ఎం.వి.ఆర్.శాస్త్రి
..........
శ్రీవారి ప్రధానార్చకుడు రమణ దీక్షితులు తన కుర్చీ కిందికి నీళ్ళు వచ్చాక ఇప్పుడు చల్లగా బయటపెడుతున్న సంగతులు వింటున్నారా ? అవి చెవిన పడ్డాక కూడా మనకు అన్నం సయిస్తూంటే ... ఒళ్లంతా కారం రాచినట్టు భగ భగ మండక పొతే - ముందు మనల్ని చూసి మనం సిగ్గుపడాలి.
వేల సంవత్సరాల తిరుమల చరిత్రలో ఏనాడూ జరగని మహాపచారం జరిగిందట. పాకశాలను పాడుబెట్టి, ఇరవై రోజులపాటు స్వామివారికి నిత్య నైవేద్యాల కు ఎగనామం పెట్టారట. ఇంట్లో కుదరనప్పుడు బయట హోటల్ నుంచి తిండి తెప్పించుకుంటామే ...అలా బయట వండిన నైవేద్యాలను అనాచారంగా పట్టుకొచ్చి మూడు వారాలపాటు పెరుమాళ్ళకు ఆరగింపు చేశారట ! గుడిని చెరబట్టిన బందిపోట్లు పోటు ( వంటశాల ) ను ఇష్టానుసారం పలుగులతో కూల్చి , నేలను తవ్వి , వకుళమాత కళ్ళముందే నానా ఆగం చేశారట .
ఇదే నిజమైతే - ఖిల్జీలూ , ఔరంగజేబుల రాక్షస పాలనలో కూడా తిరుమలలో కనీ వినీ ఎరుగని దారుణ దురాగతమిది. నమ్మి అధికారం అప్పగించిన ప్రజలకు 'సెక్యులర్' ప్రభుత్వం , దాని చేతిలోని అధికార అవినీతిగణం బరితెగించి ఇచ్చిన బహుమానమిది.
పూర్వం క్రూరమృగాలను, కాలనాగులను తప్పించుకుంటూ కాలినడకన ఏడుకొండలూ ఎక్కి పూజారి తాను మడితో వండి తీసుకు వెళ్ళిన నైవేద్యాన్ని స్వామివారికి ఆరగింపు చేసినట్టు గుర్తుగా గుడిగంటల చప్పుడు అంచె లంచలుగా చెవికి సోకాకే చంద్రగిరి రాజు తాను భోజనం చేసేవాడట. అన్ని వసతులూ, ఆధునిక హంగులు ఉన్న ఈ 21 వ శతాబ్దం లో అదే స్వామికి వారాల తరబడి యథావిధిగా నైవేద్యానికే దిక్కు లేకుండా పోయిందా ?
నిరుడు డిసెంబరులో ఈ ఘోరం జరిగితే ... ఆ సంగతి ఇప్పటిదాకా బయటికి పోక్కకపోవటం ఏమిటి ? పోటు అనేది శేషాచలం లో ఏ అడవిమధ్యనో లేదు. రొజూ వేలూ లక్షల భక్తులతో కిటకిటలాడే లోపలి ప్రాకారం లోనే ఉంది. వందల మంది ఉద్యోగులు , ఎందరొ అధికారులు మసలుతూండే చోట ఎవరికీ తెలియకుండా కూల్చివేతలూ తవ్వకాలూ ఎలా సాధ్యమయ్యాయి ? వాటికి ఎలా అనుమతించారని తాను ఎగ్జిక్యూటివ్ ఆఫీసరును అడిగితే తనకూ ఏమీ తెలియదని ఆయన బదులిచ్చాడని ప్రధాన అర్చకుడు చెబుతున్నాడు. సర్వాధికారి అయిన ఇ.ఓ.కు తెలియకుండా , ఆగమ సలహాదారు ఆమోదం లేకుండా , ఆగమ వేత్తలను సంప్రదించకుండా , ఆర్కియలాజికల్ శాఖకు చెప్పాపెట్టకుండా ప్రాచీన కట్టడంలో కూల్చివేతలు, తవ్వకాలు ఎలా జరిగాయి ? ఆగమ బద్ధంగా ఆలయ ఆచార వ్యవహారాలు జరిగేట్టు చూడవలసిన జియ్యంగారు అక్రమం , అపచారం ఏదీ జరగలేదని చెపుతున్నారేమిటి ?
అలాగే కృష్ణదేవ రాయలు , మైసూర్ మహారాజులు వగైరా పూర్వ ప్రభువులు సమర్పించుకున్న వెలలేని అపురూప తిరువాభారణాలకు లెక్కా దిక్కూ లేకుండా పోయిందని ప్రధాన అర్చకుడే చెపుతున్నాడు. ఇక్కడ మాయమైన , లెక్కతేలని వజ్రాలు విదేశీ మార్కెట్లలో వేలం అవుతున్న దృష్టాంతాలూ ఉన్నాయంటున్నారు. నిజమేనా ? మిరాసీదారులను తొలగించి చల్లా కొండయ్య కట్టుకున్న పుణ్యం వల్ల దేవుడి నగలకు రక్షణ లేకుండా పోయిందా ? తిరుమల గుళ్ళోనే దొంగలు పడ్డారా ? ఇప్పటికి జరిగిన చోరీలకు ఎవరిది జవాబుదారీ ? ఎవరికి వేయాలి శిక్ష ? ఎవరినుంచి రాబట్టాలి నష్టపరిహారం ? ఇకముందు ఇలాంటి దొంగల దోపిడీలకు ఆస్కారం లేకుండా ఏమి ఏర్పాట్లు , కట్టుదిట్టాలూ చెయ్యాలి?
ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు . ఉన్నత స్థాయి కమిషన్ ద్వారా న్యాయవిచారణ , ఏ సి.బి.ఐ. లాంటి కేంద్ర ఏజన్సీ ద్వారానో సమగ్ర దర్యాప్తు జరిపించి పని త్వరగా తెమిలేట్టు చూస్తేగానీ నినిజానిజాలు నిగ్గుతెలవు. హిందూ మతం లో విశ్వాసంలేని వారిని , అక్రమాల నేర చరితులను , పక్కా అవినీతిపరులను కీలక స్థానాల్లో నియమించి , పవిత్ర తిరుమలను అన్యమతస్తుల ఆటపట్టుగా మార్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి ప్రమేయం లేకుండా స్వతంత్ర విచారణ జరిగితేనే ధర్మానికి న్యాయం జరుగుతుంది. అలాగే కేంద్రప్రభుత్వానికి కూడా నేరుగా సంబంధం లేకుండా ...భక్తులందరికీ గౌరవం , విశ్వాసం ఉన్న ధర్మాచార్యులకు, హిందూ సమాజం లోని పెద్దలను , ఆగమ ప్రవీణులను , పరిపాలన, న్యాయ నిపుణులను తప్పొప్పులు , తదుపరి కర్తవ్యాలను తేల్చే పనిలో ఇన్వాల్వ్ చేయగలిగితే ఉత్తమం.
ఇంతకీ మన ధర్మాచార్యులు , పేరుగొప్ప పీఠాధిపతులు ఏమంటారు ?
No comments:
Post a Comment