Wednesday, 29 November 2023

గురువంటే ఇలా ఉండాలి

 ఎం.వి.ఆర్.శాస్త్రి

ముముక్షు జన మహాపీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ ముత్తీవి సీతారామ్ గురుదేవుల నిర్యాణం ధార్మికలోకానికి తీరని లోటు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం  పెదముత్తేవి లోని వారి సుప్రసిద్ధ శ్రీకృష్ణాశ్రమంలో నాలుగు రోజుల కింద ఇష్ట దైవాలకు నిత్య పూజ చేస్తూ తీవ్ర అస్వస్థతకు లోనైన గురువుగారు నిన్న ( నవంబర్28) రాత్రి 9-45 కు  శ్రీగురుపాదాలలో ఐక్యమయ్యారు. 



పరమపూజ్య శ్రీశ్రీశ్రీ సీతారామ యతీంద్రుల  ఆధ్యాత్మిక దివ్య వారసత్వం  పితృపాదులు  శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులు 1992 డిసెంబర్ లో ఐహిక  జీవనాన్ని చాలించిన తరువాత    సీతారామ్ గురుదేవులకు సంక్రమించింది.  ఆయన సంసారంలో ఉండీ సంసారం అంటని మానసిక‌ సన్యాసి . అసంఖ్యాక శిష్యుల యోగక్షేమాల కోసం‌ అహర్నిశలూ పరిశ్రమిస్తూ ప్రతి ఒక్కరికీ పరమాప్తుడిగా , కుటుంబపెద్దగా సహానుభూతి చెందుతూనే సర్వ సంగ పరిత్యాగి.  ఆధ్యాత్మికంగా ఉన్నతుడు. ఎవరి గురించీ పరుష పదం పలుకక , ఎవరి నిందనూ సహించక ,  అందరూ మహానుభావులేనని చాటిన సత్పురుషుడు. పలుకు ఎంత మృదువో ఆయనలో మండే  ధర్మాగ్రహం అంత‌ ప్రచండం. ఆయన ధర్మ‌ దీక్ష వజ్ర సదృశం. వారి ఆశ్రమం ఒక నంద గోకులం. కబేళాలకు తరలే అభాగ్య గోవులకు శ్రీకృష్ణాశ్రమమేఅదృష్టరేఖ.  గోశాలలో ఐదొందలకు పైగా గోవులున్నా పాలు, నెయ్యి మీద వ్యాపారదృష్టి వారికి ఉండదు.   

ఆధ్యాత్మికం కూడా లాభసాటి‌ వ్యాపారంగా అక్కడక్కడ రూపాంతరం చెందుతున్న ఈ రోజుల్లో సీతారామ్ గురుదేవుల వంటి భక్త శిఖామణి, ప్రేమమూర్తి, త్యాగి,విరాగి, ఆపద్బాంధవుడు, తపశ్శక్తిసంపన్నుడు కనపడటమే‌ అపురూపం. 

దైనందిన ఖర్చులకు ఎప్పుడూ తడుముకోవలసిన పరిస్థితుల్లోనే రోజూ వందల,వేలమందికి కులమతవర్గ వివక్ష లేకుండా ఆప్యాయంగా కడుపార భోజనం పెడుతూ ఆఖరు అతిథి చేయికడుక్కున్న తరువాత గానీ ఆహారం స్వికరించని నిస్వార్థ నిరతాన్నదాత సీతారామ్ గురుదేవులు. తమ‌ లక్ష్మీపతి దేవాలయంలో‌ దేవతా మూర్తుల చోరీ జరిగితే అవి తిరిగి లభించేంత వరకూ అన్నం ముట్టేందుకు ఆయన  ఇచ్చగించలేదు. 2004 లో జయేంద్ర సరస్వతి మహాస్వామిని దుర్మార్గంగా అరెస్టు చేసి‌ నప్పుడు ఆయన చెరసాలలో ఉన్నంతకాలం ఆయన క్షేమం గురించి ఎంతో  తల్లడిల్లేవారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో  వైభవంగా జరిపించే‌ గోదా కల్యాణంలో వధువును కాపురానికి సాగనంపే ఘట్టంలో సొంత కుమార్తే  దూరంగా వెళ్లిపోతున్నట్టు భక్తి పారవశ్య భావోద్వేగంతో విలపించే పిచ్చితండ్రి సీతారామ్ గారు.‌



నా "కాశ్మీర్ కథ" పుస్తకం చదివి తెగ మెచ్ఛుకుని, నా సన్మిత్రుడు , తనకు సన్నిహితుడు అయిన సీనియర్ అడ్వొకేటు కె. వెంకట‌సుబ్బారావు గారి ద్వారా కబురుపెట్టి నన్ను‌ రెండు దశాబ్దాలకింద గురువుగారు తనదగ్గరికి పిలిపించుకున్నారు. అది మొదలు ఆయనకు మొదట నేను , తరవాత నా కుటుంబం మొత్తం అతుక్కుపోయాం. మా ముగ్గురమ్మాయిల పెళ్లిళ్ళు సహా‌ మా ఇంట్లో జరిగిన ప్రతి శుభకార్యానికీ ఆయన తప్పక వచ్చి ఆశీర్వదించేవారు. 2016లో నాకు ప్రాణాపాయం వచ్చినట్టు తెలిసిన తక్షణం బయలుదేరి హైదరాబాద్ కు వచ్చి  నిమ్స్ లోనూ ఆనక అపోలో హాస్పిటల్ లో ఆపరేషన్ సమయంలోనూ దగ్గరుండి ప్రేయర్ చేసి ఆయన చూపిన వాత్సల్యం మరపురానిది.    స్వయంగా తానే వేలాది శిష్యగణానికి గురుదేవులై నిత్య పూజలందుకునే మహిమాన్వితుడైనా సరే.. 2006 చివరిలో  మా పెద్దమ్మాయి పెళ్ళిలో మా గురువు సద్గురు శివానందమూర్తి గారికి మేము చేసిన పాదపూజ కార్యక్రమంలో అందరితో బాటు కూచుని పాల్గొన్న ఆయన వినమ్రతను ఎప్పటికీ మరవలేను. మళ్లీ అదే సద్గురు శివానందమూర్తి గారు తీవ్రంగా అస్వస్థులై తనకు తాను నయం చేసుకోవటానికి ఖండితఃగా నిరాకరించిన సమయాన నేనా విషయం చెప్పగానే సీతారామ్ గురుదేవులు ఉన్నపళాన రాత్రికిరాత్రి భీమునిపట్నం వెళ్లి చాలాసేపు ఉన్నారు. ఆ తరవాత మా గురువుగారికి‌ ఒకింత స్వస్థత చేకూరిందని విన్నాను. పాదపూజ చేసుకునేందుకు వీలుగా - మా ఇంటికి దయచేయదలిచినప్పుడు కాస్త ముందస్తు నోటీసు ఇవ్వమని ఎన్ని మార్లు చెప్పినా ఈ గురువుగారు వినరు. చెప్పా పెట్టకుండా  సపరివారంగా తలుపు తోసుకువచ్చి కాఫీ పెట్టమని అడగటమే ఆయనకు ఇష్టం. ఎన్ని సార్లు ఆశ్రమానికి వెళ్లినా మా ఇంటిల్లి పాదికీ బట్టలు పెట్టకుండా ఆయన, అన్నపూర్ణాదేవిని పోలిన కమల తల్లి ఏనాడూ పంపించలేదు. 

2021 మొదట్లో తిరుపతి దగ్గరలో తమిళనాడు సరిహద్ధు గ్రామం పోన్ పడిలో కంచి , హంపి , పుష్పగిరి వంటి ఎన్నో  ప్రాచీన  పీఠాల అధిపతులు కొలువుదీరిన ధార్మిక సదస్సులో సీతారామ్ గురుదేవులు ప్రగాఢ ధర్మాగ్రహంతో అధార్మిక , రాక్షస శక్తులపై  చేసిన సింహగర్జన ఇంకా నాచెవులలో మారుమోగుతూనే ఉంది. హైందవ జాగృతి, సంగఠన అత్యావశ్యకమైన నేటి కీలక తరుణంలో 66 ఏళ్ల వయసులోనే  ఈ సద్గురువు పరమపదించటం ధార్మిక లోకానికి, ఆయనను కుటుంబ పెద్దగా , రక్షకుడిగా  తలచి కొలిచే శిష్యకోటికి  తీరని వెలితి.

Wednesday, 25 January 2023

బోసు బాబుకు ‘భారత రత్న’

ఎం.వి.ఆర్. శాస్త్రి

     తాజా బ్లాగులో నేను బ్లాగింది చూసి ఓ మిత్రుడికి పెద్ద డౌటొచ్చింది. ‘అదేమిటండీ బోసు బొమ్మతో  కరెన్సీ నోట్ల గురించీ , బూడిద పేటిక గురించీ అంతంత రాసి అసలైన భారత రత్న సంగతి మరచిపోయారు? ఈ దేశంలో కెల్లా గొప్ప సివిలియన్ పురస్కారమనబడే ఆ మేకతోలును ఇప్పుడైనా మన నేతాజీకి కప్పవద్దా’- అని అతగాడు తెగ ఫీలై పోయాడు. 

      సారీ! నో చాన్స్! సుభాస్ బోసుకు భారతరత్న ఇవ్వటానికి  ఎంతమాత్రం వీలు లేదు. కారణాలు మూడు :

1. దాన్ని తీసుకునేందుకు అతడికి అర్హత లేదు.

2. ఇచ్చేందుకు మనకు యోగ్యత లేదు. 

3. ఈ నాటకం మనం ముఫ్ఫై ఏళ్ల కిందే ఆడేశాం.

‘భారత రత్న’ అనిపించుకోవాలంటే ఎం.జి. రామచంద్రన్ లా రంగు పూసుకుని వేషాలేసే సూపర్ డూపర్ 

 సినిమా యాక్టరైనా కావాలి. సచిన్ టెండుల్కర్ లా డబ్బు దండుకుని కిరికెట్టు ఆడి కోట్లు గడించే లిటిల్ మాస్టరయినా అయ్యుండాలి. లేదా మదర్ తెరెసా లాగా సేవ పేరు చెప్పి డబ్బులు గుంజి కన్వర్షన్లకు వెచ్చించే మిషనరీ టాలెంటు,  రోగాలతో అలమటించే వాళ్లకు మందూ మాకూ ఇవ్వకుండా చంపేసే జాలి గుండె లాంటి లక్షణాలు ఉండాలి. ఆ బాపతు క్వాలిఫికేషన్లు ఏవీ మిస్టర్ సుభాస్ బోసు కు లేవు. 

      అవార్డు పెట్టి ముప్పావు శతాబ్దం గడిచాక , ఇప్పటికే నాలుగు డజన్ల మందికి ఇచ్చేశాక ఒక సుభాస్ చంద్ర బోస్ అనేవాడి పేరు కూడా దానికి కన్సిడర్ చెయ్యవచ్చు. తప్పు లేదు. కాని కొంచెం బోలెడు బావుండదు. ‘భారత రత్న’ అని పేరు పెట్టిన అవార్డును దక్షిణాఫ్రికా లో పుట్టిన నెల్సన్ మండేలాకూ , పాకిస్తాన్ లో మెట్టిన బాద్ షా ఖానుకూ ఉదారంగా పంచిపెట్టిన పుణ్యాత్ములం కాబట్టి మనకు ఏదీ ఎబ్బెట్టు కాదు. స్వతంత్రం అనబడేది వచ్ఛి 75 ఏళ్ళు గిర్రున తిరిగిన తరవాత ఆ అర్ధరాత్రి అమావాశ్య సొతంత్రానికి అసలు కారకుడైన ... మన కోసం తాను చచ్చి మనకు స్వాతంత్ర్యం ఇప్పించిన నేతాజీ అనే బతకనేర్వని వాడు మనకు గుర్తుకు రావటం ఏ జన్మలోనో అతడు చేసుకున్న పుణ్యమే. కాని చిన్న చిక్కొకటి ఉన్నది. నేతాజీ అనేవాడు  మనకోసం జీవించి , దేశం కోసం తపించి , మామూలు  మట్టి మనుషులతో మహా పోరాటాలు చేయించి , సర్వస్వం అర్పించి , ప్రాణాలు ధారపోసి , ఒంటి చేతితో మనకు స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన వెర్రి మారాజు ! అతగాడు విమానప్రమాదంలో 78 ఏళ్ల కింద మరణించిన సంగతే ఈ నాటికీ గుర్తించకుండా ... అతడి ఆస్థికలనూ , చితాభస్మాన్ని పట్టుకొచ్చి గంగలో కలిపి సముచిత స్మారకచిహ్నం కట్టాలన్న ఇంగిత జ్ఞానమైనా లేకుండా పిచ్చి వాగుళ్లతో , వెర్రి వాదాలతో పోచుకోలు కాలక్షేపాలు చేస్తున్న మనకు సూటిగా సింపుల్ గా చెప్పాలంటే నేతాజీ ని తలచే , నేతాజీ పేరు ఉచ్చరించే అర్హత లేదు. 

      ఇక భా.ర. చెప్పుతో మనం నేతాజీని కొట్టిన ట్రాజీ కామెడీ ప్రహసనం కథాక్రమంబెట్టిదనిన ...

      బోసు బాబుకు మరణానంతర పురస్కారంగా భారతరత్న ఇస్తున్నామహో అని పి.వి. నరసింహారావుగారి హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం1991 జనవరి 23 న నేతాజీ జన్మదినం నాడు పత్రికా ప్రకటన దండోరా వేసింది. అది విని అశేష ప్రజలు మురిసి ముప్పందు మవుతారని సర్కారువారు ఆశ పెట్టుకుంటే కథ అడ్డం తిరిగింది. అమాం బాపతుల వాళ్ళకు కూడా ఇచ్చేసిన తరవాత ఇంత కాలానికి మా నాన్న మీకు గుర్తొచ్చాడా? ఇది గౌరవం కాదు.. అపచారం’ అని మొగంమీదే చెప్పి బోసు కూతురు అనిత  అవార్డు తీసుకునేందుకు తిరస్కరించింది. మీరన్నా రండర్రా అంటే బోసు కుటుంబీకులు ఒక్కరూ ముందుకు రాలేదు. అంతలో – మరణించినట్టు సర్కారు వారు నేటికీ ద్రువీకరించని బోసుకు మరణానంతర పురస్కారం ఎలా ఇస్తారు అంటూ లా పాయింటు తీసి ఉత్సాహవంతుడొకడు కలకత్తా హైకోర్టులో  ఓ పిల్లు పిల్లాడు. హిట్లరు తొత్తు, ముస్సోలినీ బంటు, ఫాసిస్టు, టోజో బూట్లు నాకే కుక్క అని తాము ఏనాడో తేల్చి తీర్పు చెప్పిన బోసు ను భారత రత్న గా గుర్తించటమేమిటి  అని ఈ దేశంలో మేధావులు అనే టాగ్ గుత్తకు తీసుకున్న కమ్యూనిష్టులకు చెడ్డ కోపం వచ్చింది. లెఫ్టిష్టులు ఒంటి కాలి మీద బుస్సున లేచారు. 

      మీడియాలో రచ్చ రచ్చ అయ్యాక  గత్తర  నుంచి  బయటపడటానికి ఏమి చెయ్యాలా  అని సర్కారు వారు  తల పట్టుకున్నారు.  ఇస్తున్నట్టుగా అప్పటికే రాష్ట్రపతి భవన్ ప్రకటించింది కాబట్టి అవార్డును రద్దు చెయ్యటం కుదరదు. అవార్డు తీసుకునేందుకు నేతాజీ తరఫున ఎవరూ పిలిచినా రారు కాబట్టి ఎవరినీ పిలవొద్దు. అవార్డు ఫంక్షనులో అసలు నేతాజీ పేరే ఎత్తవద్దు- అని చక్కని తరణోపాయం కనిపెట్టారు. మరి అప్పటికే నేతాజీకంటూ ఇవ్వటానికి ఓ మెడలు రెడీ అయింది కదా? దానినేమి చెయ్యాలి అని ఇంకో శంక వచ్చింది. ఓస్! దానిదేముంది? హోమ్ మినిస్ట్రీ కచేరీ లో దాచి పెడదాం అని నిర్ణయమయింది. అవార్డు ఇవ్వలేదు; గజిట్ లో ప్రకటించలేదు; రిజిస్టరులో పేరు ఎక్కించలేదు .కాబట్టి రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన కాన్సిల్ అయినట్టే భావించవలెను అని  చెప్పి కలకత్తా హై కోర్టు 1997లో భారతరత్న గొడవకు ఎండ్ కార్డు వేసింది. 

      నేతాజీ బూడిద టోక్యో గుళ్ళో మగ్గుతున్నట్టే నేతాజీకి ఇవ్వబోయిన భారతరత్న మెడలు హోమ్ మినిస్ట్రీ అటకమీదెక్కడో  ముప్ఫై ఏళ్లుగా దుమ్ముకొట్టుకుని పడి ఉండాలి . ఇప్పుడు కాని , కొన్ని తరాల తరవాత గాని సర్కారు వారికి రాజకీయంగా గిట్టుబాటు అనుకుంటే దానికి దుమ్ము దులిపించ వచ్చు. రీమేకులు మనకు అలవాటే కనుక ‘బోసు బాబుకు  భా.ర.’  కామిక్ షో కూ మళ్ళీ ఎప్పుడైనా  క్లాప్ కొట్టవచ్చు. దయచేసి వేచి ఉండండి.




                                    ------------------------

Saturday, 21 January 2023

నేతాజీకి తీరని ద్రోహం

   నేతాశ్రీలు ఎందరున్నా నేతాజీ ఒక్కడే. నేతాజీ అంటే సుభాస్ చంద్ర బోసే!

      నేతాజీ బోస్ లక్ష్యశుద్ధితో లక్షల మందిని పోరుబాట పట్టించి , 1857 తరవాత మళ్ళీ ఆ స్థాయిలో సాయుధ స్వాతంత్ర్య సంగ్రామం నడిపించిన  విప్లవ యోధుడు . రవి అస్తమించడని మిడిసిపడిన బ్రిటిష్ సామ్రాజ్యాన్నే మెడలు వొంచి , కొమ్ములు విరిచి , దేశం నుంచి తరిమివేయ గలిగిన శూరుడు! దేశం కోసం ప్రాణం అర్పించిన లోకోత్తర అమరవీరుడు .

      సుభాస్  బోస్ అంటే ఒక స్వప్నం. ఒక సైన్యం. ఒక సాహసం.

      సుభాస్ బోస్ ఒక ప్రభంజనం. ఒక ప్రకంపనం.

       విలువ తెలియకుండా ఇవాళ మనం తేరగా అనుభవిస్తూ , విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్న స్వాతంత్ర్యం అనబడేదానికి కారణభూతుడు  సుభాస్ చంద్ర బోస్.  స్వాతంత్ర్య వీరుల త్యాగ ఫలాన్ని అప్పనంగా  అనుభవించిన ఖల్ నాయక్ లు, వారికి గొడుగుపట్టే పెంపుడు మేధావులు  అసలు కథానాయకుడైన నేతాజీ ఊసే ఎత్తరు.  

     దేశాన్ని చెరపట్టిన బ్రిటిషు సామ్రాజ్యం మీద రాజీపడకుండా వీరోచితంగా పోరాడి , స్వాతంత్ర్యం సాధించిన  నేషనల్ హీరో నేతాజీ సుభాస్ చంద్ర బోస్! స్వాతంత్ర్యానికి అతడే కారకుడు  లేక ప్రధాన కారకులలో ఒకడు అయినప్పుడు స్వతంత్ర భారతంలో కనీసం మిగతా సోకాల్డ్ కారకులతో సమానంగా అయినా ఆయనకు సముచిత గౌరవ స్థానం లభించాలి కదా? మట్టి మనుషులను గట్టి యోధులుగా మలచి , 40 వేల సైన్యంతో తెల్ల దొరతనంతో భీకర సంగ్రామం చేసి , మాతృభూమి శృంఖలాలు తెంచగలిగిన మహావీరుడిని, దేశం కోసం రక్తం ధారవోసిన అతడి స్వాతంత్ర్య సైన్యాన్ని జాతి తగినరీతిలో  సన్మానించి , అవ్యాజాదరణ  చూపి ,కృతజ్ఞత ప్రకటించి ఉండాలి కదా? జరిగిందేమిటి?


             స్వాతంత్ర్యానికి పూర్వం ఊరూరా నేతాజీ చౌక్ లు, నేతాజీ విగ్రహాలు , నేతాజీ యువజన సంఘాలు కనిపించేవి. స్వాతంత్ర్యం అనబడేది వచ్చాక సుభాస్ చంద్ర బోస్ పేర ఒక గౌరవ చిహ్నం గాని , ఏ ప్రభుత్వ సంస్థకూ ఆయన పేరు గాని, కరెన్సీ నోట్ల మీద ఆయన బొమ్మ గాని లేకుండా , ఆయన ఉజ్వల చరిత్రను ఎవరూ తలవకుండా కాంగ్రెసు ప్రభుత్వాలు  గట్టి జాగ్రత్తలు తీసుకున్నాయి.   స్వాతంత్ర్య సంగ్రామ ప్రధాన సేనాపతి సుభాస్ చంద్ర బోస్ అన్న సంగతే భావి తరాలకు తెలియకుండా , ఆయన సమీకరించి నడిపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాటమే చరిత్రకు ఎక్కకుండా నెహ్రూ –ఇందిర ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలకు అబద్ధాల మసి పూశాయి.  నేతాజీ కుటుంబం తమ ఇంటిని “నేతాజీ భవన్” గా మార్చి సొంత వనరులతో చేయిస్తున్న కార్యక్రమాలే తప్ప ఆ జాతీయ వీరుడి సంస్మరణకు ప్రభుత్వపరంగా చేసింది  పెద్దగా లేదు. కేంద్రంలో పార్టీలు , ప్రభుత్వాలు ఎన్నిమారినా నేతాజీ పట్ల ఉదాసీన వైఖరిలో ఇంతవరకూ మార్పులేదు.

       కళ్ళు తెరిచి నిండా మూడు శతాబ్దాలు కాని అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డాలర్ నోట్ల మీద జార్జి వాషింగ్టన్ , లింకన్, రూజ్ వెల్ట్ వంటి జాతీయ నాయకుల ఫోటోలు ఉంటాయి. కనీసం పదివేల సంవత్సరాల  రికార్డెడ్ చరిత్ర కలిగిన మన పుణ్యభూమిలో మాత్రంమినహ ఏ కరెన్సీ నోటు మీదైనా కనిపించేది -  150 ఏళ్ల కిందట పుట్టిన , బహు వివాదాస్పదుడైన ఒక గాంధీ ముఖారవిందం మాత్రమే.  రాజ్యాంగ పరమైన హోదా, ప్రతిపత్తి ఏమీ లేని ... ‘జాతిపిత’ అనే బిరుదు ఎవరిచ్చారో భారత సర్కారుకు కూడా తెలియని .... ఎం.కె. గాంధీ అనే సో కాల్డ్ మహాత్ముడి బొమ్మ మాత్రమే ప్రతినోటు మీదా కనపడాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? స్పెషల్ గా చట్టమేమైనా చేశారా? ఒకవేళ దిక్కుమాలిన నిబంధనలేవైనా అడ్డమొస్తే వాటిని తీసి అవతల ఎందుకు పారెయ్యరు?కాంగ్రెసును , నెహ్రూ వంశ పాపిష్టి పాలననూ తిట్టున తిట్టు తిట్టకుండా తిట్టే నరేంద్ర మోదీకి కూడా గద్దెనెక్కి తొమ్మిదేళ్ళు కావస్తున్నా  కనీసం ఒక్క కరెన్సీ నోటుమీద అయినా నేతాజీ బొమ్మ ముద్రించాలని ఇంతవరకూ  ఎందుకు బుద్ధి పుట్టలేదు? గాంధీ తప్ప జాతీయ నాయకుడు , జాతీయ వీరుడు, పూజ్యుడు ఎవరూ లేరా? స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు నిండాయని  ఆజాదీకా అమృతోత్సవ్ అట్టహాసంగా జరిపినప్పుడైనా  ఆ స్వాతంత్ర్యానికి అసలు కారకుడైన నేతాజీ చిత్రంతో ఒక్క కరెన్సీ నోటునైనా జారీ చేయటానికి నేతాజీ వీరాభిమానినని చెప్పుకునే మోదీకి వచ్చిన అడ్డంకి ఏమిటి? 2017లో కోలకతా హైకోర్టు ఇదే విషయం నిగ్గదీసినప్పుడు ఇదే మోదీ సర్కారు  - ఇండియన్ కరెన్సీ నోట్లపై జాతీయనాయకుల బొమ్మలు ముద్రించే విషయంలో రిజర్వుబ్యాంకు స్పందన కోరవలసి ఉంటుంద”ని విన్నవించింది కదా? స్పందన కోరటానికి ప్రభుత్వానికీ, స్పందించటానికి రిజర్వుబ్యాంకుకూ ఆరేళ్ళు కూడా సరిపోలేదా? అసలైన స్వాతంత్ర్య ప్రదాత అయిన జాతీయ మహానేత సుభాస్ చంద్ర బోస్ కు సముచిత గౌరవం ఇవ్వటానికి ఒక రిజర్వు బ్యాంకు ఆజ్ఞ, అనుమతి కావాలా? దేశాన్నేలే ప్రభుత్వానికి బాధ్యత లేదా? 370 రాజ్యాంగ అధికరణాన్ని తలచిందే తడవుగా ఒక్క పూటలో కొట్టిపారేయగలిగిన సూపర్ డూపర్ కార్యశూరులకు  ఆఫ్టరాల్ ఒక కరెన్సీ రూలు ఒక లెక్కా?  

      ఇక ఇంకో దౌర్భాగ్యం.  మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహా నాయకుడు ఆత్మార్పణం చేసి ముప్పావు శతాబ్దం గడచిన తరవాత కూడా ఆయన మరణించిన సంగతే మనము గుర్తించము. అంగీకరించము.  సుభాస్ చంద్ర బోస్ కు (జనవరి 23న) జననమే తప్ప రికార్డుల ప్రకారం మరణం లేదు. స్వాతంత్ర్య ప్రదాత అయిన మహనీయుడు మరణించి 75 ఏళ్ళయినా ఆయన చితాభస్మాన్నీ , ఆస్థికలను  దేశానికి తీసుకొని వచ్చి శ్రద్ధాంజలి ఘటించటానికి దిక్కు లేదు.  ఆస్థికల పాత్ర నేటికీ జపాన్ లోని రెంకోజీ మందిరంలోనే పట్టించుకునే దిక్కులేకుండా , మన నిర్లిప్తతకూ, నిష్క్రియాపరత్వానికీ ప్రత్యక్ష ప్రతీకగా పడి ఉన్నది. నేతాజీ అనుంగు భక్తుడినని చాటుకునే నరేంద్ర మోదీ ఇటీవల ప్రధాన మంత్రి హోదాలో టోక్యో వెళ్ళినప్పుడు నేతాజీ భస్మపాత్ర ఉన్న రెంకోజీ గుడి దరిదాపులకు వెళ్ళిన పాపాన పోలేదు.

      1945 ఆగస్టు 18న తైవాన్ లోని తైపేలో విమాన ప్రమాదం లో నేతాజీ మరణాన్ని చట్టబద్ధంగా ఏర్పాటైన రెండు విచారణ సంఘాలు ధ్రువీకరించాయి. ఆ విచారణల తీరు తెన్నుల గురించి ఎన్ని అక్షేపణలు ఉన్నా అవి చేసిన నిర్ణయాలవరకూ  తప్పు పట్టవలసిన పని లేదు. విమాన ప్రమాదంలో నేతాజీ మృతిని అంగీకరించిన పూర్వ ప్రభుత్వ నిర్ణయాన్ని జనతా ప్రభుత్వం  కూడా ధృవీకరించింది . అలాగే- 1999 లో ఎన్.డి.ఎ. ప్రభుత్వం నియమించిన ముఖర్జీ కమిషన్ విమాన ప్రమాదం, అందులో నేతాజీ మరణం అబద్ధమంటూ ఇచ్చిన నివేదికను  తరవాత వచ్చిన యు.పి.ఏ.ప్రభుత్వం తిరస్కరించింది. అంటే-  రాజ్యమేలేది ఏ కూటమి అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పటివరకూ అన్ని ప్రభుత్వాలూ 1945 ఆగస్టు 18 న తైపే లో నేతాజీ మృతి చెందిన వాస్తవాన్ని అంగీకరించాయి. ఆనాడునేతాజీ మరణం నిజమని ఒప్పుకున్నాక , మారుపేరుతో నేతాజీ పార్థివ కాయాన్ని దహనం చేయటమూ నిజమే , అక్కడ సేకరించిన అస్థికలూ, చితాభస్మమూ నేతాజీవే అని ఒప్పుకుని తీరాలి కదా? ఆ భస్మ పాత్ర ఇంకా జపాన్ లోనే ఎందుకు ఉండాలి? దానిని ఇకనైనా స్వదేశానికి ఎందుకు తీసుకురారని మనం గట్టిగా అడగవద్దా? అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసి , వెంటపడి ఆ పని చేయించవద్దా?  ప్రమాదంలో నేతాజీ మృతి నిజం కాక పొతే అసలు నిజం ఏది? అప్పుడు కాకపొతే నేతాజీ ఎప్పుడు ఎక్కడ మరణించాడు అన్నది  ఇప్పటివరకూ ఏ ఒక్కరూ నిర్ద్వంద్వంగా నిరూపించలేనప్పుడు  బోస్ మిస్టరీ గురించి ముదనష్టపు వాగుళ్ళు ఇంకెంత కాలం వాగుతారని  అందరం ఒక్క గొంతుతో ఉరమవద్దా?

            ప్రజల నుంచి వత్తిడి లేనిదే, ప్రజాభిప్రాయం సంఘటితమై వెంటపడనిదే,  జాతి జాగృతం కానిదే ఏ పనీ కాదు. ఏ ప్రభుత్వమూ  కదలదు. నేతాజీ కి సముచిత నివాళి కి సంబంధించినంత వరకూ ప్రధాన వైఫల్యం ప్రజలది. వారిని కదిలించి , మంచి చెడ్డ ఎరుకపరచి ,ముందుకు నడిపించలేని మేధావి వర్గానిది. జాతిపట్ల బాధ్యత మరచిన ఒపీనియన్ మేకర్లది. ఎందుకంటే నేతాజీ పోరాడింది మన కోసం. మన స్వాతంత్ర్య కోసం. మన జాతి ఉజ్వల భవిష్యత్తు కోసం. వేలమంది యోధులను సమీకరించి , దేశం కోసం రక్తం ధారవోయమని ఉద్బోదించి ,  కత్తుల వంతెన మీద వట్టికాళ్ళతో నడిపించి , మహా సంగ్రామం చేయించి , ఆఖరికి తన ప్రాణాలనే అర్పించి స్వాతంత్ర్య ఫలాన్ని సాధించి పెట్టిన జాతీయ వీరుడి దివ్యస్మృతిని  సముచిత రీతిలో గౌరవించుకోవటం జాతిజనుల  ప్రాథమిక బాధ్యత కాదా? కనీస బాధ్యత విస్మరించిన ప్రభుత్వాలనూ, ప్రభుత్వాలనూ నిగ్గదీసి , మెడలు వంచి కావలసినపని చేయించుకునే అధికారం సర్వాదికారులైన ప్రజలకు లేదా?


                                 ------------------------------------------

 

                                 ------------------------------------------