ఉన్నమాట
ఎం.వి.ఆర్.శాస్త్రి
.................
'Our is a Christian state and new Governor is an RSS activist who
is actively involved in various Hindu organisations. Christians are disturbed
as a hard-core Hindutva fundamentalist has been appointed as the Governor of a
state when 87 per count of the people were Christians. He is anti secular and
so he should be driven out of Mizoram'.
(మాది క్రిస్టియన్ రాష్ట్రం. కొత్త గవర్నర్ ఆర్.ఎస్.ఎస్. మనిషి. అనేక హిందూ సంస్థలలో చురుకుగా ఇన్వాల్వ్ అయినవాడు. 87 శాతం ప్రజలు క్రైస్తవులైన రాష్ట్రానికి కరుడుగట్టిన హిందుత్వ ఫండమెంటలిస్టును గవర్నర్గా నియమించినందుకు క్రైస్తవులు కలత చెందారు. అతడు 'యాంటీ సెక్యులర్' కాబట్టి మిజోరం నుంచి గెంటెయ్యాలి).
PRISM అనే సంక్షిప్త నామం ల మిజోరం లోని రాజకీయపార్టీ, గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ (GCIC) అనే రాడికల్ క్రైస్తవ సంస్థ కొత్తగా నియమితుడైన గవర్నర్ కుమ్మణం రాజశేఖరన్ ఉద్వాసనకు పట్టుబడుతూ చిమ్మిన నిప్పులు ఇవి.
'సెక్యులరిజం' అనే ఉదాత్త భావనకు కాలక్రమాన ఇండియాలో పట్టిన దుర్గతికి ఇది కడుపులో దేవే కొత్త రుజువు.
మిజోరం అనేది ఈశాన్య భారతంలో ఓ చిన్న రాష్ట్రం. దాని జనాభా 11 లక్షలు. అంటే విజయవాడ కంటే తక్కువ. హైదరాబాద్ జనాభాలో నిండా ఎనిమిదో వంతు లేదు. ఆ సరిహద్దు రాష్ట్రానికి కొత్త గవర్నర్గా కుమ్మణం రాజశేఖరన్ అనే పెద్దమనిషిని భారత ప్రభుత్వం నియమించింది. ఏ రాష్ట్రానికి ఎవరిని గవర్నర్గా నియమించాలో నిర్ణయించేది కేంద్రం. హోంశాఖ సిఫారసుపై రాష్ట్రపతి చేసే నియామకానికి తిరుగులేదు. దానిని ఎవరూ ఏ కోర్టులోనూ సవాలు చేయడానికి వీలే లేదు.
అయినా మిజోరంలోని మిజోరంలోని 13 ప్రధాన చర్చిల కూటమి , క్రైస్తవ వర్గాలు, పార్టీలు కొత్త గవర్నర్ నియమకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయన ప్రమాణ స్వీకారం రోజున రాజధాని ఐజాల్లో అవి నల్లజండాలు ప్రదర్శించాయి. ప్రపంచ క్రైస్తవ సంస్థలను, ఎన్.జి.ఒ.లను, మైనారిటీ పక్షపాతులైన హిందూ వ్యతిరేక సంఘాలను ముగ్గులోకి లాగి గవర్నర్కు వ్యతిరేకంగా పెద్ద కదలిక తేవటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
రాజశేఖరన్ గవర్నర్గా ఎందుకు పనికిరాడట ?
'ఆయన ఆర్.ఎస్.ఎస్.వాడు. అనేక హిందూ సంస్థలతో సంబంధం ఉన్నవాడు. కేరళ నుంచి క్రిస్టియన్ మిషనరీలను వెళ్లగొట్టటానికి ప్రయత్నించిన వాడు. కాబట్టి గవర్నర్గా ఆయన నియామకం సెక్యులరిజానికి వ్యతిరేకం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయనను బిజెపి ఎలాగూ వాడుకుంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ప్రమాదం'.
ఇదీ క్రైస్తవ వర్గాల వాదన. కుమ్మణం రాజశేఖరన్ దీర్ఘకాలం ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్గా పనిచేసినవాడే. అయితే ఏమిటిట ? ఆర్.ఎస్.ఎస్. అనేది జాతి వ్యతిరేక విద్రోహక సంస్థా ? 1962 చైనా యుద్ధ సమయంలో ఆ జాతీయ మహాసంస్థ చేసిన పౌరసేవలకు గుర్తింపుగా 1963 రిపబ్లిక్ పరేడ్లో పాల్గొనేందుకు స్వయంగా సెక్యులరిజం పితామహుడు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వమే ఆర్ఎస్ఎస్ను ఆహ్వానించలేదా ? మొన్నటి దాకా భారత రాష్ట్రపతిగా పనిచేసిన సెక్యులరిస్టు ప్రణబ్ ముఖర్జీయే నాగపూర్లోని ఆర్.ఎస్.ఎస్. శిక్షణ శిబిరంలో పాల్గొనలేదా?
అలాగే రాజశేఖరన్కి అనేక హిందూ సంస్థలతో సన్నిహిత సంబంధం ఉన్న మాట నిజం. అవేమైనా చట్ట వ్యతిరేక నిషిద్ధ సంస్థలా ? హిందూ సంస్థలతో సంబంధం ఉన్నవాడిని క్రైస్తవ రాష్ట్రానికి గవర్నర్గా పంపకూడదని రాజ్యాంగం చెప్పిందా ?
కేరళలో బిజెపికి అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని మిజోరం గవర్నర్గా పంపినంత మాత్రాన మిజోరం ఎన్నికల్లో అతడిని బిజెపి ఎలా వాడుకొనగలదు ? వాడుకొనే తీరుతుందని క్రైస్తవులు ఏ ఆధారంతో ఆరోపిస్తున్నారు ? ఇంతకు ముందు కాంగ్రెసు హయంలో ఒక రాష్ట్రంలో కాంగ్రెసు అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా పని చేసినవారిని వేరొక రాష్ట్రానికి పంపలేదా ? దానికి లేని అభ్యంతరం బిజెపి వారి విషయంలో ఎందుకుండాలి ? ఇప్పటి మోది పాలనలోనే ఆర్.ఎస్.ఎస్.తో సంబంధం ఉన్నవారిని, బిజెపి ముఖ్యులను గవర్నర్లుగా ఎన్ని రాష్ట్రాలకు పంపలేదు ? వారిపై ఏ రాష్ట్రంలోనైనా నల్ల జండాలు, గోబ్యాక్ నినాదాలు ఎరుగుదుమా ? ఆర్.ఎస్.ఎస్. గవర్నర్లపై ఏ రాష్ట్రంలో లేని ఆక్షేపణ నిరాడంబరుడు, నీతిమంతుడు అని స్వరాష్ట్రంలో అన్ని పార్టీల గౌరవం చూరగొన్న రాజశేఖరన్ గురించి మిజోరం క్రైస్తవ వర్గాలకు ఎందుకుండాలి ? ఒక వేళ వారు భయపడుతున్నట్టు గవర్నర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడితే అడ్డుకోవటానికి చట్టాలు, కోర్టులు లేవా ?
ఏదో ఒక పార్టీ, లేక క్రైస్తవ కూటమి వద్దన్నంత మాత్రాన ఏమీ కాదు. గవర్నర్కు వ్యతిరేకంగా నల్లజండాలు, వివాదాలు, మీడియాలో ప్రకటనలకు ఎవరు విలువ ఇవ్వాల్సిన పనిలేదు. ఇలాంటి కుప్పిగంతులను సీరియస్గా తీసుకోనక్కర్లేదు. కాని మిజోరం న్యూసెన్సులో గమనించాల్సింది ఏమిటంటే - జనాభాలో తమది 87 శాతం అనగానే కొన్ని క్రైస్తవ వర్గాలకు కన్నుమిన్ను కానని మత దురహంకారం ఆవహించటం ! తమది క్రైస్తవ రాష్ట్రం కాబట్టి హిందువును, హిందూ సంస్థలతో సంబంధం ఉన్నవానిని తమకు గవర్నర్గా పంపనే కూడదని వారి తాహతుకు మించి హుంకరించటం !
ఇప్పటికీ హిందువుల జనాభా 80 శాతం పైగా ఉన్న రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. అంతమాత్రాన అవి హిందూ రాష్ట్రాలు అయిపోతాయా ? హిందువు కాని వాడిని, మతసంస్థలతో సంబంధం ఉన్న అన్యమతస్తుడిని తమకు గవర్నర్గా పంకూడదని హిందువులు ఎప్పుడైనా అన్నారా ? అంటారా ?
అసలు ప్రపంచంలో 'సెక్యులరిజం' అనే భావన పుట్టిందే రాజకీయ, రాజ్యాంగ వ్యవహారాల్లో మత ప్రమేయానికి నిరసనగా ! అందునా యూరప్ దేశాల రాజకీయ విషయాల్లో క్రైస్తవ చర్చి ఆధిపత్యానికి, నిరంతర జోక్యానికి వ్యతిరేకంగా ! విడ్డూరమేమిటంటే ఇప్పుడు ఇండియాలో ఒక రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేసిన రాజకీయ నియామకాన్ని మతపరమైన కారణాలతో క్రిస్టియన్ చర్చి నిరసిస్తూ దానికి 'సెక్యులరిజం' పేరును అడ్డంగా వాడేసుకుంటున్నది !
ఎక్కడో ఒక సరిహద్దు రాష్ట్రంలో ఎవరో పేలిన మాటలకు మామూలుగా అయితే విలువ ఇవ్వనవసరం లేదు. కాని ఈ దేశంలో ఉంటూ, ఇక్కడి రాజ్యాంగం రక్షణ పొందుతూ, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ మూలంగానే మనుగడ సాగించ గలుగుతున్న మైనారిటీ వర్గాలు ఆ రాజ్యాంగ కట్టుబాట్లనే ధిక్కరించి, ఆ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించడం కొంతకాలంగా ఒక రివాజు అయిపోయింది.
భారతదేశంలోని రోమన్ కాథలిక్ క్రైస్తవులపై గట్టి పట్టు ఉన్న ఢిల్లీ ఆర్చిడయసీస్కి ఆర్చిబిషప్ అయిన అనిల్
కవుటో అనే మహానుభావుడు ఈ మధ్య దేశంలోని కేథలిక్కుందరికీ ఓ గొప్ప ఉత్తరం రాశాడు. ఏమనంటే, ఇప్పటినుంచి మొదలు పెట్టి 2019 సాధారణ ఎన్నికల దాకా ప్రతి శుక్రవారం క్రైస్తవులందరూ ఒక పూట ఉపవాసంఉండి.రాజ్యాంగ విలువలకు, తాత్విక పునరుద్ధరణకు దోహదించే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం గంటసేపు ప్రార్థన చేయాలని !
ఆర్చిబిషప్ పరిధిలోని చర్చిలన్నిటిలో చదివి వినిపించిన ఈ లేఖారాజంలోని అంతరార్థం తలకెక్కని మట్టిబుర్రల కోసం Vatican News వెబ్సైట్ ఈ కింది టిప్పణి జతచేసింది:
"హిందూ అనుకూల బిజెపి ప్రభుత్వ ఐదేళ్ల కాలం 2019 మేలో పూర్తవుతుంది. మోదీ ప్రభుత్వం మైనారిటీ మతాల ప్రయోజనాలను వమ్ముచేసి హిందూరాజ్యం స్థాపించగోరే హిందూ గ్రూపుల కొమ్ము కాస్తున్నట్టు క్రైస్తవ నాయకుల అభిప్రాయం. మోదీ వచ్చాక క్రైస్తవులపై దాడులు ఎక్కువయ్యాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక సూత్రాలకు ముప్పు వచ్చింది."
అంటే - హిందూ అనుకూల మోదీ ప్రభుత్వం పోయి క్రైస్తవులకు అనుకూలమైన రాజ్యం మళ్లీ రావాలని కోరుతూ ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్రచురణ ప్రార్థనా పూర్వక సంఘటనా కార్యక్రమం మొదలు పెట్టాలని పెద్ద పాదరీ ఉద్బోధ. వాటికన్ చేత నియమించబడిన విదేశీమతం అధికారి తన మత వ్యవహారాలేవో తాను చూసుకుంటూ హద్దుల్లో ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఈ దేశపు రాజకీయాల్లో తలదూర్చి, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయటానికి నడుంకట్టి, రాబోయే ఎన్నికల్లో గెలిచి రాజ్యమేలాల్సిన ప్రభుత్వం లక్షణాల గురించి చర్చి ఉన్నతాధికారి మాట్లాడటం దుర్మార్గం.
ఇటీవలి గుజరాత్ ఎన్నికల్లో 'జాతీయ శక్తుల' బారి నుంచి దేశాన్ని రక్షించాలంటూ గాంధినగర్ ఆర్చిబిషప్ ఇలాగే ఆ రాష్ట్ర క్రైస్తవులకు ఉద్బోధించాడు. త్రిశూలం కావాలో, శిలువ కావాలో తేల్చుకోవాలని నాగాలాండ్ బాప్టిస్టు చర్చి కౌన్సిల్ ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో క్రైస్తవులను హెచ్చరించింది. గోవా ఎన్నికల్లో బిజెపికి అధికారం దక్కనివ్వరాదని అక్కడి చర్చి పాపం నానా ప్రయాస పడింది. గోవా ఆర్చ్ బిషప్ కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడుకోవటానికి క్రైస్తవులు పూనుకోవాలని మొన్న బహిరంగ విజ్ఞప్తి చేసాడు.
కేవలం ఎన్నికల సమయంలోనే కాదు. మామూలు రోజుల్లోనూ క్రైస్తవ మతచార్యులు 'జాతీయ శక్తులకు' వ్యతిరేకంగా మత రాజకీయాలు చేస్తున్నారనడానికి చాలా దృష్టాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం మోదీ సర్కారును ఎన్నికల్లో ఓడగొట్టేందుకు ప్రార్థనల అస్త్రం ప్రయోగించిన డిల్లీ ఆర్బిబిషప్గారు ఢిల్లీలో కుర్రాళ్ల ఆటలో పొరపాటున ఒక చర్చి అద్దం పగిలినా, తాగుబోతు రాయి రువ్వినా, చిల్లర దొంగతనం జరిగినా, అవన్నీ క్రైస్తవ చర్చిమీద హిందూ మతోన్మాదుల భయానక దాడులేనంటూ పంచాయతీ పెట్టటంలో దిట్ట. ఈ దుష్ప్రచారం ఎంత అమోఘంగా సాగిందంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా సైతం భారత పర్యటనలో 'చర్చిపై దాడుల'కు బోలెడు ఆందోళన వెలిబుచ్చాడు.
క్రైస్తవ మతం ఇండియాలో ప్రవేశించింది, నిరంతరంగా పాటుపడుతున్నది ఇక్కడి ప్రధానమతమైన హైందవంతో సహజీవనం చెయ్యటానికి కాదు. 'ఏకైక సత్యమతం' అయిన క్రైస్తవంలోకి మొత్తం భారతదేశాన్ని ఏమి చేసి అయినా, ఏ దారిలో అయినా సరే మార్చివేయాలని! నూరు శాతం క్రైస్తవీకరణ లక్ష్యం నెరవేరాలంటే నూటికి 80 మందికి ప్రాతినిధ్యం వహించే హిందూమతం నూటికి నూరుశాతం అంతరించిపోవాలి. మెజారిటీ ప్రజలు ఆచరించే మతాన్ని మట్టు పెట్టేందుకు కంకణం కట్టుకున్న వారు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ విలువల గురించే మాట్లాడటమే నగుబాటు.
చర్చి పలికే పెద్ద కబుర్లను, హిందూ మత వర్గాలమీద అది వేసే అభాండాలను సరిగా పోల్చుకుని, వాస్తవమేమిటో అమాయక జనానికి తెలియజెప్ప వలసింది మీడియా, మేధావి వర్గాలు. అవి ఆ పని చేయకపోగా హిందూ ద్వేషాన్ని నరనరానా ఎక్కించుకుని, హిందూ మతాన్ని కుళ్లబొడవటమే, హిందూ ధర్మాన్ని గౌరవించే వారిని అప్రతిష్ఠ పాలు చేయటమే పనిగా పెట్టుకుని క్రైస్తవ కూటముల అసత్య సువార్తలకు పక్క వాయిద్యాలుగా మారటం దారుణం.
ఒక క్రైస్తవుడినో, ముస్లిమునో రాష్ట్ర గవర్నర్గా నియమించడాన్ని ఆ రాష్ట్రంలోని హిందువులు బలమైన కారణాలతో వ్యతిరేకించినా, హిందూ నాజీలు, ఫాసిస్టులు అంటూ 'వామపక్ష', 'ప్రగతిశీల', లిబరల్ మేధావులు, మీడియా జ్ఞానులు రంకెలేసి, ప్రపంచమంతటా యాగీ చేసేవారు . కేరళలోనో, జమ్ము కాశ్మీర్లోనో ప్రజాస్వామ్య శక్తులను గెలిపించండంటూ ఏ శంకరాచార్యుడో హిందువులకు పిలుపిస్తే రాజకీయాల్లో మత జోక్యం మహానేరం అంటూ, క్రైస్తవ ముస్లిం మత వర్గాలు, మిడిమేలపు మీడియా గోలగోల చేసేవి. అదే ఇతర మతాల దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఎవరిమీద ఎలాంటి కత్తులు దూసినా ఎవరికీ నోరు పెగలదు. కళ్లు, చెవులు పనిచేయవు.
దీన్నే ఇండియాలో సెక్యులరిజం అందురు.
No comments:
Post a Comment