పెక్యులరిజం - 13
- ఎం.వి.ఆర్.శాస్త్రి
............
హిందువులకు అన్యాయం చేసిన రాజ్యాంగ అధికరణాల్లో ఆర్టికల్ 27 తక్కువది కాదు. కాని మత స్వేచ్ఛకు సంబంధించిన ఇతర రాజ్యాంగ అధికరణాల మీద దృష్టి సారించినంతగా హైందవ మేధావుల, మతపెద్దల, హిందూసంస్థల చూపు దీనిమీద పడలేదు. 25,26,30 వంటి అధికరణాలమీద వందల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి కాని 27వ అధికరణాన్ని సవాలు చేసిన కేసులను వేళ్ళమీద లెక్కించవచ్చు. దాంతో ఈ అధికరణం మంచి చెడ్డలను, సాధక బాధకాలను సాకల్యంగా విశ్లేషించే అవకాశం ఉన్నత న్యాయవ్యవస్థకు దొరకలేదు.
ఇది వేరెవరో కాదు - స్వయానా సుప్రీంకోర్టే ఒప్పుకున్న నిజం. హజ్ సబ్సిడీని సవాలు చేస్తూ 27వ అధికరణం కింద ప్రసిద్ధ హిందూత్వవాది ప్రఫుల్ గొరాడియా భారత ప్రభుత్వం మీద వేసిన దావాపై తీర్పులో ఏడేళ్ళ కింద (2011లో) సుప్రీంకోర్టు ఏమన్నదో చూడండి:
"There are not many decisions which have given an indepth interpretation of Article 27. The decision in.. 1954 Shirur Mutt case held that.. Article 27 is not attracted. The same view was taken in Jagannath Ramanj Das Vs. State of Orissa. The decision in T.M.A. Pai foundation Vs. State of Karnataka does not really deal with Article 27 at any depth".
(''రాజ్యాంగం 27వ అధికరణాన్ని లోతుగా వ్యాఖ్యానించిన కోర్టు తీర్పులు ఎక్కువ లేవు. 1954 నాటి శిరూర్ మఠం కేసులో 27వ అధికరణం దానికి వర్తించదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. అదే సంవత్సరం ఒరిస్సా ప్రభుత్వంపై జగన్నాథ్ రామానుజ దాస్ కేసులోనూ అంతే. 2003 సంవత్సరం కర్నాటక ప్రభుత్వంపై టి.ఎం.ఎ.పాయి ఫౌండేషన్ దావాలో కూడా 27వ అధికరణాన్ని కోర్టు నిర్ణయంలో చర్చించలేదు''.)
అంటే - రాజ్యాంగానికి షష్టిపూర్తి అయ్యే సమయానికి కూడా 27వ అధికరణానికి సంబంధించి ఎన్నదగ్గ కోర్టు తీర్పులు సుప్రీంకోర్టు ధ్రువీకరించిన ప్రకారమే కేవలం మూడు!
చరిత్రాత్మకమైన శిరూర్ మఠంకేసు (AIR 1954 SC 282) లో 27వ అధికరణం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ ఇది:
What is forbidden by Article 27 is the specific appropriation of the proceeds of any tax in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination. The reason underlying this provision is obvious. Ours being a secular state and there being freedom of religion guaranteed by the constitutions, if is against the policy of the constitution, to pay out of public funds any money for the promotion or maintenance of any particular religion or religious denomination.
(ప్రత్యేకంగా ఒక మతాన్ని లేక మతశాఖను ప్రోత్సహించడానికి, లేక పోషించటానికి అయ్యే ఖర్చులను ఎలాంటి పన్ను యొక్క రాబడి నుంచి భరించటాన్ని 27వ అధికరణం నిషేధించింది. దీనికి కారణమేమిటో కనపడుతూనే ఉంది. మనది సెక్యులర్ రాజ్యం. మత స్వాతంత్య్రానికి రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చింది. కాబట్టి ప్రత్యేకంగా ఒక మతాన్నో, మతశాఖనో ప్రోత్సహించడానికి, లేక పోషించటానికి ప్రభుత్వ నిధులను ఉపయోగించటం రాజ్యాంగ తత్వానికి విరుద్ధం.)
అదృష్టవశాత్తూ మన పూర్వుల కాలంలో ఇలాంటి రాజ్యాంగ న్యాయం లేదు. కాబట్టి బతికిపోయాం. ప్రభుత్వ ధనాన్ని మత అవసరాలకు ఖర్చు పెట్టకూడదన్న నిషేధం వెనకటి రాజుల కాలంలో ఉండి ఉంటే మన ప్రసిద్ధ దేవాలయాలు, ఊరూరా చిన్నా పెద్దా గుళ్ళు, మఠాలు, గురుకులాలు, వేద పాఠశాలలు, వేదవిజ్ఞాన అధ్యయన సంస్థలు కొన్ని వందల సంవత్సరాల కిందటే ఇప్పటి అధోగతికి చేరేవి.
సరే! మనం ఉన్నది సెక్యులర్ రాజ్యంలో కాబట్టి సెక్యులర్‌గానే ఆలోచిద్దాం. ప్రత్యేకంగా ఒక మతాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ నిధులను ఖర్చుపెట్టటాన్ని 27వ అధికరణం నిషేధిస్తుందని పై తీర్పులో సుప్రీంకోర్టు సెలవిచ్చింది కదా? మరి ఏటేటా మహమ్మదీయులు మక్కాకు చేసే హజ్‌యాత్రకు సబ్సిడీ కింద ప్రభుత్వ నిధులను ఖర్చుపెట్టటానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అది ప్రత్యేకంగా ఒక మతాన్ని ప్రభుత్వ నిధులతో ప్రోత్సహించటం కాదా?
ఇంతకుముందు ప్రస్తావించిన సుప్రీంకోర్టు కేసులో ప్రఫుల్ గొరాడియా గారు సరిగ్గా ఇదే ప్రశ్న వేశాడు. దానికి 2011 జనవరి 28న జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ జ్ఞాన్‌సుధా మిశ్రాల డివిజన్ బెంచి ఏమని తేల్చిందో చూడండి:
"In our opinion Article 27 would be violated if a substantial part of the entire income tax collected in India, or a substantial part of any other tax collected in India, were to be utilized for promotion or maintenance of any particular religion or religious denomination. In other words, suppose 25 per cent of the entire income tax collected in India was utilized for promoting or maintaining any particular religion or religious denomination, that in our opinion, would be violative of Article 27
"..... it is nowhere mentioned in the Writ Petition as to what percentage of any particular tax has been utilized for the purpose of the Haj pilgrimage. ...If only a relatively small part of any tax collected is utilized for providing some conveniences or facilities or concessions to any religious denomination, that would not be violative of Article 27".
(https://indiankanoon.org/doc/709044/)
''ఇండియాలో వసూలయ్యే మొత్తం ఆదాయపు పన్నులో పెద్ద భాగాన్ని, లేక ఇంకే పన్ను వసూళ్ళ నుంచయినా పెద్ద భాగాన్ని ఒక మతం లేక మత శాఖ మీద ఖర్చుపెట్టినప్పుడు మాత్రమే 27వ అధికరణం ఉల్లంఘన అవుతుంది. ఉదాహరణకు ఆదాయపు పన్ను మొత్తం వసూళ్ళలో ఏ 25 శాతాన్నో ఒక మతం లేక మతశాఖ మీద వినియోగించే పక్షంలో 27వ అధికరణం అతిక్రమణ కిందికి వస్తుంది.
''... హజ్‌యాత్ర మీద ఏ పన్ను వసూళ్ళ నుంచి ఎంత శాతాన్ని వినియోగించారన్నది రిట్ పిటీషన్‌లో ఎక్కడా పేర్కొనలేదు. ఏ పన్ను వసూళ్ళ నుంచయినా ఒక చిన్న భాగాన్ని ఏదైనా మతంవారి సౌకర్యాలు లేక రాయితీల నిమిత్తం కేటాయించినట్లయితే 27వ అధికరణానికి భంగం కలగదు."
తీర్పు భేషుగ్గా ఉంది. ఎటొచ్చీ ఒకటే సందేహం. హజ్ సబ్సిడీ లాంటి అవసరాలకు సంబంధిత శాఖ బడ్జెటు నుంచి కదా ప్రభుత్వం ఖర్చు పెట్టేది? ఏ శాఖకు కేటాయించిన మొత్తం ఏఏ పన్ను వసూళ్ళ నుంచి ఎంతెంత శాతం అన్నది ఏ సూపర్ కంప్యూటర్ అయినా ఎలా లెక్క కట్టగలదు? ఏ పన్ను నుంచి వసూలు అయిన మొత్తంలో ఎంత శాతాన్ని హజ్ సబ్సిడీకి వినియోగించారు అని అడిగితే ప్రభుత్వమైనా జవాబు చెప్పగలదా? ప్రభుత్వానికే కష్టమైనప్పుడు కోర్టును ఆశ్రయించిన ఒక సామాన్య న్యాయార్థి నుంచి అలాంటి లెక్కలను ఆశించటం ఎంతవరకు సబబు? పన్ను వసూళ్లలో పర్సెంటేజి వివరాలు లేవన్న కారణంతో కేసు కొట్టేయ్యటం న్యాయమేనా?
ఇంకో సంగతి. ఏ పన్ను వసూళ్ళ నుంచి అయినా చిన్న భాగాన్ని ఒక మతం మీదో మత శాఖమీదో ఖర్చుపెట్టటంలో తప్పులేదు; దానివల్ల 27వ అధికరణానికి భంగం వాటిల్లదు అని సుప్రీంకోర్టు న్యాయపీఠం తేల్చి చెప్పింది కదా? దాని ప్రకారం రేపు అమర్‌నాథ్ యాత్రకో, చార్‌ధామ్ యాత్రకో వెళ్ళే హిందువులకు రైలు ఛార్జిల్లో సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చా? కోర్టువారు గీసిన 25 శాతం కటాఫ్‌కి తక్కువగా ఇన్‌కంటాక్సు లేక కస్టమ్స్ డ్యూటీ మొత్తం వసూళ్ళలో ఏ 20 శాతమో సదరు అవసరానికి ఖర్చు పెడతామంటే సుప్రీంకోర్టు సమర్థిస్తుందా?
''హిందూమతం పెద్దపులి. మైనారిటీ మతాలు చిన్న మేకలు. ఆ పులిబారి నుంచి ఈ మేకలను రక్షించటానికే మేము భూమి మీదికి వచ్చాం'' అన్నది నడమంత్రపు రాజకీయ జీవులు అల్లిన అబద్ధం. నిజానికి మైనారిటీ మతాలకు హిందూదేశం ఇచ్చేంత స్వేచ్ఛ, రక్షణ ప్రపంచంలో మరెక్కడా దొరకవన్నది చరిత్ర చాటే యదార్థం. పరమత సహనం హిందువుల రక్తంలోనే ఉంది. ఆ హిందువులు మెజారిటీగా ఉన్నంతవరకే మైనారిటీలు క్షేమంగా ఉండేది. ఈ సంగతి మిగతా మతాలవారికీ తెలుసు. క్షుద్ర రాజకీయ శక్తుల అండ చూసుకుని రెచ్చిపోయే మతపిచ్చిగాళ్ళ నోళ్ళు పెద్దవి అయి ఉండొచ్చు. కాని అన్య మతాలకు చెందిన ప్రజల సంఖ్యతో పోల్చినప్పుడు కరకు మతవాదుల సంఖ్య తక్కువే. కాబట్టే ప్రజా జీవితానికి సంబంధించినంతవరకూ మన దేశంలో మతపరమైన ఉద్రిక్తత ఎప్పుడోగాని తలెత్తదు. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు కలిసే ప్రశాంతంగా సహజీవనం చేయగలుగుతున్నారు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ సామాన్య పౌరులు మతాలపోరు లేకుండా జీవిస్తున్నారు.
కుటిల రాజకీయ నాయకులు, జాతి వ్యతిరేక విచ్ఛిన్నశక్తులు, మిడిమేలపు మీడియా, వంకర బుద్ధి మేధావులు అగ్గిపుల్లలు గీసి మతాల మధ్య మంట పెట్టటానికి ఎన్ని కుట్రలు చేస్తున్నా సాధారణ మహమ్మదీయులకు, సాధారణ క్రైస్తవులకు హిందువుల పట్ల ద్వేషం, శత్రుత్వ భావం లేవు. తమ తమ మతాలకు వలెనే హిందూమతానికీ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రోత్సాహకాలు అందనే కూడదని వారు పంతం పడతారని వాదించటం సరికాదు.
మాట వరసకు- దేశంలో ధూపదీప నైవేద్యాలకే తెరవులేని లక్షలాది హిందూ దేవాలయాల ఉద్ధరణకో, మరొక దైవ కార్యానికో నిధుల నిమిత్తం జాతీయ ప్రభుత్వం ఒక కొత్త పన్ను లేక లెవీని ప్రతిపాదించిందనుకుందాం. ఎవరిమీదా నిర్బంధం లేదు; ఇష్టమైనవారే దానిని చెల్లించవచ్చు అని అందులో ఆప్షను కూడా ఇస్తారనుకుందాం. రాజ్యాంగం 27వ అధికరణం దానిని అనుమతిస్తుందా? హజ్ సబ్సిడీ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం మొత్తం పన్ను వసూళ్ళలో కొంత భాగాన్ని మాత్రమే హిందూమత సంస్థల ప్రోత్సాహానికో, పోషణకో వెచ్చిస్తామని చెబితే కోర్టులు ఒప్పుకుంటాయా?
ఆ సంగతి న్యాయప్రవీణులు చెప్పాలి. న్యాయస్థానాలు నిగ్గు తేల్చాలి. నాకైతే అనుమానమే. ''మతస్వాతంత్య్రానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణాలు అన్ని మతాలకూ సమానంగా వర్తించే మాట నిజమే. కాని అవి ప్రధానంగా మైనారిటీల రక్షణకే ఉద్దేశించినట్టివి. ఆ వాస్తవాన్ని గుర్తుపెట్టుకునే కోర్టులు న్యాయనిర్ణయం చేయాలి'' అని ఉన్నత న్యాయవ్యవస్థ కుండబద్ధలు కొట్టిన వైనాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా?
దేశంలో అత్యున్నత న్యాయపీఠాలు అధిష్ఠించిన న్యాయమూర్తుల విజ్ఞతను విమర్శించటం తగదు. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని చులకన చేయటం మన వొంటికి మంచిది కాదు. కాబట్టి విమర్శలు, వ్యాఖ్యానాలు వద్దు. హజ్ సబ్సిడీ కేసులో 27వ అధికరణం గురించి ఇచ్చిన వివరణకు ముక్తాయింపుగా జగమెరిగిన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ, జస్టిస్ జ్ఞాన్‌సుధా మిశ్రాలు ఈ దేశం గురించి, ఇక్కడి ప్రజలను గురించి, వారి సంస్కృతి గురించి ప్రకటించిన అమూల్యాభిప్రాయాన్ని మాత్రం ఆలకించండి.
India is broadly a country of immigrants like North America. 92% of the population of India consists of descendents of immigrants.. It is the greatness of the funding fathers that under the leadership of Pandit Jawaharlal Nehru they decided to declare India a secular country instead of a Hindu country.. because 92 per cent of the people are descendants of immigrants, the only policy which can work and provide for stability and progress is secularism and giving equal respect to all communities, sects etc.
(ఉత్తర అమెరికాలాగే ఇండియా స్థూలంగా వలసదారుల దేశం. భారత జనాభాలో నూటికి 92 మంది ఇక్కడికి వలస వచ్చినవారి సంతతే! సంస్థాపక పితరుల గొప్పతనమేమిటంటే జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వాన వారు ఇండియాను హిందూదేశంగా కాకుండా సెక్యులర్ దేశంగా ప్రకటించారు. ప్రజల్లో 92 శాతం వలసదారుల సంతతి అయినందున అన్ని మతవర్గాలకూ, అన్ని శాఖలకూ సమాన గౌరవం ఇవ్వటం ద్వారానే ప్రగతి, సుస్థిరత సాధ్యం!)
అన్ని మతాలకూ, అన్ని మతశాఖలకూ సమాన గౌరవం ఇవ్వాలనటం వరకూ పేచీలేదు. ఇతర మతాలను అణగదొక్కి తమకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఇవ్వాలని హిందువులెవరూ కలనైనా కోరరు. కాని 'అమెరికాలాగే భారతదేశం కూడా వలసదారుల నానాజాతి సమితి' కాబట్టి సెక్యులరిజం ఒక్కటే దానికి దిక్కు' అన్న అవగాహనే తప్పు. ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులు భారతదేశాన్ని దౌర్జన్యంగా ఆక్రమించారని మాయదారి మాక్స్‌ముల్లర్లు పుట్టించిన తప్పుడు సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ఏనాడో తుంగలో తొక్కినా ఇంకా వలసల కళ్ళతోనే ఈ దేశాన్ని చూసే అజ్ఞానులను ఏమనాలి? ఇటువంటి కుహనా మేధావులు న్యాయనిర్ణేతలైతే భారతీయ మతానికీ, దాని విలక్షణ సంస్కృతికీ న్యాయం ఎలా చేకూరుతుంది?
No comments:
Post a Comment