Friday, 24 August 2018

గుడుల గోడు

పెక్యులరిజం - 10
ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.................

గుళ్లమీద గవర్నమెంటు కంట్రోలుకు చచ్చుదో చెడ్డదో ఒక చట్టమైతే ఉన్నది కదా? ఆ చట్ట ప్రకారం ప్రభుత్వం దేవాలయాల మీద పెత్తనం చేస్తే అది నేరం ఎలా అవుతుంది? మనకు ఇష్టం లేకపోవచ్చు. మనకు కష్టం కలగవచ్చు. అంతమాత్రాన చట్టబద్ధంగా ప్రభుత్వం చేసే అజమాయిషీని బందిపోటుతనం అని ఎలా అనగలం ?

ఉన్న అధికారాన్ని సరిగా ఉపయోగిస్తే అది అజమాయిషీ అవుతుంది. లేని అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగపరిస్తే అది దోపిడీ అనిపించుకుంటుంది. దేశంలో మనతో సహా అనేక రాష్ట్రాల్లోని హిందూ దేవాలయాల్లో ప్రభుత్వ పరంగా జరుగుతున్నది ఇందులో రెండోరకం.

ఏ దేవాలయాన్నయినా పోషించేది భక్తులు. ప్రభుత్వం తన జేబులోంచి ఖర్చు పెట్టేది దమ్మిడీ ఉండదు. ఎండోమెంట్సు చట్టం బారిన పడ్డ ఏ రాష్ట్రంలోనైనా వేళ్లమీద లెక్కించగలిగిన కొన్ని గుళ్లు భారీ ఆదాయంతో, సిరి సంపదల రాశులతో వెలిగిపోతుంటాయి. వందలకొద్దీ మధ్యతరగతి ఆలయాలు బొటాబొటి రాబడితో, పెద్ద ఖర్చేదైనా వస్తే డబ్బుకోసం తడుముకోవలసిన స్థితిలో కాలం వెళ్లదీస్తుంటాయి. వేలకు వేల బడుగు గుడులు నిత్యదీప, నైవేద్యాలకే ఇబ్బంది పడుతుంటాయి.

అంటే - సమాజంలోలాగే ఆలయ వ్యవస్థలోనూ ధనిక, మధ్య తరగతి, నిరుపేద అంతరాలు ఉన్నాయి. దేవుళ్లు మనుషుల్లాగా పిసినిగొట్లు కారు. డబ్బులేని గుడికి సహాయపడటానికి డబ్బున్న గుడి దేవుడికి అభ్యంతరం ఉండదు. అలాగే భక్తులు కూడా. తిరుమల వెంకన్నకో, భద్రాద్రి రాముడికో తాము సమర్పించుకునే కానుకలు ఊళ్లలో దీనావస్థలోని వెంకటేశ్వరాలయాలకో, రామాలయాలకో ఉపయోగపడతాయంటే సంతోషిస్తారే తప్ప ఏ భక్తుడూ తగవులాడడు.

సర్కారీ కర్రపెత్తనంలో ఇప్పుడు ఏమి జరుగుతున్నది ?

బాగా డబ్బున్న ఆలయాల సొమ్మునేమో అడ్డమైన రాజకీయ మెహర్బానీలకు యధేచ్ఛగా వాడేస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను గుళ్ల నెత్తిన రుద్దుతూ రోడ్లు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, పెద్ద ఆస్పత్రులు, మురుగు నీటి పారుదల సౌకర్యాల వంటి వాటి మీద దేవస్థానాల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తున్నారు.

దేవాలయం అనేది ప్రధానంగా మత సంస్థ. దేవస్థానంలోని మిగులు నిధులను హిందూ ధర్మ ప్రచారానికి, మత గ్రంథాల ముద్రణకు, పంపిణీకి, యాత్రికుల సౌకర్యాలకు, జీర్ణ దేవాలయ ఉద్ధరణకు వెచ్చించాలని ఎండోమెంట్ల చట్టాలైతే చెబుతాయి. హిందూ దేవాలయానికి హిందువుల వల్ల సమకూడిన నిధిని హిందూ మత ప్రయోజనాలకు వెచ్చించటానికైతే సర్కారీ పెత్తందార్లకు చేతులు రావు. హిందూ గుళ్ల సొమ్మును చర్చిలు, మసీదులు కట్టుకోవటానికి, క్రైస్తవ, ఇస్లామిక్‌ మత ప్రచార కార్యకలాపాలకు దొడ్డిదారిన తేరగా విరజిమ్మటంలో మాత్రం మన గుడిదొరలు కడు ఉదారులు!

పార్టీ ప్రయోజనాలకు, ఓట్ల అవసరాలకు, పాలకవర్గ సొంతలాభాలకు దేవుడి సొమ్మును అడ్డగోలుగా వాడేసుకునే పాలకులు దీనావస్థలోని దేవాలయాలను వాటి కర్మానికి వదిలేస్తున్నారు. ఇల్లుగడవక చిన్న గుళ్ల పుజారులు నానా బాధలు పడుతుంటే, పట్టించుకునే దిక్కు లేదు. దీపం పెట్టే దిక్కులేక ఊళ్లలో కొన్నివేల పాతగుళ్లు పాడుబడుతూంటే ఆలయ వ్యవస్థను చెరబట్టిన రాజకీయ, అధికార గణాలకు చీమకుట్టిన పాటి చలనం లేదు.

హిందూ దేవాలయాల నుంచి గుంజుకోవటమే తప్ప ఆలయాలకు ప్రభుత్వాలు ఇచ్చింది గుండుసున్న. కొన్ని శతాబ్దాలకింద, ఎన్నో తరాల వెనుక మహారాజులు, జమీందార్లు, సంపన్న దాతలు చేసిన దానాలు, ఇచ్చిన మాన్యాలే ఆలయాలకు ఉన్న ప్రధాన ఆస్తులు. సెక్యులర్‌ సర్కార్లు ఎలాగూ పైసా విదిల్చవు. కనీసం పాతకాలంలో దాతలు ఆయా ఆలయాలకు దఖలు పరచిన మడి మాన్యాలనైనా మన ప్రభువులు సక్రమంగా కాపాడుతున్నారా? వాటిని ఎవరూ ఆక్రమించకుండా, ఇవ్వవలసిన కౌలును, అద్దెలను ఎగ్గొట్టకుండా అడ్డుపడుతున్నారా?

అడ్డుకునే మాట దేవుడెరుగు. గవర్నమెంట్లు నడిపే వారే బరితెగించి గుడి ఆస్తులు కాజేస్తున్నారు. సర్కారీ పెత్తనం రావటానికి పూర్వం దేవస్థానాలలో ఉండిన వెలలేని రత్నాభరణాలకు లెక్కాపత్రం లేదు. జనాలు నాణేలు విసిరితే వజ్రం విరిగిపోయిందని చెప్పినా నమ్మాల్సిందే. దైవమాన్యాలను కాపాడవలసిన వారే తమ మనుషుల చేత ఆ మాన్యాలను కబ్జా చేయిస్తున్నారు. వేల ఎకరాల దేవుడి భూములను ఎవరికి పడితే వారికి రాజకీయ లబ్దికోసం తేరగా పంచి పెడుతున్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా, కబ్జా భూమిని దేవస్థానం స్వాధీనం చేసుకోనివ్వకుండా రాజ్యమేలే నేతలు, వారి తైనాతీలైన అధికారులు రాజకీయ చక్రం అడ్డువేస్తున్నారు. కాగితాలమీద వేల ఎకరాల మాన్యాలూ, కోట్ల విలువైన ఆస్తులు ఉండికూడా నిత్యనైవేద్యాలకు, అర్చకుల జీతాలకు కటకటలాడుతున్న ఆలయాలు వేలకు వేలు. ఈదుస్థితికి పవిత్ర ఆలయ వ్యవస్థను దిగజార్చిన వారిని చట్టబద్ధ పరిపాలకులు అనాలా? పట్టపగటి బందిపోట్లు అనాలా?

ఆలయానికి కీలకమైన పూజారి ఇవాళ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు తక్కుంగల అధికారుల చేత దొంగలా చూడబడుతూ అటెండరుకంటే తక్కువ గౌరవం పొందే అభాగ్యుడు. గుడి బాధ్యతలకు వినియోగింపబడే ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వంటివారు హిందూ మతాన్ని విశ్వసించేవారు అయి ఉండాలన్న చట్ట నిబంధన కాగితాలమీదే కొడిగట్టింది. దేవస్థానం వాహనంలో చర్చికి వేళ్లేవాళ్లు, బైబిల్‌ పట్టుకుని తిరిగేవాళ్లు, స్వామికి దండం పెట్టని వాళ్లు, ప్రసాదం ముట్టనివాళ్లు పుజారుల మీద, పూజా విధానాలు, కైంకర్యాల మీద పెత్తనం చలాయిస్తున్నారు.

ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఆలయాలలో అంతులేని అవినీతి, అక్రమాల, అపచారాల, దురాగతాల వైనాలు ఎంత చెప్పినా తరగవు. రక్షకులే భక్షకులైన ఈ దారుణ దురవస్థ మొత్తానికీ మూలం ఆలయాల మీద సర్కారీ జబర్దస్తీ!

జబర్దస్తీ అని ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాలు చేస్తున్న స్వారీకి చట్టబద్ధత ఎంత మాత్రమూ లేదు కనుక! గుళ్లమీద కంట్రోలుకు తమకు ఉన్నదని ప్రభుత్వాలు చెప్పుకునే అధికారం వాస్తవానికి వాటికి లేనేలేదు కాబట్టి!!

గుళ్లమీద పెత్తనం చేసే అధికారం మీకు ఎక్కడిదని అడిగితే ఏ ప్రభుత్వమైనా చూపించేది ఒకే ఒక రాజ్యాంగ అధికరణం : 25(2)(a). హిందూ దేవాలయాలన్నిటినీ ప్రభుత్వ ఆస్తులుగా భావించి, వాటి నెత్తినెక్కి పెత్తనం చేయవచ్చునని అందులో ఎక్కడా లేదు. అక్కడ ప్రభుత్వానికి ఇచ్చిందల్లా 'మత ఆచరణతో సంబంధం ఉన్న ఏ ఆర్థిక, ద్రవ్యపరమైన, రాజకీయ లేక సెక్యులర్‌ యాక్టివిటీని క్రమబద్ధం లేక పరిమితం చేసేందుకు శాసనాలు చేసే'' అధికారాన్ని మాత్రమే! అంటే దేవాలయాలకు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సెక్యులర్‌ కార్యకలాపాల విషయంలో ఏవైనా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లు భావిస్తే వాటిని ప్రభుత్వం క్రమబద్ధం (రెగ్యులేట్‌) చేయవచ్చు. రిస్ట్రిక్ట్‌ చేయవచ్చు. దానికి అవసరమైన శాసనాలు చేయవచ్చు. ప్రభుత్వం తన హద్దులో తానుండి, లోటుపాట్లను సరిదిద్ది కార్యకలాపాలను రెగ్యులేట్‌ చేసేందుకు కావాలనుకుంటే శాసనాలు చేయవచ్చు. అంతేగాని ఏకంగా దేవాలయాలను తన స్వాధీనం చేసుకుని, వాటి దైనందిన నిర్వహణ మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని, గుళ్లమీద స్వారీ చేసే హక్కు ప్రభుత్వానికి లేదు.

తప్పులు జరగకుండా రెగ్యులేట్‌ చేసేందుకే దేవాలయాలను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నామని సమర్థించేందుకూ రాజ్యాంగరీత్యా ఆస్కారం లేదు. మత వ్యవహారాలను సొంతంగా మేనేజ్‌ చేసుకోవటానికి, స్థిరచరాస్థులను సంపాదించి వాటిని అజమాయిషీ చేసుకోవటానికి అన్ని మతాలకు చెందిన అన్ని మత శాఖలకు, వాటికి చెందిన అన్ని విభాగాలకూ పూర్తి హక్కులను రాజ్యాంగం 26వ అధికరణం విస్పష్టంగా దఖలు పరచింది. కాబట్టి మత వ్యవహారాల మేనేజ్‌మెంటు, ఆస్తుల అజమాయిషీ ఆయా మతాల వారి హక్కు. అందులో ప్రభుత్వం చొరబడతామంటే కుదరదు.

ఈ విషయం సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికి 64 ఏళ్లకిందటే నిష్కర్షగా తేల్చి చెప్పింది. ఉడిపి కేంద్రంగా శ్రీమత్‌ మధ్వాచార్యులు స్థాపించిన అష్టమఠాల్లో ఒకటైన శిరూర్‌ మఠానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 1954లో ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పు [1954 AIR 282] లో ఏమన్నదో గమనించండి.

Under article 26(d) it is the fundamental right of a religious denomination or its representative to administer its properties in accordance with law; and the law, therefore, must leave the right of administration to the religious denomination itself subject to such restrictions and regulations as it might choose to impose. A law which takes away the right of administration from the hands of a religious denomination altogether and vests it in any other authority would amount to a violation of the right guaranteed under clause (d) of article 26.
(చట్టప్రకారం తన ఆస్తులను అజమాయిషీ (administer) చేసుకోవడం ప్రతి మత శాఖకూ, దాని ప్రతినిధులకూ 26(డి) రాజ్యాంగ అధికరణం కింద ప్రాథమిక హక్కు. కాబట్టి అజమాయిషీ హక్కును సంబంధిత మతశాఖకే చట్టం వదిలిపెట్టాలి. అందుకుగాను విధించబడే పరిమితులకు, రెగ్యులేషన్లకు లోబడి ఆ అజమాయిషీ జరగాలి. పరిపాలన హక్కును మతశాఖ చేతుల నుంచి మొత్తంగా లాగివేసి వేరొక అధారిటీకి అప్పగిస్తే అది 26(డి) అధికరణం కింద గ్యారంటీ అయిన హక్కును భంగపరచడమే అవుతుంది.)

సుప్రీంకోర్టు ప్రకటించిన ఈ ధర్మ నిర్ణయంలో సందిగ్ధత గాని, అస్పష్టత గాని ఉన్నాయా?

26వ అధికరణంలో దేవాలయాలు, మఠాలు, ఇతర సంస్థలు అంటూ విడివిడిగా పేర్కొనలేదు. అన్నీ ఆయా మతశాఖలు (డినామినేషన్లు) నిర్వహించే సంస్థల కిందికే వస్తాయి. వాటికి సంబంధించిన ఆస్తుల అజమాయిషీ, పరిపాలన వగైరాలన్నీ ఆయా మతశాఖల హక్కుగానే రాజ్యాంగం ప్రకటించింది. ప్రభుత్వం కావాలనుకుంటే బయటి నుంచి శాసనపరంగా రెగ్యులేట్‌ చేయవచ్చే తప్ప లోపలికి చొరబడి మత సంస్థపై నేరుగా పెత్తనం చలాయించేందుకు వీలేలేదు.

ఈ మాటను రతీలాల్‌ పానాచంద్‌ గాంధికి బొంబాయి రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 1954లోనే ఇలా నొక్కి చెప్పింది.

It should be remembered that under article 26(d), it is the religious denomination itself which has been given the right to administer its property in accordance with any law which the state may validly impose. A law which takes away the right of administration altogether from the religious denomination itself and vests it in any other or secular authority; would amount to violation of the right which is guaranteed by article 26(d).
[1954 AIR 388]
26(డి) అధికరణం కింద ప్రభుత్వ శాసనాలకు లోబడి తన ఆస్తులను పాలించుకునే హక్కు సంబంధిత మత శాఖకే ఇవ్వబడిందని గుర్తుంచుకోవాలి. పరిపాలన హక్కును మతశాఖ నుంచి మొత్తంగా లాగివేసి, వేరేదైనా సెక్యులర్‌ అథారిటీకి ఏ శాసనమైనా అప్పగిస్తే అది 26(డి) అధికరణం ఇచ్చిన హక్కును అతిక్రమించటమే అవుతుంది.

తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమైన (Pannalal Bansilal Pitti Vs. State of Andhra Pradesh) కేసులో సుప్రీంకోర్టు 1996 జనవరిలో చేసిన ఈ ధర్మ నిర్ణయాన్ని కూడా ఇదే సందర్భాన చిత్తగించండి :

The right to establish a religious and charitable institution is a part of religious belief or faith and... the right to administer and maintain such institution can not altogether be taken away and vested in... the officers of a secular Government.
[1996 AIR 1023]
(మత, ధార్మిక సంస్థను నెలకొల్పే హక్కు మత విశ్వాసంలో భాగం.. అలాంటి సంస్థను నడిపే హక్కును మొత్తంగా లాగేసి సెక్యులర్‌ ప్రభుత్వ అధికారులకు అప్పగించడం కుదరదు.)

మరి ఇప్పుడు స్మార్త, వైష్ణవ, మాధ్వ, వీరశైవ తదితర మతశాఖల హక్కులను లాగేసుకొని వాటికి చెందిన దేవాలయాలను నడుపుతున్నది సెక్యులర్‌ ప్రభువులే కదా? రాజ్యాంగరీత్యా అది అక్రమమే కదా?!

No comments:

Post a Comment