Saturday, 6 October 2018

అయ్యప్పకు అపచారం

అయ్యప్పకు అపచారం -1
ఎం.వి.ఆర్. శాస్త్రి
.............

యతో ధర్మస్తతో జయః

ధర్మం ఎక్కడుంటే అక్కడ జయం - అనేమో మన సుప్రీం కోర్టు అధికార చిహ్నం ఘనం గా చెబుతుంది.



ధర్మం ఎక్కడుంటే అక్కడ మాత్రమే జయం లేకుండానేమో అదే సుప్రీం కోర్టు ఈ మధ్య వరసబెట్టి తీర్పులిస్తున్నది.

స్వలింగ సంపర్కం తప్పు కాదట.
అక్రమ సంబంధం నేరం కాదట.
అయ్యప్ప గుళ్ళో ఫలానా ఈడు ఆడవాళ్ళని రావద్దనటం మాత్రం తప్పున్నర తప్పుట ! మహా నేరం కూడానట !!

అనాదిగా ఈ దేశానికి ప్రాణం అయిన సనాతన ధర్మం మాట దేవుడెరుగు. సుప్రీం కోర్టుకూ ,సో కాల్డ్ సెక్యులర్ వ్యవస్థకూ పరమ ప్రామాణికం అనబడే రాజ్యాంగ ధర్మం ప్రకారమే చూసినా ఆ ఒక ఆలయంలో అలాంటి ఆచారం తప్పా ? అది మహిళల పట్ల వివక్ష అవుతుందా ?

ఎంత మాత్రం కాదు. దానికి రుజువుల కోసం వేరెక్కడికో పోనక్కరలేదు. అదే రాజ్యాంగ ధర్మాసనం లోని ఒకే ఒక మహిళా న్యాయమూర్తి ఇందు మల్హోత్రా విడిగా ఇచ్చిన తీర్పును ఒక మారు తిరగేస్తే చాలు.

అసలు విషయం మహిళల పట్ల వివక్షే అయితే ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తే అందరికంటే ముందు దానిని తెగనాడేది. మంచి తీర్పు ఇచ్చారని మహిళా సమాజం యావత్తూ సుప్రీం కోర్టును మెచ్చుకునేది.

జరిగిందేమిటి ? ఐదుగురు జడ్జీల బెంచిలో నలుగురు మగానుభావులేమో అయ్యప్ప గుళ్ళో ఆ ఆచారం మహిళల పట్ల అపచారం ; సహించరాని వివక్ష ; రాజ్యాంగ విరుద్ధం అని నిర్ధారించారు. మహిళా హక్కుల విషయంలో ఎప్పుడూ ముందుండే మహిళా జడ్జి ఏమో అందులో అపచారం లేదు ; వివక్ష లేదు ; రాజ్యాంగ విరుద్ధమూ కాదు అని విడమర్చి వివరించారు . అంతే కాదు . దేశంలోని మహిళా సమాజం కూడా ఆమెనే సమర్ధించి , మెజారిటీ తీర్పునే తూర్పార పడుతున్నది. అదీ - ఇటీవలి కాలంలో కనీ వినీ ఎరుగని విధంగా లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ! అనేక రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ఊళ్లలో బాహాటంగా నిరసన ప్రదర్శనలు జరిపి !



అన్నిటికంటే విశేషం ! తరతరాలుగా కమ్యూనిస్టుల , ధర్మ విరోధుల ముదనష్టపు పాలనలో అతలా కుతలం అయిన కేరళ హిందువుల లోనే శబరిమలపై సుప్రీం కోర్టు తీర్పు అపూర్వ చైతన్యం తెచ్చింది. అయ్యప్ప స్వామి జన్మస్థలమైన పందళం ఊరు మీద ఊరు పడ్డట్టు మహిళా ప్రదర్శకులతో కిక్కిరిసిపోయింది.

సాధారణం గా తోలు మందం అయిన హిందూ సమాజంలో గొప్ప కదలిక తెచ్చి ధర్మాన్ని చుట్టుముట్టిన ముప్పును అందరూ గుర్తించేట్టు చేసినందుకు సుప్రీం కోర్టువారికి మనం రుణపడి ఉండాలి.

No comments:

Post a Comment