Saturday, 31 August 2019

రాజకీయ వివేకానంద


    మనిషికీ గొడ్డుకూ తేడా ఏమిటి? గొడ్డు దేవుడిని తలవదు.  కొలవదు. అవి  రెండూ మనిషికి చేతనవును."
    " మంచి గుణం, దైవభక్తి ఉన్నవాడు తక్కువ కులం వాడైనా సరే  నేను  నెత్తిన పెట్టుకొని పూజిస్తాను."
    పరీక్షలు దగ్గర పడ్డాయి అంటే కంగారు  పడతాం. కానీ జీవితంలో ప్రతి క్షణమూ దైవంధర్మం మనకు పరీక్ష పెడుతూనే ఉంటాయి.
    అసలు ఎందుకమ్మా ఈ చదువులుపెద్ద చదువు చదివి ఏ జడ్జీయోపెద్ద  ఆఫీసరో   అయి, చూసేవాళ్లకు  కళ్ళుకుట్టేంతలా సంపాదించాలా? డబ్బు,అధికారం లేకపోయినా, పేదరికంలో ఉండి కూడా మంచి మనుషులమని  అనిపించుకోవడం  మేలుకాదా?"
     స్కూల్లో చదువుకుంటుండగా 15 ఏళ్ల  వయస్సులో  సుభాస్ చంద్రబోస్ తన తల్లికి రాసిన ఉత్తరాల్లోని కొన్ని వాక్యాలివి!  ఆయన అసంపూర్ణ ఆత్మకథ An Indian Pilgrim కి అనుబంధంగా చేర్చిన చిన్ననాటి ఉత్తరాల్లో వీటిని చదవొచ్చు.
    వేదాంత గ్రంథాల సారం పిండిన మహా పండితులని అనుకోబడే వారిలోనే చాలామందికి లేని ఈ వివేకం సుభాస్ కి  చిన్న వయసులోనే ఎలా అబ్బింది?
     దీనికి ప్రేరణ స్వామి వివేకానంద!

    ఎవరో చుట్టాలబ్బాయిని కలవటానికి సుభాస్ అతడున్నచోటికి అనుకోకుండా వెళ్లాడు.అక్కడ వివేకానందుడి గ్రంథాలు కనపడ్డాయి.యథాలాపంగా ఒక పుస్తకం తీసుకుని కొన్ని పేజీలు తిరగెయ్యగానే సుభాస్ కి ఒళ్లు ఝల్లుమంది.
    "చదివి ఇచ్చేస్తానని చెప్పి ఆ పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని ఆత్రంగా చదివాను. నా మేను పులకరించింది. నాకు కావలసిన ఆదర్శం వివేకానందుడి దగ్గర దొరికింది. వారాల తరబడి ఆ పుస్తకాలను మళ్లీ మళ్లీ చదివాను. 'కొలంబో నుంచి అల్మోరా వరకు’  వివేకానందుడి ప్రసంగాలు,ఆయన రాసిన ఉత్తరాలు నన్ను బాగా ఇన్ స్పైర్ చేశాయి. 'ఆత్మనో మోక్షార్ధం జగత్ హితాయచ (వ్యక్తి తన ముక్తి కోసమేకాక ప్రపంచహితం కోసమూ పాటుపడాలి) అన్నదే జీవితలక్ష్యం అని నా మనసులో గట్టిగా నాటుకుంది. మానవసేవలో దేశ సేవ అంతర్భాగమని అర్థమైంది. పండితుడి నుంచి కడజాతివాడి వరకూ అందరూ నా సోదరులనీ...అగ్రవర్ణాల ఆధిపత్యానికి కాలం చెల్లిందనీ..శూద్రులూ,అట్టడుగు దళిత జనులూ పైకి వచ్చి అధికారం చలాయించే కాలం వచ్చిందనీ గట్టి నమ్మకం కలిగింది. వివేకానంద నా జీవితంలో ప్రవేశించే నాటికి నాకు నిండా 15 ఏళ్లు లేవు. నాటినుంచి నా అంతరంగంలో విప్లవం మొదలైంది. వివేకానంద మార్గమే నామార్గమైంది.
    -అంటాడు సుభాస్ తాను పూర్తిచేయని ఆత్మకథ An Indian Pligrim 37,38 పేజీలలో. పైన ఉటంకించిన ఉత్తరాలను అమ్మకు రాసింది ఈ పెను మార్పు తరవాతే.
    చాలామంది నాయకులు వివేకానంద తమకు ఆదర్శం అని గొప్పగా చెప్పుకున్నారు. వివేకానంద వాక్కులను అవసరమైనప్పుడల్లా వాడేసుకుని,అదంతా తమ ధర్మాగ్రహమేనని నమ్మించాలని ఎంతో మంది ఆరాటపడతారు. కాని సుభాస్ బోస్ వలె స్వామి వివేకానంద అంతరంగాన్ని అవగతం చేసుకుని,ఆయన తత్వంలో తాదాత్మ్యం చెంది,తనదైన పంథాలో దాన్ని ముందుకు తీసుకుపోయిన రాజకీయ నాయకుడు వేరొకరు కనిపించరు. వివేకానందుడు సుభాస్ ని ఎంతలా ప్రభావితం చేశాడంటే కొన్ని కీలక ఘట్టాల్లో సుభాస్ బోస్ చేసిన ఉద్వేగభరిత,ప్రవాహసదృశ ప్రసంగాలను ఆలకిస్తే వివేకానందుడే మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. సుభాస్ స్థానంలో వివేకానందుడు ఉంటే అచ్చు అలాగే చేసేవాడు-ఆయా సవాళ్లకు అలాగే స్పందించే వాడు-బోలుతనాలను అలాగే ఎండగట్టేవాడు అన్న అభిప్రాయం కలుగుతుంది.
    ఇంకోవిధంగా చెప్పాలంటే సుభాస్ చంద్ర  రాజకీయ వివేకానంద! స్వామి వివేకానంద ఆధ్యాత్మిక సుభాస్ చంద్ర!! జీవించిన కాలం,కార్యక్షేత్రం వేరువేరయినా ఇరువురిలోనూ ఉన్నది దేశంగురించి,ధర్మం గురించి ఒకే రకమైన  తపన! ఆధ్యాత్మిక విషయాల గురించి సుభాస్ బోస్ ఎప్పుడో అరుదుగా తప్ప మాట్లాడకపోతేనేమి? క్రియాశీల రాజకీయాల్లో తలమునకలుగా ఉన్నప్పుడు,కొండలను డీకొని సాహస పోరాటాలు చేస్తున్నప్పుడు,దేశ విమోచన కోసం అపూర్వ అద్భుత సైనిక సంగ్రామం సాగిస్తున్నప్పుడు కూడా అతడిలో భారమంతా దైవం మీద వేసి,ఫలితం మీద యావలేకుండా నిశ్చలంగా,నిర్వికారంగా తన ధర్మం తాను నిర్వర్తిస్తున్న నిష్కామ కర్మయోగి కనపడతాడు.
[ఈ నెలాఖరులో వెలువడనున్న నా కొత్తపుస్తకం "సుభాస్ చంద్ర బోస్" నుంచి]





No comments:

Post a Comment