Tuesday, 3 April 2018

కిల్లర్ రాముడి డాడీ !

   
   శ్రీరామచంద్రుడు ఇంకా పుట్టలేదు. అతడి తండ్రి దశరథుడికి ఇంకా పెళ్లి కాలేదు. సిహాసనమూ ఎక్కలేదు.

   కోడె వయసు యువరాజు ధనుర్బాణాలు ధరించి చీకటి వేళ సరయూ నది తీరానికి వెళ్లాడు. దూరాన నీటిలో కడవ ముంచిన చప్పుడు వినవచ్చింది. అది వన్యమృగాలు నీరు తాగటానికి వచ్చే సమయం. ఏ ఏనుగో నీళ్ళు తాగుతున్నదని దశరథుడు తలచాడు. శబ్దాన్ని బట్టి ఎంత దూరాన ఉన్న లక్ష్యాన్నైనా బాణంతో కొట్టగల తన  శబ్దభేది విద్యను సరదాకొద్దీ ప్రయోగించాడు. బాణం వదిలాడు. మదపుటేనుగు శరాఘాతానికి కుప్పకూలిన శబ్దానికి బదులు ఒక మనిషి ఆక్రందన వినిపించింది. యువరాజు తల్లడిల్లి పరుగున అక్కడికి వెళ్ళాడు. కిందపడి విలవిల లాడుతున్న తాపసిని చూశాడు.

  " వృద్ధులు , అంధులు అయిన నా తలితండ్రుల దప్పిక తీర్చటానికి నీటికోసం వచ్చిన నన్ను ఎందుకు చంపావు ? " అని మునికుమారుడు నిలదీశాడు. తలవాచేట్టు చివాట్లు పెట్టాక " నా తండ్రి శాపం పెడితే నువ్వు నాశనమవుతావు. దానికంటే ముందు నువ్వే వెళ్లి క్షమించమని అడుగు. బతికిపోతావ్ . ముందు ఈ బాణం బాధ తట్టుకోలేకపోతున్నాను. దాన్ని లాగేసి పుణ్యం కట్టుకో " అన్నాడు .

   దశరథుడు డైలమాలో పడ్డాడు. బాణం లాగితే తాపసి మరణిస్తాడు. తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. అతడేమో బాధ భరించలేను బాణం లాగెయ్యమంటున్నాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలి ? తపస్వి అతడి గుంజాటన కనిపెట్టి ఇలా అన్నాడు:

   బ్రహ్మహత్యాకృతం పాపం హృదయా దపనీయతామ్

   న ద్విజాతి రహం రాజన్ మాభూ త్తే మనసో వ్యథా 
   శూద్రాయా మస్మి వైశ్యేన జాతో జనపదాధిప   

[ వాల్మీకి రామాయణం , అయోధ్యా కాండ , 63వ సర్గ , 49 , 50 శ్లోకాలు ]

   (నేను  మరణిస్తే నీకు బ్రహ్మహత్యా మహాపాపం వస్తుందనే శంక నీ మనసులోంచి తొలగించు. నేను బ్రాహ్మణుడిని కాను. నేనొక శూద్ర స్త్రీకి వైశ్యుడి వలన పుట్టినవాడను. )

   సరే ! దశరథుడు బాణం లాగాడు . ముని కుమారుడు ప్రాణం విడిచాడు. దశరథుడు కడవతో నీరు ఎత్తుకుని మునివాటికకు వెళ్లి కొడుకు రాక కోసం గంపెడాశ తో ఎదురు చూస్తున్న చూపులేని ముసలి దంపతులకు దారుణ దుర్వార్తను వినిపించాడు. నిశ్చేష్టుడైన వృద్ధముని  కాస్త తేరుకున్నాక " నువ్వే వచ్చి చెప్పుకున్నావు కాబట్టి బతికి పోయావ్. లేకపోతే నా శాపానికి నీ తల లక్ష ముక్కలయ్యేది. మమ్మల్ని వెంటనే మా కుమారుడున్న చోటికి తీసుకువెళ్ళు " అంటాడు. అక్కడికి వెళ్ళాక కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపిస్తూ తండ్రి ఇలా అంటాడు

  కస్య వా పరరాత్రేహం శ్రోష్యామి హృదయంగమం 
  అధీయానస్య  మధురం శాస్త్రం వాన్య ద్విశేషతః 

   కో మాం సంధ్యా ముపా స్యైవ స్నాత్వా హుతహుతాశనః 
   శ్లాఘయిష్య త్యుపాసీనః పుత్రశోకభయార్దితం       

 [ వాల్మీకి రామాయణం , అయోధ్యా కాండ , 64వ సర్గ , 33 , 34 శ్లోకాలు ]

   ( ఇటుపై ఎవడు అర్ధరాత్రి లేచి హృద్యంగా మధురస్వరం తో వేదశాస్త్రాలు , తక్కిన పురాణాలు చదువుతుండగా వినగలను ? ఎవడు ఇకపై స్నానం చేసి , సంధ్యవార్చి అగ్నిహోత్రమందు హోమం చేసి పుత్రశోకం తో పీడితుడనైన నాకు శుశ్రూష చేస్తాడు ? ) 

   ఇలా పరిపరివిధాల రోదించి  కుమారుడికి తండ్రి ఉత్తరక్రియలు చేస్తాడు. రెక్కలు తెగిన పక్షుల్లాంటి తాము కొడుకు లేనిదే జీవించజాలమని పలికి  అక్కడికక్కడే చితి పేర్చుకుని ధర్మపత్నితో సహా  అగ్నిప్రవేశం చేయబోతూ " నాలాగే నువ్వుకూడా  పుత్రశోకంతో మరణిస్తావు " అని దశరథుడికి శాపం పెడతాడు. అప్పుడే ఇంకో మాట కూడా అంటాడు :

   అజ్ఞానాత్తు హతో యస్మాత్ క్షత్రియేణ త్వయా ముని :
   తస్మా త్త్వాం నావిశ త్యాశు బ్రహ్మహత్యా నరాధిప      

[ వాల్మీకి రామాయణం , అయోధ్యా కాండ , 64వ సర్గ , 56 వ  శ్లోకం ]

   ( రాజా ! క్షత్రియుడివైన నీవు అజ్ఞానం వల్ల మునిని చంపావు. కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం కలగదు. )




   ఇప్పటి లెక్క ప్రకారం షెడ్యూల్డ్ తెగ ( ఎస్.టి. ) అయిన బోయ కులంలో పుట్టి మహర్షి అయిన వాల్మీకి రాసిన ఆదికావ్యం లోని ఈ ఘట్టాన్ని బట్టి మనకు కొన్ని వాస్తవాలు  వెల్లడవుతాయి .

    మన సైన్సు తన శక్తి మేరకు కనుక్కొని మనకు చెప్పిన ప్రకారమే రామసేతువు కనీసం 7 వేల ఏళ్ల కిందటిది . దానిని కట్టిన రాముడు పుట్టటానికి చాలా ఏళ్ల పూర్వపు భారత వైదిక ఆర్య సమాజంలో ...

    1. శూద్ర స్త్రీని పెళ్ళాడిన  ఒక వైశ్యుడు ఋషి అయ్యాడు. దేశాన్నేలే రాజునే శపించగల తపశ్శక్తి సంపన్నుడయ్యాడు. ఆ రాజు తన కాళ్ళు పట్టుకుని వేడితే తల వక్కలు చేయకుండా కనికరించాడు.

    2. వైశ్య భర్త , శూద్ర భార్య , వారికి కలిగిన కుమారుడు రోజూ అగ్నిహోత్రం లో హోమం చేసేవారు. వేదశాస్త్రాలు చదివేవారు. బ్రాహ్మణుడుగా  జన్మించని కుమారుడు రోజూ సంధ్యావందనం చేసి తన వైశ్య తండ్రికీ , శూద్ర మాతకూ రాత్రి పొద్దుపోయేదాకా వేదాలను, పురాణాలను మధురస్వరంతో  వినిపించేవాడు. వేదం చదివితే నాలుక కోస్తారు , వింటే చెవుల్లో మరిగే సీసం పోస్తారన్న భయం ఆ ముని కుటుంబంలో ఎవరికీ లేదు.

   3. జన్మ చేత బ్రాహ్మణులు కాకపోయినా వారు దేశాన్నేలే రాజు చేతే పూజ్య తపస్వులుగా పాదాభివందనాలు అందుకున్నారు.

   4. తన తల్లిది శూద్ర వర్ణం , తండ్రిది వైశ్య వర్ణం కాబట్టి తాను బ్రాహ్మణుడు కాడని మునికుమారుడు అనుకున్నాడు. అందుకే నీ వల్ల నా ప్రాణం పోయినా నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకోదు అని రాజుకు భరోసా ఇచ్చాడు. కాని గుణ కర్మ ల రీత్యా అతడు నూటికి నూరు పాళ్ళూ బ్రాహ్మణుడే. ఆ సంగతి అతడికంటే విజ్ఞుడు, ధర్మజ్ఞుడు అయిన తండ్రికి తెలుసు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం  వారు  బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణ కుమారుడి మరణానికి కారకుడైన రాజుకు బ్రహ్మహత్యాపాతకం మామూలుగా అయితే తగలవలసిందే. కానీ అది తెలియక చేసిన నేరం కనుక , నేరస్తుడు తనను క్షమాబిక్ష వేడాడు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం తగలకుండు గాక అని వృద్ధ ముని తన తపశ్శక్తి చేత మినహాయింపు ఇచ్చాడు.

   ఈ కాలంలో మన మహామేధావులు మనకు నూరిపోస్తున్న ఘోర చరిత్రే కనుక నిజమయితే .. ఈ ఘట్టంలో దశరథుడు ఏమి చేయాల్సింది ? శూద్రుడు వేదం చదవకూడదు . వినకూడదు. తపస్సు చేయనే కూడదు అని దారుణమైన మనువాద ఆంక్షలు అమలులో ఉన్న కాలమట కదా అది ?! ఎవడో శూద్రుడు ఎక్కడో తపస్సు చేస్తున్నాడని ఒక బ్రాహ్మడు వచ్చ్చి పితూరీ చేయగానే దుష్ట రాముడు అర్జెంటుగా వెళ్లి శంబూకుడనే  శూద్రుడి తల నరికేశాడట గదా ?  కొడుకే అంత పని చేసి ఉంటే మరి  అతడిని కనబోయే దశరథుడు ఇంకెంత " కట్టర్ మనువాది " అయి ఉండాలి?

   శూద్ర సంతానమైన వాడు మునివాటికలో తపస్సు చేస్తున్నాడూ   అంటే అది ఎలాగూ తల నరకాల్సినంతటి నేరమే కాబట్టి రాత్రివేళ తన బాణం తగిలి అతడు చావటం న్యాయమే అని దశరథుడు డబాయించి ఉండాలి కదా ?" చావు !శూద్రా ! " అని గర్జించి వాడు అడగకుండానే బాణం లాగి చంపి ఉండాలి కదా ? తరవాత అడ్రెసు కనుక్కుని మునివాటిక వెళ్లి బ్రాహ్మణులుగా పుట్టకుండా తపస్సు చేస్తున్న నేరానికి ముసలి దంపతుల తలలు అక్కడికక్కడే తెగ వేసి ,  సామాజిక చైతన్యవంతులైన మన మహాజ్ఞానులకు  మనువాదాన్ని చీల్చిచెండాడడానికి ఇంకో గొప్ప ప్రచారాయుధం అందించి ఉండాల్సింది కదా ?

   మరి కిల్లర్ రాముడి డాడీ అవేమీ చేయనే లేదేమిటి ? అబ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తున్నారు , హోమాలు , తపస్సులూ ఎంచక్కా చేసుకుంటున్నారు అని తెలిసినా మండిపడకుండా ,  పోయిపోయి వాళ్ళ కాళ్ల మీదే పడ్డాడేమిటి ?

   దశరథుడి నాటికి మనుధర్మం లేదు .కొడుకు హయాంలోనే అది తగులడింది అని సర్ది చెప్పుకుందామా ? కుదరదు . మనువు దశరథుడి  కంటే బోలెడు తరాల ముందువాడు. ఇక్ష్వాకు వంశ మూలపురుషుల్లో ఒకడు.

    ఇంకా ఎన్నాళ్ళు వినిపిస్తారు శంబూకుడి కట్టుకథను ?

 







No comments:

Post a Comment