Friday, 10 August 2018

రాజ్యాంగ రక్షణ హిందువులకెందుకు?

పెక్యులరిజం - 8
 ఎం.వి.ఆర్‌. శాస్త్రి

..........


నిజం చూడకు.

నీ యధార్థ స్థితిని తెలుసుకొనే ప్రయత్నం చెయ్యకు.

బుర్రకు పని పెట్టకు.

హాయిగా భ్రమల్లో బతికెయ్‌.

ఇదీ ఈ కాలంలో సగటు హిందువు మనఃస్థితి.

రాజ్య వ్యవహారాలూ, రాజ్యాంగ విషయాలూ మామూలు జనాలకు ఎలాగూ బుర్రకెక్కవు. మేధావులమని, తమకు తెలియంది లేదని అనుకునే వింత శాల్తీలకైనా తాము ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నారో అర్థమైందా?

మాట వరసకు మత స్వాతంత్య్రం సంగతే తీసుకోండి.

హిందూ సమాజంలో ప్రతి అమాంబాపతు మేధావీ ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పలికే చిలక పలుకులేమిటి?

పరమ పవిత్ర భారత రాజ్యాంగం పౌరులందరికీ మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ప్రసాదించింది. 25 నుంచి 30 నెంబరు వరకూ ఏకంగా ఆరు అధికరణాలను మత స్వాతంత్య్రాన్ని గట్టి చేస్తూ రాజ్యాంగం ప్రాథమిక హక్కుల పరిచ్చేదంలో చేర్చారు. అవి భారత పౌరులందరితో సమానంగా హిందువులకూ వర్తిస్తాయి. కాకపోతే రాజ్యాంగం దేవుడు వరమిచ్చినా గవర్నమెంట్లు అనబడే పూజారులు వరమివ్వకుండా హిందువులమీద తగని వివక్ష చూపిస్తున్నాయి. లోపం రాజ్యాంగానిది కాదు. ప్రభుత్వాలు నడిపే రాజకీయ నాయకులది. రాజ్యాంగం ఇచ్చిన మతహక్కులను నిలబెట్టుకునేందుకు హిందువులు ఏకం కావాలి.

ఇదే కదా? మన పెద్ద తలకాయలు మనకు విసుగులేకుండా చెప్పేది? ఇది కరక్టేనా?

రాజ్యాంగంలో పొందుపరచిన మత స్వాతంత్య్రం ప్రధానంగా ఎవరిని ఉద్దేశించినట్టిది? 25 నుంచి 30 దాకా ఆరు అధికరణాలను రాజ్యాంగంలోకి ఎక్కించింది ముఖ్యంగా ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి? ఎవరి మత క్షేమం కాంక్షించి? అసలు మత స్వాతంత్య్రం విషయంలో రాజ్యాంగం రాసినవారి ఆలోచన ఏమిటి?

ఈ ప్రశ్నలకు తిరుగులేని సమాధానం చెప్పగలిగిందెవరు? రాజ్యాంగానికి సంబంధించినంతవరకు సాధికారికంగా వివరించగలిగింది ఉన్నత న్యాయ వ్యవస్థే కదా? అందులోనూ రాజ్యాంగ ధర్మ సూక్ష్మాలపై పరమ ప్రామాణికం సుప్రీంకోర్టు అభిప్రాయమే కదా? దేశంలో ఎంతటివారైనా దాన్ని శిరసావహించవలసిందే కదా?

మరి - అంతటి సర్వోన్నత న్యాయపీఠం రాజ్యాంగంలో మత స్వాతంత్య్రానికి సంబంధించిన అధికరణాల వెనుక ఉద్దేశం, వాటి పరమార్థం గురించి ఏమి చెప్పింది?

The object of articles 25 to 30 was to preserve the rights of religious and linguistic minorities, to place them on a secure pedestal... These provisions enshrined a befitting pledge to the minorities in the Constitution of the country... It is only  the minorities who need protection.

(25 నుంచి 30 వరకు గల రాజ్యాంగం అధికరణాల ఉద్దేశం మతపరమైన, భాషా పరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించి, వారిని పదిలమైన పీఠం మీద ఉంచడమే... దేశ రాజ్యాంగం మైనారిటీలకు చేసిన సముచితమైన బాసను ఈ అధికరణాలు తాపడం చేశాయి... రక్షణ అవసరమైంది మైనారిటీలకు మాత్రమే.)

ఇవి నేటికి 44 ఏళ్లకింద గుజరాత్‌ ప్రభుత్వానికీ, సెయింట్‌ జేవియర్స్‌ కాలేజికి నడుమ వ్యాజ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎన్‌.రే నేతృత్వంలో 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని కొన్ని వాక్యాలు. (1974 AIR 1389)

సుప్రీంకోర్టు చేసిన ఈ ధర్మ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయంలో ఇంకా సందేహం ఉంటే పైన పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ కేరళ హైకోర్టు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఇచ్చిన ఈ కింది వివరణను చిత్తగించండి.

In this context it is relevant to bear in mind the historical background which led to the inclusion of Articles 25 to 30 in the chapter on fundamental rights in the Constitution... The real purpose and intendment of Articles 25 and 26 is to guarantee especially to the religious minorities in this country the freedom to profess, practise and propagate their religion, to establish and maintain institutions for religious and charitable purposes, to manage its own affairs in matters of religion.

No doubt, the freedom guaranteed by these two articles applies not merely to religious minorities but to all persons (Articles 25) and all religious denominations or sections thereof (Article 26). But in interpreting the scope and content of the guarantee contained in the two Articles, the court will always have to keep in mind the real purpose underlying the incorporation of these provisions in the fundamental rights chapter.

(రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో 25 నుంచి 30 అధికరణాలను చేర్చడానికి దారితీసిన చారిత్రక నేపథ్యాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. 25, 26 అధికరణాల వెనక అసలు ఉద్దేశం, ఆంతర్యం ముఖ్యంగా దేశంలోని మతపరమైన మైనారిటీలకు కొన్ని గ్యారంటీలు ఇవ్వటమే. వారి మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి, ఆచరించటానికి, వ్యాప్తి చేయటానికి మతపరమైన, ధార్మికమైన సంస్థలను స్థాపించి, నడుపుకునేందుకు... మతపరంగా వారి వ్యవహారాలను వారే నిర్వహించుకోవటానికి స్వేచ్ఛనిచ్చే గ్యారంటీలవి.

ఈ రెండు అధికరణాలలో గ్యారంటీ ఇవ్వబడిన స్వాతంత్య్రం మతమైనారిటీలకే గాక అందరు వ్యక్తులకు (25వ అధికరణం), అన్ని మత శాఖలకు లేక వాటియొక్క విభాగాలకు (26వ అధికరణం) కూడా వర్తిస్తాయనడంలో సందేహం లేదు. కాని ఈ రెండు అధికరణాలలో పొందుపరిచిన గ్యారంటీల పరిధిని, విషయాన్ని వ్యాఖ్యానించేటప్పుడు  ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో ఈ అధికరణాలను చేర్చడంలోని అసలు ఉద్దేశాన్ని న్యాయస్థానం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.)

గురువాయూర్‌ దేవస్థానం మేనేజిమెంటుకూ టి.కృష్ణన్‌కూ నడుమ దావాలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కేరళ హైకోర్టు ధర్మాసనం 1978లో ఇచ్చిన తీర్పు (AIR 1978 Ker 68) లో చెప్పిందిది.

రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు రాజ్యాంగం నుంచే సర్వాధికారం పొందిన ఉన్నత న్యాయవ్యవస్థ రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వాతంత్య్రం ప్రధానంగా ఎవరి రక్షణ కోసం? ఎవరి ప్రయోజనాలను ఉద్దేశించి? అన్న విషయాన్ని ఇదిగో ఇంత వివరంగా చెప్పింది. అయినా రాజ్యాంగం తమకేవో గొప్ప వరాలు ఇచ్చిందన్న భ్రమలను హిందూ సమాజం వదలకపోతే దానిని బ్రహ్మదేవుడు కూడా బాగుచేయలేడు.

ఇక్కడ ఓ సందేహం రావచ్చు. దేశ జనాభాలో నూటికి 80 శాతం ఉన్న హిందువులను వదిలేసి 20 శాతం ఉన్న మైనారిటీలకు మాత్రమే రాజ్యాంగం అన్ని రక్షణలు ఎందుకు కల్పించింది? హిందువులకు మత స్వాతంత్య్రం అక్కర్లేదా? రాజ్యాంగ కర్తల దృష్టిలో మైనారిటీలవి మాత్రమే మతాలా? రాజ్యాంగం రాసినవాళ్లకు దేశంలోని అతిప్రధాన మతం మీద కక్ష ఏమైనా ఉందా? వారి దృష్టిలో హిందువులు ఏ రక్షణకూ యోగ్యత లేని రెండో తరగతి పౌరులా?

కాదు. తొందరపడి అలా నిందించటం తప్పు. రాజ్యాంగం రాసిన, ఆమోదించిన అంబేద్కర్ వంటి పెద్దలకు అలాంటి దురుద్దేశం లేదు. హిందువుల మీద, వారి మతం మీద రాజ్యాంగ కర్తలకు ప్రత్యేక ద్వేషం ఏమీ లేదు. అసలు విషయం వడ్లగింజలో బియ్యపు గింజ.

జనాభాలో కేవలం 20 శాతంలోపు ఉన్న మైనారిటీల మత స్వేచ్ఛకు మాత్రమే రాజ్యాంగంలో రక్షణ ఎందుకు కల్పించారంటే - వారు 20 శాతం కంటే తక్కువ ఉన్నారు కాబట్టి. 80 శాతం పైగా ఉన్న హిందువుల మత స్వేచ్ఛకు అలాంటి రక్షణ ఎందుకు ఇవ్వలేదంటే - వారు 80 శాతం పైగా ఉన్నారు కనుక! వారికి ప్రత్యేక రక్షణలేవీ అవసరం లేదు కనుక!

అది న్యాయమే కదా? దేశంలో ఉన్నదంతా హిందూ మతమే. దేశం నిండా ఉన్నది హిందువులే అయినప్పుడు వారి మతానికి వేరొకరి అనుమతి కావాలా? రాజ్యాంగంలో ప్రత్యేకంగా వరం ఇస్తేగానీ వారి మతాన్ని వారు ఆచరించుకోలేరా? వేల ఏళ్లుగా హిందూ ధర్మంలో ఉండి, హిందూ మతంలో పుట్టి, హిందూ మతంలో బతికి, హిందూ మతంలో చస్తున్న హిందువులకున్న మత హక్కులకు ఏ శక్తి అడ్డం రాగలదు? ఒకవేళ సమస్య ఏదైనా వస్తే వారు కాస్త చికాకు చూపిస్తే చాలు పరిపాలకులు పరిగెత్తుకొచ్చి ఆ సమస్యను తేల్చరా? మనం ఎంచుకున్నది ప్రజాస్వామ్యం. అందులో ఎవరు తమను పాలించదగ్గ వారో నిర్ణయించేది ప్రజలు. ఆ ప్రజల్లో 80 శాతం మందికి పైగా హిందూ మతస్థులు. అలాంటప్పుడు హిందూ మతం పట్ల భయభక్తులతో మెలిగి ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే మళ్లీ ఎన్నికల్లో ప్రజలు తమని తన్ని తగలేస్తారన్న భయం ప్రభుత్వాలు నడిపేవారికి ఉంటుంది. ఏదైనా కావలసివస్తే ప్రభుత్వాల గొంతు మీద కూచుని హిందువులు చేయించుకోగలరు. కాబట్టి మళ్లీ వారికి ప్రత్యేకంగా రాజ్యాంగ రక్షణల రక్షరేకు అక్కర్లేదు. వారి వలె ప్రభుత్వాలను ఒత్తిడి చేసి కార్యం సాధించగలిగిన ఓట్ల సంఖ్యాబలం అల్పసంఖ్యాకులైన మైనారిటీ మతాలకు ఉండదు. అవికూడా బతకాలి కదా? కాబట్టి వాటికి ఊతంగా చట్టరక్షణ అవసరం.

ఇదీ రాజ్యాంగ కర్తల ఆలోచనా ధోరణి. ఇది కేవలం మన ఊహ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే ధ్రువీకరించిన యదార్థం. పైన ఉటంకించిన 1974 AIR 1389 తీర్పులో సుప్రీంకోర్టు ఇంకా ఏమందో చూడండి.

The majority in a system of adult franchise hardly needs any protection. It can look after itself and protect its interests. Any measure wanted by the majority can without much difficulty be brought on the statute book because the majority can get that done by giving such a mandate to the elected representatives. It is only  the minorities who need protection.

(వయోజనులందరూ కలిసి చట్ట సభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానంలో మెజారిటీ వర్గానికి వేరే రక్షణ అవసరమే ఉండదు. అది తన సంగతి తాను చూసుకోగలదు. తన ప్రయోజనాలను తాను కాపాడుకొనగలదు. మాకు ఇది కావాలి, మీరు ఇది చేయండి అని తాము ఎన్నుకొనే ప్రతినిధులకు చెప్పి, అలా చేయడానికి వారికి తమ తరఫున అధికారం ఇవ్వగలరు. మెజారిటీ ఏ విధానాన్ని కోరుకుంటే అది పెద్ద కష్టం లేకుండా చట్ట ప్రతిపత్తిని పొందగలదు. రక్షణ కావలసింది మైనారిటీలకి మాత్రమే.)

ప్రభుత్వాన్ని మెడలు వంచి తమకు కావలసిన చట్టాన్ని చేయించుకోగలిగిన ఓట్ల మహాబలం ఉన్నప్పుడు మళ్లీ హిందువులకు చట్టపరంగా ముందస్తు రక్షణ ఎందుకు? ఆ బలం లేనివారికి కదా అలాంటి రక్షణ ఊతం కావలసింది?

కరెక్ట్‌. అలాంటి మహాబలం తమ చేతిలో ఉన్నదన్న స్పృహ హిందువులకు ఉంటే ఏ సమస్యా లేదు. రాదు. కాని విచిత్ర విషాదం ఏమిటంటే - తమ ఉనికి చేతనే రాజ్యమేలే వారికి వినమ్రత కలిగించి, తమ కనుసైగతోనే పాలకులను శాసించి, రాజాధిరాజుల్లా బతకవలసిన హిందువులకు అనేక రకాల సంకర సెక్యులర్‌ వైరస్‌లు పట్టి మెదడు మొద్దుబారింది. తమ పెద్దలు, గురువులు, మేధావులు అని హిందువులు భావించేవారే గందరగోళంలో పడి తమ అయోమయాన్ని హిందూ సమాజానికి ప్రసాదంలా పంచిపెడుతున్నారు.

దాంతో - హిందువులు వారి దేశంలోనే వారు దిక్కులేనివాళ్లమని ఫీలైపోతున్నారు. ఏదో రాజ్యాంగం అండ ఉన్నది కాబట్టే ఈమాత్రం బతక గలుతున్నామని వారు తృప్తి పడుతున్నారు. మిగతా మతాలతో బాటు, వాటితో సమానంగా తమకూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కూడా సరిగా అనుభవించలేని ఖర్మ పట్టిందని చాలా ఇదైపోతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా తమకు దక్కనీయకుండా ప్రభుత్వాలు దుర్మార్గాలకు దిగాయని నిస్సహాయంగా నెత్తి బాదుకుంటున్నారు. తమ నౌకర్లయిన పాలకులు తమకు చేస్తున్న అన్యాయాలను సరిదిద్ది, తమను ఆదుకోమంటూ పిటీషన్లు పట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

రాజకీయ నక్కలకూ, గద్దెలెక్కిన తోడేళ్లకూ అంతకంటే చాన్సు ఏమి కావాలి?


No comments:

Post a Comment