Sunday, 20 September 2026

మా ఇంటి మహాలక్ష్మి

  "ఆమె మరణించలేదు. విశ్వశక్తిలో విలీనమయింది. ఆమె మీ నుంచి ఏమీ కోరటం లేదు. ఏ కర్మకాండా ఆమెకు చేయనవసరంలేదు."

                        - శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్

"ఆ తల్లి తాను వచ్చిన పని పూర్తి చేసుకొని సద్గతి పొందినది."

                         - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

రెణ్నెల్ల కింద (జూలై 15 వేకువన) గోదావరి ఎక్స్ ప్రెస్ లో తన్మయి, నేను విశాఖపట్నం చేరాము. మధ్యాహ్నం  అక్షయ్ హాస్పిటల్ లో డాక్టర్ పెద్దపల్లి అప్పారావుగారిని మేము కలవాలి. "చాలా టైముంది. కనకమహాలక్ష్మి గుడికి వెళతావా?" అని అడిగాను. "భీమిలి అమ్మవారి గుడికి పోదాం" అంది మా అమ్మాయి. 

భీమునిపట్నం లోని తమ ఆనందవనంలో పూజ్యసద్గురు శివానందమూర్తి గారు ప్రతిష్ఠించిన, దేశంలోకెల్లా అరుదైన ఆద్యాది మహాలక్ష్మి దేవాలయం లో నిబంధనలు స్ట్రిక్టు. అర్చకుడు మనోహర్ కి ఫోన్ చేస్తే 10-30 లోగా రండి అన్నాడు. కారులో మేము చేరేసరికే 10-45 దాటింది. అయినా గుడి తెరిచే ఉంది. భక్తులు వేరెవరూ లేరు. మా అమ్మాయిని మహాలక్ష్మి మరకత విగ్రహం ఎదుట కూర్చోబెట్టి సహస్రనామార్చన చేశారు. అమ్మవారికి కట్టిన చీరను తన్మయికి ఇచ్చారు. అది అరుదైన ప్రాప్తం.  

తరవాత గురువుగారి ఆశ్రమానికి వెళ్లాము. ముప్ఫై ఏళ్లుగా అక్కడికి వెళుతున్నా మేము ఎన్నడూ చూడని గురువుగారి పడక గదిలో  పాన్పు దగ్గరా, ఆయన పూజచేసి తీర్థం ఇచ్చిన గది లోనూ కూర్చుని చాలాసేపు తన్మయి ధ్యానం చేసింది.  వెలిగిపోతున్న ముఖంతో కారెక్కింది. 

ఇది గొప్ప శుభసూచకం; అమ్మవారు, గురువుగారు పిలిచి ఆశీస్సులిచ్చి డాక్టర్ అప్పారావుగారి దగ్గరికి పంపారు కనుక అమ్మాయికి జబ్బు నయమవుతుంది. తప్పక కోలుకుంటుంది- అని మేము ఆనందపడ్డాము. కాని తన్మయి చేసుకున్న ప్రార్థన వేరు. అమ్మవారే పిలిపించి చీర, గాజుల సారె పెట్టి ఆమెను సాగనంపిందన్న సంగతి ఆ తరవాత కానీ నాకు అర్థంకాలేదు. 

"మీ అమ్మాయి ప్రపంచంలో అన్నీ, అందరినీ వదిలేసిది. మైండ్ నంబ్ అయింది. కోలుకోవాలన్న కోరిక మనసుకు లేనప్పుడు ప్రపంచంలోని ఏ మందూ, ఏ వైద్యమూ పని చేయదు" అన్నారు తన్మయి పల్సు చూడగానే మహా సిద్ధ వైద్య చికిత్సాలయ అధిపతి కె .వి. ప్రసాద్ గారు. ఆయన అపర ధన్వంతరి. నాడి చూడగానే అనేక జన్మల కర్మ ప్రభావాలను కూడా పసిగట్టగలరు. అక్కడికీ ఆయన అధునాతన వైద్య ప్రక్రియలతో శాయశక్తులా అన్ని ప్రయత్నాలూ చేశారు. లాభం లేదని నాడి చూసిన ప్రతి సారీ ఆయనకు తెలిసిపోతూనే ఉంది. మాకే అర్థం కాలేదు. 

"తన్మయి క్షేమం కోసం పదకొండు రాత్రులు వారాహి జపం చేసి . ఆమెను నా ఆరాధ్యదైవమైన ఉచ్చిష్ట గణపతికి అప్పగించాను. ఆమెలో ఏమీ లేదని మా అయ్యగారు చెబుతున్నాడు. ఏదో ఉందని ఏ డాక్టరు చెప్పినా నేను నమ్మను" అన్నారు పటాన్ చెరు లోని పాదుకాంత పూర్ణదీక్షాపరులు, మా అమ్మాయికి మంత్రగురువులు జివికె రావు గారు.

 నిజమే! ఆమెలో ఏమీ లేదు. బంధమేదీ మిగలలేదు. ఆమె రోజూ పూజించే ఇష్టదైవమైన గణపతికే రావుగారు ఆమెను అప్పగించారు. ఆయన స్వీకరించాడు. వినాయక చవితి (2026 సెప్టెంబర్ 14) రాత్రి ఆమెని తన దగ్గరికి చేర్చుకున్నాడు. 

శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ కు నేనంటే మహా ప్రేమ. మా కుటుంబంలో ఎవరికి ఏ ప్రాణగండం వచ్చినా ఆయనకు చెబుతాను. ఏ దేశాన ఉన్నా ఆయన వెంటనే అభయమిస్తారు. తన భక్తులలోని సంబంధిత వైద్యనిపుణులతో మాట్లాడి, పలుమార్లు శ్రద్ధగా చర్చించి, నయమయ్యేంత వరకూ ఫోన్లు చేస్తూ కుశలం కనుక్కుంటుంటారు. అలాంటిది నా ప్రియాతిప్రియమైన కూతురుకు బ్రెయిన్ ట్యూమర్  ప్రాణాంతకంగా మళ్లీ ప్రకోపిస్తే స్వామి అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఆమెరికాలోని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారితో ఒకమారు మాత్రం మాట్లాడి ఊరుకున్నారు. "సర్జరీ చేయించాలా? వేరే ప్రత్యామ్నాయం చూసుకోమంటారా? " అని గుచ్చిగుచ్చి అడిగినా " నీకు వివేకం ఉంది. ఏదైనా ఆలోచించి సరైన నిర్ణయమే చేస్తావు. నువ్వు, నీ శ్రీమతి ఎలా నిర్ణయించినా నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి" అనేవారు. ఎందుకంత ఉదాసీనత అని మేము నొచ్చుకున్నాము. "ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. ఆమె స్థితి నాకు ముందే తెలుసు. విశ్వశక్తిలో తను కలిసి పోయింది. ఇక ఆమెకు జన్మ ఉండదు. ఏ కర్మకాండా ఆమెకు చేయనవసరం లేదు" అని విశ్వంజీ స్వామి అంతా అయిపోయాక మాకు రహస్యం వెల్లడించారు. 

"మీ వంటి ప్రజ్ఞానిధులకు ధైర్యం చేకూరాలని స్వామిని ప్రార్థిస్తున్నాను . ఆ తల్లి తాను వచ్చిన పని పూర్తి చేసుకొని సద్గతి పొందినది ."అన్నారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.

చెన్నై లోని అపోలో హాస్పిటల్ వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేయక తప్పదని తేల్చాక ఆగమేఘాలమీద హైదరాబాద్ కిమ్స్ కు మావాళ్లు పరుగెట్టారు. అక్కడి న్యూరో సర్జన్ మానస్ పాణిగ్రాహి గారు చాలా గంటలు వెయిట్ చేయించి, పది రోజుల తరవాత కాని సర్జరీ చేయటానికి తనకు ఖాళీ లేదని సెలవిచ్చారు. వెంటనే చేయకపోతే ప్రాణానికి ముప్పు కాదా అని అడిగితే "ఫర్వాలేదు. అమ్మాయి ఇప్పుడు చక్కగా ఉన్నది కదా?" అన్నారట. ఆ విధంగా నిరర్థకమైన సర్జరీ బాధ ఆఖరి నిమిషంలో దైవికంగా తన్మయికి తప్పింది. 

వెళ్లపోవటానికి పన్నెండు రోజులముందు ఇలా కనపడింది




వెళ్లపోవటానికి ఆరు రోజులముందు  ( సెప్టెంబర్ 8న) ఉదయం ఐదింటికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి మధ్యాహ్నం రెండింటికి విశాఖపట్నంలో దిగింది. ఎకాఎకి కారులో రెండు గంటలు ప్రయాణం చేసి చోడవరం దగ్గరిలోని ఆశ్రమ వైద్యశాలలో డాక్టర్ పెద్దపల్లి అప్పారావు గారిని కలిసి ఖరీదైన టీకా వేయించుకుంది. మళ్ళీ అదే రాత్రి దురంతో ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారేసరికి తిరిగి సికింద్రాబాద్ చేరింది.  (అప్పారావుగారు ముచ్చటపడి తీయించుకున్న ఫోటోచూడండి.)

ఆరేళ్లకింద బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు మా అమ్మాయి భరించలేని తలనెప్పితో యమయాతన పడింది. ఈ సారి ట్యూమర్ అంతకంటే ఉద్ధృతంగా పెరిగినా పిసరంత కూడా తలనెప్పిలేదు. శరీరానికి ఏ బాధా లేదు. ఏనాడూ జ్వరం లేదు. ఎలాంటి సమస్యా లేదనే ప్రతి పూటా చెప్పేది. ఎప్పుడు చూసినా ముఖం నిర్మలంగా కళకళలాడేది. చివరి రోజు కూడా జపం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంది. పిల్లల సంగతి కూడా నీకు అక్కర్లేదా అంటే "లేదు" అన్నట్టు నిర్విచారంగా తల ఊపింది. తల్లి ఇచ్చిన పళ్లరసం తాగి రాత్రి 8 గంటలకు హాస్పిటల్ కు వెళ్లింది. 11 గంటలకు వరసగా ఫిట్లు వచ్చాయి. శరీరం ఎడమవైపు పెరాలసిస్ రానున్నదని ఐసియు డాక్టర్ అంటుండగానే హార్ట్ బీట్ 200 నుంచి అధాటున 0 కి పడిపోయింది. ప్రాణం పోయాక కూడా  ఏ యాతన చాయలూ లేకుండా  వదనం కళగా ఉంది. 

ట్యూమర్, కాన్సర్ అంటూ మేము హడలిపోయాము.   ప్రతి వైద్యుడూ తన ముందే అన్నీ చెబుతున్నా అది తన విషయం కానట్టు నిర్లిప్తంగా విన్నదే తప్ప తన్మయిలో భయమూ లేదు. ఆందోళనా లేదు. . చివరి వరకూ స్పృహలోనే ఉంది. ప్రతిదీ గుర్తున్నది. అవసరమైతే చక్కగా మాట్లాడగలిగేది. లలితా సహస్రాన్ని గొంతెత్తి పారాయణ చేయగలిగేది. 

పిల్లలే ప్రాణంగా బతికిన మనిషి చివరి దశలో వారి మీద మమకారాన్ని కూడా వదిలేసింది. మురిపెంగా చూసేదే తప్ప పిల్లల గురించి  బెంగపడలేదు.ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుమొగంతో ఉండేది.  భవబంధాలను స్వచ్ఛందంగా, నిశ్చింతగా వదిలేసుకుని...  కర్మ, ఋణం తీరగానే అనాయాసంగా వెళ్లిపోయింది.

 నా ఇంట్లో నా దగ్గరే ఉన్నా ఆమె ఎవరో, తన ఆధ్యాత్మిక స్థితి, కాలక్రమంలో చెందిన పరిణతి ఎలాంటివో నేను గుర్తించలేక పోయాను. ఆ పుణ్యాత్మురాలిని కని పెంచినందుకు మేము ధన్యులమయ్యాము. 










(ఇది వరంగల్ గురుధామ్ లో ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారిని అక్క పల్లవితో కలిసి తన్మయి ఇంటర్వ్యూ చేసినప్పటి చిత్రం. )

































Thursday, 17 September 2026

మా తన్మయి మరిలేదు

 మా మూడో అమ్మాయి తన్మయి. బంగారం లాంటి పిల్ల. నలభై దాటకుండానే దానికి నూరేళ్లూ నిండాయి. వినాయకచవితి (14వతేది) రాత్రి 12-55న హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రిలో మా ముద్దుల కూతురు బ్రెయిన్ ట్యూమరు, ఇతరేతర దుష్ప్రభావాల మూలాన అనాయాసంగా ఇహలోకం వదిలివెళ్లింది.

మా ముగ్గురు అమ్మాయిలలో  తన్మయి చిన్నది. కాని అదే ఎక్కువ ధైర్యస్థురాలు. 1987లో పుట్టింది. బిటెక్ తరవాత బి-స్కూలులో ఎంబిఎ ఫైనాన్స్ చేసింది. 2011 లో  ముంబయి Capgemini లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం తెచ్చుకుంది.  అందులోని యాంత్రికత నచ్చక కొద్దినెలలకే దాన్ని స్వచ్ఛందంగా వదిలేసి, తనను తాను స్వతంత్రంగా ప్రూవ్ చేసుకోవటం కోసం పట్టుబట్టి హైదరాబాద్ తిరిగొచ్చింది. అప్పటి వరకూ నేను, నా భార్య దుర్గ కిందామీదా అవస్థపడుతూ నడుపుకుంటున్న "దుర్గా పబ్లికేషన్స్" ను సొంతంగా, సమర్థంగా డెవలప్ చేసింది. నా రచనలేకాక వేరే పుస్తకాలనూ విరివిగా ప్రచురించింది. బుక్ ఫెయిర్ లలో   తానే కూర్చుని స్టాల్ నడిపేది. నేను చేపట్టిన ప్రతి సమాజసేవా కార్యం లోనూ నాకు కుడిభుజంలా  పని చక్కబెట్టేది. 


ఇవన్నీ చేస్తూనే ఈ సంవత్సరం కొత్తగా SAP కోర్సు బహుకష్టపడి చేసింది. నా పేరు, పలుకుబడి నీడ కూడా పడకుండా, నాకు తెలియకుండా జాగ్రత్త పడి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాలుకు ₹14 లక్షల జీతం మీద ఉద్యోగం స్వశక్తితో సాధించింది. ఇద్దరు పిల్లల సంగతి చూసుకుంటూ, హైటెక్ సిటీకి సొంతంగా కారు డ్రయివ్ చేసుకుంటూ వెళ్లి ఈ జూలై మొదటివారం వరకూ చక్కగా పనిచేసింది. దాని కెరీర్ గొప్పగా పైకి వెళుతున్నదని అందరం ఆనందపడుతుండగా ఎవరూ కలనైనా ఊహించని రీతిలో విధి మాపై పగబట్టినట్టు ఏకంగా దాన్నే పైకి తీసుకుపోయింది. 

ఇంటా బయటా, చిన్నా పెద్దా అందరికీ తన్మయి అంటే చాలా ఇష్టం.  ప్రపంచంలో అదంటే గిట్టనిది కట్టుకున్నవాడికి, మెట్టినింటి వారికి మాత్రమే. శాయశక్తులా కష్టపడి జయప్రదంగా దానిని కాటికి పంపినది కూడా వారే. 

మా గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారి అనుమతి, ఆమోదం లేకుండా మేము ఏ ముఖ్య నిర్ణయమూ చేయము. వచ్చిన సంబంధాన్ని వారి ముందు పెట్టి, అనిష్టంగా, వ్యాకుల పడుతూ ఆయన సరే అన్న మీదట ప్రసిద్ధ జ్యోతిషులు పసుమర్తి కామేశ్వర శర్మ గారు ముందుండి నడిపించగా... బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, పలువురు యతీశ్వరులు స్వయానా విచ్చేసి ఆశీర్వదించగా 2014 లో తన్మయిని విజయవాడ గుంటుపల్లి వాస్తవ్యులైన రైల్వే వర్క్ షాపు ఉద్యోగి తూములూరి గోవర్ధన రావు, గిరిజల సుపుత్రుడు, IBM ఉద్యోగి దిలీప్ కుమార్ కి ఇచ్చి 2014 డిసెంబరులో ( ఒక నివేశన స్థలం అమ్ముకుని) వైభవంగా పెళ్లి చేశాము. ఆ తరవాత అది ఏనాడూ సుఖపడింది లేదు. పిండుకోవటం, పీడించటమే తప్ప భార్యాబిడ్డలను సుఖపెట్టటం దాని మగడు ఎరగడు. 

మైలు దూరంలోనే ఉన్నప్పటికీ నాకు కూడా తెలియకుండా,పడిన శారీరక, మానసిక గృహహింస కారణంగా 2020 ఆగస్టులో తన్మయికి బ్రెయిన్ ట్యూమర్ దాపురించింది. లక్షలు ఖర్చుపెట్టి వెంటనే  సర్జరీ, రేడియేషన్ చేయించాను. అదేరోజుల్లో దాన్ని, ఇద్దరు పిల్లలను వదిలేసి మగడు చేతులు దులుపుకున్నాడు. గురుకృపతో తెప్పరిల్లిన తన్మయి భర్త మీద గృహ హింస, కట్నం వేధింపు, ఫోర్జరీ వగైరా క్రిమినల్ కేసులు పెట్టింది. పిల్లల పోషణ కోసం మెయింటెనెన్సు కోరుతూ ఫామిలీకోర్టుకెళ్లింది. నాలుగేళ్లకు పైగా కోర్టులచుట్టూ తెగ తిరిగినా ఏ కేసూ అంగుళం ముందుకు కదలలేదు. నేరస్థులను కడుపులో పెట్టుకుని కాపాడి, న్యాయార్తులను శతవిధాల సతాయించటాన్నే మనం నెత్తికెక్కించుకున్న దిక్కుమాలిన (అ)వ్యవస్థలో  న్యాయపాలన లేక రూల్ ఆఫ్ లా అందురు. 

తపస్సులా కోర్సుచేసి, కోరుకున్న ఉద్యోగాన్ని సాధించిన ఆనందంతో కళకళలాడవలసిన స్థితిలో తన్మయి ప్రవర్తన అనూహ్యంగా మారింది. పిల్లలు సహా ఎవరినీ, దేనినీ పట్టించుకోవటం మానేసింది. దానికి ఏదో అయింది. జులై లో MRI తీయిస్తే బ్రెయిన్ ట్యూమర్  మెదడుకు రెండు వైపులా మళ్లీ ఉద్ధృతంగా వచ్చిందన్నారు. అర్జంటుగా ఆపరేషన్  చేయాలి : కాని- వ్రణాన్ని సగం మాత్రమే తొలగించగలం. ఆపైన రేడియేషన్, కెమో థెరపీ చికిత్సలు షరా మామూలే. పక్షవాతం, చూపు, మాట, మెమరీ పోవటం వంటి సైడ్ ఎఫెక్టులు తప్పవు. కాని మరికొంతకాలం బతకాలంటే ఇంతకుమించి గత్యంతరం లేదు అని హైదరాబాద్, చెన్నై లలో పేరుమోసిన ఆస్పత్రుల ఘనవైద్యులు అన్నారు. సర్జరీ వద్దే వద్దు, రేడియేషనే గతి అని మరికొందరు స్పెషలిస్టులు చెప్పారు. వీటిలో ఏదారి ఎంచుకున్నా బతికేది మహా అయితే సగటున ఒకటి రెండేళ్లేనన్న సంగతి మాత్రం దాటేశారు. పులి, సింహం, చిరుతపులి వంటి సర్జరీ, రేడియేషన్, కెమోథెరపీలతో మా అమ్మాయిని వికృతాకారంలో జీవచ్ఛవాన్ని చేయటానికీ ప్రాణం ఒప్పక ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆశ్రయించాము. 


విశ్వవిఖ్యాత ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు,మాకు అత్యంత ఆప్తులైన ఇమ్యునాలజిస్టు డాక్లర్ వ్ల్యాకరణం నాగేశ్వర్ర్  గారు,   వ్యాధి వల్ల కలిగే వాపును తొలగించి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచటం ద్వారా సకల వ్యాధులను  నయంచేయగల ఇంజెక్షన్, టీకాలను సొంతంగా కనుగొన్న  ప్రసిద్ధ ఇమ్యునాలజిస్టు, మైక్రో  డాక్టర్ పెద్దపల్లి అప్పారావు గారు, హైదరాబాద్ లోని మహా సిద్ధ  వైద్య చికిత్ల్సాలయ వైద్యులు డాక్ముటర్ఖ నిర్లేప, ప్రసాద్ గార్లు, కోయంబత్తూరు లోని కాన్సర్ స్పెషలిస్టు డాక్టర్ రాధేశ్యామ్ గారు, న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మీనాధ్ శివరాజు గారు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ధనంజయ్, డాక్టర్ ఎస్. ఎస్. శాస్త్రి, ఆయర్వేద నిపుణులు డాక్టర్ ప్రదీప్ గారు, హోమియో వైద్యులు డాక్టర్ నాగ హరిత గారు తన్మయి మీద అభిమానంతో  శాయశక్తులా ప్రయత్నించారు. అమ్మాయిని చూసిన ప్రతి డాక్టరూ ఆమె తలనెప్పి, శరీర బాధ ఏదీ లేకుండా జీవకళతో చక్కగా ఉన్నందుకు ఆశ్చర్య పడ్డారు. 

కంచి కామకోటి సర్వజ్ఞ పిఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి స్వామి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి, విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, పెద్దముత్తేవి శ్రీకృష్ణాశ్రమ గురువు శ్రీ గౌరా గారు,  తన్మయిని విశేష వాత్సల్యంతో ఆశీర్వదించారు. కంచి కామాక్షి, స్కందగిరి, చిల్కూరు బాలాజీ, ఎల్లారమ్మ దేవాలయాల నుంచి ప్రసాదాలు వచ్చాయి. చివరి రోజు వరకూ మా అమ్మాయి  హనుమాన్ చాలీసా, లలితా సహస్రం, నవగ్రహ స్తోత్రాదుల పారాయణం, మంత్ర జపం ప్రతి నిత్యం చేసింది. రోజూ గురువుగారి ఫోటో కళ్లకద్దుకునే మంచం దిగేది. గంటముందు వరకూ మామూలుగానే కనిపించింది. నిర్విచారంగా, నిర్వికారంగా, ప్రశాంతంగా వెళ్లి పోయింది. 

ఈ ఫిబ్రవరిలో తన్మయి పట్టుబట్టి, తానే అన్నీ ఆర్గనైజ్ చేసి పదేళ్ల కుమారుడికి ఉపనయనం చేయించింది. అత్త మామలు మేము రమ్మన్నా రాలేదు. బిడ్డలిద్దరితో కలిసి స్వయంగా వెళ్లి అడిగినా భర్త పట్టించుకోలేదు. ఈ 15 న మరణవార్త తెలిపినా, ఎంతమంది ఫోన్ చేసినా వారెవరూ వచ్చి చూసిన పాపాన పోలేదు. అంత్యక్రియల మరుసటి రోజు రాత్రి అతడు "హాయ్ శాస్త్రి గారూ, విషాద వార్త విని దిగ్భ్రాంతి చెందాను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని మెసేజ్ పంపాడు. 

బన్సీలాల్ పేట శ్శశాన వాటికలో నిత్య కర్మలు,  చిక్కడపల్లి లోని మా స్వగృహంలో 23 నుంచి 25 వరకు 10,11,12 రోజుల కర్మలు తన్మయి కుమారుడు చి. రుత్విక్ చేస్తున్నాడు. మొత్తం కుటుంబ సభ్యులం, బంధువర్గం ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. కేవలం సన్నిహిత బంధుమిత్రులకు పరిమితమైన ప్రైవేటు కార్యక్రమంగా దీనిని దుఃఖ భారంతో నిర్వహిస్తున్నాము. అందరితో అన్నీ ఏకరువుపెట్టి, పరామర్శలు, సాంత్వనపూర్వక హితబోధలు అందుకునే ఓపిక, సత్తువ నాకు గాని, వాళ్లమ్మకు గాని లేవు. కొద్ది రోజులపాటు మా మానాన మమ్మల్ని వదిలేయటమే మాకు చేయగలిగిన మేలు. నేను బాగానే ఉన్నాను. విధి లీల, ప్రారబ్ధం, దైవనిర్ణయం,  వైరాగ్యం, వేదాంతాల గురించి అనర్గళంగా పరోపదేశం చేయగలిగిన స్థితిలోనే ఉన్నాను. 

నా హితైషి పవన్ కల్యాణ్ గారి సంతాప ప్రకటన ద్వారా విషయం తెలిసి, తల్లడిల్లి, సానుతాపంతో ఫోన్లు, మెసేజ్ లు చేసిన, ఇంటికి వచ్చి పరామర్శించిన నా మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, పూజ్యులు అందరికీ వందనాలు. మూడునెలలుగా సమయమంతా మా అమ్మాయి కోసమే వెచ్చించాను. నా ధర్మ నిరతి, ఉద్యమ దీక్ష పూర్వం లాగే ఉన్నాయి. త్వరలో కలుద్దాం. ఆలోచించ వలసింది, చేయవలసింది చాలా ఉన్నాయి. 🙏

Friday, 16 January 2026

మీడియా తప్పేమిటి?

 మూడు రోజులుగా మీడియాలో, అన్ సోషల్ మీడియాలో మోత మోగిపోతున్న ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు వార్త, బరితెగించిన మీడియా అంటూ సమాజంలో బహు నీతిమంతుల ధర్మాగ్రహాల ఫెళ ఫెళార్భాటానికి బిత్తరపోయి ఇంతకీ ఏమిటా వార్త అని ఇప్పుడే చూశాను. అరడజనుకుపైగా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ల టైము వేస్టు చేసి, సిట్టు వేసి, విమానాశ్రయం లో మాటువేసి ఫ్లైటెక్కబోతున్న జర్నలిస్టును అంతర్జాతీయ టెర్రరిస్టు లెవెల్లో అవమానకరంగా పట్టుకొచ్చి, ఇళ్లమీదపడి జర్నలిస్టులను మానసికంగా హింసించి, బాధ్యత గల మీడియా సంస్థ కార్యాలయం ఆగమాగం చేయాల్సినంత మహానేరం, మహాపాపం ఇందులో ఏముందో నాకైతే అర్థం కాలేదు.

 జర్నలిజంలో అర్ధ శతాబ్ది అనుభవం గడించి...  బాధ్యతా యుతమైన దిన పత్రికకు 23 ఏళ్లు బాధ్యతాయుతంగా సంపాదకత్వం వహించి...ప్రభుత్వాల మీద, అధికార మదాంధుల పవరుకావరం మీద ఎన్నో యుద్ధాలు చేసి సమాజంలోని అన్ని వర్గాల సుహృద్భావం, గౌరవం చూరగొన్న ఎడిటర్ గా నాకు ఎన్టీవీ వారి కథనంలో తప్పు పట్టాల్సింది ఏమీ కనిపించటం లేదు.

 నేను ఎడిటర్ గా ఉండగా ఇదే స్టోరీని నా రిపోర్టర్ పట్టుకొచ్చి ఉంటే నిరభ్యంతరంగా క్లియర్ చేసే వాడిని. మరీ ఎన్టీవీ పిల్లలు వేేసినంత పచ్చిగా, కచ్చగా కాదుగాని, కాస్త శుభ్రమైన భాషలో, ఎవరి చేతికీ చిక్కని రీతిలో సంస్కరించి ఆ స్టోరీని తప్పక బయటపెట్టే వాడిని. దాని మీద ఏ ఆక్షేపణలు, నేరారోపణలు వచ్చినా, ఎన్ని కేసులు, దాడులు ఎదురైనా నా రిపోర్టర్లకు, సంపాదకీయ సిబ్బందికి రక్షణగా నిలబడి ప్రభుత్వ, పోలీసు దురాగతాన్ని నా పత్రిక ఫ్రంట్ పేజిలో చీల్చి చెండాడేవాడిని.మేము చేసింది ఎలా సబబో, మాపై జరిగింది ప్రజాప్రయోజనాలకు,  పత్రికా స్వాతంత్ర్యానికి ఏరకంగా భంగకరమో పౌర సమాజానికి సహేతుకంగా, తార్కికంగా వివరించి, ప్రజాస్వామ్య హితైషులందరినీ ఒప్పించేవాడిని. మళ్లీ ఇంకొకసారి ఇలాంటి ఆగడానికి పాల్పడకుండా పౌర సమాజపరంగా గట్టి గర్జన చేయించి ఉండేవాడిని. 

తాజా ఉదంతంలో నేను షాక్ అయింది పోలీసుల ఓవరాక్షనుకు కాదు.  పౌర సమాజం అన్నా, మీడియా అంకుశమన్నా భయమనేది లేకపోతే ప్రభుత్వాలూ, పోలీసు శాఖలూ ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే వ్యవహరిస్తాయి. ఆశ్చర్యపోవలసిందీ, అసహ్యించుకోవలసిందీ ఆ మీడియా సంస్థలోని ఎడిటోరియల్ హెడ్ల,   యాజమాన్య ప్రతినిధుల నిష్క్రియాపరత్వం చూసి! తాము చేసిన దానిని సభ్య సమాజం ముందు తమకు తాముగా బహిరంగంగా డిఫెండ్ చేసుకోలేక... మీడియా వ్యవస్థ గౌరవాన్ని, జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేక -కలుగులో దాక్కున్న- వారి పిరికితనాన్ని చూసి!

జర్నలిస్టులకు, ఎడిటర్లకు విలువ అనేది పోయి మీడియా అనేది యజమానుల ఇష్టారాజ్యంగా, మేనేజిమెంట్ల నీచ నికృష్ట స్వార్థాల స్వైర విహారంగా, రాజకీయ, వ్యాపార లావాదేవీల సెటిల్మెంటు రంగస్థలిగా మారినప్పుడు మీడియా దౌర్భాగ్యం ఇలాగే ఉంటుంది.

Thursday, 2 October 2025

నమస్తే సదావత్సలే మాతృభూమే !

ఎం.వి.ఆర్.శాస్త్రి

1925 సంవత్సరంలో సిద్ధాంతపరంగా , విధాన పరంగా, ఆలోచన పరంగా ఉత్తర, దక్షిణ ధ్రువాలైన రెండు ప్రజా సంస్థలు ప్రస్థానం  ప్రారంభించాయి. 

1. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

2. భారత కమ్యూనిస్టు పార్టీ

రెండిటికీ గొప్ప చరిత్రే ఉన్నది. రెండు సంస్థలూ మేధో పరంగా, సామాజికంగా , సాంస్కృతికంగా తమదైన ముద్రను జాతి జీవనంలో బలంగా వేశాయి. కాని కాలక్రమంలో చీలికలు పేలికలయి, మూల సిద్ధాంతం చచ్చి ,  నైతిక ధ్రుతి సడలి, రాజకీయంగా దిగజారి , ప్రజల చేత తిరస్కరింపబడి భారత కమ్యూనిస్టు పార్టీ దాదాపుగా దివాలా తీసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖండంగా, అప్రతిహతంగా  ముందుకు సాగి , శాఖోపశాఖలుగా మహా వట వృక్షం వలె విస్తరించి , నిత్య నూతనంగా వర్ధిల్లుతున్నది. ఇన్ని కోట్ల కార్య కర్తల తో , ఇన్నిన్ని క్షేత్రాల్లో ఇన్నిన్ని బృహత్ వ్యవస్థలతో , ఇంత ఏకశిలాసదృశంగా , ఇంత క్రమశిక్షణా యుతంగా , ఇంత నిస్వార్థంగా ,నిరాడంబరంగా,  వంకపెట్టలేనంత పకడ్బందీగా నూరేళ్లుగా  నడుస్తున్న సాంస్కృతిక, సాంఘిక సేవా సంస్థ మొత్తం ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు. 

 ఆర్.ఎస్.ఎస్. ఏమి చేస్తుంది , దాని విజయరహస్యమేమిటి అన్నది ఆ సంస్థ గిట్టనివారికి ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు. ఆరెస్సెస్ గర్జించదు. క్షాత్రం ప్రదర్శించదు. ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోదు. ఎవరెంత దుమ్మెత్తి పోసినా చలించదు. ఎవరెంత మొత్తుకున్నా తాను ఎంచుకున్న దారి నుంచి అరంగుళం బెసగదు. తన ప్రభావం  ఎంత ఘనమైనదైనా ఆరెస్సెస్ బహిరంగంగా చెప్పుకోదు. తన ప్రతాపాన్ని ఒప్పుకోదు.

సంఘ నిర్మాణానికి మనుషులను తయారుచేయటం, సహస్ర బాహువులతో వారి చేత పనిచేయించటమే సంఘ్ పని. అది తానుగా లైమ్ లైట్ లో ఎక్కడా కనపడదు. సంఘ్ జస్ట్ ఉంటుంది. అంతే. అది ఉన్నది కాబట్టే హిందూ సమాజం క్షేమంగా ఉన్నది.  సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని, హైందవ సంస్కృతిని,  హిందువుల ఉనికిని నిర్మూలించటానికి ప్రపంచ వ్యాప్తంగా రాక్షస , పైశాచిక అక్షౌహిణులు  ఉమ్మడిగా విరుచుకుపడుతున్న ఈ విపత్కాలంలో ఆరెస్సెస్ లేని హిందూ సమాజాన్ని తలచుకుంటే భయం వేస్తుంది. 

నేను స్వయం సేవక్ ను కాను. సంఘ్ శాఖకు ఏనాడూ హాజరుకాలేదు. ఆరెస్సెస్ తో కాని, దాని అనుబంధ సంస్థలతో కాని నాకు  ఎలాంటి ప్రమేయం లేదు. అయినా అర్ధ శతాబ్దిగా సంఘ్ కార్యకలాపాలను నిశితంగా, సన్నిహితంగా గమనిస్తున్న మేధావిగా నాకు ఆరెస్సెస్ మీద అపార గౌరవం ఉంది. అచంచల విశ్వాసం ఉన్నది. కొన్ని తరాలుగా సంఘ్ వరిష్ఠ నాయకులతో నాకు ఆత్మీయ అనుబంధం ఉన్నది. పూజ్య సర్ సంఘ్ చాలక్‌మోహన్ జీ తో , సర్ కార్యవాహ్ దత్తాజీతో పరిచయ భాగ్యం కూడా కలిగింది.



 




నాకు ఆరెస్సెస్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా కరడుగట్టిన ఆరెస్సెస్ వాడిగానే నాకు హిందూ వ్యతిరేకుల దృష్టిలో గుర్తింపు. అందుకు నాకు సంతోషమే తప్ప సంతాపం లేదు. దిగ్విజయంగా , సగర్వంగా శతవసంతోత్సవం చేసుకుంటున్న వేళ హిందూ సమాజానికి కొండంత అండ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ అనే మేరునగానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, వినమ్ర ప్రణామాలు, మనసారా కృతజ్ఞతలు.  "నమస్తే సదావత్సలే మాతృభూమే"  అని  దిగంతాలకు నినదిస్తూ  తొలి శతాబ్దిలాగే సహస్రాబ్ది మైలురాయినీ మన "సంఘం" జయప్రదంగా చేరుకోవాలని నా శుభకామన. 


Friday, 28 June 2024

సామవేదం : నిశ్శబ్ద ధార్మిక విప్లవం

 

 ఎం.వి.ఆర్.శాస్త్రి

https://youtu.be/0hyPgJ3JtGA?si=p8u4UN4CacIs5IKC

     “హిందువులకు దేవుడే దిక్కు" అని నేను చేసిన కొత్త వీడియోను ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న "ఋషిపీఠం" వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు చూసి మెచ్చుకుంటూ  ఆడియో సందేశం పంపారు. ధన్యోస్మి. మేమిద్దరం ఒకే గురువు నుంచి స్ఫూర్తి ని, శక్తినీ పొంది , గురు ఉపదేశాన్ని దివ్యాదేశంగా తలచి ఎవరి క్షేత్రంలో వారు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్లం. ధర్మ వీరుడు, ధర్మ ప్రచారకుడు, ధర్మ మూర్తి అయిన షణ్ముఖశర్మ  గారి మెచ్చుకోలును  సద్గురు శివానందమూర్తి గురుదేవులు పలికించిన దీవెనగా భావిస్తాను




      షణ్ముఖ శర్మగారు నాకు కనీసం 30 ఏళ్లుగా తెలుసు. స్వాతి వారపత్రికలో జర్నలిస్టుగా , సినిమా కవిగా జీవయాత్ర సాగించిన కాలం మొదలుకుని ... ఋషిపీఠం  పెట్టి బాలారిష్టాల నుంచి దానిని ఒడ్డున పడవేయటానికి సతమతమైన వామన దశ నుంచి ... ప్రవచన రంగంలో ఇంతింతై బ్రహ్మాండమంతగా ఎదిగి దేశ దేశాలలో లక్షల అభిమానుల  అక్షౌహిణులను సమకూర్చుకుని నిశ్శబ్ద ధర్మయుద్ధంలో  నిమగ్నమైన నేటి అవక్ర త్రివిక్రమత్వం వరకూ- సామవేదంవారి  ప్రస్థానాన్ని నేను దూరం నుంచే సన్నిహితంగా గమనిస్తున్నాను. ధర్మపీఠం ముందు నిలబడి సత్య నిష్ఠ తో దేనినైనా ప్రశ్నించి, ఎవరినైనా నిలదీసి , అక్షరాయుధంతో  అధర్మాన్ని చీల్చి చెండాడటంలో ఎవరికీ తీసిపోను- అని  కొంచెం ఎక్కువే గర్వించే నేను కూడా క్రోధం లేకుండా శుద్ధ సత్వాన్ని వీడకుండా మెత్తటి మాటలలోనే వజ్ర సదృశ కాఠిన్యాన్ని, ధర్మాగ్రహ ప్రచండత్వాన్ని  భాసింపజేయగల సామవేదం వారి సంపాదకీయ ప్రజ్ఞకు ఆశ్చర్యపోతుంటాను.  ఉదాహరణకు  కాశీ కారిడార్ నిమిత్తం వారణాసి క్షేత్రం లోని ప్రాచీన దేవతామూర్తులను పెకలించినప్పుడు “క్షేత్రాపచారం జరగరాదు” శీర్షికతో 2021 జూలై లో శర్మగారు రాసిన ఈ పలుకుల ములుకులను చిత్తగించండి:




     “ప్రాచీన క్షేత్రాలను, ఆలయాలను అభివృద్ధిపరచడం హర్షణీయమే.కానీ ఆ క్రమంలో వాటి ప్రాచీనతనీ , చరిత్రనీ , పౌరాణిక ఐతిహాసిక ప్రాధాన్యాన్నీ పావనత్వాన్నీ దెబ్బతీయకుండా వాటిని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాలి. కాశీ కేవలం కట్టడాల క్షేత్రం కాదు. దానికి లెక్కలకందని కాలాల ఘనేతిహాస నేపథ్యం  ఉంది. ఏ లింగం, ఏ ప్రతిమ ఏ స్థానంలో ఉందో పురాణాలు వర్ణించాయి. వాటిని తొలగిస్తే ఆ స్థానాల పురాణ నేపథ్యం తెలిసి చేసే శాస్త్ర విధానాలు , యాత్రలు ఏమవుతాయి? మనకు చిన్నప్రతిమలుగా , గూడుల్లాంటి గుడులుగా కనపడుతున్నవి విశ్వ చైతన్య శక్తిబిందువులు . COSMIC ENERGY POINTS గా వైజ్ఞానిక పరిశోధనలతో తేల్చారు. ఆ చోటు నుండి వాటిని కదల్చినా ఒక శక్తి కేంద్రాన్ని భంగ పరచినట్టే కదా? ఇళ్ళూ, దుకాణాలు  కూల్చినట్టు గుడులనూ, ప్రతిమలను తొలగించటం దైవాపచారం, క్షేత్రాపచారం అవుతాయి కదా!

     “కాశీ పునర్నిర్మాణంలో ద్వాదశాదిత్య మందిరాలు , పంచ వినాయకులు, కొన్ని స్వయంభూ లింగాలు, మూర్తులు తొలగిపోయాయనీ, ముక్తిమండపం కూడా పోతోందనీ, ఒక ప్రాచీన అక్షయ మహావృక్షం ఖండించబడిందనీ ఎందరో వేదన పడుతున్నారు. విశ్వనాథాలయాన్ని మరింత శోభాయమానం చేస్తూ చక్కని కారిడార్ కట్టడం మంచిదే కానీ , ఆ మందిర శోభ కోసం ఎన్నో ప్రాచీన మందిరాలను, దేవతామూర్తులను, ప్రాచీన వృక్షాలను ధ్వంసం చేయటం సమంజసమా? ఈ క్షేత్ర దైవాపరాధం దేశానికి క్షోభకరం  కాదా? దేశాన్నీ, ధర్మాన్నీ దెబ్బతీయాలని చూస్తున్న విపక్షాల మూక దీనిని అవకాశంగా తీసుకుని హిందువులను చీల్చవచ్ఛు కూడా. “

      ఆ ఋషివాక్కే నిజమయింది. కాశీక్షేత్ర దైవాపరాధమే ఇప్పుడు ఈ  దేశానికి క్షోభకరం అయింది. దేశాన్నీ ధర్మాన్నీ దెబ్బతీయాలనుకునే విపక్షాల మూక ఇలాంటి దైవాపరాధాలను , అనేకానేక ధర్మాపచారాలను అవకాశంగా తీసుకుని హిందువులను చీల్చనే చీల్చింది. 400 కు తగ్గేదే లేదని తొడకొట్టిన భాజపేయ గండర గండలు ధర్మదేవత చాచికొట్టిన దెబ్బకు ఎన్నికల గోదాలో కుదేలై సింపిల్ మెజారిటీకే తెరువులేక అలయెన్సు ఊతకర్రల సాయంతో సర్కారును నెట్టుకు రావాల్సిన దుస్థితికి చేరారు.

      ఆ సంగతి అలా ఉంచండి. తెలుగులో -ఆ మాట కొస్తే దేశంలోనే ఎన్నో వందల, వేల  పత్రికలు ఉన్నాయి కదా? ప్రాచీన కాశీ క్షేత్రంలో సౌకర్యాల అభివృద్ధి పేర పరమ పవిత్రమైన దేవతా మూర్తుల , దైవ ప్రతీకల మహా విధ్వంసం జరిగితే ఋషిపీఠం వలె గొంతెత్తి అపచారాన్ని నిష్కర్షగా ఖండించిన పత్రిక వేరొకటి ఉన్నదా అంటే నాకైతే సందేహమే.  

     సద్గురు శివానంద మూర్తి గారి దివ్య స్ఫూర్తితో వేల మందిని కదిలించి ధర్మరక్షణకు కార్యోన్ముఖం చేయించి దేశంలోనే ఒక గొప్ప ధార్మిక ఉద్యమానికి చోదకశక్తి కాగలిగిన యోగ్యత, దక్షత షణ్ముఖశర్మగారికి ఉన్నాయి.ఆ మాట నేను ఆయనతోనే పలుమార్లు అన్నాను. కాని పట్టించుకున్నట్టు కనిపించలేదు. వయసు, వనరులు, శక్తి, సామర్ధ్యం , అవకాశం అన్నీ ఉండి కూడా ఆయన విసుగు , విరామం లేకుండా నిరంతర ప్రవచనాలకే సమయమంతా వెచ్చిస్తూ అసలైన, హిందూసమాజానికి జీవన్మరణ సమస్య వంటి  ధర్మ పోరాటం మీద శ్రద్ధ పెట్టటం లేదు. ప్రవచనాలు ఎన్ని చెప్పినా మన మొద్దు జనాలు మారతారా, కదులుతారా అని నాకు లోలోన ఒకింత అసంతృప్తి ఉండేది. అదికూడా ఒక నెలకింద పోయింది. అదీ ఆశ్చర్యకరంగా .



1999 జూలై లో సంస్థాపన నుంచి ఈ జూన్ వరకు పాతికేళ్లలో రాసిన 209 “ఋషిపీఠం సంపాదకీయాలు” ను అదే పేరిట ప్రచురించామనీ , నా అభిప్రాయం కోసం దాన్ని నాకు పంపుతామనీ శర్మగారు ఆ మధ్య  నాకు ఫోన్లో చెప్పారు. ఆ సందర్భంలోనే ఋషిపీఠం రజతోత్సవ వేడుకలు మూడు రోజులుగా భాగ్యనగరం లో జరుగుతున్నాయని , ఆహ్వాన పత్రిక ప్రత్యేకంగా మా ఇంటికి పంపించామని  గుర్తు చేసి ఆ సాయంత్రం  ముగింపు సభకు స్వయంగా ఆహ్వానించారు. వెళ్లకపోవటం మర్యాద కాదు కనుక 6-30లోగా తప్పక వస్తానని చెప్పాను.

బషీర్ బాగ్ లోని భారతీయ విద్యాభవన్ పెద్ద ఆడిటోరియం లో సభ.  6 గంటలకు మొదలు అని చెప్పినా అతిథులు, ఆహూతులు వచ్చి సీట్లలో సెటిలై కార్యక్రమం మొదలెట్టేసరికి మామూలు ఆనవాయితీ ప్రకారం ఆరున్నర పైమాటే. అయినా  శర్మగారిని ముందుగా కలిసి కాసేపు మాట్లాడుదాం అనుకుని 6-10 కల్లా సభాస్థలికి చేరాను. వెయ్యి మంది పట్టే ఆ ఆడిటోరియం అంతా నిశ్శబ్దంగా ఉన్నది. గేటు దగ్గర నిలబడి గౌరవ అతిథుల కోసం ఎదురు చూసేవారు లేరు. ఎక్కడా ఏ రకమైన అలికిడీ లేదు. అనుమానం వచ్చి ఇంకోసారి ఆహ్వాన పత్రిక చూశాను. సరైన  టైముకు సరైన స్థలానికే  వచ్చాను. మరి ఒక్క కార్యకర్తా కనపడడేమిటి ? ఒక  వేళ ప్రోగ్రాం కాన్సిల్ అయిందేమో కనుక్కో అని నా అసిస్టెంటుకు చెప్పాను. అతడు లోపలికి వెళ్లి కనుక్కుంటే   మీటింగు అప్పటికే మొదలైందని చెప్పారట.



      ఎవరూ లేకుండా మీటింగు ఏమిటి అని ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్లి చూద్దును గదా ఆడిటోరియం కిటకిటడుతున్నది. ముందు వరసలో నా కోసమే అన్నట్టు ఒక్క సీటు ఖాళీగా ఉన్నది. ఎక్స్ ట్రా చెయిర్లు కూడా వేసి ఉన్నాయి. అవిగాక కొంతమంది వరసలలో నెల మీద కూచుని ఉన్నారు. హౌస్ ఫుల్ అయినా హాలంతా నిశ్సబ్దంగా ఉన్నది. ఎవరూ ఎవరినీ పట్టించుకునే స్థితి  లో లేరు. అందరి దృష్టీ నడుస్తున్న కార్యక్రమం మీద  లగ్నమై ఉన్నది. పెద్ద వేదిక . దాన్ని మధ్య మూడే మూడు కుర్చీలు. మధ్యలో మెగా మాగ్నెట్ సామవేదం వారు. అటూ ఇటూ ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు ; కంచి పీఠం చల్లా విశ్వనాథ శాస్త్రిగారు , ఇద్దరూ పది పదిహేను నిమిషాలు క్లుప్తంగా మాట్లాడారు. షణ్ముఖ శర్మగారూ 40నిమిషాలకంటే ఎక్కువ సమయం తీసుకోలేదు.




      అమెరికా నుంచి , ఇతర దేశాలనుంచి సకుటుంబంగా వచ్చిన ఎంతో మంది    శిష్యులు-  గొప్ప గొప్పఎం.ఎన్.సీ .లలో చాలా పెద్ద హోదాలో ఉన్న చిన్నవయసు దిగ్గజాలు సంప్రదాయ వైదిక దుస్తుల్లో నేలమీద భక్తిశ్రద్ధలతో నిష్టగా కూచోవటం, పిల్లాజెల్లా ఉన్నా చప్పుళ్ళు , కేకలు లేకపోవటం, వాలంటీర్ల హడావుడి లేకుండా సుదీర్ఘ  కార్యక్రమం మిలిటరీ క్రమశిక్షణతో చకచకా నడిచిపోవటం చూసి ముచ్చట వేసింది. సామవేదం షణ్ముఖ శర్మగారు ఊళ్లు, దేశాలు పట్టుకుని ప్రవచనాలు చేయటం, ఋషిపీఠం పత్రిక నడపటం మాత్రమే కాదు -వారి ట్రస్టు సనాతన ధర్మ సంరక్షణకు, ఆర్ష విద్య, సంస్కృతి, కళల అభ్యున్నతికి దేశంలోనూ, దేశాంతరాలలోనూ వేలమందిని సమీకరించి బృహత్ వ్యూహంతో నిశ్శబ్ద ధార్మిక విప్లవానికి తనవంతు కృషి పటాటోపం లేకుండా సాగిస్తున్నదని నాకు అర్థమయింది. నేను లోపలికి వెళ్ళటం లాగే రెండుగంటల తరవాత బయటికి రావటమూ ఎవరూ గమనించలేదు. నేనా సభలో ఉన్నట్టు శర్మగారికి కూడా బహుశా ఇప్పటికీ తెలియదు.

      ధర్మం గురించి గావుకేకలు పెట్టి, సొంత లాభానికి ధర్మాన్ని అడ్డంగా వాడుకునే ఆధ్యాత్మిక ఆషాఢభూతుల కంటే మౌనంగా వేగంగా ప్రణాళికాబద్దంగా ధర్మవిజయానికి వేలమందిని నిమగ్నం చేయిస్తున్న సామవేదం వంటి వారి వల్లే ధర్మం నిలబడుతుంది. హిందూ దేశంలోనే హిందువుల మనుగడ ప్రశ్నార్థకమై , రకరకాల మానసిక , సామాజిక , రాజకీయ వైకల్యాలతో హిందూ సమాజం నిస్తేజం, నిర్వీర్యం అయిన ప్రస్తుత దురవస్థనుంచి బయటపడి హిందూ దేశంలో హిందూ రాజ్యం సర్వమతాలకు శ్రేయోదాయకంగా సుప్రతిష్ఠితమవటానికి తాజా వీడియోలో నేను చేసిన సూచన షణ్ముఖశర్మ గారికి నచ్చి తాను సైతం ఆదిశగా అడుగువేస్తానని చెప్పటం చాలా సంతోషం. ధార్మిక , ఆధ్యాత్మిక రంగాలలో దిగ్దంతులైన ఆయన వంటి మహానుభావులు పూనుకుని సమష్టి కార్యాచరణకు ఆయత్తం కాగలిగితే అంతకంటే కావలసింది ఏముంది?    

https://youtu.be/7dtjLr8xQTk?si=1pp96gpDFoIit48m

     సామవేదం వారితో ఇంతకు ముందు ఒకసారి నేను ధర్మ సంబంధమైన వీడియో సంభాషణ చేశాను. యు ట్యూబ్  లో దాన్ని చాలామంది చూశారు. దానికి కొనసాగింపుగా సమకాలిక ధర్మ సంకటాలు, హిందుత్వ అస్తిత్వ సమస్యలపై ఆయనతో ఇంకో సంవాదం చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నా ఇప్పటి దాకా కుదరలేదు. ఆ సంగతే ఇవాళ ఫోన్లో మాట్లాడగా జూలై చివరి వారంలో అమెరికా నుంచి తిరిగి వచ్చాక వీలైనంత త్వరలో ఒక పూట సావకాశంగా కలుద్దామని శర్మ గారు అన్నారు. శుభం.

                                                ---------------------------------

Friday, 14 June 2024

నలంద ఆల్ టైమ్ గ్రేట్

ప్రపంచంలోకెల్లా అతి పురాతన విశ్వవిద్యాలయమేది? అని అడిగితే ఈ కాలపు కుర్రాళ్ళకు చప్పున స్ఫురించే పేరు ఆక్స్ ఫర్డ్. నిజానికి ఘనత వహించిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మొదలవటానికి 500 ఏళ్ల పూర్వమే హిందూదేశంలో నలందా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో మహా వైభవంగా వెలిగిపోతుండేది. ఇంకా చెప్పాలంటే ఆ కాలాన నలంద ఒక్కటే ప్రపంచం మొత్తంలో ఏకైక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.  కొరియా , జపాన్, చైనా, టిబెట్, మంగోలియా, ఇండోనేసియా, ఇరాన్, గ్రీస్ , టర్కీ వంటి దూర దేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడి కొచ్చి వైద్యం , తర్కం, గణితం, జ్యోతిషం, ఖగోళం,వ్యాకరణం, తత్త్వం వంటి అనేకానేక శాస్త్రాలను సాంగోపాంగంగా  అధ్యయనం చేసేవారు. నలంద ప్రధానంగా బౌద్ధ విశ్వ విద్యాలయం అయినా అక్కడ బౌద్ధ మత గ్రంథాలు, ధర్మశాస్త్రాలతో బాటు,  వేద వేదాంగాలను, దర్శనాలను , ఉపనిషత్తులను, శ్రుతి స్మృతి పురాణ ఇతిహాసాలను కూడా సాకల్యంగా బోధించే వారు. రాజనీతి, యుద్ధ కళ , శిల్ప శాస్త్రాల వంటి లౌకిక విద్యలకూ నలంద పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా అక్కడ జగత్ ప్రసిద్ధమైనది అక్కడి అత్యద్భుత గ్రంథాలయ వ్యవస్థ. ధర్మగంజ అని పిలువబడ్డ ఆ గ్రంథాలయ సముదాయంలోరత్నసాగర , రత్నోదధి, రత్నరంజక అనే మూడు బహుళ అంతస్తుల భవనాలు ఉండేవి. అందులో తొమ్మిది అంతస్తుల రత్నోదధి ప్రాచీన పవిత్రగ్రంథాల కాణాచి. శతాబ్దాల తరబడి ఎందరో మహాత్ములు బహు కష్టపడి సేకరించి నలందలో అందరికీ అందుబాటులో ఉంచిన అపురూప  గ్రంథాల సంఖ్య ఎంతో తెలుసా? మొత్తం కలిపి 90 లక్షల పైచిలుకు!



భారత చరిత్రలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందిన గుప్తరాజుల హయాంలో సామాన్య శకం 427 సంవత్సరంలో మొదటి కుమారగుప్తుడు స్థాపించిన నలంద విశ్వ విద్యాలయం ఇంచుమించుగా ఎనిమిది శతాబ్దాల పాటు ప్రపంచానికి విద్య గరిపింది. మానవ విజ్ఞానానికి , నాగరికతకు గురుస్థానంగా దేశ దేశాల జిజ్ఞాసువులకు జ్ఞాన తృష్ణ తీర్చింది. 5,6 శతాబ్దాలలో గుప్తవంశీకుల తరవాత 7వ శతాబ్దంలో హర్షవర్ధనుడు వంటి కనౌజ్ ప్రభువులు, 8 – 12 శతాబ్దాలలో పాల వంశం పాలకులు తాము అనుసరించేది బౌద్ధాన్నా , వైదిక మతాన్నా అన్నదానితో నిమిత్తం లేకుండా నలందలోని  బౌద్ధ మహావిహారానికి మహారాజ పోషకులుగా నిలిచి దాని అభివృద్ధికి సర్వవిధాల తోడ్పడ్డారు. ఖర్చులన్నీ మహారాజులే భరించారు గనుక అక్కడ విద్య, భోజన , నివాస వసతి పూర్తిగా ఉచితం .  అందులో చోటు దొరకటం మాత్రం చాలా కష్టం. అక్కడ స్కాలర్ గా చేరాలంటే ఎవరైనా సరే ప్రవేశ పరీక్షలో నెగ్గి తీరాలి.  ఆ పరీక్ష చాలా కఠినం . అయినా ఎప్పుడు చూసినా పదివేల సంఖ్యకు తగ్గని విద్యార్థులతో, రెండువేలకు పైగా ఆచార్యులతో కళకళలాడిన నలంద ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ . ప్రాచీన మగధ రాజ్యంలో భాగమై నేటి  పాట్నా నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో వెలసిన నలందలో దేశ దేశాల నుంచీ వచ్చిన బౌద్ధ బిక్షువులు ఎందరో  సంవత్సరాల పర్యంతం నివసించి , విద్యాసముపార్జన చేసి వేలాది అపురూప గ్రంథాల వ్రాతప్రతులను కాపీ చేసుకుని బండ్లమీద మోసుకుని మరలిపోతుండే వారు.  నలందలో హర్షవర్ధనుడి సమకాలికుడైన చైనీస్ యాత్రికుడు హుయెన్ సాంగ్ అనే Xuan Zang సామాన్య శకం 630 – 643 నడుమ భారత పర్యటన కాలంలో రెండేళ్ళ పాటు నలందలో శిలాభద్ర ఆచార్యుడి వద్ద శిష్యరికం చేసి   సంస్కృతం, తర్క వ్యాకరణ , యోగాచారాలను అధ్యయనం చేశాడు. చైనాకు మరలిపోయేప్పుడు 657 ప్రాచీన తాళపత్ర గ్రంథాలను కాపీ చేసుకుని 520 పెట్టెల్లో  20 గుర్రాల  మీద పట్టుకు వెళ్ళాడు. 3705 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో , బహుళ అంతస్థులు కలిగిన ఏడు బౌద్ధ మఠాలు, ఎనిమిది వేరువేరు కాంపౌండ్లు , పది దేవాలయాలు, మెడిటేషన్  హాళ్లు , విశాలమైన క్లాస్ రూములు,  తొమ్మిది అంతస్తుల ధర్మగంజ్ గ్రంథాలయ సదనం,   మూదు అంతస్తుల డార్మిటరీ సముదాయం, తటాకాలు, ఉద్యానవనాలతో  నలంద ప్రాంగణం ఎంత వైభవోపేతంగా విలసిల్లిందీ ఆ యాత్రికుడు కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. అనంతర కాలాన ఆర్కియలాజికల్ తవ్వకాలలో విద్యాబోధనకు సంబంధించినదిగా బయటపడ్డ పెద్ద దిబ్బ పొడవు 1400 అడుగులు, వెడల్పు 400 అడుగులు అంటే అప్పటి కట్టడాలు ఎంత గొప్పగా ఉండేవో ఊహించవచ్చు. నాగార్జున , పద్మసంభవ , వసుబందు, ధర్మపాల వంటి మహా విద్వాంసులు నలందలోనే విద్యనేర్చారు. ప్రపంచానికి సున్నను ప్రసాదించి గణిత శాస్త్ర వికాసానికి తోడ్పడిన ఆర్యభట్ట ఈ విశ్వ విద్యాలయానికి ప్రదానాచార్యుడుగా ఉన్నాడు.

           ప్రపంచంలో ఏ ఖండంలో ఏ మూల ఏ దేశం వారైనా ... ఏ మతానికి ,ఏ సంప్రదాయానికి , ఏ కులానికి , ఏ తెగకు చెందినవారైనా.. ఏ దైవాన్ని నమ్మేవారైనా , ఏ దైవాన్నీ నమ్మనివరైనా ... సంపన్నులైనా , నిరుపెదలైనా ... ప్రతిభ, జిజ్ఞాస, శ్రద్ధ ఉండి ప్రవేశ పరీక్షలో నెగ్గితే చాలు ... మా విశ్వ విద్యాలయానికి రావచ్చు. ఇష్టమైన విద్యలను, వాటికి సంబంధించిన శాస్త్రాలను మహా మహా మహోపాధ్యాయుల సన్నిధిలో దమ్మిడీ ఖర్చు లేకుండా , చదువుకూ తిండికీ బసకూ పైసా రుసుము కట్టాల్సిన పనిలేకుండా ... జ్ఞానతృష్ణ తీరేదాకా ఎన్నేళ్ళయినా ఇక్కడే ఉండి అభ్యసించవచ్చు. ఇక్కడి జగత్ ప్రసిద్ధ గ్రంథాలయంలో భద్రపరచిన  లక్షలాది అపురూప ప్రాచీన గ్రంథాల వ్రాతప్రతులను  తీరుబడిగా అధ్యయనం చేయవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని గ్రంథాలను ఉచితంగా కాపీ చేసుకుని పోవచ్చు .... అని బంపర్ ఆఫర్ ఇచ్చే యూనివర్సిటీ లేక విద్యా విజ్ఞాన సంస్థ ఈ 21 వ శతాబ్దంలోనే ప్రపంచం మొత్తం మీద ఒక్కటీ లేదు. మానవజాతి అదృష్టం కొద్దీ పదహారు శతాబ్దుల కిందటే విజ్ఞాన సర్వస్వమనదగిన అటువంటి మహా విద్యా సంస్థ హిందూ దేశంలో  శతాబ్దాల పర్యంతం   మహా వైభవంగా నడిచింది. ,మల్టీబిలియనీర్లు , ట్రిలియనీర్లు కొల్లలుగా ఉన్న ఈ ఆధునిక యుగంలో ఏ వదాన్యుడూ , ఏ సూపర్ రిచ్ సూపర్ పవర్ ప్రభుత్వమూ తలపెట్టని లోకోత్తర మహత్కార్యాన్ని ఒక మోస్తరు రాజ్యాల బౌద్ధ, హైందవ ప్రభువులు , పేరు ప్రచారం ప్రతిఫలం ఆశించకుండా  నిస్వార్థంగా చేపట్టి కావలసినన్ని  వనరులు, హంగులు, మడిమామత న్యాలూ సమకూర్చి ధన్యులయ్యారు. ఆ అద్భత వ్యవస్థ అలాగే నిరాఘాటంగా కొనసాగిఉంటే మానవ విజ్ఞానం మరింత వేగంగా పురోగమించగలిగేది. మానవాళికి మహోపకారం జరిగేది.

కాని మన దౌర్భాగ్యం ! ఎందరో మహానుభావులు ఎన్నో శతాబ్దాల పాటు పడిన శ్రమ , చేసిన త్యాగం , సాధించిన విజయం అన్నీ చివరికి బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. మతమౌడ్యం జడలుకట్టిన ఇస్లామిక్ మతోన్మాదం బారిన పడి మొత్తం ప్రపంచానికి విజ్ఞాన ఖని , విద్యల కల్పవల్లి అయిన నలందా మహా విహార విశ్వ విద్యాలయం సర్వనాశనం అయింది. అక్షరజ్ఞానం లేని ఒక నీచ నికృష్ట నరరూప రాక్షసుడి మతమౌడ్యం  మూలంగా మంటల్లో దగ్ధమై అక్షరాలా బూడిదే అయింది. దానివల్ల సనాతన ధర్మానికి, బౌద్ధ మతానికి, మొత్తంగా మానవ విజ్ఞానానికి , నాగరికతకు ఎవరూ అంచనా అయినా కట్టలేనంత తీవ్ర విఘాతం జరిగింది.

నలందను మళ్ళీ కోలుకోలేనంతగా సర్వనాశనం చేసిన  పాపాత్ముడి పేరు బఖ్తియార్ ఖిల్జీ. వాడి పేరు లోని ఖిల్జీని చూసి తెలియనివారు అతడిని 13 వ శతాబ్దంలో హిందూ దేశాన్ని చెరబట్టిన ఖిల్జీల పారంపర్యానికి  చెందినవాడని పొరబడతారు. కాని కాదు. వాడొక తాదూ బొంగరం లేని ఆవారాగాడు. తబకాత్ -ఇ- నాసిరీ  గ్రంథంల్ 548 నుంచి  552 వరకూ  పేజీల్లో మౌలానా మిన్హాజ్ ఉద్దీన్ , అబూ ఉమర్ ఉస్మాన్ లు తెలిపిన వివరాల ప్రకారం అతడు  ఆఫ్గానిస్తాన్ లో ఖిల్జీ తెగ వాడు.  ,పందొమ్మిదో ఏట ఘజినీ లో ముహమ్మద్ ఘోరీ దర్బారుకు వెళ్లి సైన్యంలో  చేర్చుకోమన్నాడు. అతగాడి వికారపు మొగం, పొట్టి వాలకం ,  పొడుగు చేతులు చూస్తేనే సుల్తానుకు అసహ్యం వేసి గెంటేశాడు. అక్కడినుంచి దిల్లీ వెళ్లి కుతుబుద్దీన్ ఐబక్ ను కలిశాడు. అక్కడా పరాభవం అయింది. తరవాత 1193 ప్రాంతాల్లో అవద్ చేరాడు. అక్కడ తన  పినతండ్రికి చిన్న జాగీరు ఉండేది. అతడు చనిపోయాక ఆ జాగీరు బఖ్తియార్ పరమయింది, ఆ ఆసరాతో కొంతమంది కిరాయి సైనికులను, కాసిని గుర్రాలను , ఆయుధాలను సమకూర్చుకుని చుట్టుపక్కల ప్రాంతాల మీద పడ్డాడు. దొమ్మీలు, దౌర్జన్యాలు, దోపిడీలు  చేస్తూ అందిన కాడికి ఊళ్లు, చిన్నా చితకా రాజ్యాలూ ఆక్రమిస్తూ , అపార సంపద కొల్లగొడుతూమెల్లిగా కుతుబుద్దీన్  సుల్తాన్ దృష్టిలో  పడి గౌరవ సన్మానం అందుకున్నాడు. దరిమిలా ఇంకా మదించి ,  రెట్టించిన క్రౌర్యం తో  మునేర్, బిహార్ ల వైపు కార్చిచ్చు లా చెలరేగి  1197 లో కాబోలు నలంద పరిసరాలలో దాపురించాడు.

7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు హుయెన్ సాంగ్ కళ్ళారా చూసి వర్ణించిన దానిప్రకారం ఏకంగా  3705ఎకరాల మేర విస్తరించిన  నలందా మహావిహార విశాల ప్రాంగణం చుట్టూ ఎత్తైన ఇటుక గోడ ఉండేది. ప్రధాన ద్వారం చాలా పెద్దగా ఉండేది. విద్యా బోధన జరిగే భవన సముదాయానికి వేరుగా సంఘారామం మధ్యలో ఎనిమిది పెద్ద బహుళ అంతస్తుల భవనాలు ఉండేవి. అంతరిక్షపు అబ్జర్వేటరీలు ఉన్న పై గదులు మబ్బులను తాకుతూందేవి. ఎంత దూరానికైనా కనిపించే పెద్ద పెద్ద టవర్లు , భవన సముదాయాల పైన కళాత్మకంగా అమర్చిన చిన్న గోపురాలు చూస్తే సంస్కారం ఉన్న సహృదయులకు కన్నులవిందు అవుతుంది. కానీ చదువు సంస్కారం ఏ కోశానా లేని , విద్యా ప్రాంగణాలంటూ ఉంటాయని కూడా తెలియని  బఖ్తియార్ ఖిల్జీ అనే  మూర్ఖ ముష్కరుడి పాపిష్టి దృష్టికి  అది ఒక పెద్ద కోటలా కానవచ్చింది. దోచుకోవటానికి అక్కడ అపార సంపద ఉంటుందని దుర్బుద్ధి పుట్టింది,  సదరు “బిహార్ కోట” (Hisar-i-Bihar) ను కొల్లగొట్టటానికి శరవేగంతో లోట్టలేస్తూ దౌడుతీశాడు. అతడి వెంట ఉన్న 200 మంది సాయుధ రౌతులలో మొదటి జట్టులో 18 మంది మాత్రమే అతడి వెంట ఉన్నారు.  వారిని చూసిన వారు  పరదేశి వ్యాపారులు కాబోలు అనుకున్నారు తప్ప వేల మందిని ఊచకోత కోసి ఆ ఊరును వల్లకాడు చేయటానికి వచ్చిన నరపిశాచులన్న సందేహం ఎవరికీ కలగలేదు.



ఎవరి జోలికీ వెళ్ళకుండా ఎవరికీ ఇబ్బంది కలగనీయకుండా తమ మానాన తాము ప్రశాంతంగా విద్యల అద్యయన అధ్యాపనాలు చేసుకుంటున్న సజ్జనులకు ఎవరైనా హాని చేయవచ్చు;  చదువుల తల్లి నడయాడే పవిత్ర ప్రాంగణం మీద పైశాచిక దాడి జరగవచ్చు అన్న ఊహే అంతవరకూ ఎవరికీ రాలేదు. విదేశీ తురుష్కులు విరుచుకు పడి పలు రాజ్యాలను ఆగమాగం చేస్తున్నారని తెలిసినా చదువుల నెలవులో నిష్కారణంగా తలలు నరికేంతటి  రాక్షసత్వానికి వారు పాల్పడగలరని మన ధర్మ ప్రభువులెవరూ ఆ కాలాన శంకించ లేదు. బహుశా అందువల్లే అనేక వేల ఎకరాల విశాల నలంద మహావిహారం రక్షణ ,భద్రత ల విషయం ఎవరూ పట్టించుకోలేదు. అదే బఖ్తియార్ ఖిల్జీకి కలిసివచ్చింది. జరగకూడని ఘోరం జరిగిపోయింది. కేవలం 200 మంది తురుష్క ముష్కరులు పదివేల మంది విద్యార్థులను, మూదు వేలకు పైగా ఆచార్యులను, వేలాది బౌద్ధ బిక్షువులను పరమ కిరాతకంగా ఊచకోత కోశారు. మళ్ళీ ఎన్నడూ కోలుకోలేనంతటి భయానక విధ్వంసం సాగించారు.  ఆ సమయాన ఖిల్జీ పక్కనే ఉంది చరిత్రలో కనీ వినీ ఎరుగని ఆ దారుణ మారణకాండలో స్వయానా పాపిష్టి పాలు పంచుకున్న  శంశముద్దీన్ అనే వాడి నుంచి సమాచారం రాబట్టి తబకాత్ నాసిరీ గ్రంథంలో ముస్లిం చరిత్రకారులు మిన్హాజ్ , ఉస్మాన్ లు రికార్డు చేసిన  ప్రకారం –

The band of Holy Warriors reached the gateway of the fortress and began the attack. Muhammad Bakhtyar threw himself into the postern of the gateway of the place, and they captured the fortress , and acquired great booty. The greater number of the inhabitants of that place were Brahmans , and the whole of those Brahmans had their heads shaven ; and they were  all slain. There were a great number of books there ; and when all these books came under the observation of the  Musalmans , they summoned a number of Hindus that they might give them information respecting the import of those books; but the whole of the Hindus had been killed. On becoming acquainted with the contents of those books, it was found that the whole of that fortress and city was a college, and in the Hindu tongue , they call a college Bihar.

[Tabakat-i- Nasiri, By Maulana Minhaj -ud- Din ,Abu - Umar-i- Usman , Translated by Major HG Raverty P 552]

(పవిత్ర యోధుల దళం కోట ప్రధాన ద్వారాన్ని చేరుకొని దాడి మొదలెట్టింది. ముహమ్మద్ బఖ్తియార్ అక్కడి పక్కద్వారం మీదికి లంఘించి కోటను వశపరచుకుని గొప్ప సంపద కొల్లగొట్టాడు. అక్కడ నివసిస్తున్నవారిలో అత్యధికులు బ్రాహ్మణులు. వారందరూ శిరోముండనం చేయించుకుని ఉన్నారు.  మొత్తం అందరినీ నరికివేశారు. అక్కడ కొల్లలకు కొల్లలుగా  గ్రంథాలు ఉన్నాయి. ఆ విషయం ముసల్మాన్ల దృష్టికి వచ్చినప్పుడు ఆ గ్రంథాలలో ఏమున్నదో తెలియపరచటం కోసం పలువురు హిందువులను పిలిపించమన్నారు. కాని అప్పటికే హిందువులు యావన్మందీ చంపివేయబడ్డారు. ఆ గ్రంథాల ఆనుపానులు ఆరా తీసిన మీదట ఆ కోట, ఆ నగరం నిజానికి ఒక కాలేజీ అని అర్థమయింది. హిందూ భాషలో కాలేజీని విహార్ ( బిహార్) అని పిలుస్తారు.)

అది అపార ధనరాశులు ఉండే కోట కాదు; చదువులు నేర్పే కాలేజీ అని పొట్ట కొస్తే అక్షరం ఉండని నీచ నికృష్టుడికి అర్థమయ్యేసరికి మహా విలయం జరిగిపోయింది. పదివేలకు పైగా విద్యార్థులు, రెండు వేలకు పైగా ఆచార్యులతో కళకళలాడిన మహోన్నత విశ్వ కళా పరిషత్తులో  కనీసం పుస్తకాలలో విషయం ఏమిటన్నది చూసి చెప్పటానికి ఒక్క విద్యావంతుడూ మిగలలేదంటే సామూహిక జన సంహారం ఏ స్థాయిలో జరిగిందో, ఆరు అంతస్థుల బౌద్ధ విహారంలో, తొమ్మిది అంతస్థుల గ్రంథాలయ సముదాయంలో , అనేకానేక చైత్యాలూ, ఆరామాలూ , ఆవాస హర్మ్యాలలో ఎన్ని రోజులపాటు ఎన్ని తలలు నరికారో , ఎంతటి రక్తపుటేరులు పారాయో తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఏ పాపమెరుగని , చీమకైనా హాని తలపెట్టని అహింసావ్రత నిష్టా గరిష్టులైన వేలాది విద్వాంసులను మేరలేని మతవిద్వేషం తో రాక్షసంగా ఊచకోత కోసిన తరవాత అక్కడి లక్షలాది గ్రంథాలను ఏమి చేయాలన్న ప్రశ్న ఉదయించింది. అలాంటి సమస్యే దానికి కొన్ని శతాబ్దాల పూర్వం ఒక ఖలీఫా ముందుకు వచ్చింది.

When the Persian capital of Ctesiphon in province of Khvarvaran (today Iraq) fell to the Muslims in 637 ... ... Waqqas wrote to Caliph Umar asking what should be done with the books at Ctesiphon. Umar wrote back: "If the books contradict the Qur'an, they are blasphemous. On the other hand, if they are in agreement, they are not needed, as for us Qur'an is sufficient." Thus, the huge library was destroyed and the books were thrown into fire or the river Euphrates.

[ Jurji Zaydan in  The History of the Islamic Civilization, vol. III, pp.42-51]

( ఇప్పటి ఇరాక్ లోని ఒక రాష్ట్రంలో పర్షియన్ రాజధాని టెసిఫోన్ 637లో ముస్లిముల వశమైనప్పుడు ఆ నగరంలో దొరికిన గ్రంథాలను ఏమి చేయాలని వక్కాస్ అనేవాడు ఖలీఫా ఉమర్ కు లేఖ రాశాడు. ఆ గ్రంథాలు కురాన్ కు విరుద్దంగా ఉంటె దైవ దూషణ నేరం చేసినట్టు కాబట్టి  అవి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ అవి కురాన్ బాధలకు అనుగుణ్యంగా ఉన్నా అవి అక్కరలేదు. ఎందుకంటే మనకు కురాన్ ఒకటే చాలు “ అని ఖలీఫా గారి ధర్మనిర్ణయం! ఇంకేం? బ్రహ్మాండమయిన గ్రంథాలయాన్ని ధ్వంసం చేసి వెలలేని పుస్తకాలను యూఫ్రటిస్ నదిలో పారేశారు – అని  The History of the Islamic Civilizationగ్రంథం మూడో సంపుటం 42-51 పేజీలలో ఇస్లామిక్ విద్వాంసుడు  Jurji Zaydan రాశాడు.

బఖ్తియార్ ఖిల్జీ కూడా అతడికి సరితూగే వాడే. నలంద లోని  అపురూప గ్రంథాల భాండాగారాన్ని నాశనం చేయకండి అని పుస్తకాల విలువ తెలిసిన వారు ప్రాధేయపడితే అతగాడో ప్రశ్న వేశాడట. ఆ పుస్తకాలలో అల్లా గురించి , మహమ్మద్ ప్రవక్త గురించి ఉన్నదా?అని. ‘లేదు’ అని వారన్నారు. అయితే మానవాళికి ఆ పుస్తకాలు అక్కరలేదు. వాటిని తగలెట్టండి అన్నాడట ఆ శుంఠ ! అనుచరులు అంతపనీ చేశారు. 90 లక్షల గ్రంథాలను కాల్చి బూడిద చేయటం మాటలా? మహమ్మదీయ పవిత్ర యోధులు ఆ పుణ్యకార్యం పూర్తి చేయటానికి మూడు నెలలు పట్టింది. అంతకాలమూ ఆరని మంటల్లో అరుదైన అపురూప గ్రంథాలు కాలుతూనే ఉన్నాయి.

విజ్ఞాన సర్వస్వమైన ఒక మహా విద్యా వ్యవస్థను  నామరూపాలు మిగలకుండా సర్వనాశనం చేసిన నీచాతినీచ మానవ మృగం పేరు తలవటమే పాపం . మరి ఆ పరిసరాలలోని మునిసిపల్ టౌనుకూ , రైల్వే స్టేషనుకూ  భక్తియార్ పూర్ అంటూ ఆ దూర్తుడి పేరు కొనసాగించి ఈ నాటికీ  లక్షల  జనం దానిని నిత్యం స్మరించేలా చేసిన మనకాలపు సెక్యులర్ ప్రభువులను ఏమనాలి? ముస్లిం మతోన్మాదం మూలంగా జాతికి జరిగిన ఘోరాపచారాన్ని జాతి జనులకు తెలియకుండా అబద్ధాల అల్లికలల్లి –బఖ్తియార్ అనే సాదుజీవి  అసలు నలంద మొగమే ఎరుగడు.. అతడు కూల్చినది వేరేదో బౌద్ధ మఠం. నిజానికి బౌద్ధం మీద విద్వేషంతో  వరసగా దాడులు చేసి , నలందను  కూల్చినది హిందూ మతోన్మాదులనీ..... ఇద్దరు అడుక్కుతినే బ్రాహ్మణులు  తమ మీద ఎవరో చెడు నీళ్ళు పోసారన్న కక్షతో పన్నెండేళ్ళు సూర్యోపసాసన చేసి తంత్ర శక్తితో కార్చిచ్చుని సృష్టించి  మొత్తం అన్ని వేల ఎకరాలలోని భవనాలనూ,  గ్రంతాలనూ కాల్చేశారని కట్టుకతలల్లి  అదే ప్రామాణిక చరిత్ర అని తెగబడి డబాయిస్తున్న డి.ఎన్.ఝా లాంటి కమ్యూనిస్టు కబోది మేధావి గణాలను ఏమని పిలవాలి?