Thursday, 15 February 2024

తెలుగువారి అదృష్టం....‌

  ఎం.వి.ఆర్.శాస్త్రి

   (2005 లో జి.వెంకట రామారావు గారురచించిన " ప్రధానిగా పి.వి." గ్రంథానికి నేను రాసిన ముందుమాట)



     పీవీ నరసింహారావు తెలుగువాడు కావటం తెలుగువారి అదృష్టం ; పీవీ దురదృష్టం.

     ఇటువంటి ప్రజా నాయకుడు ,ఇంతటి పండితుడు, మేధావి,  బహు భాషావేత్త, చెయితిరిగిన రచయిత, సంస్కరణశీలి ,దార్శనికుడు ,విశిష్ట పరిపాలకుడు వేరే రాష్ట్రంలోనో  ,వేరే దేశంలోనో  పుట్టి ఉంటే అక్కడి ప్రజలు నెత్తిన పెట్టుకుని పూజించేవారు .మరి మనమో..? ముఖ్యమంత్రి కావటానికి ముందూ తర్వాతా... ప్రధాని కావటానికి ముందూ తర్వాతా... జీవించి ఉండగా, మరణించిన తర్వాతా... మనమూ మనలను నడిపించే నేతలూ వారిని నడిపించే అధినేతలూ పీవీ పట్ల ఎంత గౌరవం ఎంత ఆదరణ ఎంత కృతజ్ఞత చూపింది మన అంతరాత్మలకు తెలుసు. విపులీకరించవలసిన పనిలేదు.

       ఒక సంవత్సరం కిందట ఇలాంటి పుస్తకాన్ని నేను చూసి ఉంటే -ఎందుకిది ?ఒక ప్రధానమంత్రి ఐదేళ్ల హయాంలో జరిగినవన్నీ ఇప్పుడు నెంబర్ వేయటం దేనికి అనేవాణ్ణి. దీర్ఘకాలం దేశాన్ని, పార్టీని సేవించిన పీవీకి దివంగతుడైన తరువాత దేశ రాజధానిలో లభించిన ఘన నివాళిని , మరవలేని గౌరవ మర్యాదలను గమనించాక నా అభిప్రాయం మారింది. ఔరంగజేబు రోడ్లూ, తుగ్లక్ రోడ్లే తప్ప కృష్ణ దేవరాయల రోడ్డు, రుద్రమదేవి రోడ్డు లాంటివి రాజధాని నగరంలో కలికానికి కూడా కనిపించని దేశంలో...స్వాతంత్రం వచ్చి షష్టిపూర్తి కావస్తున్నా దాక్షిణాత్యుల పట్ల చిన్న చూపు ఉత్తరాది వారికి పోని బాధాకర పరిస్థితుల్లో ... కొద్ది బుద్ధి కలవారి కర్ర పెత్తనాలు ఇప్పటిలాగే సాగితే నెహ్రూ వంశానికి వెలుపలివాడైన నరసింహారావు అనే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపించిన సంగతి కూడా మరుగున పడిపోతుందేమో! ఆ ప్రమాదాన్ని నివారించడానికైనా- పీవీ పరిపాలనలో దేశం ఎలా ఉండేదో ,అప్పటి దేశకాల పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం ఏమి సాధించిందో, ఏమి సాధించలేకపోయిందో ,ఎందువల్ల సాధించలేకపోయిందో, ఆ పరిపాలన ప్రత్యేకతలు ఏమిటో ఎప్పటికీ గుర్తు పెట్టుకో దగిన విశేషాలు ఏమిటో గ్రంథస్థం అయి తీరాలి. వివిధ నాయకులకు, ఆయా చారిత్రక ఘట్టాలకు సంబంధించి ఇటువంటి గ్రంథాలు ఇంగ్లీషులో బాగానే వచ్చినా, తెలుగులో ఈ మాదిరి రచనలు చాలా తక్కువ. అరుదైన, కష్టమైన ఇలాంటి కార్యానికి పూనుకుని ప్రతిభావంతంగా నిర్వర్తించినందుకు మిత్రులు వెంకట రామారావు గారిని అభినందిస్తున్నాను.

      ఈ సందర్భంలో స్వర్గీయ బుడి సత్యనారాయణ సిద్ధాంతి గారు నాకు గుర్తుకొస్తున్నారు. ప్రధానమంత్రి అయ్యాక నరసింహారావు గారి ఆధికారిక నివాసానికి కుటుంబ పురోహితుడుగా ఆయనే గృహప్రవేశం చేశారట. ఆ ఇంటికి ఏదైనా మార్పులు ,చేర్పులు సూచించబోతే "ఎందుకండీ పండిట్జీ ! ఈ సర్కారు ఎంతో కాలం ఉండదు కదా" అని అక్కడివారు పెదవి విరిచే వారట! నిజమే! రాజీవ్ మరణానంతరం వేరే దారి లేక నాయకుడిగా ఎన్నుకోబడ్డ పి.వి. గారు అదృష్టవశాత్తు ప్రధానమంత్రి అయినా, కనీస మెజారిటీకే గతి లేని ఆయన ఓటి ప్రభుత్వం రాజకీయ పెను తుఫాన్లను, సంక్లిష్ట సమస్యల సుడిగుండాలను తట్టుకొని ఆట్టేకాలం నిలబడుతుందన్న నమ్మకం అప్పట్లో ఎవరికీ లేదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా సామాన్లు సర్దుకుని హైదరాబాదుకు మకాం మార్చటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న వృద్ధుడు... తనకంటూ వర్గ బలం, వీరాభిమానగణం ఏదీ లేని దుర్బలుడు రాజీవ్ అనంతరపు వెలితిని ఎంత మాత్రం పూరించలేక బొక్క బోర్ల పడతాడనే చాలామంది ఊహించారు. ఎవరికీ ఏ విధమైన ఆశ లేకపోవటమే పీవీకి వరమైంది. అద్భుతాలు సాధించగలడని తారాస్థాయిలో ఆశలు రేపిన రాజీవ్ గాంధీ ఎంత చేసినా తనపై ప్రజలు పెట్టుకున్న ఆశలకు, ఆకాంక్షలకు సరితూగలేక చివరికి భంగపడ్డాడు. ఏమీ చేయ లేడని ముందే ముద్రపడిన పీవీ కొంచెమే చేసినా అదే చాలా ఎక్కువ అనుకునేందుకు జనం సిద్ధంగా ఉన్నందున అధికార స్థానంలో కాలు నిలదొక్కుకోవటం తేలికైంది. బానిస మనస్తత్వానికి పేరు పడ్డ చాలామంది కాంగ్రెస్ నాయకుల్లా కాక స్వతంత్రంగా వ్యవహరించి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ,తన సత్తా ఏమిటో చూపించిన తెలుగు బిడ్డ పీవీ! కరణీకపు ప్రజ్ఞతో మైనారిటీని మెజారిటీగా మార్చుకుని ఐదేళ్ల పూర్తికాలం అధికారం చలాయించిన అపర చాణక్యుడాయన. కొన్ని వ్యక్తిగత, రాజకీయ బలహీనతల వల్ల... కీలక విషయాల్లో అసమర్ధ నిర్వాహకాలవల్ల ...కాంగ్రెస్ పార్టీకి ,ప్రభుత్వానికి స్వతసిద్ధమైన అవలక్షణాల వల్ల ...ఇంకా అనేక అనేక కారణాలవల్ల మళ్లీ ఎన్నికల్లో ప్రజా విశ్వాసం పొందలేక ఆయన అధికార చ్యుతి నందటం వేరే సంగతి. అందుకు పూర్తిగా ఆయన్నే బాధ్యుడిని చేయటమూ సరికాదు. అధికారం కోల్పోయాక కూడా పార్లమెంటు లోపలా వెలుపలా ఆయన గౌరవం తగ్గకపోగా, కొన్ని సందర్భాల్లో ఇనుమడించిన సంగతీ మరచిపోరాదు.

       నరసింహారావు గారు ఇచ్చకాలు గిట్టని మనిషి.ముఖస్తుతులను, ప్రచార భజనలను ఇష్టపడని వ్యక్తి . లోతుగా ఆలోచించి ,సమయానికి ,సందర్భానికి తగ్గట్టు కౌటిల్య తంత్రం రచించుకుని గుంభనంగా తన పని తాను



చేసుకుపోవటమే తప్ప ఫలానా ఘనకార్యాలు, ఘన విజయాలు తపపల్లే సిద్ధించాయని డప్పు కొట్టించుకోవటం ఆయనకు ఇష్టం ఉండదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వైఫల్యాల మాట ఎలా ఉన్నా, ప్రధానమంత్రిగా పీవీ ఘనతలూ తక్కువేమీ కాదని స్పష్టం. బాంబుల పేలుళ్లు, కాల్పులు, ఊచ కోతలు నిత్య కృత్యంగా మారిన పంజాబులో విచ్ఛిన్నకర ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి, మళ్లీ లేవకుండా మట్టు పెట్టగలగటం ఆషామాషీ విషయం కాదు. అలాగే కంఠశోషలిజాన్ని కట్టి పెట్టి ,ఉజ్జ్వల జాతీయ భవితకు ప్రోది చేసిన ఆర్థిక సంస్కరణలూ పీవీ హయాంలోనే దారిన పడ్డాయి. బాబరీ మసీదు కూల్చివేతను నిరోధించలేక పోవడాన్ని అందరూ మాయని మచ్చగా అభిప్రాయ పడుతున్నా... మనను కమ్మిన  మాయ పొరలు తొలగి, నిజమైన చారిత్రక దృష్టితో ,సిసలైన జాతీయ దృక్పథంతో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే పరిణతి కలిగాక పీవీ చేసినదానిని గురించి, చేయలేకపోయిన దానిని గురించి చరిత్ర ఇచ్చే తీర్పు ఏమిటో ఎవరి కెరుక?






No comments:

Post a Comment