Monday, 2 April 2018

మనువు శూద్ర ద్వేషా ?

మనుధర్మం - 12


ఎం.వి.ఆర్.శాస్త్రి
........
 

  ఫలానా కులంలో పుట్టుక చేతనే వీరు అధికులు, వారు నీచులు .. వీరిది ఎక్కువ కులం , వారిది తక్కువ కులం ... అని  జాతిదురహంకారులు ఎన్ని దరిద్రగొట్టు దురాలోచనలు వ్యాప్తి చేసినా -

    వాస్తవానికి  మనుషులందరిదీ ఒకటే కులం. భరతఖండంలో పుట్టినవారందరిదీ ఒకటే డి.ఎన్.ఏ. ! ఒకటే రక్తం ! ఆ జాతికి మన పూర్వులు పెట్టిన పేరు "శూద్ర " అని.

    జన్మనా జాయతే శూద్రః 
    సంస్కారాత్ ద్విజ ఉచ్యతే 
    వేద పఠనాత్ భవేత్ విప్రః
    బ్రహ్మ జానాతి  బ్రాహ్మణః
   - అంటుంది ఋగ్వేదం 5 వ మండలం లోని ఆత్రేయ స్మృతి .

     అంటే - పుట్టుక చేత మానవులందరూ శూద్రులు . వారిలో విద్యాసంస్కారం చేయబడ్డ వారు ద్విజులు అనబడతారు. మళ్ళీ వారిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు అవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అవుతారు.

    విద్యాసంస్కారానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉన్నది. నాకు విద్యనేర్పండి అని అడిగిన ప్రతి ఒక్కరికీ వారి కులగోత్రాలతో , తలిదండ్రుల  పుట్టుపూర్వోత్తరాలతో నిమిత్తం లేకుండా గురుకులాలలోని గురువులు ఉపనయన సంస్కారం చేసి విద్య నేర్పాలి. ఆ విధంగా శూద్ర అనే "ఏకజాతి" గా పుట్టిన మానవులలో కొందరికి విద్యాసంస్కారం చేత విద్యాజన్మ అనే రెండో జన్మ వచ్చి ద్విజులు అవుతారు. ఆ ద్విజులలో పరిపాలన , రాజ్య రక్షణ ,ప్రజా సంరక్షణ వంటి వృత్తిని ఇష్టపడి  చేపట్టేవారు క్షత్రియులు అనబడతారు. వ్యవసాయం, పశుపాలన, వ్యాపారం వంటి వృత్తులను ఎంచుకునే వారు వైశ్యులు అనబడతారు. వేదాధ్యయనం, అద్యాపనం , యజ్ఞం చేయటం, చేయించటం వృత్తిగా ఎంచుకున్నవారు విప్రులుగా పిలవబడతారు. అహంకార మమకారాలను వదిలిపెట్టి, ఇంద్రియాలను జయించి , బ్రహ్మ తత్వం  ఎరిగి , బ్రహ్మజ్ఞానం కలిగి , లోక క్షేమం కాంక్షించి , సమాజ హితం కోసం పాటుపడేవారు బ్రాహ్మణులు అనే సర్వోత్తమ, సర్వ శ్రేష్ట తరగతికి చెందుతారు. వారిని అందరూ పూజిస్తారు. అత్యంత గౌరవ స్థానం ఇస్తారు.

    ఇదీ ఆర్ష ధర్మంలో వర్ణవ్యవస్థ. ఇందులో తప్పు ఉన్నదని మెడ మీద తలకాయ ఉన్న వాడు  ఎవడైనా అనగలడా? విద్వాంసుడికి, మానవోత్తములకు పూజ్య స్థానం ఇవ్వమని చెప్పటం నేరమా? పోనీ ఆ పూజ్య స్థానం కేవలం ఒక కమ్యూనిటీలో , ఫలానా కులం లో , లేక గోత్రాలలో పుట్టినవారు  మాత్రమే పొందగలరు ; ఇతర నిమ్న వర్ణాలకు చెందిన వారికి దాన్ని చేరే యోగ్యత లేదు - అంటే అది ముమ్మాటికీ నేరమే. అలాంటి నిషేధం ఆర్షధర్మం లో ఎక్కడా లేదు. మనిషి పుట్టుక పుట్టిన ప్రతివాడికీ ఆ అత్యున్నత గౌరవ స్థానం పొందే యోగ్యత ఉన్నదనే ధర్మ శాస్త్రం చెబుతుంది.

    శూద్రేణ హి సమస్తావత్ యావద్వేదే న జాయతే  ( మనుస్మృతి 2-172 )

    ఉపనయన , విద్యాసంస్కారం అయ్యేవరకు ప్రతివాడూ శూద్రుడే అని మనుస్మృతి చెపుతుంది. ఇది ఉపనయన సంస్కారాన్ని , విద్యాజన్మ అనే ద్విజత్వాన్ని శూద్రులకు నిషేధించటం అవుతుందా ? పుట్టుక చేత శూద్రత్వం నుంచి , విద్య,ఉత్తమ సంస్కారాల చేత ద్విజత్వం పొందే హక్కు, అధికారం ప్రతి మానవుడికీ ఉన్నదని చాటిన మనుస్మృతి శూద్రులను ద్వేషిస్తుందని, నీచంగా పరిగణిస్తుందని ముద్రవేయటం వివేకం ఉన్నవారు చేయవలసిన పనేనా ?

     ఫలానా చెడుపనులు చేసినందుకుగాను శూద్రవర్ణానికి చెందిన వారికి మనువు నిర్దేశించిన శిక్షను .. మనకాలంలో మూడువేల  శూద్రకులాల , ఉపకులాలలో మనం చేర్చిన వారందరిపట్ల మనువు కక్షగా, దారుణ వివక్షగా భావించటం తప్పు. నేరానికి శిక్షల విషయంలో మనువు ఆధునిక  శిక్షాస్మృతులకంటే  ఎన్నో యోజనాల ముందు ఉన్నాడు. పులినీ పిల్లినీ ఒకే గాటన కట్టి , బలవంతుడికీ బలహీనుడికీ ఒకే  రకమైన న్యాయం అమలుపరచే నేటి న్యాయ ప్రహసనానికి మనువు పూర్తిగా  విరుద్ధం . బ్రాహ్మణుడు ఎంత ఘోరనేరం చేసినా తక్కువ దండనతో సరిపెట్టాలనీ, అదే శూద్రుడికేమో చిన్న అపరాధానికి కూడా ఘోరమైన శిక్షలతో చిత్ర వధ చేయాలనీ కొందరు అగ్రవర్ణ దురహంకారులు తరవాత కాలంలో చొప్పించిన తప్పుడు శ్లోకాలకూ , మనుస్మృతి మౌలిక తత్వానికీ ఎక్కడా పోలిక లేదు. అవి దుర్మార్గపు ప్రక్షేపాలని మనుస్మృతి మొత్తాన్ని చదివిన వారెవరికైనా అర్థమవుతుంది.

  విద్యాస్థాయి, ఉత్తమ గుణాలు, ఉన్నత సంస్కారాలను బట్టి పై మూడు వర్ణాలకూ ఒకదానిని మించిన గౌరవ స్థానం ఆ పై దానికి ఇవ్వడంతో మనువు ఆగలేదు. తప్పు చేస్తే ఆ వర్ణాలకు శిక్ష మోతాదును కూడా అదే దామాషాలో నిర్ణయించాడు. ఒకే నేరాన్ని శూద్రుడు చేస్తే విధించాల్సిన శిక్షకంటే రెట్టింపు శిక్షను అదే నేరాన్ని వైశ్యుడు చేస్తే విధించాలి. అదే విధంగా వైశ్యుడికి వేసే శిక్షకంటే రెండింతల శిక్షను క్షత్రియుడికి , దానికి రెట్టింపు , అంటే.. శూద్రుడికి వేయవలసిన దానికంటే ఎనిమిది రెట్ల శిక్షను బ్రాహ్మణుడికి వేయాలని మనువు న్యాయం.

   అష్టాపాద్యం తు శూద్రస్య స్తేయే భవతి కిల్బిషం 
   షోడశైవ తు వైశ్యస్య ద్వాత్రింశత్ క్షత్రియస్య చ  ( 8-337 )

   బ్రాహ్మణస్య చతుష్షష్టి: పూర్ణం వాపి శాతం భవేత్ 
   ద్విగుణా వా చతుష్షష్టిస్తద్దోష గుణవిద్ధి సః   (8-338 )

   ( తాను చేసిన నేరాన్ని తానే అంగీకరించిన శూద్రుడికి 8 యూనిట్ల శిక్షవేస్తే ... అతడి స్థానంలో వైశ్యుడు ఉంటే 16 యూనిట్లు , క్షత్రియుడికైతే 32 యూనిట్లు , అదే నేరం బ్రాహ్మణుడు చేస్తే 64 లేక 100 లేక 128 యూనిట్ల శిక్షను విధించాలి. సామాన్యుడి కంటే విజ్ఞానవంతుడికి ఎక్కువ దండన )


    ఏమీ తెలియని పామరుడి కంటే అన్నీ తెలిసిన పండితుడు ఎక్కువ దండనార్హుడు అని మనువు భావం.  మంచిదే కదా ?

    ఈనాడు  శూద్రకులాలు అని భావించబడుతున్నవి మనువుకాలంలో లేనే లేవు. బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య కులాలకింద చేర్చటానికి వీలులేని కులాలనన్నిటినీ శూద్ర కులాలు గా ఈ కాలం లో మనం పరిగణిస్తున్నాం . వాటిలో ప్రతికులానికీ, ప్రతి ఉపకులానికీ కచ్చితమైన ఒక పేరు ఉంది. వాస్తవానికి "శూద్రకులం" అంటూ ప్రత్యేకంగా ఒక కులం ఏనాడూ లేదు .

     గుణాలను , స్వభావాలను, , యోగ్యతలను , సామర్ధ్యాన్ని బట్టి మనుషులను బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్య , శూద్ర అనే నాలుగు వర్ణాలుగా మనువు విభజించాడు. ఫలానా ఫలానా వృత్తులు, పనులు ఫలానా వర్ణాలవారు చేయాలన్న వర్గీకరణ మనుస్మృతిలో లేదు.ఫలానా వృత్తులు, కార్యాలుశూద్ర వర్ణం వారు చేయాలనిగాని , ఆయా వృత్తులు , లేక వ్యాపారాలు, లేక వ్యాపకాలు లేక సేవలు చేసేవారు , వారికుటుంబంలోని  వారు, వారికి పుట్టిన వారు యావన్మందీ శూద్రులుగానే బతికి తీరాలన్న కట్టడి మనువు పెట్టలేదు.  ఉపనయన సంస్కారం పొంది , విద్యాభ్యాసం చేసి , ఉత్తమ గుణాలను సంతరించుకొని ద్విజత్వం పొందే అవకాశం శూద్రులకు  ఇచ్చిన మనువును శూద్రద్వేషి గా చిత్రించటం అన్యాయం.

     పోనీ అలా సామాజిక నిచ్చెన లో పైకి పోవటానికి ప్రయత్నించక  ద్విజత్వాన్ని ఆశించక ఏకజాతి శూద్రులుగానే మిగిలిపోయినవారిని చులకన భావంతో నీచంగా చూడాలని మనువు చెప్పాడా ?

   వైశ్యశూద్రావాపి ప్రాప్తౌ కుటుంబేతిథి ధర్మిణౌ
   భోజయేత్ సహ భ్రుత్యైస్తావా నృశంస్యం ప్రయోజయన్   ( మనుస్మృతి 3-112 )

   భుక్త వత్ స్వథ విప్రేషు స్వేషు భ్రుత్యేషు  చైవ హి 
   భుంజీయాతాం తతః పశ్చాదవశిష్టం తు దంపతీ        ( మనుస్మృతి 3 -116 )

   శూద్రులు తమ ఇంటికి అతిథులుగా వస్తే వారికి , తమ సేవకులైన శూద్రులకు భోజనం పెట్టాకే  గృహస్థ దంపతులు భోజనం చేయాలని మనువు చెప్పాడు. ఇది శూద్రులను అవమానించటం అందామా ? మనుధర్మాన్ని పాతిపెట్టి , కులరహిత సమాజాన్ని స్థాపించే దిశలో వడివడిగా ముందుకు పోతున్నామని చెప్పుకునే ఈ  కాలంలో తమ పనివారికి భోజనం పెట్టాకే యజమానులు భోజనం చేసే సంప్రదాయాన్ని ఎవరైనా పాటిస్తున్నారా ? పనివాళ్ళు తిన్నాకే మనం తినాలని  చెప్పిన మనువేమో అమానుష శూద్రద్వేషి , మనం తిన్నాక మిగిలిన పదార్థాలను పనివాళ్ళ మొగాన పడేసే  మనమేమో మహా మానవతా మూర్తులమా ?

   మానార్హః  శూద్రోపి  దశమీం గతః       ( మనుస్మృతి 2- 137 )

   వయో వృద్దుడైన  శూద్రుడు - అందరూ గౌరవించవలసినవాడే  అన్న మనువు  శూద్ర వ్యతిరేకా ?

   అలాగే - నిర్దిష్ట యోగ్యతలు కలిగిన బ్రాహ్మణులు విరాట్ పురుషుడికి ముఖం అవుతారని , దేశాన్ని రక్షించే క్షత్రియులు బాహువులు , వర్తక వ్యాపారాలు చేసే వైశ్యులు ఊరువులు ( తొడలు ) , కాయకష్టం  చేసే శూద్రులు విశ్వాత్మకు పాదాలు అవుతారని పురుషసూక్తం లో చెప్పటం శూద్రులను అవమానించటం ఎలా అవుతుంది ? తన తలకాయ చాలా గొప్పది , తన పాదాలు చాలా నీచమైనవి అని ఏ మానవుడైనా అనగలడా ? సర్వ సమానత్వం సాదించటం కోసం శరీరంలో  చేతులు , తొడలు , పాదాలను ఒకే దగ్గర చేర్చటం ఎంతటి రష్యన్ సర్కస్ కళాకారుడికైనా  సాధ్యమయ్యే పనేనా ? కష్టజీవుల శ్రమ మీదే ప్రపంచం ఆధారపడి ఉన్నదని చెప్పటం శ్రమజీవులను కించపరచటం అని చెప్పేవాడికి మతి ఉన్నట్టా ? లేనట్టా ?







4 comments: