Friday, 28 June 2024

సామవేదం : నిశ్శబ్ద ధార్మిక విప్లవం

 

 ఎం.వి.ఆర్.శాస్త్రి

https://youtu.be/0hyPgJ3JtGA?si=p8u4UN4CacIs5IKC

     “హిందువులకు దేవుడే దిక్కు" అని నేను చేసిన కొత్త వీడియోను ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న "ఋషిపీఠం" వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు చూసి మెచ్చుకుంటూ  ఆడియో సందేశం పంపారు. ధన్యోస్మి. మేమిద్దరం ఒకే గురువు నుంచి స్ఫూర్తి ని, శక్తినీ పొంది , గురు ఉపదేశాన్ని దివ్యాదేశంగా తలచి ఎవరి క్షేత్రంలో వారు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్లం. ధర్మ వీరుడు, ధర్మ ప్రచారకుడు, ధర్మ మూర్తి అయిన షణ్ముఖశర్మ  గారి మెచ్చుకోలును  సద్గురు శివానందమూర్తి గురుదేవులు పలికించిన దీవెనగా భావిస్తాను




      షణ్ముఖ శర్మగారు నాకు కనీసం 30 ఏళ్లుగా తెలుసు. స్వాతి వారపత్రికలో జర్నలిస్టుగా , సినిమా కవిగా జీవయాత్ర సాగించిన కాలం మొదలుకుని ... ఋషిపీఠం  పెట్టి బాలారిష్టాల నుంచి దానిని ఒడ్డున పడవేయటానికి సతమతమైన వామన దశ నుంచి ... ప్రవచన రంగంలో ఇంతింతై బ్రహ్మాండమంతగా ఎదిగి దేశ దేశాలలో లక్షల అభిమానుల  అక్షౌహిణులను సమకూర్చుకుని నిశ్శబ్ద ధర్మయుద్ధంలో  నిమగ్నమైన నేటి అవక్ర త్రివిక్రమత్వం వరకూ- సామవేదంవారి  ప్రస్థానాన్ని నేను దూరం నుంచే సన్నిహితంగా గమనిస్తున్నాను. ధర్మపీఠం ముందు నిలబడి సత్య నిష్ఠ తో దేనినైనా ప్రశ్నించి, ఎవరినైనా నిలదీసి , అక్షరాయుధంతో  అధర్మాన్ని చీల్చి చెండాడటంలో ఎవరికీ తీసిపోను- అని  కొంచెం ఎక్కువే గర్వించే నేను కూడా క్రోధం లేకుండా శుద్ధ సత్వాన్ని వీడకుండా మెత్తటి మాటలలోనే వజ్ర సదృశ కాఠిన్యాన్ని, ధర్మాగ్రహ ప్రచండత్వాన్ని  భాసింపజేయగల సామవేదం వారి సంపాదకీయ ప్రజ్ఞకు ఆశ్చర్యపోతుంటాను.  ఉదాహరణకు  కాశీ కారిడార్ నిమిత్తం వారణాసి క్షేత్రం లోని ప్రాచీన దేవతామూర్తులను పెకలించినప్పుడు “క్షేత్రాపచారం జరగరాదు” శీర్షికతో 2021 జూలై లో శర్మగారు రాసిన ఈ పలుకుల ములుకులను చిత్తగించండి:




     “ప్రాచీన క్షేత్రాలను, ఆలయాలను అభివృద్ధిపరచడం హర్షణీయమే.కానీ ఆ క్రమంలో వాటి ప్రాచీనతనీ , చరిత్రనీ , పౌరాణిక ఐతిహాసిక ప్రాధాన్యాన్నీ పావనత్వాన్నీ దెబ్బతీయకుండా వాటిని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాలి. కాశీ కేవలం కట్టడాల క్షేత్రం కాదు. దానికి లెక్కలకందని కాలాల ఘనేతిహాస నేపథ్యం  ఉంది. ఏ లింగం, ఏ ప్రతిమ ఏ స్థానంలో ఉందో పురాణాలు వర్ణించాయి. వాటిని తొలగిస్తే ఆ స్థానాల పురాణ నేపథ్యం తెలిసి చేసే శాస్త్ర విధానాలు , యాత్రలు ఏమవుతాయి? మనకు చిన్నప్రతిమలుగా , గూడుల్లాంటి గుడులుగా కనపడుతున్నవి విశ్వ చైతన్య శక్తిబిందువులు . COSMIC ENERGY POINTS గా వైజ్ఞానిక పరిశోధనలతో తేల్చారు. ఆ చోటు నుండి వాటిని కదల్చినా ఒక శక్తి కేంద్రాన్ని భంగ పరచినట్టే కదా? ఇళ్ళూ, దుకాణాలు  కూల్చినట్టు గుడులనూ, ప్రతిమలను తొలగించటం దైవాపచారం, క్షేత్రాపచారం అవుతాయి కదా!

     “కాశీ పునర్నిర్మాణంలో ద్వాదశాదిత్య మందిరాలు , పంచ వినాయకులు, కొన్ని స్వయంభూ లింగాలు, మూర్తులు తొలగిపోయాయనీ, ముక్తిమండపం కూడా పోతోందనీ, ఒక ప్రాచీన అక్షయ మహావృక్షం ఖండించబడిందనీ ఎందరో వేదన పడుతున్నారు. విశ్వనాథాలయాన్ని మరింత శోభాయమానం చేస్తూ చక్కని కారిడార్ కట్టడం మంచిదే కానీ , ఆ మందిర శోభ కోసం ఎన్నో ప్రాచీన మందిరాలను, దేవతామూర్తులను, ప్రాచీన వృక్షాలను ధ్వంసం చేయటం సమంజసమా? ఈ క్షేత్ర దైవాపరాధం దేశానికి క్షోభకరం  కాదా? దేశాన్నీ, ధర్మాన్నీ దెబ్బతీయాలని చూస్తున్న విపక్షాల మూక దీనిని అవకాశంగా తీసుకుని హిందువులను చీల్చవచ్ఛు కూడా. “

      ఆ ఋషివాక్కే నిజమయింది. కాశీక్షేత్ర దైవాపరాధమే ఇప్పుడు ఈ  దేశానికి క్షోభకరం అయింది. దేశాన్నీ ధర్మాన్నీ దెబ్బతీయాలనుకునే విపక్షాల మూక ఇలాంటి దైవాపరాధాలను , అనేకానేక ధర్మాపచారాలను అవకాశంగా తీసుకుని హిందువులను చీల్చనే చీల్చింది. 400 కు తగ్గేదే లేదని తొడకొట్టిన భాజపేయ గండర గండలు ధర్మదేవత చాచికొట్టిన దెబ్బకు ఎన్నికల గోదాలో కుదేలై సింపిల్ మెజారిటీకే తెరువులేక అలయెన్సు ఊతకర్రల సాయంతో సర్కారును నెట్టుకు రావాల్సిన దుస్థితికి చేరారు.

      ఆ సంగతి అలా ఉంచండి. తెలుగులో -ఆ మాట కొస్తే దేశంలోనే ఎన్నో వందల, వేల  పత్రికలు ఉన్నాయి కదా? ప్రాచీన కాశీ క్షేత్రంలో సౌకర్యాల అభివృద్ధి పేర పరమ పవిత్రమైన దేవతా మూర్తుల , దైవ ప్రతీకల మహా విధ్వంసం జరిగితే ఋషిపీఠం వలె గొంతెత్తి అపచారాన్ని నిష్కర్షగా ఖండించిన పత్రిక వేరొకటి ఉన్నదా అంటే నాకైతే సందేహమే.  

     సద్గురు శివానంద మూర్తి గారి దివ్య స్ఫూర్తితో వేల మందిని కదిలించి ధర్మరక్షణకు కార్యోన్ముఖం చేయించి దేశంలోనే ఒక గొప్ప ధార్మిక ఉద్యమానికి చోదకశక్తి కాగలిగిన యోగ్యత, దక్షత షణ్ముఖశర్మగారికి ఉన్నాయి.ఆ మాట నేను ఆయనతోనే పలుమార్లు అన్నాను. కాని పట్టించుకున్నట్టు కనిపించలేదు. వయసు, వనరులు, శక్తి, సామర్ధ్యం , అవకాశం అన్నీ ఉండి కూడా ఆయన విసుగు , విరామం లేకుండా నిరంతర ప్రవచనాలకే సమయమంతా వెచ్చిస్తూ అసలైన, హిందూసమాజానికి జీవన్మరణ సమస్య వంటి  ధర్మ పోరాటం మీద శ్రద్ధ పెట్టటం లేదు. ప్రవచనాలు ఎన్ని చెప్పినా మన మొద్దు జనాలు మారతారా, కదులుతారా అని నాకు లోలోన ఒకింత అసంతృప్తి ఉండేది. అదికూడా ఒక నెలకింద పోయింది. అదీ ఆశ్చర్యకరంగా .



1999 జూలై లో సంస్థాపన నుంచి ఈ జూన్ వరకు పాతికేళ్లలో రాసిన 209 “ఋషిపీఠం సంపాదకీయాలు” ను అదే పేరిట ప్రచురించామనీ , నా అభిప్రాయం కోసం దాన్ని నాకు పంపుతామనీ శర్మగారు ఆ మధ్య  నాకు ఫోన్లో చెప్పారు. ఆ సందర్భంలోనే ఋషిపీఠం రజతోత్సవ వేడుకలు మూడు రోజులుగా భాగ్యనగరం లో జరుగుతున్నాయని , ఆహ్వాన పత్రిక ప్రత్యేకంగా మా ఇంటికి పంపించామని  గుర్తు చేసి ఆ సాయంత్రం  ముగింపు సభకు స్వయంగా ఆహ్వానించారు. వెళ్లకపోవటం మర్యాద కాదు కనుక 6-30లోగా తప్పక వస్తానని చెప్పాను.

బషీర్ బాగ్ లోని భారతీయ విద్యాభవన్ పెద్ద ఆడిటోరియం లో సభ.  6 గంటలకు మొదలు అని చెప్పినా అతిథులు, ఆహూతులు వచ్చి సీట్లలో సెటిలై కార్యక్రమం మొదలెట్టేసరికి మామూలు ఆనవాయితీ ప్రకారం ఆరున్నర పైమాటే. అయినా  శర్మగారిని ముందుగా కలిసి కాసేపు మాట్లాడుదాం అనుకుని 6-10 కల్లా సభాస్థలికి చేరాను. వెయ్యి మంది పట్టే ఆ ఆడిటోరియం అంతా నిశ్శబ్దంగా ఉన్నది. గేటు దగ్గర నిలబడి గౌరవ అతిథుల కోసం ఎదురు చూసేవారు లేరు. ఎక్కడా ఏ రకమైన అలికిడీ లేదు. అనుమానం వచ్చి ఇంకోసారి ఆహ్వాన పత్రిక చూశాను. సరైన  టైముకు సరైన స్థలానికే  వచ్చాను. మరి ఒక్క కార్యకర్తా కనపడడేమిటి ? ఒక  వేళ ప్రోగ్రాం కాన్సిల్ అయిందేమో కనుక్కో అని నా అసిస్టెంటుకు చెప్పాను. అతడు లోపలికి వెళ్లి కనుక్కుంటే   మీటింగు అప్పటికే మొదలైందని చెప్పారట.



      ఎవరూ లేకుండా మీటింగు ఏమిటి అని ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్లి చూద్దును గదా ఆడిటోరియం కిటకిటడుతున్నది. ముందు వరసలో నా కోసమే అన్నట్టు ఒక్క సీటు ఖాళీగా ఉన్నది. ఎక్స్ ట్రా చెయిర్లు కూడా వేసి ఉన్నాయి. అవిగాక కొంతమంది వరసలలో నెల మీద కూచుని ఉన్నారు. హౌస్ ఫుల్ అయినా హాలంతా నిశ్సబ్దంగా ఉన్నది. ఎవరూ ఎవరినీ పట్టించుకునే స్థితి  లో లేరు. అందరి దృష్టీ నడుస్తున్న కార్యక్రమం మీద  లగ్నమై ఉన్నది. పెద్ద వేదిక . దాన్ని మధ్య మూడే మూడు కుర్చీలు. మధ్యలో మెగా మాగ్నెట్ సామవేదం వారు. అటూ ఇటూ ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు ; కంచి పీఠం చల్లా విశ్వనాథ శాస్త్రిగారు , ఇద్దరూ పది పదిహేను నిమిషాలు క్లుప్తంగా మాట్లాడారు. షణ్ముఖ శర్మగారూ 40నిమిషాలకంటే ఎక్కువ సమయం తీసుకోలేదు.




      అమెరికా నుంచి , ఇతర దేశాలనుంచి సకుటుంబంగా వచ్చిన ఎంతో మంది    శిష్యులు-  గొప్ప గొప్పఎం.ఎన్.సీ .లలో చాలా పెద్ద హోదాలో ఉన్న చిన్నవయసు దిగ్గజాలు సంప్రదాయ వైదిక దుస్తుల్లో నేలమీద భక్తిశ్రద్ధలతో నిష్టగా కూచోవటం, పిల్లాజెల్లా ఉన్నా చప్పుళ్ళు , కేకలు లేకపోవటం, వాలంటీర్ల హడావుడి లేకుండా సుదీర్ఘ  కార్యక్రమం మిలిటరీ క్రమశిక్షణతో చకచకా నడిచిపోవటం చూసి ముచ్చట వేసింది. సామవేదం షణ్ముఖ శర్మగారు ఊళ్లు, దేశాలు పట్టుకుని ప్రవచనాలు చేయటం, ఋషిపీఠం పత్రిక నడపటం మాత్రమే కాదు -వారి ట్రస్టు సనాతన ధర్మ సంరక్షణకు, ఆర్ష విద్య, సంస్కృతి, కళల అభ్యున్నతికి దేశంలోనూ, దేశాంతరాలలోనూ వేలమందిని సమీకరించి బృహత్ వ్యూహంతో నిశ్శబ్ద ధార్మిక విప్లవానికి తనవంతు కృషి పటాటోపం లేకుండా సాగిస్తున్నదని నాకు అర్థమయింది. నేను లోపలికి వెళ్ళటం లాగే రెండుగంటల తరవాత బయటికి రావటమూ ఎవరూ గమనించలేదు. నేనా సభలో ఉన్నట్టు శర్మగారికి కూడా బహుశా ఇప్పటికీ తెలియదు.

      ధర్మం గురించి గావుకేకలు పెట్టి, సొంత లాభానికి ధర్మాన్ని అడ్డంగా వాడుకునే ఆధ్యాత్మిక ఆషాఢభూతుల కంటే మౌనంగా వేగంగా ప్రణాళికాబద్దంగా ధర్మవిజయానికి వేలమందిని నిమగ్నం చేయిస్తున్న సామవేదం వంటి వారి వల్లే ధర్మం నిలబడుతుంది. హిందూ దేశంలోనే హిందువుల మనుగడ ప్రశ్నార్థకమై , రకరకాల మానసిక , సామాజిక , రాజకీయ వైకల్యాలతో హిందూ సమాజం నిస్తేజం, నిర్వీర్యం అయిన ప్రస్తుత దురవస్థనుంచి బయటపడి హిందూ దేశంలో హిందూ రాజ్యం సర్వమతాలకు శ్రేయోదాయకంగా సుప్రతిష్ఠితమవటానికి తాజా వీడియోలో నేను చేసిన సూచన షణ్ముఖశర్మ గారికి నచ్చి తాను సైతం ఆదిశగా అడుగువేస్తానని చెప్పటం చాలా సంతోషం. ధార్మిక , ఆధ్యాత్మిక రంగాలలో దిగ్దంతులైన ఆయన వంటి మహానుభావులు పూనుకుని సమష్టి కార్యాచరణకు ఆయత్తం కాగలిగితే అంతకంటే కావలసింది ఏముంది?    

https://youtu.be/7dtjLr8xQTk?si=1pp96gpDFoIit48m

     సామవేదం వారితో ఇంతకు ముందు ఒకసారి నేను ధర్మ సంబంధమైన వీడియో సంభాషణ చేశాను. యు ట్యూబ్  లో దాన్ని చాలామంది చూశారు. దానికి కొనసాగింపుగా సమకాలిక ధర్మ సంకటాలు, హిందుత్వ అస్తిత్వ సమస్యలపై ఆయనతో ఇంకో సంవాదం చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నా ఇప్పటి దాకా కుదరలేదు. ఆ సంగతే ఇవాళ ఫోన్లో మాట్లాడగా జూలై చివరి వారంలో అమెరికా నుంచి తిరిగి వచ్చాక వీలైనంత త్వరలో ఒక పూట సావకాశంగా కలుద్దామని శర్మ గారు అన్నారు. శుభం.

                                                ---------------------------------

Friday, 14 June 2024

నలంద ఆల్ టైమ్ గ్రేట్

ప్రపంచంలోకెల్లా అతి పురాతన విశ్వవిద్యాలయమేది? అని అడిగితే ఈ కాలపు కుర్రాళ్ళకు చప్పున స్ఫురించే పేరు ఆక్స్ ఫర్డ్. నిజానికి ఘనత వహించిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మొదలవటానికి 500 ఏళ్ల పూర్వమే హిందూదేశంలో నలందా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో మహా వైభవంగా వెలిగిపోతుండేది. ఇంకా చెప్పాలంటే ఆ కాలాన నలంద ఒక్కటే ప్రపంచం మొత్తంలో ఏకైక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.  కొరియా , జపాన్, చైనా, టిబెట్, మంగోలియా, ఇండోనేసియా, ఇరాన్, గ్రీస్ , టర్కీ వంటి దూర దేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడి కొచ్చి వైద్యం , తర్కం, గణితం, జ్యోతిషం, ఖగోళం,వ్యాకరణం, తత్త్వం వంటి అనేకానేక శాస్త్రాలను సాంగోపాంగంగా  అధ్యయనం చేసేవారు. నలంద ప్రధానంగా బౌద్ధ విశ్వ విద్యాలయం అయినా అక్కడ బౌద్ధ మత గ్రంథాలు, ధర్మశాస్త్రాలతో బాటు,  వేద వేదాంగాలను, దర్శనాలను , ఉపనిషత్తులను, శ్రుతి స్మృతి పురాణ ఇతిహాసాలను కూడా సాకల్యంగా బోధించే వారు. రాజనీతి, యుద్ధ కళ , శిల్ప శాస్త్రాల వంటి లౌకిక విద్యలకూ నలంద పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా అక్కడ జగత్ ప్రసిద్ధమైనది అక్కడి అత్యద్భుత గ్రంథాలయ వ్యవస్థ. ధర్మగంజ అని పిలువబడ్డ ఆ గ్రంథాలయ సముదాయంలోరత్నసాగర , రత్నోదధి, రత్నరంజక అనే మూడు బహుళ అంతస్తుల భవనాలు ఉండేవి. అందులో తొమ్మిది అంతస్తుల రత్నోదధి ప్రాచీన పవిత్రగ్రంథాల కాణాచి. శతాబ్దాల తరబడి ఎందరో మహాత్ములు బహు కష్టపడి సేకరించి నలందలో అందరికీ అందుబాటులో ఉంచిన అపురూప  గ్రంథాల సంఖ్య ఎంతో తెలుసా? మొత్తం కలిపి 90 లక్షల పైచిలుకు!



భారత చరిత్రలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందిన గుప్తరాజుల హయాంలో సామాన్య శకం 427 సంవత్సరంలో మొదటి కుమారగుప్తుడు స్థాపించిన నలంద విశ్వ విద్యాలయం ఇంచుమించుగా ఎనిమిది శతాబ్దాల పాటు ప్రపంచానికి విద్య గరిపింది. మానవ విజ్ఞానానికి , నాగరికతకు గురుస్థానంగా దేశ దేశాల జిజ్ఞాసువులకు జ్ఞాన తృష్ణ తీర్చింది. 5,6 శతాబ్దాలలో గుప్తవంశీకుల తరవాత 7వ శతాబ్దంలో హర్షవర్ధనుడు వంటి కనౌజ్ ప్రభువులు, 8 – 12 శతాబ్దాలలో పాల వంశం పాలకులు తాము అనుసరించేది బౌద్ధాన్నా , వైదిక మతాన్నా అన్నదానితో నిమిత్తం లేకుండా నలందలోని  బౌద్ధ మహావిహారానికి మహారాజ పోషకులుగా నిలిచి దాని అభివృద్ధికి సర్వవిధాల తోడ్పడ్డారు. ఖర్చులన్నీ మహారాజులే భరించారు గనుక అక్కడ విద్య, భోజన , నివాస వసతి పూర్తిగా ఉచితం .  అందులో చోటు దొరకటం మాత్రం చాలా కష్టం. అక్కడ స్కాలర్ గా చేరాలంటే ఎవరైనా సరే ప్రవేశ పరీక్షలో నెగ్గి తీరాలి.  ఆ పరీక్ష చాలా కఠినం . అయినా ఎప్పుడు చూసినా పదివేల సంఖ్యకు తగ్గని విద్యార్థులతో, రెండువేలకు పైగా ఆచార్యులతో కళకళలాడిన నలంద ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ . ప్రాచీన మగధ రాజ్యంలో భాగమై నేటి  పాట్నా నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో వెలసిన నలందలో దేశ దేశాల నుంచీ వచ్చిన బౌద్ధ బిక్షువులు ఎందరో  సంవత్సరాల పర్యంతం నివసించి , విద్యాసముపార్జన చేసి వేలాది అపురూప గ్రంథాల వ్రాతప్రతులను కాపీ చేసుకుని బండ్లమీద మోసుకుని మరలిపోతుండే వారు.  నలందలో హర్షవర్ధనుడి సమకాలికుడైన చైనీస్ యాత్రికుడు హుయెన్ సాంగ్ అనే Xuan Zang సామాన్య శకం 630 – 643 నడుమ భారత పర్యటన కాలంలో రెండేళ్ళ పాటు నలందలో శిలాభద్ర ఆచార్యుడి వద్ద శిష్యరికం చేసి   సంస్కృతం, తర్క వ్యాకరణ , యోగాచారాలను అధ్యయనం చేశాడు. చైనాకు మరలిపోయేప్పుడు 657 ప్రాచీన తాళపత్ర గ్రంథాలను కాపీ చేసుకుని 520 పెట్టెల్లో  20 గుర్రాల  మీద పట్టుకు వెళ్ళాడు. 3705 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో , బహుళ అంతస్థులు కలిగిన ఏడు బౌద్ధ మఠాలు, ఎనిమిది వేరువేరు కాంపౌండ్లు , పది దేవాలయాలు, మెడిటేషన్  హాళ్లు , విశాలమైన క్లాస్ రూములు,  తొమ్మిది అంతస్తుల ధర్మగంజ్ గ్రంథాలయ సదనం,   మూదు అంతస్తుల డార్మిటరీ సముదాయం, తటాకాలు, ఉద్యానవనాలతో  నలంద ప్రాంగణం ఎంత వైభవోపేతంగా విలసిల్లిందీ ఆ యాత్రికుడు కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. అనంతర కాలాన ఆర్కియలాజికల్ తవ్వకాలలో విద్యాబోధనకు సంబంధించినదిగా బయటపడ్డ పెద్ద దిబ్బ పొడవు 1400 అడుగులు, వెడల్పు 400 అడుగులు అంటే అప్పటి కట్టడాలు ఎంత గొప్పగా ఉండేవో ఊహించవచ్చు. నాగార్జున , పద్మసంభవ , వసుబందు, ధర్మపాల వంటి మహా విద్వాంసులు నలందలోనే విద్యనేర్చారు. ప్రపంచానికి సున్నను ప్రసాదించి గణిత శాస్త్ర వికాసానికి తోడ్పడిన ఆర్యభట్ట ఈ విశ్వ విద్యాలయానికి ప్రదానాచార్యుడుగా ఉన్నాడు.

           ప్రపంచంలో ఏ ఖండంలో ఏ మూల ఏ దేశం వారైనా ... ఏ మతానికి ,ఏ సంప్రదాయానికి , ఏ కులానికి , ఏ తెగకు చెందినవారైనా.. ఏ దైవాన్ని నమ్మేవారైనా , ఏ దైవాన్నీ నమ్మనివరైనా ... సంపన్నులైనా , నిరుపెదలైనా ... ప్రతిభ, జిజ్ఞాస, శ్రద్ధ ఉండి ప్రవేశ పరీక్షలో నెగ్గితే చాలు ... మా విశ్వ విద్యాలయానికి రావచ్చు. ఇష్టమైన విద్యలను, వాటికి సంబంధించిన శాస్త్రాలను మహా మహా మహోపాధ్యాయుల సన్నిధిలో దమ్మిడీ ఖర్చు లేకుండా , చదువుకూ తిండికీ బసకూ పైసా రుసుము కట్టాల్సిన పనిలేకుండా ... జ్ఞానతృష్ణ తీరేదాకా ఎన్నేళ్ళయినా ఇక్కడే ఉండి అభ్యసించవచ్చు. ఇక్కడి జగత్ ప్రసిద్ధ గ్రంథాలయంలో భద్రపరచిన  లక్షలాది అపురూప ప్రాచీన గ్రంథాల వ్రాతప్రతులను  తీరుబడిగా అధ్యయనం చేయవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని గ్రంథాలను ఉచితంగా కాపీ చేసుకుని పోవచ్చు .... అని బంపర్ ఆఫర్ ఇచ్చే యూనివర్సిటీ లేక విద్యా విజ్ఞాన సంస్థ ఈ 21 వ శతాబ్దంలోనే ప్రపంచం మొత్తం మీద ఒక్కటీ లేదు. మానవజాతి అదృష్టం కొద్దీ పదహారు శతాబ్దుల కిందటే విజ్ఞాన సర్వస్వమనదగిన అటువంటి మహా విద్యా సంస్థ హిందూ దేశంలో  శతాబ్దాల పర్యంతం   మహా వైభవంగా నడిచింది. ,మల్టీబిలియనీర్లు , ట్రిలియనీర్లు కొల్లలుగా ఉన్న ఈ ఆధునిక యుగంలో ఏ వదాన్యుడూ , ఏ సూపర్ రిచ్ సూపర్ పవర్ ప్రభుత్వమూ తలపెట్టని లోకోత్తర మహత్కార్యాన్ని ఒక మోస్తరు రాజ్యాల బౌద్ధ, హైందవ ప్రభువులు , పేరు ప్రచారం ప్రతిఫలం ఆశించకుండా  నిస్వార్థంగా చేపట్టి కావలసినన్ని  వనరులు, హంగులు, మడిమామత న్యాలూ సమకూర్చి ధన్యులయ్యారు. ఆ అద్భత వ్యవస్థ అలాగే నిరాఘాటంగా కొనసాగిఉంటే మానవ విజ్ఞానం మరింత వేగంగా పురోగమించగలిగేది. మానవాళికి మహోపకారం జరిగేది.

కాని మన దౌర్భాగ్యం ! ఎందరో మహానుభావులు ఎన్నో శతాబ్దాల పాటు పడిన శ్రమ , చేసిన త్యాగం , సాధించిన విజయం అన్నీ చివరికి బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. మతమౌడ్యం జడలుకట్టిన ఇస్లామిక్ మతోన్మాదం బారిన పడి మొత్తం ప్రపంచానికి విజ్ఞాన ఖని , విద్యల కల్పవల్లి అయిన నలందా మహా విహార విశ్వ విద్యాలయం సర్వనాశనం అయింది. అక్షరజ్ఞానం లేని ఒక నీచ నికృష్ట నరరూప రాక్షసుడి మతమౌడ్యం  మూలంగా మంటల్లో దగ్ధమై అక్షరాలా బూడిదే అయింది. దానివల్ల సనాతన ధర్మానికి, బౌద్ధ మతానికి, మొత్తంగా మానవ విజ్ఞానానికి , నాగరికతకు ఎవరూ అంచనా అయినా కట్టలేనంత తీవ్ర విఘాతం జరిగింది.

నలందను మళ్ళీ కోలుకోలేనంతగా సర్వనాశనం చేసిన  పాపాత్ముడి పేరు బఖ్తియార్ ఖిల్జీ. వాడి పేరు లోని ఖిల్జీని చూసి తెలియనివారు అతడిని 13 వ శతాబ్దంలో హిందూ దేశాన్ని చెరబట్టిన ఖిల్జీల పారంపర్యానికి  చెందినవాడని పొరబడతారు. కాని కాదు. వాడొక తాదూ బొంగరం లేని ఆవారాగాడు. తబకాత్ -ఇ- నాసిరీ  గ్రంథంల్ 548 నుంచి  552 వరకూ  పేజీల్లో మౌలానా మిన్హాజ్ ఉద్దీన్ , అబూ ఉమర్ ఉస్మాన్ లు తెలిపిన వివరాల ప్రకారం అతడు  ఆఫ్గానిస్తాన్ లో ఖిల్జీ తెగ వాడు.  ,పందొమ్మిదో ఏట ఘజినీ లో ముహమ్మద్ ఘోరీ దర్బారుకు వెళ్లి సైన్యంలో  చేర్చుకోమన్నాడు. అతగాడి వికారపు మొగం, పొట్టి వాలకం ,  పొడుగు చేతులు చూస్తేనే సుల్తానుకు అసహ్యం వేసి గెంటేశాడు. అక్కడినుంచి దిల్లీ వెళ్లి కుతుబుద్దీన్ ఐబక్ ను కలిశాడు. అక్కడా పరాభవం అయింది. తరవాత 1193 ప్రాంతాల్లో అవద్ చేరాడు. అక్కడ తన  పినతండ్రికి చిన్న జాగీరు ఉండేది. అతడు చనిపోయాక ఆ జాగీరు బఖ్తియార్ పరమయింది, ఆ ఆసరాతో కొంతమంది కిరాయి సైనికులను, కాసిని గుర్రాలను , ఆయుధాలను సమకూర్చుకుని చుట్టుపక్కల ప్రాంతాల మీద పడ్డాడు. దొమ్మీలు, దౌర్జన్యాలు, దోపిడీలు  చేస్తూ అందిన కాడికి ఊళ్లు, చిన్నా చితకా రాజ్యాలూ ఆక్రమిస్తూ , అపార సంపద కొల్లగొడుతూమెల్లిగా కుతుబుద్దీన్  సుల్తాన్ దృష్టిలో  పడి గౌరవ సన్మానం అందుకున్నాడు. దరిమిలా ఇంకా మదించి ,  రెట్టించిన క్రౌర్యం తో  మునేర్, బిహార్ ల వైపు కార్చిచ్చు లా చెలరేగి  1197 లో కాబోలు నలంద పరిసరాలలో దాపురించాడు.

7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు హుయెన్ సాంగ్ కళ్ళారా చూసి వర్ణించిన దానిప్రకారం ఏకంగా  3705ఎకరాల మేర విస్తరించిన  నలందా మహావిహార విశాల ప్రాంగణం చుట్టూ ఎత్తైన ఇటుక గోడ ఉండేది. ప్రధాన ద్వారం చాలా పెద్దగా ఉండేది. విద్యా బోధన జరిగే భవన సముదాయానికి వేరుగా సంఘారామం మధ్యలో ఎనిమిది పెద్ద బహుళ అంతస్తుల భవనాలు ఉండేవి. అంతరిక్షపు అబ్జర్వేటరీలు ఉన్న పై గదులు మబ్బులను తాకుతూందేవి. ఎంత దూరానికైనా కనిపించే పెద్ద పెద్ద టవర్లు , భవన సముదాయాల పైన కళాత్మకంగా అమర్చిన చిన్న గోపురాలు చూస్తే సంస్కారం ఉన్న సహృదయులకు కన్నులవిందు అవుతుంది. కానీ చదువు సంస్కారం ఏ కోశానా లేని , విద్యా ప్రాంగణాలంటూ ఉంటాయని కూడా తెలియని  బఖ్తియార్ ఖిల్జీ అనే  మూర్ఖ ముష్కరుడి పాపిష్టి దృష్టికి  అది ఒక పెద్ద కోటలా కానవచ్చింది. దోచుకోవటానికి అక్కడ అపార సంపద ఉంటుందని దుర్బుద్ధి పుట్టింది,  సదరు “బిహార్ కోట” (Hisar-i-Bihar) ను కొల్లగొట్టటానికి శరవేగంతో లోట్టలేస్తూ దౌడుతీశాడు. అతడి వెంట ఉన్న 200 మంది సాయుధ రౌతులలో మొదటి జట్టులో 18 మంది మాత్రమే అతడి వెంట ఉన్నారు.  వారిని చూసిన వారు  పరదేశి వ్యాపారులు కాబోలు అనుకున్నారు తప్ప వేల మందిని ఊచకోత కోసి ఆ ఊరును వల్లకాడు చేయటానికి వచ్చిన నరపిశాచులన్న సందేహం ఎవరికీ కలగలేదు.



ఎవరి జోలికీ వెళ్ళకుండా ఎవరికీ ఇబ్బంది కలగనీయకుండా తమ మానాన తాము ప్రశాంతంగా విద్యల అద్యయన అధ్యాపనాలు చేసుకుంటున్న సజ్జనులకు ఎవరైనా హాని చేయవచ్చు;  చదువుల తల్లి నడయాడే పవిత్ర ప్రాంగణం మీద పైశాచిక దాడి జరగవచ్చు అన్న ఊహే అంతవరకూ ఎవరికీ రాలేదు. విదేశీ తురుష్కులు విరుచుకు పడి పలు రాజ్యాలను ఆగమాగం చేస్తున్నారని తెలిసినా చదువుల నెలవులో నిష్కారణంగా తలలు నరికేంతటి  రాక్షసత్వానికి వారు పాల్పడగలరని మన ధర్మ ప్రభువులెవరూ ఆ కాలాన శంకించ లేదు. బహుశా అందువల్లే అనేక వేల ఎకరాల విశాల నలంద మహావిహారం రక్షణ ,భద్రత ల విషయం ఎవరూ పట్టించుకోలేదు. అదే బఖ్తియార్ ఖిల్జీకి కలిసివచ్చింది. జరగకూడని ఘోరం జరిగిపోయింది. కేవలం 200 మంది తురుష్క ముష్కరులు పదివేల మంది విద్యార్థులను, మూదు వేలకు పైగా ఆచార్యులను, వేలాది బౌద్ధ బిక్షువులను పరమ కిరాతకంగా ఊచకోత కోశారు. మళ్ళీ ఎన్నడూ కోలుకోలేనంతటి భయానక విధ్వంసం సాగించారు.  ఆ సమయాన ఖిల్జీ పక్కనే ఉంది చరిత్రలో కనీ వినీ ఎరుగని ఆ దారుణ మారణకాండలో స్వయానా పాపిష్టి పాలు పంచుకున్న  శంశముద్దీన్ అనే వాడి నుంచి సమాచారం రాబట్టి తబకాత్ నాసిరీ గ్రంథంలో ముస్లిం చరిత్రకారులు మిన్హాజ్ , ఉస్మాన్ లు రికార్డు చేసిన  ప్రకారం –

The band of Holy Warriors reached the gateway of the fortress and began the attack. Muhammad Bakhtyar threw himself into the postern of the gateway of the place, and they captured the fortress , and acquired great booty. The greater number of the inhabitants of that place were Brahmans , and the whole of those Brahmans had their heads shaven ; and they were  all slain. There were a great number of books there ; and when all these books came under the observation of the  Musalmans , they summoned a number of Hindus that they might give them information respecting the import of those books; but the whole of the Hindus had been killed. On becoming acquainted with the contents of those books, it was found that the whole of that fortress and city was a college, and in the Hindu tongue , they call a college Bihar.

[Tabakat-i- Nasiri, By Maulana Minhaj -ud- Din ,Abu - Umar-i- Usman , Translated by Major HG Raverty P 552]

(పవిత్ర యోధుల దళం కోట ప్రధాన ద్వారాన్ని చేరుకొని దాడి మొదలెట్టింది. ముహమ్మద్ బఖ్తియార్ అక్కడి పక్కద్వారం మీదికి లంఘించి కోటను వశపరచుకుని గొప్ప సంపద కొల్లగొట్టాడు. అక్కడ నివసిస్తున్నవారిలో అత్యధికులు బ్రాహ్మణులు. వారందరూ శిరోముండనం చేయించుకుని ఉన్నారు.  మొత్తం అందరినీ నరికివేశారు. అక్కడ కొల్లలకు కొల్లలుగా  గ్రంథాలు ఉన్నాయి. ఆ విషయం ముసల్మాన్ల దృష్టికి వచ్చినప్పుడు ఆ గ్రంథాలలో ఏమున్నదో తెలియపరచటం కోసం పలువురు హిందువులను పిలిపించమన్నారు. కాని అప్పటికే హిందువులు యావన్మందీ చంపివేయబడ్డారు. ఆ గ్రంథాల ఆనుపానులు ఆరా తీసిన మీదట ఆ కోట, ఆ నగరం నిజానికి ఒక కాలేజీ అని అర్థమయింది. హిందూ భాషలో కాలేజీని విహార్ ( బిహార్) అని పిలుస్తారు.)

అది అపార ధనరాశులు ఉండే కోట కాదు; చదువులు నేర్పే కాలేజీ అని పొట్ట కొస్తే అక్షరం ఉండని నీచ నికృష్టుడికి అర్థమయ్యేసరికి మహా విలయం జరిగిపోయింది. పదివేలకు పైగా విద్యార్థులు, రెండు వేలకు పైగా ఆచార్యులతో కళకళలాడిన మహోన్నత విశ్వ కళా పరిషత్తులో  కనీసం పుస్తకాలలో విషయం ఏమిటన్నది చూసి చెప్పటానికి ఒక్క విద్యావంతుడూ మిగలలేదంటే సామూహిక జన సంహారం ఏ స్థాయిలో జరిగిందో, ఆరు అంతస్థుల బౌద్ధ విహారంలో, తొమ్మిది అంతస్థుల గ్రంథాలయ సముదాయంలో , అనేకానేక చైత్యాలూ, ఆరామాలూ , ఆవాస హర్మ్యాలలో ఎన్ని రోజులపాటు ఎన్ని తలలు నరికారో , ఎంతటి రక్తపుటేరులు పారాయో తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఏ పాపమెరుగని , చీమకైనా హాని తలపెట్టని అహింసావ్రత నిష్టా గరిష్టులైన వేలాది విద్వాంసులను మేరలేని మతవిద్వేషం తో రాక్షసంగా ఊచకోత కోసిన తరవాత అక్కడి లక్షలాది గ్రంథాలను ఏమి చేయాలన్న ప్రశ్న ఉదయించింది. అలాంటి సమస్యే దానికి కొన్ని శతాబ్దాల పూర్వం ఒక ఖలీఫా ముందుకు వచ్చింది.

When the Persian capital of Ctesiphon in province of Khvarvaran (today Iraq) fell to the Muslims in 637 ... ... Waqqas wrote to Caliph Umar asking what should be done with the books at Ctesiphon. Umar wrote back: "If the books contradict the Qur'an, they are blasphemous. On the other hand, if they are in agreement, they are not needed, as for us Qur'an is sufficient." Thus, the huge library was destroyed and the books were thrown into fire or the river Euphrates.

[ Jurji Zaydan in  The History of the Islamic Civilization, vol. III, pp.42-51]

( ఇప్పటి ఇరాక్ లోని ఒక రాష్ట్రంలో పర్షియన్ రాజధాని టెసిఫోన్ 637లో ముస్లిముల వశమైనప్పుడు ఆ నగరంలో దొరికిన గ్రంథాలను ఏమి చేయాలని వక్కాస్ అనేవాడు ఖలీఫా ఉమర్ కు లేఖ రాశాడు. ఆ గ్రంథాలు కురాన్ కు విరుద్దంగా ఉంటె దైవ దూషణ నేరం చేసినట్టు కాబట్టి  అవి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ అవి కురాన్ బాధలకు అనుగుణ్యంగా ఉన్నా అవి అక్కరలేదు. ఎందుకంటే మనకు కురాన్ ఒకటే చాలు “ అని ఖలీఫా గారి ధర్మనిర్ణయం! ఇంకేం? బ్రహ్మాండమయిన గ్రంథాలయాన్ని ధ్వంసం చేసి వెలలేని పుస్తకాలను యూఫ్రటిస్ నదిలో పారేశారు – అని  The History of the Islamic Civilizationగ్రంథం మూడో సంపుటం 42-51 పేజీలలో ఇస్లామిక్ విద్వాంసుడు  Jurji Zaydan రాశాడు.

బఖ్తియార్ ఖిల్జీ కూడా అతడికి సరితూగే వాడే. నలంద లోని  అపురూప గ్రంథాల భాండాగారాన్ని నాశనం చేయకండి అని పుస్తకాల విలువ తెలిసిన వారు ప్రాధేయపడితే అతగాడో ప్రశ్న వేశాడట. ఆ పుస్తకాలలో అల్లా గురించి , మహమ్మద్ ప్రవక్త గురించి ఉన్నదా?అని. ‘లేదు’ అని వారన్నారు. అయితే మానవాళికి ఆ పుస్తకాలు అక్కరలేదు. వాటిని తగలెట్టండి అన్నాడట ఆ శుంఠ ! అనుచరులు అంతపనీ చేశారు. 90 లక్షల గ్రంథాలను కాల్చి బూడిద చేయటం మాటలా? మహమ్మదీయ పవిత్ర యోధులు ఆ పుణ్యకార్యం పూర్తి చేయటానికి మూడు నెలలు పట్టింది. అంతకాలమూ ఆరని మంటల్లో అరుదైన అపురూప గ్రంథాలు కాలుతూనే ఉన్నాయి.

విజ్ఞాన సర్వస్వమైన ఒక మహా విద్యా వ్యవస్థను  నామరూపాలు మిగలకుండా సర్వనాశనం చేసిన నీచాతినీచ మానవ మృగం పేరు తలవటమే పాపం . మరి ఆ పరిసరాలలోని మునిసిపల్ టౌనుకూ , రైల్వే స్టేషనుకూ  భక్తియార్ పూర్ అంటూ ఆ దూర్తుడి పేరు కొనసాగించి ఈ నాటికీ  లక్షల  జనం దానిని నిత్యం స్మరించేలా చేసిన మనకాలపు సెక్యులర్ ప్రభువులను ఏమనాలి? ముస్లిం మతోన్మాదం మూలంగా జాతికి జరిగిన ఘోరాపచారాన్ని జాతి జనులకు తెలియకుండా అబద్ధాల అల్లికలల్లి –బఖ్తియార్ అనే సాదుజీవి  అసలు నలంద మొగమే ఎరుగడు.. అతడు కూల్చినది వేరేదో బౌద్ధ మఠం. నిజానికి బౌద్ధం మీద విద్వేషంతో  వరసగా దాడులు చేసి , నలందను  కూల్చినది హిందూ మతోన్మాదులనీ..... ఇద్దరు అడుక్కుతినే బ్రాహ్మణులు  తమ మీద ఎవరో చెడు నీళ్ళు పోసారన్న కక్షతో పన్నెండేళ్ళు సూర్యోపసాసన చేసి తంత్ర శక్తితో కార్చిచ్చుని సృష్టించి  మొత్తం అన్ని వేల ఎకరాలలోని భవనాలనూ,  గ్రంతాలనూ కాల్చేశారని కట్టుకతలల్లి  అదే ప్రామాణిక చరిత్ర అని తెగబడి డబాయిస్తున్న డి.ఎన్.ఝా లాంటి కమ్యూనిస్టు కబోది మేధావి గణాలను ఏమని పిలవాలి?


Wednesday, 5 June 2024

బిజెపి కి ఎందుకు బెంగ ?

 ఎం.వి.ఆర్. శాస్త్రి 

నా మనవడు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జాం రాశాడు. మొన్నీ మధ్య రిజల్స్ వచ్చాయి. CGPA  9.7 వచ్చింది అని చెప్పింది మా అమ్మాయి. అంటే మంచి గ్రేడే కదా అని సంతోషించి వాడికి ఫోన్ చేశా. వాడు మాత్రం సంతోషంగా లేడు. 10కి 10 రాలేదు కదా 9.7 అంటే చాలా తక్కువ అని  డల్ గా చెప్పాడు. టాపర్ కావాలనుకునే మెరిట్ స్టూడెంటు కాబట్టి వాడి నిరుత్సాహాన్ని అర్థం చేసుకోవచ్ఛు. 

కానీ ఈ బిజెపి వాళ్ళకేమయింది? పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూసి ఆముదం తాగినట్టు మొహం పెడుతున్నారు? వరసగా మూడో సారి ఆ పార్టీ కూటమి దేశంలో అధికారం అందుకుని హ్యాట్రిక్ కొట్టబోతున్నది. ఇదేమైనా అల్లాటప్పా విజయమా? మామూలుగా ఏ రూలింగు  పార్టీ నైనా ఐదేళ్ళు భరించటమే కష్టం. వెనకటి రూలింగు పార్టీ మీద తీవ్ర అసహ్యం పుట్టి , దాని మీద కసితో ఈ పార్టీని నెత్తిన పెట్టుకున్న జనం దీని నిర్వాకం చూశాక దీని మీదా రోత పుట్టి ఎప్పుడెప్పుడు దీన్ని వదిలించుకుంటామా అని తొందర పడతారు. మళ్ళీ ఎన్నికలు రాగానే ఎత్తి చెత్తకుండీ లోకి గిరవాటేసి  ఎదురుగా ఏ ప్రత్యామ్నాయం కనిపిస్తే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. అంటే ఏకాడికీ ఏ పార్టీ అయినా పవరు కొట్టేసేది సాధారణంగా నెగిటివ్ వోటు మీదే . ఎంత మోతుబరి పార్టీ కైనా ఒక టర్ము కాగానే యాంటీ ఇన్కంబెన్సీ తెగులు పట్టుకుని మరుసటి ఎన్నికల్లో అడ్రెసు గల్లంతు కావటం మామూలే కదా? అలాంటిది తమ  నాయకుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్ళలో సాధించిన ఘన విజయాలను , అవినీతి మచ్చ అంటని పరిపాలనను సగర్వంగా చెప్పుకుని భారతీయ జనతా పార్టీ పాజిటివ్ వోటు తో మూడో సారి కూడా అత్యధిక శాతం వోట్లూ, సీట్లూ గెలుచుకోవటం ఏ రకం గా చూసినా దిగ్విజయం కాదా? స్వతంత్ర భారత చరిత్రలో ఒక నాన్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ టర్మ్ కూడా పవర్లోకి రావటం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? సొంతంగా 282 స్థానాలు గెలిచి 2014లో పవర్లోకి వచ్చిన పార్టీకి మూడో టర్ములో కూడా 42 తక్కువగా అన్ని సీట్లూ దక్కటం గొప్పకాదూ?




ఆ మాటంటే – 400 వస్తాయని అనుకున్నాము కదా ? ఎగ్జిట్ పోల్సు లో కూడా అన్ని సర్వేలూ 350 పక్కా అనే చెప్పాయి కదా? తీరా వచ్చినవి 240 నే కదా?కనీసం  సింపుల్ మెజారిటీకి కూడా తక్కువేనాయె అని బిజెపి వీరాభిమానుల ఏడుపు. బెట్టింగు దందాల స్పెషల్ ఆర్డర్లకు తగ్గట్టు , ఎవరి కాకులలేక్కలు వాళ్ళు వేసి మీడియా సంస్థలు వండి వార్చే తల తిక్క ఎగ్జిట్ పోల్స్ ను ఎవరు నమ్మమన్నారు? “అబ్ కీ బార్ చార్ సౌ పార్” అని మీ నాయకులు తెగ హడావుడి చేసినంత మాత్రాన నిజంగానే 400 వస్తాయని మీరెలా అనుకున్నారు?  రాజకీయ దురంధరులు మోదీ , అమిత్ షా 400 అన్నారంటే కనీసం 300 తగ్గక పోవచ్చు అనే అర్థం . ఇప్పుడు ఎన్ డి ఏ కి వచ్చిన సీట్లు 300 కి ఏడే కదా తక్కువ? బిజెపి వరకే చూసుకున్నా  240 సీట్లతో అదే సింగిల్ లార్జెస్టు పార్టీ. సొంతంగా మెజారిటీకి 33 మాత్రమె తక్కువ. దాని దరిదాపుల్లో ఇంకో పార్టీ ఏదీ లేదు.మొత్తం అపోజిషన్ పార్టీలన్నీ  అలయన్సుగా కూడి తెచ్చుకున్న మొత్తం సీట్లకంటే ఒంటి చేత్తో బిజెపి తెచ్చుకున్నవే ఎక్కువ.   ఎన్ డి ఏ కూటమికి  మాజిక్ మార్కు కంటే 21 సీట్లు ఎక్కువే వచ్చాయి. చాలదా? మరి ఎందుకు  కంగారు? 

రెండో పెద్ద పార్టీ ఏది? కాంగ్రెసు . దానికి వచ్చినవెన్ని? ఆఫ్టరాల్ 99. నిండా మూదంకెలు కూడా లేవు. అధికారమే ఏకైక లక్ష్యంగా ఒక నీతీ రీతీ లేకుండా అమాం బాపతు పార్టీలను కూడగట్టి అది కట్టిన INDIA గుడారానికి మొత్తం కలిపి వచ్చిన సీట్లేన్ని? 235. అంటే మాజిక్ ఫిగరు కు దాదాపు 40 తక్కువ. అయినా సోనియాగాంధీ , రాహుల్ గాంధీ , సోనియా గాంధీలు బ్రహ్మండమేదో బద్దలు కొట్టినట్టు, ఇప్పటికే పవరు ఎగిరి వచ్చి వొళ్ళో వాలినట్టు జాయింటుగా ఇకిలిస్తూ వేళ్ళతో V గుర్తు చూపిస్తున్నారు . 



మెజారిటీ కూడా ఇప్పటికే వచ్చేసిన బిజెపి వాలాలేమో మొగాలు వేలాడేసి ఇంతేనా, ఇంతేనా అంటూ తెగ ఫీలై పోతున్నారు. వీరేమో గెలుపును చూసి ఓటమి అనుకుంటున్నారు. వారేమో ఓటమిని గెలుపుగా చూపెట్టుకుంటున్నారు. భలే! 

ఇంతకీ నీరసం ఎందుకయ్యా అని బిజెపి కాంపు వాళ్ళని అడిగితే – ఇలా సొంతంగా సింపిల్ మెజారిటీకి కూడా తెరువు లేని పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు అని ఉసూరుమంటారు. అనుకోకపోతే అది వారి తెలివితక్కువ. ఇది ఇలా అయ్యే ఆస్కారం ఎంతైనా ఉన్నదని బిజెపి బడానేతలకు కూడా ఎప్పుడో తెలుసు. కర్మం చాలక ఇటువంటి అగత్యం వచ్చినా మెజారిటీకి ఇబ్బంది లేకుండా చూసుకోవటానికే చిన్నా పెద్దా ప్రాంతీయ పార్టీలను తమ బుట్టలో వేసుకోవటానికి వారు తెగ తంటాలు పడ్డారు. తెలంగాణా ఎన్నికల ముందు కేసీఆర్ పార్టీతో చాటుమాటు సరాగాలాడినప్పుడే ఈ సంగతి రాజకీయ పరిశీలకులకు అర్థమయింది. ఆంద్ర ప్రదేశ్ లో నమ్మరాని తెలుగుదేశంతో పొత్తు వద్దే వద్దని పార్టీ, హిందూ వర్గాలు ఎంత మొత్తుకున్నా వినకుండా డిల్లీ పెద్దలు పట్టుబట్టి కొంగు ముడి వేయించినప్పుడైనా దానిలోని మర్మం కమలం వాళ్లకు తేటతెల్లం అయి ఉండాలి, ఉత్తరాదిన పడ గల గండ్లను దక్షిణాదిన వైసిపి,  టిడిపి లాంటి పార్టీల సాయంతో పూడ్చుకోవాలని బిజెపి నాయకులు చాలాకాలం కిందటే డిసైడయ్యారు . తమ అవసరాలకు అనుగుణంగా వైకాపా నడుచుకున్నంత కాలమూ జగన్ అవసరాలను కేంద్రం వారు అరసుకున్నారు. జనాల్లో వైకాపా పూర్తిగా భ్రష్టు పట్టిందని గ్రహించాక ఇష్టమున్నా లేకున్నా టిడిపిని చేరదీశారు. తప్పేమీ లేదు. దటీజ్ పాలిటిక్స్!

ఏమైనా ఈ ఎన్నికల్లో బిజెపి గర్వంగా చెప్పుకోదగిన విజయాలు చాలా ఉన్నాయి. కాంగ్రెసును నజ్జునజ్జు చేసి మొత్తం 29 కి 29 సీట్ల క్లీన్ స్వీప్ తో మధ్యప్రదేశ్ కంచుకోట ను తిరిగి వశం చేసుకోవటం ,ఒడిశాలో21కి 20 లోక్ సభ సీట్లు కొట్టేసి , అసెంబ్లీ లో పూర్తీ మెజారిటీ తో సొంతంగా ప్రభుత్వం ఏర్పరచగలగటం దిగ్విజయం కాదా? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చేయిజార్చుకున్న కర్ణాటకలో ఈ మారు కాంగ్రెస్ కంటే ఒకటి తక్కువగా రెట్టింపు సీట్లతో స్వీట్ రివెంజ్ తీర్చుకోవటం పెద్ద  విశేషమే. గుజరాత్ లో 26 కు 25, డిల్లీలో 7 కు ఏడూ “ఆప్ చీపురు’ తో సహా ఊడ్చేయ్యటం  చిన్న విషయం కాదు. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి స్కోరు ఏ రకంగా చూసినా అద్భుతమనదగ్గదే. తెలంగాణలో ముఠా తగవులు, అంతర్గతంగా సాబటేజ్ లు, సంస్థాగత సమస్యలు పెచ్చరిల్లిన దృష్ట్యా ఈ సారి ఎన్నికల్లో రెండు మూడుకుమించి రావని పార్టీ లోపలివారే ఒక దశలో భయపడిన సంగతి గుర్తుపెట్టుకుంటే బిఆర్ఎస్ ను పచ్చడి చేసి కాంగ్రెసుతో సరిసమానంగా ఎనిమిది లోక్ సభ సీట్లను కేవలం మోదీ మహిమ తో బిజెపి గెలుచుకోవటం గొప్ప విశేషం. అలాగే ఐదేళ్లుగా అన్నివిధాలా చితికి , అతీగతీ లేదని అందరూ ఆశ వదిలేసుకున్న ఆంద్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని కూటమి కూడి , తెలుగుదేశం ధర్మమా అని ఏకంగా 8 అసెంబ్లీ , 3 పార్లమెంటు సీట్లు బిజెపి  దక్కించుకోవటమంటే  జాక్ పాట్ కొట్టినట్టే., తెలుగుదేశం తో పొత్తు లేనిదే జగనాసుర రాక్షస రాజ్యాన్ని అంతమొందించటం అసాధ్యమని తాను నమ్మినదాన్ని తిట్లూ చివాట్లను లెక్కచెయ్యకుండా అందరికీ నచ్చచెప్పి కడు ఓపికగా ఒడుపుగా కూటమిని కూర్చి , తాను తగ్గి ఉమ్మడి ప్రయోజనాన్ని పెంచి అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్ దార్శనిక రాజనీతిజ్ఞతను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. కిందటి ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాలలో జయప్రదంగా ఓడిపోయిన దుస్థితి నుంచి ఈ సారి పోటీ చేసిన 21 కి 21 అసెంబ్లీ స్థానాలనూ , రెండుకు రెండు లోక్ సభ స్థానాలనూ ‘పొలిటికల్ పవర్ స్టార్’  మొత్తంగా గెలుచుకోగలగటం పరమాద్భుత విజయం.  ఐదేళ్లుగా గూండాల రాజ్యంగా , అరాచక నిలయంగా, సోమరిసత్రంగా తయారై అన్నివిధాలా చితికి చిద్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకలు తీరిన రాజకీయ దురంధరుడు, సమర్థ పాలకుడు , దార్శనిక ప్రజ్ఞావంతుడు అయిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావటం శుభ పరిణామం. పూర్వప్రభుత్వం దింపిన అప్పుల ఊబి నుంచి పైకి లాగి , మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించగలడనీ, పాడుబడిన అమరావతికి పునర్ వైభవం తెచ్చి రాష్ట్రానికి చక్కని రాజధానిని అమర్చి బాగా అభివృద్ధి చేయగలడననీ చంద్రబాబు మీద ప్రజలు ఆశ పెట్టుకున్నారు. గతానుభవాల నుంచి పాఠం నేర్చి, 2014-19 ఏలుబడిలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుని  , ‘సన్ స్ట్రోకు’ ల నుంచి జాగ్రత్త పడగలిగితే చంద్రబాబు నాయుడు ఆదర్శ పాలకుడిగా చరిత్రలో నిలిచిపోగలడు.  

తెలంగాణ లో కాంగ్రెసుకు  బలమైన ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదిగింది . దాని ఫండమెంటల్సు చాలా పటిష్టం గా ఉన్నాయి.  కాబట్టి  తెరాస లేక భారాసకు కష్టకాలమే.  పోటీ చేసిన మొత్తం అన్ని సీట్లలో ఘోరంగా ఓడిపోయినంత మాత్రాన గులాబీ వాడి వడలినట్టేనని చెప్పటం తొందరపాటు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావాన్మి ఎవరూ తక్కువ అంచనా వెయ్యకూడదు.

కానీ అదే మాట ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి , అతడి పార్టీ విషయంలో చెప్పలేము .అధికార ప్రభావం పోయి , కేంద్రంలో రాష్ట్రంలో బలాబలాలు మారినందున  తీవ్ర ఆర్ధిక నేరాల క్రిమినల్ కేసులనూ , జైలునూ అతడు ఇంకేమాత్రమూ తప్పించుకోజాలడు. అధికారం ఆశతో అతడి నడమంత్రపు పార్టీలోకి వాలిన రాజకీయపక్షులు అది కాస్తా పోయాక కొత్త వలసను వెతుక్కోక మానవు. వైఎస్ సొంత కుటుంబం వారే చీకొట్టే పరిస్థితి వచ్చాక  వైఎస్ఆర్  కాంగ్రెసు పార్టీ అంతరించకుండా మిగలగలిగితే అబ్బురమే. జగన్ రెడ్డి ని ముద్దులాడి అతడి అండతో మిదిసిపడ్డ సాములోర్లకూ , మర్డర్ కేసులో ఏ పాపమెరుగని పసివాడికీ , అధికార మదంతో నోళ్లు పారేసుకున్న తక్కుంగల వదరుబోతులకూ  ఇక కష్ట కాలమే. 

ఈ సారి 400 సీట్లు గ్యారంటీ అని బిజెపి పెద్దలు, అవునునిజమే అన్నీ వచ్చేట్టు ఉన్నాయని మిడిమేలపు మీడియా ఇచ్చిన బిల్దపులను చూసి, ఇక ఎలాగూ గెలవబోయే వారికి మన సాయం ఎందుకన్నఉదాసీనత  జనంలో ఎక్కడొస్తుందో , ఓవర్ కాన్ఫిడెన్సు మూలంగా  బిజెపి కొంప ఎక్కడ మునుగుతుందోనని ఆ పార్టీ హితైషులు చాలా భయపడ్డారు. అదృష్టవశాత్తూ 2004 గత్తర అయితే తప్పింది. అత్యధిక ప్రజాదరణ సంపాదించి , సొంతంగా మెజారిటీకి కేవలం  బెత్తెడు దూరంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి నిలబడింది. ఎన్నికలకు ముందే కుదిరిన ఎన్ డి ఏ కూటమి వరకూ పూర్తి మెజారిటీకి ధోకా లేదు. అయినా మీడియా మాయావులు పనికి మాలిన తెలివితేటలు ఉపయోగించి నానా రకాల ఊహాగానాలతో అకారణ అనుమానాలనూ , భయాలనూ రేకెత్తిస్తున్నారు. 

నిజమే. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు అడ్డం తిరిగితే ఎన్ డి ఏ కు మెజారిటీ కష్టమే. కాని అంతటి రాజకీయ దురంధరులు ఎన్నికల ఏరు దాటీ దాటగానే  కూటమి తెప్పను తగలేసి పోయిపోయి, అన్ని రకాల స్వార్థాలూ రాశిపడి ఉన్న  నీతిమాలిన కాంగ్రేసు కలగూరగంపలో చేరతారని ఊహించలేము.  నమ్మకద్రోహానికి పాల్పడితే జనం మొగాన పేద నీళ్ళు కొడతారన్న భయంవల్ల అయినా అలాంటి నీచత్వానికి కనీసం కొంతకాలం వరకూ ఎవరూ దిగజారరు. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలో నిర్ణయించేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము . ఆమె గుణగణాలు ఎరిగిన వారెవరికీ ఆమె న్యాయ మార్గం తప్పుతారన్న సందేహం కలగదు. కాస్తంత  సందు దొరికితే చాలు తమకు అధికారం కోసం లేక బిజెపి అధికారాన్ని గండికోట్టటం కోసం  ఎంతనీచానికైనా అవతలివారు  దిగజారగలరు. కానీ ఆ పాటి సందు వారికి ఇప్పుడప్పుడే చిక్కదు. 

ఏమైనా కేంద్రంలో బిజెపి ఏకచత్రాధిపత్యం ముగిసినట్టే. ప్రభుత్వ మనుగడకు కూటమి పార్టీల సహకారం తప్పనిసరి అయినప్పుడు భాగస్వామ్య పక్షాలు తల ఎగురవేయక మానవు. మద్దతుకు ప్రతిఫలంగా హిరణ్యక్షవరాలు కొరకుండానూ ఉండవు. గతంలో జయలలితలూ మమతా బెనర్జీ లూ చంద్రబాబులూ వాజపేయికి తెచ్చిపెట్టిన సంకటాల వంటివి  ఇకముందూ ఎదురుకాబోవని చెప్పలేము. వాటి సంగతి తరవాత మాట్లాడుకోవచ్చు. ఏమైనా నరేంద్ర మోదీ మరీ వాజపేయి అంత సౌమ్యుడు, మంచివాడు కాడు కాబట్టి కథ ఎలా అయినా తిరగవచ్ఛు. చూద్దాం. 

ఇంతకీ ఈ ఎన్నికల ఫలితాలలో గుండెకాయ వంటి ఉత్తర ప్రదేశ్ లో , రాజస్తాన్, పంజాబ్ , మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భంగపాట్ల నుంచి బిజెపి నేర్వవలసిన గుణపాఠాలు, మార్చుకోవలసిన పద్ధతులు  ఏవీ లేవా? లేకేమి ? ఆ పార్టీ , దాని నాయకులు చేసిన తప్పులు , ఆత్మావలోకనం చేసుకోవలసిన అంశాలు , సరిదిద్దుకోవలసిన లోపాలు బోలెడు ఉన్నాయి. వాటి గురించి ఇంకో సారి చెప్పుకుందాం. 

                            ------------------------------------------------------

Wednesday, 17 April 2024

చిన్న ఊరిలో గొప్ప గోపురం

 

గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామచంద్రుని విశిష్ట ఆలయం

దుర్గరాజు స్వాతి , జర్నలిస్టు

ఆంధ్రదేశంలో రామాలయం లేని ఊరు వుండదని నానుడి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న రామాలయం ఏదీ అంటే అందరూ  ఠక్కున చెప్పే పేరు భద్రాచలం. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఆ ఆలయానికి అంతటి ప్రాశస్త్యం వుంది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణగా, ఆంధ్రప్రదేశ్ గా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఆంధ్రాలో పురాతనమైన ఒంటిమిట్ట రామాలయం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అయితే ఆ రెండు ప్రధాన ఆలయాలలో లేని విశిష్ట శిల్ప సంపదతో అలరారుతున్న ఓ గొప్ప గోపురం వున్న రామాలయం ఒకటి ఓ చిన్న ఊరిలో ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు. అది కూడా మన ఆంధ్రాలోనే ఉన్నదన్న విషయము మాకు కూడా ఈ మధ్యనే తెలిసి దానిని దర్శించుకుని వచ్చాము. శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా ఆ విశేషాల్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. 



    తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడ అనే చిన్న ఊరిలో నెలకొన్న ఆ ఆలయం పేరు శ్రీ కోదండ రామచంద్ర మూర్తి దేవస్థానం.

   ఆలయ పరిధి దృష్ట్యా చూస్తే ఇది చిన్నదే అయినా దాని విశిష్టత అంతా అద్భుత శిల్ప సంపదతో అలరారుతున్న గొప్ప గోపురంలోనే ఇమిడి వుంది. 

       శ్రీరామచంద్రుని చుట్టూ అస్త్ర దేవతలు ప్రదక్షిణ చేయడం; దశరధుడు తన సతులు కౌసల్య,సుమిత్ర, కైకేయిలతో ఇరువైపులా నిలుచుని ఊయలలో నిదురిస్తున్న బాలరాముని ఆనందంగా తిలకించడం; విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుండగా విల్లంబులు ఎక్కుపెట్టి రామలక్ష్మణులు మారీచ, సుబాహులతో యుద్ధం చేయడం; సీతారాముల కళ్యాణం;    అరణ్యవాసంలో రామాలక్షమణులు ఓ వృక్షం కింద సేదదీరడం; సీతాపహరణం, పక్కనే హనుమ ఆశీనుడై వుండగా వానరులంతా రామయ్యకు నమస్కరించడం; అశ్వాలు పూన్చిన రథాన్ని రామ లక్ష్మణులు ఎక్కబోవడం; వారధి నిర్మాణానికి వానర సైన్యం రామ శిలలను మోసుకు రావడం;  రావణ వధానంతరం సీత అగ్ని పరీక్షను ఎదుర్కోవడం; సీతా సమేతంగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు పయనమవడం ఇలా ఎన్నో రామాయణ ఘట్టాలను అద్భుత శిల్పాలుగా చెక్కి గొప్పగా గోపురాన్ని నిర్మించడం ఇక్కడ మనం చూడవచ్చు. కేవలం రామాయణ ఘట్టాలే కాకుండా, నరసింహస్వామి హిరణ్యకశిపును వధించడం, సింహవాహిని కనకదుర్గమ్మ, సప్తాశ్వ రథమారూడుడయిన సూర్యభగవానుడు,   క్షీరసాగర మధనం, గీతోపదేశం వంటి ఇంకా అనేక ఘట్టాలను కూడా ఈ గోపురంపై చక్కగా చెక్కారు. 



కాల ప్రామాణికంగా చూసినా ఈ ఆలయానికి దాదాపు 130 ఏళ్ల చరిత్ర వుంది. కీ.శే. శ్రీ ద్వారపూడి సుబ్బారెడ్డి గారు, రామిరెడ్డి గారు అనే సోదరుల సంకల్పబలంతో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగింది. అదీ 1889లో రామ కోలల ప్రతిష్ఠాపనతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1934లో సీతారామ లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవస్థానంగా నామకరణం చేశారు. తదనంతరం 1948లో 160 అడుగుల ఎత్తులో తూర్పు గోపురం, 1956లో 200 అడుగుల ఎత్తులో పశ్చిమ గోపురం నిర్మించారు. మొత్తం పది అంతస్తులుగా నిర్మించిన ఈ గొప్ప గోపురంలో ప్రతి అంతస్తుకు చేరుకునేలా లోపలివైపు మెట్లను నిర్మించారు. ప్రతి అంతస్తులో ఓ గవాక్షం ఏర్పాటు చేయడంతో భక్తులు ఒక్కో అంతస్తు ఎక్కుతూ అక్కడ నుండి బాహ్య పరిసరాల్నింటినీ చూడవచ్చు. ఒక్కో అంతస్తూ ఎక్కుతున్నకొద్ది మనకు ఇంకా విశాలమయిన పరిధి కనబడుతూ ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది. అంతేకాదు కొన్ని అంతస్తుల్లో మరికొన్ని విశేషాలు కూడా జోడించారు. అందులో  1975లో నిర్మించిన అద్దాల మందిరం ఒకటి వుంది. దీనిని ద్వారంపూడి వారసుడు రామచంద్రారెడ్డి గారు నెలకొల్పారు. అక్కడ నిలుచుని దేవతల విగ్రహాలను ప్రత్యేక భంగిమల్లో చూడడమే గాక మనం కూడా మన రూపాలను వివిధ ఆకృతుల్లో చూసుకుని వినోదించే ఏర్పాటు వుంది. అంటే అవి మ్యాజిక్ అద్దాలు కావడంతో అది మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. అలా ఒక్కో అంతస్తూ ఎక్కుతూ అక్కడ నుంచి కనబడే మేరకు శిల్ప సౌందర్యాలను ఆసక్తిగా తిలకించవచ్చు. 






ఈ ఆలయానికి కొద్దిపాటి భూములే వున్నా అక్కడ పనిచేసే అర్చకులకు ఇతర సిబ్బందికి ధర్మకర్తలే జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్నారు. అంతేకాదు ఇక్కడ నిత్యాన్నదానం కూడా నిర్వహించడం గమనార్హం. 

 ఇక ఆలయ సందర్శన వేళలు ఉదయం 6గంటల నుండి రాత్రి 8 గంటలవరకు వుంటుంది. గోపురం అంతస్తులు ఎక్కి చూసే సమయం మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే. 

ఈ ఆలయానికి సమీపంలోనే సూర్యభగవానుని ఆలయం కూడా వుండడం మరో విశేషం.

 ఇంత విశిష్టతలు వున్న ఆ ఊరిని దర్శించాలనే ఆకాంక్ష మీలో కూడా కలుగుతోంది కదూ. ఇక కదలండి మరి.