్రద్ధ వహించినా  కోలుకోలేని దెబ్బ శరీరముపై పడడం ఖాయం.

       తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1)  రోడ్లపై తిరగకుండా, పనులు సాధ్యమైనంత తగ్గించుకుని ఇంటి పట్టున   ఉండడం అత్యుత్తమం.

2) జ్వరము, దగ్గు,తుమ్ములు,ఒళ్ళు నొప్పులు ఆయాసం,ఈ లక్షణాలు వచ్చి రెండు మూడు రోజుల్లో గనక తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

3) కనీసం నాలుగు గంటలకు ఒకసారి చేతులు ముఖ్యంగా వేలు అరిచెయ్యి శుభ్రంగా సబ్బుతో  కడగడం అవసరం.

4) బయట తిరిగేటప్పుడు సాధ్యమైనంతవరకు  మనిషి - మనిషి  మధ్య మూడు నుంచి ఆరు అడుగుల దూరం ఉండేట్టు ఎవరికి వారు జాగ్రత్త పడగలిగితే ఈ వ్యాధి వ్యాప్తిని చాలావరకు అరికట్ట వచ్చు. (Social Distancing.)

5) పార్కులు, క్లబ్బులు , థియేటర్లు , ఫంక్షన్ హాల్స్ వంటి పబ్లిక్ స్థలాలు, ఆటోలు, బస్సులు,  ట్రైను, ఏరోప్లేన్, వంటి ప్రయాణ మాధ్యమాలు సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయాలి.

6) కుదిరితే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలో, కొత్త వారు ఎవరు వచ్చినా క్షుణ్ణంగా  వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని, వారు  కూడా పరిశుభ్రత నియమావళి పాటించాలి. వారికి గనక పై వ్యాధి లక్షణాలు ఉన్నట్టయితే నిర్మొహమాటంగా  పరీక్షలు నిర్వహించాలి.

7) పోషకాహారం తినవలసిన అవసరం ఎంతైనా ఉంది. చైనాలో మాంసాహార  మార్కెట్లోనే ఈ వ్యాధి పురుడుపోసుకుంది అని గుర్తుంచుకుని మాంసాహారులు  జాగ్రత్త పడాలి.


       అంతా ప్రభుత్వమే చేస్తుంది గా!!

       అంతా ప్రభుత్వమే చేస్తుందనుకుని, మన బాధ్యత కూడా ప్రభుత్వంపై నెట్టేయడం, కరోనా వ్యాధి కంటే భయంకరమైన ఆలోచన వ్యాధి.  ఎవడి ఇల్లు వాడే జాగ్రత్త పరచుకోవాలి! ఎవరి వొళ్లు వారే కాపాడుకోవాలి!

        తెలిసీ తెలియని వాళ్లు సోషల్ మీడియాలో చేసే పిచ్చి వాగుళ్లకు మోసపోకుండా ,  వైద్యం గురించి ఏమీ తెలియని మహానుభావులు చెప్పే చచ్చుపుచ్చు చిట్కాల మాయలో పడకుండా భిన్నమైన,   Corona virus గురించి వాస్తవాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండక పోతే కొంప కొల్లేరు అవ్వడం ఖాయం!!




No comments:

Post a Comment